వాలిన పోద్ధు
వాలిన పోద్ధు
"ఏంటత్తయ్యా వంట పాత్రలు సరిగా శుభ్రం చేయలేదు. పాత్రలపై తెల్లగా పేరుకుపోయింది. మీరు ఏ పని చేసినా నేను రెండోసారి చేసుకోవాల్సి వస్తోంది" అంటూ అత్త నాగవేణి ని ఇంకా ఏవేవో కొన్ని మాటలు బిగ్గరగా కొన్ని మాటలు అంటోంది పెద్ద కోడలు సుప్రీత.
తన భార్య నాగవేణిని ఇలా అనడం హాల్ లో కూర్చున్న సుబ్రహ్మణ్యం వింటూ తమ నిస్సహాయతకు తనే లోలోపల బాధ పడ సాగాడు
సరిగ్గా అప్పుడే సుబ్రహ్మణ్యం కొడుకు అజయ్ వంట గదిలోకి వెళ్ళాడు.
"అబ్బబ్బా. ఉదయం లేవగానే ఇంట్లో నీ తిట్ల సుప్రభాతం వినలేకున్నా సుప్రీత. అమ్మా నువ్వైనా ఓ మూల పడి ఉండక నీ కోడలు పనులకు ఎందుకు అడ్డు వెళ్తావు "అన్నాడు.
చిన్నంతరం పెద్దంతరం లేదు.
తన చేతుల్లో పెరిగిన కొడుకు.
ఎంతో ప్రేమగా క్రమశిక్షణ గా పెంచింది.
అయినా స్వార్థం గా తయారయ్యాడు.
ఇప్పుడు తననే నిందిస్తున్న కొడుకు ను చూస్తూ...నిదానంగా నడుచుకుంటూ వచ్చి హాల్ లో భర్త సుబ్రహ్మణ్యం పక్కన అవమానభారంతో కూర్చుంది నాగవేణి.
మూడు నెలలుగా ఇదే తంతు. సుప్రీత అత్తమామల ఉనికిని భరించలేకుండా ఉంది. ప్రతి పనిలో మాటల్లో తన అసహనాన్ని చూపిస్తోంది. ఈ వయసులో ఏ సినిమాలకు షికార్లకు వెళ్ళలేం అంటూ.. ఎవరైనా బంధువులు శుభ కార్యాల పిలుపుకు వస్తే " హూ.. ఇల్లు కదిలేట్టు ఉన్నామా. మేము వస్తే వీళ్ళకు వండిపెట్టే దిక్కెవరు"అంటూ చులకనగా మాట్లాడుతోంది.
నాగవేణి కొడుకు అజయ్ కూడా తన భార్య సుప్రీతనే సమర్థించడం గమనిస్తోంది.కానీ ఏమీ చెప్పలేని నిస్సహాయత.
ఇక చిన్నకొడుకు కోడలు సరేసరి.
ఇద్దరూ ఉద్యోగరీత్యా సిటీలో ఉంటారు.
చిన్న కోడలు కనీసం మాటవరుసకు కూడా అత్తమామల బాగోగులు చూస్తాననదు
నాగవేణి కూతురు కూడా అవసరం ఉన్నంత వరకే.
ఏమైనా అంటే తన భర్త ఇష్టమే తన ఇష్టం అంటూ బాధ్యతల నుంచి తప్పించుకుంటుంది
ఈ మధ్య కాలంలో పెద్దకొడుకు కోడలు కు కూడా సుబ్రహ్మణ్యం నాగవేణి భారంగా మారారు.
కారణం
ముఖ్యంగా కొన్ని రోజుల క్రితం సుబ్రహ్మణ్యం ను అన్నయ్యా అంటూ పిలిచే ఆప్తుడు రంగనాథ్ వచ్చాడు. అప్పుడెప్పుడో సుబ్రహ్మణ్యం ఇల్లు కట్టేటపుడు అప్పు తీసుకున్నాడని అది అసలు వడ్డీతో కలిపి పదిలక్షలు దాటిందని ...మూడు నెలల్లో మొత్తం అప్పు తీర్చేయాలని గొడవపడ్డాడు.
