STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

3  

Midhun babu

Romance Classics Fantasy

ప్రియా నేస్తం

ప్రియా నేస్తం

2 mins
12


కాలింగ్ బెల్ మోగుతూ ఉంది. " అబ్బబ్బా ఇప్పుడే పనమ్మాయి వెళ్ళింది, తలుపేసుకుని పూజ చేసుకుంటున్నా. మనఃశ్శాంతిగా పూజ కూడా చేసుకోనివ్వకుండా మళ్ళీ ఎవరో " అనుకుంటూ తలుపు తీసింది కమల. ఎదురుగా చిన్ననాటి నేస్తం మోహన్. 


" ఎప్పుడొచ్చినా సాయంత్రం పూట రావటం అలవాటు కదా, ఇవాళేమిటి పొద్దున్నే వచ్చావు " అడిగింది కమల.


" చెబుతా చెబుతా నీ చేతి కమ్మటి ఫిల్టర్ కాఫీ తాగనిదే ఏదీ చెప్పనుగా కమలా " అన్నాడు మోహన్. " సరే పూజ చేసుకుని వస్తా, ఈ లోగా ఈ చల్లటి నీళ్ళు తాగు "అంది నీళ్ళ గ్లాసు అందిస్తూ కమల.


"మీ ఇంట్లో మాత్రం సర్వకాల సర్వావస్ధలయందూ కుండనీళ్ళు చల్లగా హాయిగా దొరుకుతాయి కమలా " అన్నాడు మోహన్.


పావుగంట తరువాత టిఫిన్ ఏం చెయ్యను అడిగింది కమల. "ఏం వద్దు గానీ నువ్వు చీర మార్చుకుని తయారయ్యి రా, మా ఇంటికి వెళదాం, సుగుణ టిఫిన్ చేసి పెడతానంది "అన్నాడు మోహన్.


ఇప్పడెందుకు రావటం మళ్ళీ ఇంకోసారి వస్తాలే అంది కమల. "నీకు చాలా ఇష్టమైన వారు నా ఇంట్లో ఉన్నారు, తర్వాత నీ ఇష్టం వస్తావో రావో "అన్నాడు మోహన్.


"ఎవరూ వాసంతీయేనా, నిఝంగా వాసంతీనా "అంది మోహం చంద్రబింబంలా వెలిగిపోతుండగా కమల. ఎవరో నేనయితే చెప్పను, నీకు సర్ప్రయిజ్ అన్నాడు మోహన్.


పదపదా వెళదాం అంటూ తాళం చేతబుచ్చుకుంది కమల. మరి నీ చేతి కమ్మటి నా ఫిల్టర్ కాఫీనో అడిగాడు చిన్నపిల్లాడిలా మోహన్. ఈసారి పది కాఫీలు ఇస్తాను ఇప్పుడు త్వరగా పదా అంది కమల.


మరి చీర మార్చుకోవా అడిగాడు. ఏం వద్దు నా కళ్ళతో నేను త్వరత్వరగా నా వాసంతిని చూడాలి, తనని చూసి ఎన్నేళ్ళయ్యిందో అంటోంది ఆత్రృతగా కమల. నేను అక్కడ ఉన్నది వాసంతి అని చెప్పనేలేదుగా కమలా అన్నాడు. నా మనసుకి తెలుస్తోంది నేను కలవబోయేది వాసంతినే అని " అని చెప్పి గబగబా తాళం వేసి, రోడ్డవతల రెండు సందుల అవతల ఉన్న మోహన్ ఇంటికి పరుగుపరుగున దారితీసింది కమల. 


వెనుకన మోహన్ చిన్నగా నడుస్తున్నాడని మోహన్ చేతిని తానే పట్టుకుని చకచకా లాగేస్తూ అడుగులు వేసేస్తోంది కమల తన ప్రియనేస్తం కోసం.


తలుపు తట్టి నిలుచున్నారు కమల మోహన్ చిన్నగా ఆయాసపడుతూ. సుగుణ తలుపు తీసింది. ఎదురుగా.... ఎదురుగా.... డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చుని ఉంది కొద్దిగా ముసలితనం వచ్చేసిన వాసంతి. " వాసంతులు " ఆప్యాయంగా పిలుస్తూ వాసంతి దగ్గరకు వెళ్ళింది కమల. వాసంతి లేచి నుంచుని చేతులను కాస్తంత గాలిలో ఆడిస్తూ, కొంచెం తడుముకుంటూ కమల రెండు చెంపలూ తన చేతులతో పట్టుకుంది ప్రేమగా వాసంతి. ఏమయ్యిందే నీకు అడిగింది ఆదుర్దాగా కమల.


ఏమీ కాలేదే, ఒక కన్నుకు కాటరాక్ట్ వచ్చింది. ఆపరేషన్ ఇదిగో చేయించకుందాం, అదుగో చేయించుకుందాం అని అనుకుంటుండగానే రెండో కంటికీ కాటరాక్ట్ వచ్చేసింది. ఇప్పుడు కళ్ళు పూర్తిగా కనపడవు, కొంచెం కొంచెం ఎదుటిమనిషి ఆనవాలు తెలుస్తుంది. ఇదుగో ఇప్పుడు నువ్వు కాస్తంత తెలుస్తున్నావు నా కళ్ళకి, కానీ స్పష్టంగా లేవు కమలా అని అంది. ఇద్దరూ ఆప్యాయంగా కౌగలించుకున్నారు. మోహన్ వారిద్దరినీ ఫొటోలు తీసి ఫ్రెండ్స్ గ్రూప్ లో పోస్ట్ చేస్తున్నాడు. కమల, వాసంతి తమ స్నేహపు గాఢపరిష్వంగపు మాధుర్యాన్ని అనుభవిస్తూ, ఆస్వాదిస్తున్నారు. ఇంతలో సుగుణ నాలుగు పళ్ళాల్లో ఘుమఘుమలాడే అల్లం పచ్చిమిర్చి జీలకర్ర జల్లి చేసిన పెసరట్లు తెచ్చింది. ముగ్గురు స్నేహితులూ ఆపాతమధురాలు ముచ్చటించుకుంటూ పెసరట్టు లాగిస్తున్నారు.



Rate this content
Log in

Similar telugu story from Romance