శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Tragedy

4  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Tragedy

మువ్వల సవ్వడి

మువ్వల సవ్వడి

5 mins
458


           మువ్వల సవ్వడి

            ( ట్రాన్స్జెండర్)

           

           -శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి


   రైలు పరిగెడుతుంది...!

   

   ప్రయాణికులు ఎవరిమట్టుకు వాళ్ళు...వారి మొబైల్ ఫోన్స్ ను చూసుకుంటున్నారు. కొందరు పేపర్, బుక్స్ లాంటివి చదువుకోవడంలో నిమగ్నమయ్యారు. మరికొందరైతే కునికిపాట్లు పడుతున్నారు.

   

   ఓ ట్రాన్స్జెండర్ ...చేతులతో తప్పెట్లు చరుస్తూ...మీది మీదికి వస్తుంటే... అక్కడున్న మగవారంతా తుళ్ళిపడ్డారు.

   

  అప్పటికే మల్లికను అక్కడంతా వింతగా చూస్తున్నారు. మనసుల్లో అదో రకమైన భయం, జుగుప్సా....ఎక్కడ చెయ్యేసి పట్టుకుంటుందోనని. అందుకేనేమో...తమ వంతు ఎలాగూ తప్పదని...పర్సుల్లోంచి డబ్బులు తీసి సిద్ధంగా పట్టుకుని వున్నారు.


  మల్లిక చేతుల్లో...డబ్బులు నిండుకుంటుంటే...పైట మాటున జాకెట్టులో కూరుకుంటూ...ఇవ్వని వాళ్ళని ఒక ఆట పట్టిస్తుంది. భరించలేని కొందరు చేసేదిలేక...ఎంతో కొంత ఇచ్చి వదిలించుకుంటుంటే...చూసే వాళ్లకు నవ్వులపండుగ్గా ఉంది. ఆ మనిషిని 'ఆమె' అనాలో...'అతను' అనాలో తెలియని వింత శరీర సౌష్టవం. 


   పిల్లలకైతే...మహా విడ్డూరంగా ఉంది. "ఎవరమ్మా అలా వున్నారు? ఆంటీయా...? అంకులా...?" అమాయకంగా అడుగుతున్న కొడుకు నోటిని మూసేసింది వాళ్ళమ్మ. 

   

  ఆ పిల్లవాడి మాటలు మల్లిక చెవిన సోకకపోలేదు. తనకు తెలుసు....పసిపిల్లల మొదలు ముసలివారి వరకూ...తానొక వింతమనిషినని. ఇలా పెరగడం నాలోపం కాదు కదా...నా ఇష్టానికి తగ్గట్టుగా నేను మసులుకోవడం నేను చేస్తున్న తప్పా...? నా పుట్టుక కూడా ఒక జీవితమేనా...? ఆ దేవుడిచ్చిన జన్మనే భరిస్తున్నాను. మల్లిక మనసులో ఏదో వేధన. 


   మగవాడనే వారిని ఏ ఒక్కరినీ వదలకుండా...డబ్బులు వసూలు చేస్తూ...ముందుకెళ్తున్న మల్లిక ...రైలు గుమ్మం దగ్గర ముడుచుపెట్టుకుని కూర్చున్న ఓ వృద్ధురాలిని చూసి ఒక్కసారిగా ఆగిపోయింది. ఆమెను చూడగానే... కళ్ళముందు తన అమ్మ కనిపించింది. అమ్మని తల్చుకోగానే కళ్లనీళ్లు ఉబికివచ్చాయి. ఆ వృద్ధురాలి చర్మం పలచబడి నరాలు బయటపడి ... ఎముకలు గూడు మాత్రమే మిగిలి కృశించిపోయిన ఆమెను చూస్తే...మల్లిక గుండె తరుక్కుపోయింది. 

