ప్రేమ పేడ
ప్రేమ పేడ
నువ్వు ముందుంటే నా జీవితంలో ప్రేమ వెలుగుతుంది
లేకపోతే చిత్తు కాగితంలా మారి చిరుగుతుంది
పెరుగు తాగితే రోజూ కడుపులో చల్లదనం పెరుగుతుంది
లేకపోతే అది ఆరోజుకు వాల్కనోలా మరుగుతుంది...
కవితా ఝమ్ఝా మారుతంలో కొట్టుకు పోతున్నాడు సుబ్రావ్. జస్ట్ యస్టర్ డే... పేడమీద కాలేసి జర్రుమని జారి పడినప్పుడు కిసుక్కున నవ్వింది సీత. ఆ వెంటనే ఆమె చూపుల్లో ప్రశంశ ప్రతిఫలించింది. నువ్వు నా వెంటుంటే జీవితాంతం సుఖంగా బతికేస్తానన్న నమ్మకం కనిపించింది. నవ్వులకోసం చేసిన నిరీక్షణ ఇన్నాళ్లకు ఫలించింది. తన దేవత కరుణించి చిరు నవ్వులు ప్రసాదించింది.
నీ నవ్వులు పులిహోరాలో వేగిన మిరపలు
అవి లేక నా బతులో చప్పిడి మెతుకులు....
"ఒరే ఏబ్రాసీ... ఎక్కడ చచ్చావురా..." ఫెటీల్మని మోగిన బామ్మ కంఠస్వరం. ధార తెగింది... వెల్లువలా ఉబుకుకొస్తున్న కవితా ఝరి ఆగింది.
విలవిలల్లాడిపోయాడు సుబ్రావ్. ఈ రోజు ఎంత సుదినం. ఒళ్ళంతా పేడ అంటుకున్న తనను చూసి సీత నవ్వుల ఫక్కుమన్న శబ్దాలు... ప్రేమను ఒలికించి తన మది పులకించింది. లక్కీగా ఈమధ్య కథల పోటీలో లో ఇచ్చిన కథాశం కూడా అదే. రాసి పారేద్దామనుకున్నాడు. ప్రేమ పైత్యాన్ని... ప్రేమకోసం, ప్రేమతో కక్కేద్దామనుకున్నాడు. మధ్యలో ఈ రాక్షసిలాంటి బామ్మ.
"సన్నాసెదవా, చెవుల్లో దూలాలు పెట్టుకున్నావేమిరా, నేనిట్ఠా ప్రాణాలవిసేలా అరిచి చస్తావుంటే. మూగమొద్దులా ఇక్కడ సెల్ఫోన్లో తల దూర్చుకుని కూర్చోనుండావ్..."
తిక్క రేగిపోయింది. తాళలేక పోయాడు. కాలకూట పాషాణ పానోన్మత్త ప్రళయకాళ రుద్రుడై... రావణాసుర సంహారోద్రేక కోదండ రామచంద్రుడై... రక్కసాధముల దునుమాడడానికి మహోగ్రంగా దూసుకొచ్చే విష్ణు చక్రంలా పేట్రేగి పోదామనుకుంటున్న ఉత్తర క్షణాన.
"ఎవరో సీతట... నీకోసం వచ్చిందిరా వెఱ్ఱికుంకా..." బామ్మ నోట్లో మాట నోట్లోనే ఉంది. మెట్లు ఎప్పుడు దిగాడో... ఎప్పుడు ఇంటి గుమ్మం చేరాడో... భయంతో, భక్తితో, రక్తితో, అనురక్తితో, కృతజ్ఞతతో, విశ్వాసంతో మెలికలు తిరిగిపోతున్నాడు సీత ఎదుట సుబ్రావ్.
"ఏ... ఏ... ఎమ్... ఏం క్క... క్కా... క్క... క్కా... వాలండీ..." నత్తి ఎప్పుడొచ్చిందో తెలియడంలేదు.
"మా అమ్మ పిడకలు పెట్టుకోవాలంట..." సీత.
ప్రేమకు, పిడకలకు ఏమిటి సంబంధం. ఏమో... ఉండే ఉండొచ్చు. తొందరపడి క్వశినించి అజ్ఞానాన్ని బయట పెట్టుకోరాదు.
"ఆ..."
"మీ పక్కింట్లో బర్రెపేడ తెమ్మంది"
"ఊఁ..." సుబ్రావ్ లో నో ఎక్స్ ప్రెషన్.
ఈ అభాగ్యుడు అర్థం చేసుకోలేక పోతున్నాడు ప్రియా క్షమించు.
"నాకు పేడంటే అసహ్యం"
"ఆఁ... ఊఁ..." మనోడిలో తీవ్ర అయోమయం.
"మొన్న మీరు రోడ్డుమీద జారి పడినప్పుడు చూశాను, ఎంత ప్రేమగా మూతికంటిన పేడ తుడుచుకున్నారో. నావంక చూసి మీలోమీరే నవ్వుకుంటూ పెదవులపై ఉన్న పేడను నాకి మింగి చప్పరించారు కూడా."
"అ... ఆఆ... ఉఊఁ..." ఎలా ఏం చేయాలో, ఏం చెప్పాలో అంతా శూన్యం సుబ్రావ్లో.
"మీరు ఆ పక్కింటికొచ్చి మీ బంగారు చేతుల్తో బర్రెల కింద పేడ తీసి ఇందులో వేశారంటే, నేను అంటుకోకుండా తీసుకెళ్లి అమ్మకు ఇస్తా... ప్లీజ్..." వెంట తీసుకొచ్చిన చేట ముఖంపై పెట్టింది సీత, తల ఒంచుకునే.
సమాధానం రాక, తలెత్తి చూసేసరికి ఎదురుగా సుబ్రావ్ లేడు.
కింద కాళ్ళ దగ్గర బొక్కబోర్లా పడి గిలగిలా కొట్టుకుంటున్నాడు.
---------------------------------------------------------------
