STORYMIRROR

చిట్టత్తూరు మునిగోపాల్

Tragedy

4  

చిట్టత్తూరు మునిగోపాల్

Tragedy

నాయిన సైకిలు

నాయిన సైకిలు

3 mins
36

"పెదపిల్లోడా ముందెక్కడ పంచరైందో చూడరా"

"యాడా కనపడ్డంలేదు మావా"

"నీ తలకాయ్, ఇగ్గో ఈడ బుడగలొస్తావుండాయి జూడు"

ఒక పెద్ద సత్తు దబర్లో నీళ్లు, దాన్లో కొంచెం గాలి కొట్టిన సైకిల్ ట్యూబు. ఐదోఆరో పంచర్లు పడుండాయి దానికిి. మల్లీ ఇప్పుడు ఇంగొకటి.

గళ్ళ లుంగీ తొడల్దాకా ఎగ్గట్టి ట్యూబు రొండు చేతుల్తో పట్టుకోని మెత్తగా సగించినట్టు ఒత్తతా ఉండాడు దుదుగుంటోల్ల రవణయ్య. పక్కనే మా నాయిన గూడా గుచ్చోని ఆయన్నకు సలహాలిస్తావుండాడు. నాలుగు మూరల పంచి, ఒక చిన్న పైగుడ్డ... అదీ పెదపిల్లోడి అవతారం.

ఎట్టాగైతేనేంది.. దబర నీళ్ళల్లో ముంచిన ట్యూబులోనుంచి సన్న బుడగలు వొచ్చినాయి బుస్సుమని.

“అదిగదిగో పెదపిల్లోడా అక్కడ అయినట్టుండాది పంక్చరు.. సీకిరిపుల్ల గుచ్చు.” సన్నటి నడుమును వొంచేసి కన్నార్పకుండా చూస్తావుండిన నాయిన అరిచినట్టు చెప్పినాడు.

‘సీకిరిపుల్ల గుచ్చేసి, నీళ్ళల్లోనుంచి ట్యూబు బయటికి తీసి పంచర్ ఏసే గస తీర్చుకుంటా సల్లటి యాపసెట్టు నీడ కింద నులకమంచం మింద కుచ్చున్నారు ఇద్దురూ.

అమ్మ చేతికిచ్చిన బెల్లం కాపీ చప్పరిస్తా ముచ్చట్లలో పడినారు.

మావూళ్లో పెదపిల్లోడే కాదు, చినపిల్లోడు గూడా ఉండాడు.

పెదపిల్లోడంటే దుదుగుంటోల్ల రమణయ్యే. చిన పిల్లోడంటే ఆయప్ప తమ్ముడు నాగయ్య.

నలపై దాటిన ఆయన్నలిద్దురికీ మా నాయిన పెట్టుకున్న ముద్దు పేర్లు అయ్యి.

ఊల్లో అందరికీ ఇచిత్రం పేర్లు పెట్టడంలో మా నాయిన్ని మించినోడు లేడు.

బీఎస్ఏ సైకిలది. నేను మూడో తరగతిలో ఉన్నప్పుడు మాయింటికొచ్చింది. ఆప్పుటినుంచీ ఆ సైకిలు వైబోగం యేమని జెప్పాలి.

కోవనూరు బడిలో పనిజేసేటప్పుడు పోస్టాపీసు రవన్న దెగ్గర కొనుక్కున్నాడు. ఆయన్న కొని రొండ్రోజులే అయిందంట... కొత్తది. ముదురాకుపచ్చ కలరు. పచ్చ సీటు. హ్యాండిల్ కప్పులు కూడా పచ్చవే. సీటుకింద బారుకు మూడు ఎండి పట్టీలు. ఆ పట్టీల మజ్జమజ్జలో B S A అని కంపినీ అచ్చరాలు.

నా సామిరంగా... ఊల్లో జరిగే రాములోరి పటమూరేగింపు మాదిర్తో తీసుకోనొచ్చినాడు కోవనూరు నుంచీ తిమ్మసంద్రానికి నాయిన. లోపలికి రాకండానే తలాకిట్లో స్టాండేసి నిలబెట్టినాడు. అమ్మని బిలిచి పసుప్పూసి కుంకం బొట్లు పెట్టి కర్పూరం ఆరతిచ్చినాడు. నిమ్మకాయి దిష్టి దీసి, ఆ దబ్బల్ని సగానికి కోసి, పసుపుకుంకం బూసి, రొండు చక్రాలకింద తొక్కించినాడు. సైకిలెక్కి ఈదిలో ఒక రౌండు కొట్టి, అనాక ఇంట్లోకి దెచ్చి స్టాండేసి నిలబెట్టినాడు బద్రంగా.

ఇగప్పుటినుంచీ సైకిలు నాయిన ప్రాణమయ్యింది. అదాయిన ఒంట్లో ఒక బాగమయ్యింది. మా ఇంట్లో ఒక మనిషిగా మారిపొయ్యింది.
దినామూ నిద్ర లేస్తానే గుడ్డపేలిక ఎత్తుకోని సైకిలును తుడిచి, కడిగి, మల్లీ తుడిచి సుబ్బరం చెయ్యడంతో మొదులయ్యేది నాయిన దినచర్య... బడినుంచీ ఇంటికొచ్చినాక రొండోసారి మల్లీ అదేపని జేసి బద్రంగా చూరుకింద నిలబెట్టినాక ముగిసేది.

