Midhun babu

Classics Fantasy Inspirational

4  

Midhun babu

Classics Fantasy Inspirational

ముగిసిన కథ

ముగిసిన కథ

2 mins
14



గోదారి గట్టుమీద ముసలి రావిచెట్టు చిన్నపాటి గాలికి ఆకులన్నిటిని రెపరెపలాడిస్తూ తన మొహాన్ని గోదారి నీటిలో చూసుకుంటోంది. కొత్త గోదారినీరు ఎర్రగా బుర్రగా ఉంది. ముక్తేశ్వరం నుంచి వచ్చే పడవ దూరంగా ఉన్నప్పుడు చిన్నగా రేవుదగ్గరకి వచ్చేకొద్దీ పెద్దది ఔతోంది. కోటిపల్లి రేవులో పడవలో జనం బిలబిలమంటూ దిగారు. పాతిక మేకలతో మల్లిగాడు,జీళ్ళ గంపతో పుల్లమ్మ, పచ్చి రొయ్యలు,చేపలు, పీతలు అమ్ముకునే అమ్ములు బుట్టతో రేవులో దిగారు. గంగరాజు తలపాగా చుట్టుకుని అమ్ములు వెనకాల నెమ్మదిగా గట్టువెంట నడవటం మొదలెట్టాడు. “ఏటే! అమ్ములూ ఈమద్దెన మాట్టాట్టం తగ్గించేసినావు” చుట్ట వెలిగిస్తూ అడిగాడు. “నీతో నాకు మాటలేటి” అమ్ములు కాస్త గట్టిగానే సమాధానం చెప్పింది. “నీకు నాకు మనువు సెయ్యాలని మీ నాన్న అమ్మ అనుకుంటుంటే నువ్వేటి వంకర మాటలు మాట్లాడతావు టింకరదానా” గుప్పుమని చుట్టపొగ బయటకు వదులుతూ అన్నాడు గంగరాజు. “పనీ పాటాలేని ఆళ్లు అలాగే అంటారు, పైసా సంపాదన లేని నిన్నుకట్టుకుని నేనేం చేసుకుంటాను” అంటూ రోడ్డు పక్కనేఉన్న పాకలోకి వెళ్లిపోయింది అమ్ములు.

అమ్ములు వదిలిన తూటాల్లాంటి మాటలు గంగరాజుకు తల కొసేసినట్లు అనిపించాయి. గంగరాజు చెప్పినదంతా విని ఊరిచివరన తూములమీద కాలక్షేపానికి కూర్చునే కాకిరాజు “ఒరే గంగరాజా నేనొక పని చెబుతాను ఆపనిలోకి దిగావంటే డబ్బుకు డబ్బు కాలచ్చేపానికి కాలచ్చేపం” అన్నాడు. “సర్లే ముందు పనేటో చెప్పు” అన్నాడు గంగరాజు ఆసక్తిగా. “నే చెప్పేది జాగ్రత్తగా విను. అర్ధరాత్రి పన్నెండు ఒంటిగంట మయంలో మనిద్దరం ఈ తూములమీద కూర్చుని, ఎవడో ఒకడిని ఆపి, నేను ఆడి నోరు గట్టిగా మూసి పట్టుకుంటాను నువ్వు ఆడి జేబూలో చెయ్యపెట్టి డబ్బులు బయటకి తీసి పారిపోదాం! ఎటంటావు” చెప్పటం ఆపి అడిగాడు కాకిరాజు. “అయ్యబాబో దొంగతనమా?”బెదురుచూపులతో అన్నాడు గంగరాజు. “ఇదిగో గంగరాజూ! బస్సులో కండక్టరుగారు మనం దిగేటప్పుడు చిల్లర ఇవ్వకుండా నొక్కేస్తాడు, అది దొంగతనం కాదా! దుకాణాల్లో నీకో రేటు నాకో రేటు చొప్పున అమ్ముతా ఉంటారు అది దొంగతనం కాదా! పాలోడు అటూ ఇటూ చూసి పాలల్లో నీళ్ళు కలిపేస్తాడు, అది దొంగతనం కాక మరేటి! ఇలా చాలా మంది రోజూ చేస్తూనే ఉంటారు! అంచేత కలియుగంలో దొంగతనం దొరతనం” అంటూ లేచి నిలబడ్డాడు కాకిరాజు. గంగరాజు కాకిరాజు మాటలకి మొదట్లో ఊహూ ఊహూ అని బాగా టైము తీసుకుని ఆహా ఓహో అన్నాడు.

ఆరోజు దొంగతనం మొదలెట్టాలని అనుకుని సరిగ్గా పదకొండింటికి దేవుడికి దండం పెట్టుకున్నాడు. నల్లగుడ్డలేసుకుని,వంటికి ఆముదం రాసుకుని ఊరిచివరి తూముల దగ్గరకి బయలుదేరారు కాకిరాజు,గంగరాజు. సమయం పన్నెండు అయింది. “దెబ్బకు ఠా దొంగల ముఠా” రెండో ఆట వదిలారు. ఎవరో ఇద్దరు ఆడాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ వస్తున్నారు. అందులో పెద్దావిడని కాకిరాజు గట్టిగా పట్టుకున్నాడు. గంగరాజు ఆవిడ మెడలో గొలుసు వడిసిపట్టి లాగేసి చీకట్లోకి మాయమైపోయారు. పెద్దగా మబ్బేసింది, చిటుక్కున మెరుపు మెరిసింది అనుకున్నారు దొంగలు. అది మెరుపు కాదు తల్లివెనకాల ఉన్న పిల్ల సెల్లు మెరుపని వాళ్ళకి తెలియలేదు.

తెల్లారింది. సూరీడు రంగులు మారుస్తూ గబగబా పాక్కుంటూ ముదురు తొండలా ఊక్కుంటూ గోదాట్లోంచి పైకొచ్చాడు. గంగరాజు మంచి ఉషారుగా ఉన్నాడు. తలకి సెంటు నూనె రాసుకున్నాడు. కొత్తబనీను వేసుకున్నాడు. కోటిపల్లి తీర్థంలో మొన్నామధ్యన కొన్న సెంటు, చొక్కా కాలరు వెనకాల రాసుకున్నాడు. రోజూలాగే పచ్చి రొయ్యలు, చేపలు, పీతలు అమ్ముకునే అమ్ములు బుట్టతో రేవులో దిగింది. గంగరాజు తలపాగా చుట్టుకుని అమ్ములు వెనకాల నెమ్మదిగా గట్టువెంట నడవటం మొదలెట్టాడు. “ఏటే! అమ్ములూ మొహం మాడిపోయిన పెసరట్టులా ఎట్టుకున్నావు. ఎటైనాదేటి” అన్నాడు. అమ్ములు మాట్లాడలేదు. “ఇదిగో నీకో బహుమతి రాజమండ్రిలో కొన్నాను” అంటూ జేబూలోంచి రాత్రి తూములదగ్గర కాజేసిన గొలుసు అమ్ములు చేతిలో పెట్టాడు. “నేనూ నీకోటి తెచ్చాను, ఈ ఫోటో ఎవరిదో చెప్పుకో” అంటూ సెల్లు చూపించింది అమ్ములు. ఆ ఫోటో చూశాక గంగరాజు మళ్ళీ ఆఊరిలో కనిపించలేదు.


Rate this content
Log in

Similar telugu story from Classics