   

   "అమ్మా...నువ్వేమైనా తిన్నావా..?" ప్రేమగా మల్లిక పలకరించేసరికి ...ఆ వృద్ధురాలు తలపైకెత్తి చూసింది. లోతుకుపోయిన ఆకళ్ళల్లో...ఎన్నో రోజుల ఆకలి తాండవిస్తుంది. ఆమె అలా చూస్తుంటే....మల్లిక కళ్ళలో నీళ్లు గిర్రున తిరిగాయి . తడి బారిన ఆ చెమ్మకు కాటుక కరిగిపోతుంటే...పైట చెంగుతో కళ్ళను ఒత్తుకుంటూ....జాకెట్టులోకి చేయి పెట్టి చేతికి వచ్చిన నోట్లను ఆ వృద్ధురాలి చేతిలో పెట్టింది. ఆమెను కొడుకులు గాలికి వదిలేశారని తెలిసి...మరింతగా చలించిపోయింది. 


   మా ఊర్లో మా అమ్మ ఎలా ఉందో...? మనసు మబ్బుపట్టినట్టుగా ఏ క్షణాన్నైనా కళ్లలోంచి కన్నీళ్లు కురిసేలా ఉన్నాయి. ఈ వృద్ధురాలిని చూడగానే...అమ్మను చూడాలనే కోరిక తట్టింది ఇన్నాళ్లకు...!


   మల్లిక రైలు దిగి వెళ్లిపోలేదు. ఆ రైలు రాజమండ్రి మీదుగానే వెళ్తుంది కాబట్టి....ఏదో ఆశయంతో తనూరు వెళ్లాడానికే నిశ్చయించుకుని...ఓ కిటికీ ఓరగా కూర్చుంది. రైలు పరుగెడుతూనే ఉంది....తనని గతంలోకి లాక్కెళ్ళుతూ...!!


   మల్లిక ఆఇంటి గారాలపట్టి. కాదు కాదు మల్లికగా మారిపోయిన మహేష్ అనే వాడని చెప్పుకుంటే బాగుంటుందేమో..! రాజేశ్వరి, రామారావులకు  ఇద్దరు తర్వాత మూడో సంతానం తాను. అందరికంటే చిన్నవాడవ్వడం వలనేమో...తల్లి ఎంతో ముద్దు చేసేది. అమ్మ కొంగు పట్టుకుతిరుగుతూ...అమ్మనే గమనించడం చేస్తుండేవాడు. అమ్మ బొట్టుపెట్టుకుంటుంటే...తానూ పెట్టించుకోవడంతో.... చిన్నపిల్లాడు అలా అడిగిపెట్టించుకుంటుంటే...ఆ తల్లి ఎంతగా మురిసిపోయేదో. రానురాను అదొక పిచ్చిగా ముదిరిపోయింది మహేష్ కి. వయసు పెరుగుతున్న కొద్దీ....అలంకారాలు ఎక్కువయ్యాయి. రోజులో ఎక్కువసేపు అద్దం ముందే గడిపేవాడు. బొట్టు పెట్టుకోవడం...కాటుక దిద్దుకోవడం...పెదాలకు రంగు పూసుకోవడం... తల్లో పూవును పిన్నుతో తగిలించుకోవడం..గుండెలపై ఒక తువ్వాలు గుడ్డను పడేసుకుని వయ్యారంగా నడిచి చూసుకోవడం...సన్నటి గొంతుకతో ఆడదానిలా మాట్లాడడం...ఇలా ఎన్నో అలవాట్లుగా మారిపోయాయి.

    

   ఆఖరికి అమ్మ పెట్టుకునే మువ్వల పట్టీలుపై కూడా కన్నేశాడు. "అమ్మా...ఇవి తీసి ఇవ్వమ్మా నాకు పెట్టుకోవాలని ఉంది..." అని అదేపనిగా అడుగుతున్న కొడుకును సున్నితంగా వారించేది తల్లి.