సుబ్రహ్మణ్యం నాగవేణి లకు ఇద్దరు కొడుకులు ఒక కూతురు.
సుబ్రహ్మణ్యం పంచాయితీ రాజ్ శాఖలో చిరుద్యోగి. రెండు సంవత్సరాల క్రితం రిటైర్ అయ్యాడు. ఇద్దరు కొడుకులను బాగా చదివించాడు. కూతురు ని కూడా డిగ్రీ వరకు చదివించాడు. మంచి సంబంధం వచ్చిందని కట్నం బంగారం పెట్టి వైభవంగా పెళ్ళి చేసి పంపాడు
కొడుకులకు ఎంత డబ్బు ఇచ్చినా తక్కువే అన్నట్టు మాట్లాడుతుంటారు. కూతురేమో పండుగలకు పబ్బాలకు వస్తూ ఉంటుంది. తనకి కావాల్సినవి తల్లిదండ్రులతో కొట్లాడి అయినా తీసుకెళ్ళేరకం.
సుబ్రహ్మణ్యం గతం
సుబ్రహ్మణ్యం కు చిన్న వయసులోనే ఉద్యోగం వచ్చింది.
ఉద్యోగం ఉన్నందున తల్లిదండ్రుల బాధ్యత తీసుకోవడమే కాక తన ఇద్దరు అక్కల కుటుంబ ఆర్థిక సమస్యలకు చేదోడుగా ఉండేవాడు. బాధ్యతైన వ్యక్తి మంచి వ్యక్తి అనే పేరు తప్ప ఆర్థికంగా తను మిగిల్చింది లేదు.
ఒకప్పుడు సుబ్రహ్మణ్యం తన భార్య నాగవేణిని చాలా బాగా చూసుకున్నాడు.
పచ్చని పసిమిచాయతో ఎంతో అందంగా అణకువగా ఉండే నాగవేణి అంటే సుబ్రహ్మణ్యం కు అపురూపం.
ఏనాడూ ఆమె ఇల్లు దాటిన దాఖలాలు లేవు.
నాగవేణి చేతికి మట్టిగాజులతో పాటు బంగారు గాజులు ..
చెవికి బుట్టకమ్మలు
మెడలో మాంగల్య గొలుసుతో పాటు
రెండు సన్నపాటి బంగారు గొలుసులతో
కాళ్ళకు పెద్ద వెండి పట్టీలతో
చేతులకు ఎర్రగా పండిన గోరింటతో చూడ్డానికి దేవలోక సుందరిలా ఉండేది.
నాగవేణితో పెళ్ళైయ్యాక అద్దె ఇంట్లో ఉండేవాడు. చూస్తుండగానే కాలక్రమంలో సుబ్రహ్మణ్యం నాగవేణి దంపతులు ముగ్గురు పిల్లలకు తల్లిదండ్రులయ్యారు.
ముప్పై ఏళ్ళ క్రితమే ఇంట్లో నే నీటి సదుపాయం ఉండేది. నాగవేణి ఓ బిందెడు నీళ్ళు కూడా మోసి ఎరుగదు.
సుబ్రహ్మణ్యం పని మీద వేరే ఊరు వెళ్ళినా చీకటి పడే వేళకు ఇంటీకి చేరుకోవాల్సిందే.సుబ్రహ్మణ్యం కు భార్య నాగవేణి చేతి వంట అద్భుతంగా తోచేది.
నాగవేణి కూడా ఏనాడూ భర్త మాటకు ఎదురు చెప్పి ఎరుగదు
రోజురోజుకీ పెరుగుతున్న ఖర్చులు. ఎంత ఉద్యోగం ఉన్నా ఖర్చులు తడిసి మోపెడయ్యేవి.ఆర్థకభారం పెరగసాగింది.
సుబ్రహ్మణ్యం తల్లి తరువాత సంవత్సరం తేడాతో తండ్రి కాలం చేశారు.
