ఒక రచయిత ప్రయాణం
ఒక రచయిత ప్రయాణం
రేవంత్ గారూ! మీకు చిన్నప్పటి నుంచే రచనలు చేయాలనే ఆలోచన రావడం ఎలా జరిగింది? సుధ ఇంటర్వ్యూ లో అడిగింది.
పచ్చటి లాన్ లో వాళ్లిద్దరూ కూర్చున్నారు. ఒక టీపాయ్ అటూ ఇటూ చెరో కుర్చీ. వేడి టీ ఆస్వాదిస్తూ ఇంటర్వ్యూ సాగుతోంది.
మా తాతగారికి సాహిత్యమంటే మక్కువ. ఆయన ప్రోత్సాహంతోనే నేను బాల్యం నుంచే రచనలు చేయడం ప్రారంభించాను అన్నాడు రేవంత్.
సుధ అతను చెప్పేవి రికార్డ్ చేసుకుంటోంది.
ఇప్పుడు భారత దేశంలో మీరొక పాపులర్ రైటర్. ముప్పై ఏళ్ల వయసులో ఈ విజయాన్ని సాధించడం మీకెలా అనిపిస్తోంది అంది సుధ.
నేను ఏ విషయాన్నీ తొందరగా మరచిపోలేను. నిజం చెప్పాలంటే మరచిపోను కూడా. బహుశా దానివల్లే నేనెక్కువగా నా అనుభవాల్ని హృద్యంగా వ్రాయగలనేమో.
ఏదీ మరచిపోలేకపోవడం కూడా ఒక రకంగా బాధాకరమైన విషయమే.. చిన్నప్పుడు పెంచుకున్న చిలుక చనిపోవడం, అమ్మ ఆఖరి శ్వాస, పదేళ్ల క్రితం బస్ మిస్ అయినప్పుడు పడిన టెన్షన్ .. ఇలా ప్రతీదీ నా రచనల్లో ప్రాణం పోసుకుంటుంది..
పాఠకులకు నచ్చి నా రచనలు పాపులర్ అయ్యాయి. నాకంటే గొప్పగా వ్రాసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ల నుంచి నేను చాలా నేర్చుకోవాలి అన్నాడు రేవంత్.
మరికొన్ని ప్రశ్నలు,సమాధానాలు, బిస్కెట్లు పూర్తయ్యాక ఇంటర్వ్యూ ముగిసింది.
ఒక రకంగా నేను మీకంటే అదృష్టవంతురాలినే అంది సుధ రికార్డింగ్ ఆఫ్ చేశాక.
ఎలా అన్నాడు రేవంత్..
నేను కొన్ని మరచిపోగలను అందామె ఒకలా నవ్వుతూ..
ఆమె వెళ్లిపోతుంటే రేవంత్ కి ఏదో పాత సంగతులు జ్ఞాపకం వచ్చాయి.