    

    "హుష్...తప్పు మహేష్. ఇలాంటివి నువ్వు పెట్టుకోకూడదు. నువ్వు మగాడివి. మగాడుగానే ఉండాలి. రోజంతా నువ్వు చేస్తున్న పనులన్నీ గమనిస్తూనే వున్నాను. అదేపనిగా అద్దం ముందు కూర్చుని ఆడదానిలా సింగారించుకోవడం ఏమీ బాగోలేదు. నిన్ను చూసి అందరూ నవ్వుతుంటే నీకేమీ అనిపించడం లేదా...?" అని తల్లి మందలిస్తూ అడుగుతుంటే....అప్పుడర్థమయ్యింది తనకు... అందరూ తనను చూస్తూ "ఆడింగోడు" అని ఎందుకనుకుంటున్నారో...?


    "అవునూ....వీళ్ళందరికీ ఎందుకమ్మా...? నేనసలు ఎలా తయారైతే వీళ్ళకేమైంది...? అందరూ నన్నెందుకు అదోలా చూస్తున్నారు...? చెవుల్లో ఏదో చెప్పుకుని నవ్వుకుంటూ వుంటారు. అందరిలా నన్నెందుకు చూడ్డం లేదు...? బొమ్మలకు పెళ్లిళ్లు చేద్దామంటే...ఎవరూ ఆడమంటున్నారు. ఆ బంతాటలూ, దొంగాటలు నాకు నచ్చడం లేదు. నాతో ఎవరూ ఆడుకోరు. సరిగా మాట్లాడరు..." తల్లితో చెప్పుకుని బావురుమన్నాడు మహేష్. 


   ఆ మాటలన్నీ...విన్నట్టున్నారు అన్నలిద్దరూ. "ఒరేయ్...నిన్ను చంపేస్తాం. నీమూలాన్న మేము తలెత్తుకోలేకపోతున్నాం. ఆ ఆడంగి వేషాలు మానకపోతే... కాళ్ళూ చేతులూ కట్టి ఇంట్లోనే కూర్చోబెడతాం. ఊర్లో అంతా మీ తమ్ముడేంటి ఆడదానిలా నడుస్తున్నాడు అని అడుగుతుంటే...మాకు తలవంపుగా ఉంది. మగాడుగా పుట్టావు. మగాడు లక్షణాలు అలవర్చుకో" అంటూ కొట్టినంత పనిచేశారు. అన్నలిద్దరూ ఒకేసారి విరుచుకుపడ్డంతో... బెదిరిపోయాడు పాపం మహేష్. తల్లి చాటుకెళ్లి దాక్కున్నాడు. గారాల కొడుకవ్వడంతో... ఆతల్లికి పాపమనిపించింది. కన్నతల్లి వారించడంతో...అన్నలిద్దరూ అంతటితో ఆపేశారు. 


    యుక్త వయసు వచ్చేసరికి రాను రాను స్త్రీలలో వుండే లక్షణాలన్నీ మరింతగా ప్రభావితం చేస్తున్నాయి మహేష్ ని. చాటుమాటుగా ముస్తాబవుతున్న అలంకరణతో బాహాటంగా నిత్యం సింగారించుకోవాలన్న తపన ఎక్కువైపోయింది. తానింకా అక్కడే ఉంటే..ఇంట్లోనూ...బంధువుల్లోనూ మరింత చులకనగా చూస్తూ...నవ్వులపాలు చేస్తారని ముందే గ్రహించి...ఎవరికీ చెప్పాపెట్టకుండా... ఇంట్లోనుంచి వెళ్ళిపోయాడు మహేష్. 


    తాను పూర్తిగా స్త్రీగా కనిపించాలనే కోరికతో...హిజ్రాల్లో ఒకడిగా చేరిపోయాడు. మహేష్ కాస్తా మల్లికగా పేరు మార్చుకుని వారిలో కలిసిపోయాడు. 

    

   వారు చేసుకున్న జల్సా పండుగలో మొదటిసారిగా ఎంతో ఆనందాన్ని పొందింది మల్లిక.