సుబ్రహ్మణ్యం నాగవేణి జంట ఎంతో అన్యోన్యంగా ఉండేవారు.
సుబ్రహ్మణ్యం రిటైరయ్యాక నాగవేణి పరిస్థితి దయనీయం గా మారింది.
తప్పక కొడుకులు కోడళ్ళ దగ్గర ఉండాల్సి వస్తోంది
కొడుకుల చదువులు పూర్తయ్యాయి. పెళ్ళిళ్ళు అయ్యాయి. రిటైర్మెంట్ కు ముందే సుబ్రహ్మణ్యం కు అల్జీమర్స్(మర్చిపోవడం) వచ్చింది.
టాబ్లెట్లు వాడుతున్నాడు.
రిటైర్మెంట్ కాగానే వచ్చిన డబ్బును పిల్లలు పంచుకున్నారు.
ఉన్న ఇల్లును కూడా అవసరం అంటూ కొడుకులు అమ్మేసారు.కూతురేమో మనవరాలి చదువు ఖర్చులకి అంటూ తల్లి నాగవేణి చేతులకున్న నాలుగు బంగారు గాజులు తీసేసుకుంది.
మేమేం తక్కువ అంటూ అత్తగారితో ఓ వారం రోజులు ప్రేమగా మాట్లాడి...ప్లాట్ కొంటే డబ్బు తక్కువ ఉన్నాయంటూ అత్తగారి నల్లపూసల గొలుసును తీసేసుకుంది పెద్ద కోడలు.
తనకు గుర్తుగా ఇమ్మంటూ అత్త నాగవేణి బంగారు గొలుసును మంచిగా ఇప్పించేసుకుంది చిన్న కోడలు.
వృద్ధాప్యం లో దాచుకున్నది అంటూ ఏమీ లేదు.
పైగా ఇప్పుడేమో రంగనాథం అప్పు అంటూ ఇంటిమీద కొచ్చేసరికి సుబ్రహ్మణ్యం కొడుకులు కోడళ్ళకి ఆ అప్పు ఎక్కడ నెత్తిన పడుతుందో అనే భయం మొదలైంది.
మరుసటి వారం కోడుకులు కూతురు పెద్దకొడుకు ఇంట్లో కలిసారు.
సుబ్రహ్మణ్యం నాగవేణిని కూర్చోబెట్టుకున్నారు.
"నాన్నా .
మా కుటుంబాలను పోషించు కోవడమే కష్టం.
పైగా ఈ వయసులో మీ బాగోగులు చూస్తూ మీ హాస్పిటల్ ఖర్చులు భరించడం ఇంకా కష్టం.
అందుకే మాకు తెలిసిన అనాథాశ్రమంలో చేరుస్తాం.
వేళకు ఇంత తిండి పెట్టి మీ బాగోగులు చూస్తారు.అన్నాడు పెద్దకొడుకు
మిగిలిన ఇద్దరూ అదే కరెక్ట్ అన్నారు.
సుబ్రహ్మణ్యం మనసు భారమైంది. ఏ పిల్లల కోసం రెక్కలు ముక్కలు చేసుకున్నారో ..
ఏ పిల్లలకోసం తమకున్న సంపదంతా వదిలేసుకున్నారో...
ఏ పిల్లల సంతోషం చూడ్డానికి తపించారో....ఆ పిల్లలే ఇపుడు తమను అనాథల్ని చేశారు.
సుబ్రహ్మణ్యం నాగవేణి కనులధారగా కారుతున్న కన్నీరు అక్కడ ఎవరి మనసులనీ కరిగించలేదు.
ఆ రాత్రి అందరూ నిద్రపోయాక సుబ్రహ్మణ్యం నాగవేణి దంపతులు తలుపు తెరుచుకుని చీకట్లో కలిసిపోయారు.
ఉదయాన్నే ఈ విషయం గమనించిన సుబ్రహ్మణ్యం పిల్లలు కూడా ఏమీ పట్టినట్టుగా ఉండిపోయారంతా.
పెద్ద భారం దిగిపోయిందనుకున్నారు.
