ప్రయత్నం
ప్రయత్నం
హరి భావన ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు..
అప్పటికి వారి పెళ్ళి అయ్యి నాలుగేళ్ళు..
వారికి ఒక చిట్టితల్లి, ఆ పాపకి పారిజాత అని ముద్దుగా పేరు పెట్టుకున్నారు...
వారుండే అపార్ట్ మెంట్స్ లో రెండో ఫ్లోర్ లో ఎదురుబొదురు ఫ్లాట్స్ లో ఒకటి హరి వాళ్ళది..ఎదురుగా ఉండే ఫ్లాట్
శంకరం సుకన్య లది... వారు పెద్దవయసు దంపతులు..
పారిజాతను భావన వాళ్ళు అత్తగారింట్లో ఉంచేసారు..ఇద్దరివీ ఉద్యోగాలు మరి...
చేసుకునేది ఎప్పుడో, తినేది ఎప్పుడో వారికే తెలీదు...ఇక చిన్నపిల్లకేమి పెడతారు...అందుకే పాప మకాం నాన్నమ్మ ఇంట్లో..
ఆ రోజు పొద్దున్నుంచే ఒకటే వాన..హాయిగా డ్యూయెట్లు పాడుకోకుండా వాదనతో సమయాన్ని పాడుచేసుకుంటున్నారు హరి భావన..
నువ్వు సంపాదించేదంతా నీ చీరలు డ్రెస్సులు బంగారం కొనుక్కోటానికే వాడేసుకుంటే ఇక నువ్వు సంపాదించి ఏం లాభం...ఇప్పుడు ఆ డైమండ్ సెట్ కొనుక్కోపోతే ఏమయ్యింది..పెళ్ళికి కొనుక్కున్న అన్ని నగలున్నాయిగా అని హరి ఒకటే సాధిస్తున్నాడు భావనని..
అవును పెళ్ళికి ముందు నన్ను నీతో పెళ్ళికి ఒప్పించేందుకు చందమామని అయినా తెచ్చిస్తా, చుక్కలనయినా కోసిస్తా అని తెగ గాలికోటలు కట్టావు..అవి ఎలాను చేతికందవు..ఇప్పుడేమో, కొనుక్కోగలిగిన బంగారానికి కూడా ఇన్ని కేకలేస్తున్నావు...మా చెల్లి పెళ్ళిలో మా మావయ్య కూతురుతో పోటిపడి నేను లేటెస్ట్ సెట్ పెట్టుకోకపోతే ఏం బావుంటుంది...అర్ధం చేసుకోవూ అని భావన గోల పెడుతోంది...
ఛా పెళ్ళికి ముందు ఇవన్నీ అర్ధమయి చావవు అందుకే ఏదో ఒకటి వాగేసాను...ఇప్పుడు అనుభవిస్తున్నా అని హరి తన చేతిలోని టీవి రిమోట్ ని దూరంగా విసిరికొట్టాడు..
రిమోట్ విరిగిపోయింది..అది చూసి భావన గట్టిగా అరుస్తోంది..బంగారానికి డబ్బు ఖర్చు అయిందంటూ ఇప్పుడు నువ్వు చేసే పనేంటి..కొత్త ఖర్చులు తెస్తున్నావు...అని కోప్పడింది భావన...
నా మాటలు నాకే తిప్పిచెప్పి నన్ను వెక్కిరిస్తే కోపం రాదా మరి..నిన్నేమి చెయ్యలేక రిమోట్ మీద కోపం చూపించా...అన్నాడు హరి..
అంటే నన్ను కొడతావా అంటూ రెట్టించింది భావన..
నిన్ను కొడతాను అనలేదు..నిన్నేమి చెయ్యలేక అన్నాను అన్నాడు హరి...
ఇద్దరూ అలిసిపోయి గొడవ పడటం ఆపేసి నీరసంగా కూర్చున్నారు..ఏమీ వండుకోను కూడా లేదు...ఇద్దరికీ ఆకలేస్తోంది...ఫోన్ చేసి పిజ్జా ఆర్డర్ చేసుకున్నారు...
హరి మళ్ళీ మొదలుపెట్టాడు...కమ్మగా పప్పుచారు వేడన్నం అప్పడాలు ఉంటే కడుపు నిండా తినచ్చు...ఈ పిజ్జా ఆకలి తీరుస్తుందేమో కానీ...తిన్నామన్న తృప్తినివ్వదు...అన్నాడు
ఆఫీస్ పని లాప్టాప్ లో చేసుకుంటున్న భావన చెప్పింది...అదేదో ఆర్డర్ చేసేముందు చెప్పొచ్చుగా ఇద్దరం కలిసి తిప్పలు పడి చేసుకునేవాళ్ళం...నీకు నన్ను ఏదో ఒకటి అనకపోతే తోచదనుకుంటా అంది కొంచెం బాధగా...
ఇదీ వారి అర్ధంపర్ధం లేకుండా అస్తవ్యస్తంగా సాగుతున్న నేటి జంట కధ..