   ఆరోజు నుంచి ఈరోజు వరకూ...తన స్నేహితులతో కలిసి ... సంతోషంగా..సరదాగా సాగిపోతుందంటే తనలాంటి వారిమధ్యకు రావడం వల్లే. అక్కడున్నవారంతా చదువుకున్నవారే అయినా అంతా నిరుద్యోగులే. పేదవాడైనా...సంపన్నుడైనా అందరిదీ ఒక్కటే జీవన విధానం.  పొట్టకూటికోసం రైళ్లలోనూ, బస్సుల్లోనూ, షాపుల్లోనూ అడుక్కుంటే చాలు...రోజూ జల్సాగా గడిపేయొచ్చు. వారేంటో అర్ధమయ్యే వారిమధ్యే వారికి అందమైన ప్రపంచం కనిపించేది.  అందుకే మల్లిక మందారంగా వికసించింది వారందరి మధ్యా. 


    ఈరోజు ఆ వృద్ధురాలిలో తల్లి కనిపించేసరికి ... గతమంతా కళ్ళముందు గిర్రున తిరిగింది. 

    

   ఇంతలో...తాను దిగాల్సిన స్టేషన్ రావడంతో...

పదేళ్ల తర్వాత.... బరువెక్కిన గుండెలతో...రైలులో నుంచి కిందకి దిగింది .


       *    *     *    *    *


   మల్లిక తనూరిలోకి అడుగు పెట్టింది...!


   ఒక్కో ప్రదేశాన్నీ చూస్తూ వెళ్తుంటే....తన వెంటపడి వెక్కిరించిన జ్ఞాపకాలు తరుముతున్నాయి.....

    

   అదిగో...ఆ రావి చెట్టుకాడే కదూ....తాగిన మైకంలో మునిసబు గాడు నన్నేదో చేయబోతే...తప్పించుకుని పారిపోయాను....


   నేను చదువుకున్న ఈబళ్ళో కుర్రోళ్ళంతా....నన్ను చూసి వెకిలిగా నవ్వుతుంటే...ఎందుకలా నవ్వుతున్నారో అర్థంకాకే కదా...నాలో నేను ముడుచుకుపోయాను....


  ఈ హోటలు దగ్గరే కదా...నన్ను వంటలో సాయపడమని కూరగాయలు కోయించుకుంటూ...పప్పులు రుబ్బించుకునేవారు....


   ఇలా అడుగడుక్కీ ఎన్నో అవమానాలు పడ్డ రోజులు గుర్తుకొస్తూ...కళ్ళు తడిబారుతున్నాయి...మల్లికకు.


   "అదిగో...ఆవచ్చేవాడు అప్పుడెప్పుడో ఊరొదిలి వెళ్లిపోయిన మహేష్ గాడిలా ఉన్నాడే. అచ్చం ఆడదానిలాగే రూపుదిద్దుకుని ఎంత ముద్దొస్తున్నాడో..."!  ఇంటిదగ్గర్లోకి వస్తుంటే...ఎవరో చూసి పోల్చడంతో తన వెనకే... నవ్వులతో వెంటబడ్డారు కొందరు. మనసులో బాధగా వున్నా...వారడిగే ప్రశ్నలకు పైకి నవ్వుతూ బదులిస్తూనే ఇంటికి చేరింది మల్లిక.


   "అమ్మా..." అంటూ పిలిచింది...

    

    తల్లిని చూడాలన్న తపనతో మల్లిక గుండెల్లోంచి ఎంతో ఆర్థ్రతతో పొడుచుకొచ్చిందా పిలుపు. 

    

   తలుపు తీయాల్సిన అమ్మ స్థానంలో మరెవరో వచ్చి...

 ఎవరు నువ్వు...? చిరాగ్గా చూస్తూ అడిగింది.

    

   "ఇది మాఇల్లు కాదా..."? వీస్తుపోతూ అడిగింది.

    

   "లేదు. ఈ ఇంటావిడ చనిపోతే...ఆవిడ కొడుకులు ఈ ఇంటిని మాకమ్మేశారు"...చెప్పిందావిడ. 

