నాన్నకు ప్రేమతో
నాన్నకు ప్రేమతో
పూజ్యులైన నాన్నగారికి మీ ప్రియపుత్రుడు నందన్ నమస్కారములు .ఇక్కడ మీకోడలు మరియు మనవళ్లు అందరం కుశలంగా ఉన్నాము .మీ ఆరోగ్యం ఎలావుందీ ?ఈ విషయం పైనే నేను మీకోడలు ఆందోళన పడుతున్నాము. మీరు నేర్పిన క్రమశిక్షణ, సమయపాలన మరియు నా భవితకై మీరు చూపిన బాటలో నేను మీ మాట జవదాటని బాటసారినై నడచి విదేశాలలో మంచి స్థితిలో ఉన్నాను .కానీ మీకు దగ్గరగా లేనన్న అసంతృప్తి నన్ను తీవ్రంగా వేధిస్తూవుంది .
మీ కోడలు పిల్లలు కూడా మనదేశానికి వచ్చేసి మీతో అమ్మతో కలిసివుండాలని ఎంతగానో ఎదురుచూస్తున్నారు . ప్రతిరోజూ మీరు నాకు, అక్కయ్యకు మీపళ్లెం నుండి తొలిముద్ద ప్రేమగా పెట్టేవారు . ఇక్కడ మీరు పిల్లలకు అలవాటు చేసిన పిమ్మట మీ మనవళ్ళు రివాజుగా నాతో తొలిముద్ద రోజూ రుచి చూస్తున్నారు. ప్రతి రోజూ మీరు నా పక్కనే ఉన్న అనుభూతిని ఈ సమయంలో పొందుతాను .ప్రేమానురాగాలను ఆస్వాదించడమంటే ఇదేనేమో! మాకు,పిల్లలకు అనుబంధాల విలువను ఒక గొప్పగురువల్లే నేర్పించారు!
మీ జీవితం ఒక త్యాగాల పర్వం .తల్లితండ్రులు ఎన్ని కోర్కెలను చంపుకుంటే పిల్లలు ఇంతవారవుతారు! మన కుటుంబనేపధ్యాన్ని పరిగణలోకి తీసుకుంటే ఒకవేళ మీరు కనుక సుఖపడాలనుకొని ఉంటే మీ పిల్లలమైన మేము ఖచ్చితంగా ఈ స్థాయిలో ఉండేవారం కాదు .మమ్మల్ని ఉప్పుమూట ఆటలో మోసి సంతోషపరిచేవాడివి .పెద్దైయ్యాక మా అవసరాలను కోర్కెలను తీర్చేందుకు కావడి మోసే కార్మికుడల్లే ఎంతగానో కష్టబడ్డావు .కానీ చిరునవ్వు చేరగనీవు. కష్టం తెలియనీవు. మా నాన్న ఉన్నాడనే భరోసాను కరగనీవు .
చిన్ననాడు మా ఆరోగ్యాలు బావోలేనపుడు మీరు, అమ్మ పడిన తపన, ఆసుపత్రులలో చేసిన జాగరణ, దేవుళ్ళకు మీరు కట్టిన మ్రొక్కులు ముడుపులు మరిచిపోగలనా. అటువంటి ప్రేమమూర్తులైన మీ చరమాంకాన మీ పాదసేవ చేసుకోలేని ఈ బ్రతుకు వృధా అనిపిస్తుంది .ఈ సంపాదన స్థితి స్థాయి మీ పాదధూళితో సమానం .ఎందుకంటే ఇవన్నీ మీరు పెట్టిన భిక్ష .
మేము సంపూర్ణంగా అమెరికా నుండి ఇండియాకు వచ్చేస్తున్నాము . అక్కడ సంపద ఉండొచ్చు కానీ నిజమైన జీవిత సౌభాగ్యం దంపతులైన మీ పాదాల దగ్గరే ఉంది . పిల్లలు మన సంప్రదాయాలను విలువలను నేర్చుకొనే అదృష్ట ఘడియలు త్వరలో అరుదెంచబోతున్నాయి . ఇంతటితో సెలవు తీసుకుంటూ మీ ఇరువురి ఆరోగ్యం జాగ్రత్త అంటూ హెచ్చరిస్తూ నమస్కారాలతో...