ఎదురుగా ఉన్న శంకరం సుకన్యలు కుదురైన జంట...వారి ఇద్దరు పిల్లలు చెరో చోట వారి వారి కుటుంబాలతో సెటిల్ అయి ఉన్నారు...అప్పుడప్పుడూ వారు వీరి దగ్గరికో, వీరు వారి దగ్గరికో వస్తూ పోతూ కలుస్తూ ఉంటారు...
సుకన్యకు చేతులు పట్టు ఉండవు ...కండరాలు బలహీనపడి ఒక్కోసారి గ్లాసును కూడా సరిగ్గా పట్టుకోలేదు...అయినా ఉండీలేని ఓపికతో ఏదో ఒకటి చెయ్యాలని చూస్తుంది...శంకరం చెయ్యనివ్వడు...
సుక్కూ ఇన్నాళ్ళూ కష్టపడ్డావు..ఇప్పుడు చేతకానప్పుడు ఎందుకురా చెయ్యటం నేనున్నాగా...చేస్తాను...అని ధైర్యం చెబుతుంటాడు భార్యకి..
మీకు మాత్రం ఏమి ఓపికుంది...మీరైనా ఏమి చెయ్యగలరూ అని ప్రేమగా విసుక్కుంటుంది సుకన్య శంకరాన్ని...
ఒక రోజు పండుమిర్చి పచ్చడి పడదామని శంకరం రెండు కిలోలు పండుమిరపకాయలు తెచ్చాడు...
తడిబట్టతో అన్నీ శుభ్రంగా తుడిచి మళ్ళీ ఇంకో పొడిబట్టతో తడి లేకుండా చూసి మిరపకాయలకు తొడిమలు తీసి పక్కన పెడుతోంది సుకన్య...చింతపండు కొలతకు తగ్గట్టు పళ్ళెంలోకి తీస్తూ శంకరం చెబుతున్నాడు సుకన్యతో...ఇదిగో అమ్మీ ఈ సారి పులుపు ఎక్కువేద్దాం..
కిందటిసారి, తింటే ఆ ఘాటుకి, ముక్కులోంచి పొగలు రావాలి, పులుపు కారాన్ని డామినేట్ చెయ్యకూడదు అని నువ్వు అన్నావు అని నేనూ ఒప్పుకున్నా...అప్పుడు పచ్చడి తిన్న రోజంతా కడుపుమంటా అని తెగ బాధపడ్డావు..ఈసారి అంత కారంగా వద్దులే అని భార్యను ఒప్పిస్తున్నాడు శంకరం..
సరే కానీ అబ్బీ నీ మాట ఈ ఒక్కసారికి వింటానులే అని మధురంగా నవ్వింది సుకన్య...
ఓ అరగంట తరువాత పచ్చడి దంచుతున్నాడు శంకరం రోటిలో...పక్కనే కూర్చుని సమంగా ఉప్పు పసుపు చింతపండు వేస్తూ స్పూన్ తో పచ్చడి కలుపుతోంది సుకన్య...ఆ ఘాటు తట్టుకోలేకపోయిందో, ఏమయ్యిందో కానీ సుకన్య నేల మీదకి స్పృహ లేకుండా ఒరిగిపోయింది...
సుక్కూ ఏమయ్యిందీ అని మొహం మీద నీళ్ళు చల్లుతున్నాడు శంకరం...సుకన్య స్పృహలోకి రాలేదు...అంబులెన్స్ కి ఫోన్ చేసాడు...
ఎదురింటికెళ్ళి తలుపు తట్టాడు...హరి భావన బయటికొచ్చారు...ఇదీ విషయం అని చెబితే ఇద్దరూ తోడున్నారు శంకరం సుకన్యలకు...
హాస్పిటల్ లో ఐ సి యు లో చేర్చారు సుకన్యను..శంకరం కి దిగులుగా ఉంది..
డాక్టర్ వచ్చి చెప్పారు సుకన్యకు బి పి బాగా డవున్ అవడం వలన అలా అయింది అని, ఇప్పుడు సుకన్య స్పృహలోకి వచ్చారు అని...శంకరం పరుగున వెళ్ళి సుకన్యను పలకరించాడు...సుకన్య శంకరం ని చూసి ఊరుకుంది...శంకరం సుకన్య చెయ్యి పట్టుకుని సుక్కూ ఇప్పుడెలా ఉంది అని అడిగాడు...
సుకన్య అయోమయంగా చూస్తోంది తప్ప సమాధానం చెప్పట్లేదు..
డాక్టర్ బయటకు వెళ్ళి హరికి చెప్పాడు ఒక్కోసారి పెద్దవయసు వారికి బి పి,
లో(low) అయ్యి, మెదడుని బాగా ప్రభావితం చెయ్యచ్చు...అప్పుడు కాసేపు జ్ఞాపకం ఉండదు..బహుశా అందుకే ఆవిడ గుర్తు పట్టలేకపోతున్నారు అని...అది విని భావన కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి...డాక్టర్ ని అడిగింది...ఇప్పుడెలా డాక్టర్ అంకుల్ ని ఎలా సముదాయించాలి, ఆయన తట్టుకోగలడా ఆవిడ అంకుల్ ని గుర్తు పట్టలేదని తెలిస్తే అని బాధగా అడిగింది...