     

    తల్లి చనిపోయిందన్న విషయం వింటూనే అక్కడే కళ్ళు తిరిగిపడిపోయింది మల్లిక. 

    

   అదంతా చూస్తున్న పక్కింటి పార్వతమ్మ...ఆ వచ్చింది ఎవరో గుర్తుపట్టి పరుగున వచ్చింది. మొహంపై నీళ్లు జల్లి...గ్లాసుతో నీళ్లు తాగించి కూర్చోపెట్టింది. 

    

   "అరె...మహేష్ ఇన్నాళ్లూ ఎక్కడికిపోయావు...? మీ అమ్మ నీమీద బెంగతో నిన్ను తలవని రోజంటూ లేదు. ఆవిడను మీ అన్నలిద్దరూ ఓదార్చేది పోయి..."పోయినోడు పోయాడు. మనకు శని విరగడయ్యింది. వాడికోసం ఎందుకేడుస్తావు" అంటూ సాధించేవారు. ఆకోపంతో...మీ అమ్మనసలు పట్టించుకోనేలేదు. రాను రాను ఆరోగ్యం పాడై... మూడేళ్లు మంచం మీదే మూలిగింది. కానీ ఏనాడూ మీ అన్నలిద్దరూ ఆసుపత్రికి తీసుకెళ్లిన పాపాన్న పోలేదు. మీ అమ్మ బ్రతికుండగానే మీకున్న పొలాల్ని పంచేసుకున్నారు. మీ అమ్మ చనిపోయిన వెంటనే ఈ ఇల్లు కూడా అమ్మేసి... ఆ పాడుబడ్డ గుడి దగ్గర...అద్దె ఇంట్లోకెళ్లిపోయారు..." అంటూ తాను ఊళ్ళో లేని ఈ పదేళ్ల కథనూ వినిపించింది .

    

   మల్లికకు తన తల్లి చావు గుండెను కుదిపేసినా...అదంతా విన్న మల్లికలో...ఏదో ఆవేశం గుప్పుమంది. "మా అన్నలిద్దర్నీ కలిసొస్తాను పిన్నీ " అంటూ వెళ్లబోతున్న మల్లికను ఆపి...  

    

   "ఒక నిమిషం మహేష్...నువ్వు వస్తే మీ అమ్మ నీకిమ్మని ఒక బరిణ ఇచ్చింది తీసుకెళ్లు ' అంటూ లోపలికెళ్లొచ్చి చేతిలో పెట్టింది పక్కింటి పార్వతమ్మ. 

   

   దాన్ని భద్రంగా పైట కొంగుకి కట్టి...అన్నయ్యల్ని కలవాలని వెళ్ళింది.


   మల్లికను చూస్తూనే....చిర్రుబుర్రులాడారు. "మళ్లీ ఎందుకొచ్చావురా...ఆడింగెదవా...తేడా గాడా ..." అంటూ...వచ్చీరాగానే నోరిచ్చుకుపడుతున్న అన్నలిద్దర్నీ ..."ఆపండి"  అంటూ గట్టిగా ఒక అరుపు అరిచింది.


   "ఒరేయ్ అన్నయ్యలూ....


