పునరాగమనం
పునరాగమనం


సార్. చెప్తే వినిపించుకోండి. వీలైతే ఈ సిటీ వదిలి వెళ్లిపోండి. ట్రైన్స్ అన్నీ క్యాన్సిల్ చేశారు. అనౌన్సర్ హడావిడిగా చెబుతూ బయటికి వెళ్ళిపోయాడు.
స్టేషన్లో నీరజ, ఆమె తండ్రి వాసుదేవ్ మాత్రమే ఇంకా ఏదో ఆశతో ఉన్నారు.
హైదరాబాద్, ముంబయ్, చెన్నై నుంచి బయలుదేరే పలు రైళ్లలో బాంబు పేలుళ్ళు జరుగుతాయి అన్న సమాచారం అందడంతో పోలీసు శాఖ రైళ్ల రాకపోకల్ని పూర్తిగా నియంత్రించింది. దేశంలోని ప్రధాన నగరాల మధ్య రవాణా స్తంభింపచేశారు.
ఆ రాత్రి నీరజ ఢిల్లీ చేరుకోవాలి. ప్రతిష్టాత్మక జాతీయ విలువిద్యా పోటీలో ఆమె పాల్గొనాలి. ఎన్నో ఏళ్ల కల కళ్ళ ముందరే ఇలా చిధ్రం అవుతుంటే ఎవరికి మాత్రం కన్నీళ్లు రావు?
గందరగోళంగా ఉన్న రైల్వే స్టేషన్ నుంచి ఆ తండ్రీ కూతుళ్ళు బయట పడ్డారు. పోలీసులు ఏర్పాటు చేసిన తాత్కాలిక వసతిలో ఒక రోజు గడిచింది.
ఇంటికి చేరే సరికి ఓ వైపు విలు విద్యా పోటీల ఫలితాలు ప్రసారం చేస్తున్నారు. బాంబు బెదిరింపు వార్తలకు ప్రభుత్వం భయపడకుండా పోటీలను నిర్వహించినందుకు ఢిల్లీలో క్రీడాకారులు సంతోషం వ్యక్తం చేశారు.
నీరజ తన గదిలోకి వెళ్లి బెడ్ మీద పడుకుంది. జాగ్రత్తగా ఇంటికి చేరినందుకు తల్లి సంతోషించిందే కానీ తన లక్ష్యం గురించి ఏమీ మాట్లాడలేదు.
ఇన్నేళ్ల శ్రమ వృథా అయినట్లేనా. ఇది కేవలం తన దురదృష్టమేనా. ప్రాణం ఉంటే చాలు. లక్ష్యం సంగతి మళ్లీ చూసుకోవచ్చు. ఇదేనా మనిషి ఆలోచన. ఇది మంచికే జరుగుతుందా.. నీరజ ఆలోచిస్తూ పడుకుంది.