చిన్న రిపేరొచ్చినా తనకలాడి పొయ్యేవోడు. మిట్ట మజ్జానమైనా, అర్దరేత్రయినా దాన్ని బాగజేసేదాకా ఒదిలేవోడు కాదు. సైకిల్ రిపేర్ల కోసమనే చిన్న సామాన్ల పెట్టి కొన్నాడు. ఊల్లో ఇంగెవురి దగ్గిరా అటుమంటి రిపేరు సామాన్లు లేవు.

అనాక ఊరిడిసిపిపెట్టి కాలాస్త్రి వొచ్చేస్తిమి. నాయినితో కలిసి పంక్చర్ ఏసే సావాసగాళ్ళు అక్కడే ఊళ్లోనే ఉండిపోయ్యినారు. ఎప్పుడైనా పంచర్ అయితే సికిలు అంగిటికి ఎయ్యించాల్సి వొచ్చేది.

ఒగరోజు దర్మరాజుల తిరనాల్నుంచీ వొచ్చి అమాన మంచంమీద వాలిపొయ్యినాడు నాయిన.

"టీ ఈమంటారా..." వంటింట్లోనుంచీ అడిగింది అమ్మ. ఉలుకూపలుకూ లేదు.

నాకు బయమేసింది. ఒకసారి తిర్పతిలో ఓపెన్ యూనివర్సిటీ క్లాసులకు ఎల్లి వొస్తావుంటే, గుండి నెప్పి వొచ్చిందంట నాయినికి. డాక్టరు దెగ్గరకి తీస్కుని బోతే అటుమంటిదేమీలేదు, మామూలు కండల నెప్పేనని జెప్పి మాతర్లిచ్చి అంపినాడంట. మేం జెప్పినట్టు నాయినకు చెప్పబాకబయా అంటా ఆయిన ఫ్రెండ్స్ చెబితే తెలిసింది మల్లెప్పుడో.
అదంతా గెవనానికి వొచ్చిందిప్పుడు.

"గుండిలో యేమన్నా నెప్పిగా ఉండాదా నాయినా..." అడిగినా మెత్తగా దగ్గిరికెల్లి.

"తిర్నాల్లో సైకిల్నెవురో ఎత్తుకోనెల్నార్రా" నాయిన గొంతులో జీర.

"యాడ బెట్టుంటే"

"తిర్నాల జరిగే చోటుకి దూరంగా, సందులో ఒకింటి ముందర బద్రంగానే పెట్టినాన్రా. అర్జున తపస్మాన్ జూసుకొన్నాను. మీకోసం నిమ్మకాయిలు బట్టుకున్నా. మీ పెల్లై శానాకాలమైనా బిడ్డల్లేరుగదా. అవి నమిలి దింటేనన్నా పుట్టుకోనొస్తారని ఆశ. ఈడొచ్చి జూసేతాలికి సైకిల్ కనబళ్లా. ఎవురో దొంగలెత్తుకోని బొయ్యినారు." లేచి కుచ్చోని తలకాయి కొంచెం పైకెత్తి చెప్పినాడు.

నాయిన కల్లల్లో పల్సగా నీల్లపొర.

అప్పుడు జూసినా ఈదిలో... ఎప్పుడూ ఠీవిగా, రాజా మాదిర్తో నిలబడి హ్యాండిలెగరేసే సైకిల్లేదు.

వారం దినాలు ఈది మొగం జూడలేదు నాయిన. లోపల్లోపల్నే కుమల్తా ఇంట్లోనే ఉండిపొయ్యినాడు.
కొత్త సైకిలు కొనుక్కుందామంటే ఇనలేదు.

"ఎందుకురా దండగ. ఆ డబ్బులు పెడితే ఇంట్లోకి నెలారొండు నెలల సరుకులు సాయిబంగట్లో తెచ్చుకోవొచ్చును." అంటా నా మాటలు కొట్టేసినాడు.

అనాక ఎప్పుడో, ఎక్కడో పాత డొక్కు సైకిలు తెచ్చినాడు గానీ, సీటు బలే ఎత్తు అయిపోయ్యింది. నాయినకు కాల్లందలేదు.

సాయిబంగట్లో పంజేసే పిల్లోడికి తొక్కుకోమని ఇచ్చేసినాడు ఫ్రీగా.

కొత్త హీరోహోండా కొన్నాక, నా పాత టీవీయస్ మోపెడ్ ఇచ్చినాను. దాంతో కూడా జత కుదర్లేదు.

"సైకిలంటే అదిరా... దాన్నెక్కి తొక్కతా ఉంటే ఆ వైబోగమే ఏరేగా ఉండేది. ఈ టీవీఎస్లూ, డుగుడుగు బండ్లూ  నా బీ ఎస్ ఏ సైకిలు ముందు బలాదూరు. ఉర్దాగా దొంగల పాలైపొయ్యింది గదరా." పదేపదే గుర్తుకు తెచ్చుకోని బాదపడేపడేటోడు నాయిన.

చివరి రోజుల్లో కాన్సరు మహమ్మారితో పోరతా కూడా నాయినలో ఇదే కలవరం.

నా గుండిల్లో ఇప్పుటికీ కన్నీల్ల సలపరం.
-------------------------------------------------------
(నాయనకు, ఆయన ముదిగారపు BSA సైకిలుకు అంకితం)


Rate this content
Log in

Similar telugu story from Tragedy