    "నాకున్న ఈప్రవర్తనా లోపంతో...నేనిలా పుట్టడం నాపొరపాటే అయితే...అన్ని అవయవాలతో సక్రమంగా పుట్టిన మీ బుద్ధి ఏమయ్యిందిరా...? కన్నతల్లిని కళ్లారా చూసుకుందామని ఎంతో ఆశగా వచ్చాను. నాన్న మన చిన్నతనంలో పోయినందుకైనా...అమ్మను మీరు కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవాల్సింది పోయి...తను బతికుండగానే.. ఆస్తుల్ని పంచేసుకుని... తిండి పెట్టకుండా ఆకలితో మాడ్చేశారు. అనారోగ్యం పాలైనా వైద్యం చేయించకుండా... మీరే చంపేశారు. అమ్మ బ్రతికుండుంటే... నాతోనే ఉంచుకుంటూ.. నేనెంతో సంపాదించిన డబ్బుతో... పుట్టి పెరిగిన ఈ ఊరికి ఏదో ఉపకారం చేద్దామనే ఆశయంతో వచ్చాను. నేను ఈ ఊరు విడిచి వెళ్లిపోయినా....ఇప్పటికైనా మీలో మార్పు వచ్చి వుంటుందేమోనని...నన్నూ ఓ సాటిమనిషిగా ఆదరిస్తారని ఎంతో నమ్మకంతో మళ్లీ తిరిగి వచ్చాను. కానీ చీడ పట్టిన మీలాంటి వాళ్ళ దగ్గరకు రావడం నాదే బుద్ధి తక్కువ. మీరెప్పటికీ మారరు. మాలాంటి వాళ్ళను చులకనగా చూడ్డమూ మానరు. ఇలాంటి చోట ఏం చేసినా వ్యర్థమే. 

    

    నేను ఈవిధంగా పుట్టినా...నాకూ మనసుంది. మానవత్వమూ ఉంది. మీరు ఓ మగాడిగా సక్రమంగా పుట్టి కూడా మానవత్వమంటూ లేక మనసు లేని మనుషులు మీరు. కన్నతల్లిని కూడా పట్టించుకోకుండా...స్వార్థపరులై విభిన్న మనస్తత్వాలతో ఉన్న మీరా...లేక నేనా...? ఎవరు తేడా...? అంటూ సమాధానం చెప్పలేని ప్రశ్నను... అన్నల్ని ప్రశ్నించి కళ్ళు తుడుచుకుంది మల్లిక.


   వెళ్తూ వెళ్తూ...చీరకొంగు ముడి విప్పి... అమ్మ ఇచ్చిన బరిణను...ఎంతో ఆతృతగా మూత తీసింది. 

   

   అందులో...తన కళ్ళను తానే నమ్మలేని ముచ్చటైన అమ్మ జ్ఞాపకం....

   

   బాల్యం నుంచీ తానెంతో కోరిగ్గా ఎన్నోసార్లు అడిగి  లేదనిపించుకున్న అమ్మ కాళ్ళకుండే...మువ్వల పట్టీలు. వాటిని కళ్లకద్దుకుని...తల్లిని తలచుకుంటూ.. కాళ్లకు తగిలించింది. వయ్యారంగా అడుగులు వేస్తూ నడుస్తుంటే...ఆ మువ్వల సవ్వడి మల్లిక కెంతో ఆహ్లాదంగా అనిపించి తల్లి తనవెంటే అడుగులేస్తున్న అనుభూతికి లోనయ్యింది.  అమ్మ ప్రేమతో తనకోసం జ్ఞాపకంగా ఇచ్చినా...తనకెంతో అపురూపమైన, విలువైన కానుక ఆ పట్టీలు. చిన్నతనంలో మనసుపడ్డ అమ్మ వస్తువును ఇన్నాళ్లకు సాధించుకున్నానన్న గర్వంతో అక్కడ నుంచి మల్లిక కదిలి వెళ్ళిపోతుంటే...అన్నలిద్దరికీ మరిక నోటమాట రాలేదు....!!*



        *****      ******      ******


(నిత్య జీవితంలో మనకెందరో ఇలాంటి ట్రాన్స్ జెండర్స్ ఎదురవుతూనే వుంటారు. అలాంటి వారిని కించపర్చకుండా వారి మనోభావాలు అందరికీ అర్థమవ్వాలనే తపనతో...ఈకథను సమర్పించాను. దయచేసి వారిని కూడా సాటి మనుష్యులుగా గుర్తించుకుందాం.) 


                  


     

    


    

    

    

    


    


    

    

 


    


   

   

    


    



   

    


   

   


Rate this content
Log in

Similar telugu story from Tragedy