డాక్టర్ చెప్పాడు ఒక అరగంటలో ఆవిడ మామూలుగా అవ్వచ్చు...ఇప్పుడే తేరుకుంటున్నారు కదా కొంచెం ఓపిక పట్టండి అని...
హాస్పిటల్ లో ఇప్పుడు సుకన్యగారిని ఐ సి యు నుంచీ రూం కి షిఫ్ట్ చేస్తారుట, ఈ రోజు ఇక్కడే ఉండాలిట అని ఏదో ఒకటి చెప్తూ హరి నెమ్మదిగా శంకరం చెయ్యి పట్టుకుని సుకన్య దగ్గరనుంచీ బయటకు తీసుకొచ్చేసాడు...
ఒక అరగంట తర్వాత డాక్టర్ వచ్చి చెప్పాడు శంకరం గారిని సుకన్య అడుగుతోంది అని, ఇప్పుడు ఆవిడకు అన్నీ గుర్తు వస్తున్నాయి అని...అది విని శంకరం కి అర్ధం అయింది ఇందాక సుకన్య అభావంగా చూసిన చూపులకు కారణం ఇదా అని..
గబగబా సుకన్య దగ్గరకు వెళ్ళాడు...సుకన్య ప్రేమగా చూసింది శంకరం ని...
వెంటనే రూం కి మార్చారు సుకన్యని..రూం లో ఉన్నట్టుండి శంకరం సుకన్యని విసుక్కున్నాడు...
నీ వయసు గురించి, ఆరోగ్యం గురించి ఆలోచించకుండా నీ పిల్లలు బావుండాలని ఉపవాసాలు చెయ్యటమెందుకు, అదీ చాలదన్నట్టు తినే నాలుగు ముద్దలూ పచ్చళ్ళు కలుపుకుని తింటావు...నీ ఆరోగ్యం పాడైతే నీకేమో కానీ నాకు పిచ్చ టెన్షన్ వస్తుంది...నువ్వు మాత్రం నీకు తోచిందే చేస్తావు, నా గురించి మాత్రం ఆలోచించకు, నీకేదన్నా అయితే నేనేం కావాలి అని ఆవేశపడి ఆయాసపడుతున్నారు...
అది చూస్తున్న హరి, భావనకు అర్ధం కావటం లేదు...ఎందుకలా శంకరం పేషంట్ మీద కోపపడుతున్నాడో అని...
సుకన్య అంత నీరసం లోనూ ఉక్రోషంగా సమాధానం చెప్పింది శంకరం కి...నేనేమీ పచ్చళ్ళు తిననులే మీరు ఇచ్చే రాగిజావ తాగి బతుకుతా, మీరు వేసుకుతినండి కమ్మగా పచ్చళ్ళు అని గట్టిగొంతు తెచ్చుకుని కోప్పడుతోంది శంకరం ని..
ఏమిటి వీళ్ళిద్దరూ అని హరి, భావన అయోమయం లో ఉన్నారు..
కాసేపటికి మందుల వల్ల మత్తుతో సుకన్య నిద్ర పోతోంది...
హరి, భావన శంకరం ని అడిగారు...అంకుల్ మీరు మామూలుగానే ఏ రోజూ ఆంటీని విసుక్కోగా మేము చూడలేదు..ఈ రోజు వంట్లో బాగోని మనిషి మీద అంతలా ఎందుకు విసుక్కున్నారు అని..
శంకరం చెప్పాడు కొంచెం ఏడుపుగొంతుతో.. డాక్టర్లు చెప్పారు సరే, తనకి జ్ఞాపకం తిరిగొచ్చిందని, తనూ నన్ను ప్రేమగా చూసింది సరే, గుర్తుపట్టినట్టుగా, అయినా ముసలోణ్ణిగా, చాదస్తం జాస్తి అందుకే నాకు నేనే ఒకసారి ప్రయత్నీంచి ఇంకోసారి ఋజువు చేసుకోవాలనిపించింది, తను నన్ను నిజంగా గుర్తుపట్టిందా లేదా అని అందుకే అలా విసుక్కున్నాను....
అసలు తను ఏదీ చెయ్యలేకపోయినా పర్వాలేదు, నా ఓపికున్నంతలో నేను చేసిపెడతాను, కానీ తను నన్ను గుర్తు పట్టలేకపోతే, ప్రేమగా నన్ను ఏంటి అబ్బీ అని పలకరించకపోతే నేను తట్టుకోలేను...అందుకే విసుక్కుని తనలో రోషం పుట్టించాను...తనూ నన్ను విసుక్కుంది...కోపంలో ఎక్కడెక్కడివో కూడా మన మనుష్యులకు గుర్తొస్తాయి కదా అని, అలా చేసానర్రా...ఏదో తను నన్ను మరిచిపోకూడదు అని నాకు తోచిన ప్రయత్నం చేసాను అన్నాడు అమాయకంగా...
హరి, భావన ఆ పండు దంపతుల ఫలవంతమైన ప్రేమను అర్ధం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు....హాపీ మారీడ్ లైఫ్ కి పరమార్ధం తెలుసుకుంటున్నారు...

