ఒక రోజు పార్టీ ఖర్చు
ఒక రోజు పార్టీ ఖర్చు
నాకు పదవీ విరమణ ఫంక్షన్ చేసుకోవాలని లేదు అన్నారు శ్రీనివాసరావు గారు.
ఆయన సేవాగుణం గురించి తెలిసిన వాళ్ళెవరూ ఆశ్చర్యపోలేదు.
కనీసం ఒక చిన్న పార్టీ అయినా ఇస్తాము అని బ్రతిమిలాడారు కొంత మంది ఉద్యోగులు. ఆయన వద్దని చెప్పేశాడు.
కొద్ది మంది ధైర్యం చేసి అడిగారు. గురువు గారూ! మరీ ఒక రోజు పార్టీ చేసుకుంటే తప్పు ఏముందండీ.
సరే. మీరు నాకు పార్టీ ఇవ్వాలి. అంతే కదా. ఏ మాత్రం ఖర్చు పెడతారేమిటి? ఆయన ప్రశ్న విని వారికి ఆశ్చర్యం వేసింది.
ఓ ఐదు వేలు పెడదాం అనుకుంటున్నాం అండీ అని ఒక కుర్ర ఉద్యోగి బదులిచ్చాడు.
సరే ఆ ఐదు వేలు నాకు ఇవ్వండి అన్నాడు ఆయన.
మరుసటి రోజు ఆయన పదవీ విరమణ పార్టీ ఆయనే ఆర్గనైజ్ చేశాడు. మరీ ఎక్కువ ఐటమ్స్ లేకున్నా పది మందికి సరిపడా కూల్ డ్రింక్స్, స్నాక్స్, తనకు తానే వారి తరపున గిఫ్టుగా ఒక చిన్న వినాయకుడి ప్రతిమ కొన్నాడు.
పార్టీ అంతా అయ్యాక అందరినీ ఒక వృద్ధాశ్రమానికి తీసుకుని వెళ్ళాడు.
ఒక పదిహేను మంది వృద్ధులు ఆడా మగా కలిసే ఉన్నారు.
వారి ప్లేట్లలో కొంచెం చిత్రాన్నం, రెండు చపాతీలు ఉన్నాయి. కప్పులలో చట్నీ, కూరా కూడా ఉన్నాయి. ఒక్కో దానిమ్మ ఒక్కొకరి కంచం పక్కనే ఉంది.
వాళ్ళందరూ కళ్ళు మూసుకుని దణ్ణం పెట్టుకున్నారు. శ్రీనివాస రావు అందరినీ చూడమని చెప్పాడు. ఆ వృద్ధాశ్రమం నడిపే అతను ఇలా చెప్పాడు.
ఈ రోజు మనకు అన్నదానం చేసిన వారికి జగద్గురువు అయిన ఆ శ్రీ కృష్ణ పరమాత్మ ఆశీర్వాదం ఉండాలని, వారికి ఆయురారోగ్యాలు ఆయన ప్రసాదించాలని మేము ప్రార్థిస్తున్నాము అని వాళ్ళతో చెప్పించాడు.
వాళ్ళు అలా చెప్పి కళ్ళు తెరిచి తృప్తిగా భోజనం చేశారు.
వారి కళ్ళలోని వెలుగును చూసి శ్రీనివాసరావుతో వచ్చిన వారందరికీ హృదయం ఒక గొప్ప అనుభూతితో నిండిపోయింది.
గురువు గారూ! ఏమో అనుకున్నాం. మేమిచ్చిన డబ్బులోనే మీరు పార్టీ, ఈ అన్నదానం రెండూ జరిపించి మాకు గొప్ప సందేశం ఇచ్చారు.
ఇక నుంచీ మేమూ ఇలానే ఆచరించి ఈ ఆశ్రమానికి కాస్త సహాయపడతాము అని అన్నారు.
శ్రీనివాసరావు వారందరి వైపు మెచ్చుకోలుగా చూశాడు.