అప్పు తీర్చమని రంగనాథ్ కూడా రాకపోవడంతో దరిద్రం పోయిందనుకున్నారు.
@@@@@
గవర్నమెంట్ హాస్పిటల్ ముందు పది రూపాయలకే టిఫిన్ .
జనం రద్దీ ఎక్కువగా ఉంది.
ఓ ముప్పై సంవత్సరాల యువతి ముప్పైరెండేళ్ళ వ్యక్తి జనాలకు టిఫిన్ లు సప్లై చేస్తూ వచ్చిన డబ్బు సరిచూసుకుంటున్నారు.
ఉదయం పది గంటలు దాటుతుండగా రంగనాథ్ వసూలైన డబ్బు తీసుకుని ఆ పనిచేసిన భార్య భర్తలకు ఐదు వందలు చేతిలో పెట్టి మిగిలిన డబ్బును జేబులో పెట్టుకుని బయలుదేరాడు.
@@@@
రంగనాథ్ ఓ ఇంటి ముందు ఆగాడు.
ఎదురుగా నాగవేణి వస్తూ కనిపించింది.
"ఇదిగో వదినా. నిన్న వరకు బ్యాంకులో జమ చేసిన మొత్తం మునుపటిది పద్దెనిమిది లక్షలు. ఈ మూడు నెలలకు హోటల్ ఆదాయం ఖర్చు పోను డెబ్బై వేలు జమచేసాను. చూడు అంటూ బ్యాంక్ పాస్ బుక్ చూపించబోయాడు.
నిజానికి రంగనాథ్ ఒకప్పుడు సుబ్రహ్మణ్యం అప్పు ఉన్నాడంటూ రావడం అంతా ఒక నాటకం.
రంగనాథ్ సుబ్రహ్మణ్యం దగ్గర తీసుకున్న డబ్బు పెట్టుబడిగా పెట్టిన స్థలం అమ్మిన డబ్బు ఇద్దాం అనుకుని వచ్చి అక్కడ సుబ్రహ్మణ్యం నాగవేణి ఎంత దీనంగా బతుకుతున్నారో అర్థమై వారికి వృద్ధాప్యంలో మంచి జీవితం ఇవ్వదలచి నాటకం ఆడాడు.
ఇప్పుడు రంగనాథ్ అండలో సుబ్రహ్మణ్యం నాగవేణి వార్థక్యం సాఫీగా సాగుతోంది.
నాగవేణి రంగనాథం కాళ్ళు పట్టుకో బోయింది
రంగనాథ్"అయ్యో వదినా. నువు తల్లివి. ఎక్కడైనా బిడ్డ కాళ్ళకు ....అంటూ మాట రాక ఆగిపోయాడు .
ఎప్పుడో నా పదిహేనేళ్ళ వయసులో తిరనాలలొ నాన్నపై అలిగి తప్పిపోయి మీ ఇంటి గడప తొక్కాను. నువ్వు అన్నయ్య ఆదరించారు. మూడేళ్ళు మీ ఇంట ఉన్నా. అన్నయ్య చెప్పిన బుద్ది మాటలకు మారి మా ఇంటికి వెళ్ళా. ప్రయోజకుడయ్యా.
పది సంవత్సరాల క్రితం అవసరం అంటే అన్నయ్య ఉద్యోగం లో లోను పెట్టి యాభై వేలు ఇచ్చాడు. నా అవసరం తీరి డబ్బు వెనక్కి ఇవ్వబోతే తీసుకోలేదు.అందుకే ఆ డబ్బుతో ఓ స్థలం కొన్నా.ఇప్పుడు మంచి లాభంతో అమ్మితే ఆ పద్దెనిమిది లక్షలు వచ్చింది.
ఇప్పుడు ఆ హోటల్ బేరం చేశా. వచ్చేనెలలో ఆ హోటల్ పదిలక్షలకు కొంటున్నాం. ఇక అంతా లాభమే.
బిజినెస్ తో పాటు సమాజసేవ చేస్తున్నారు.
పది రూపాయలకు మూడు దోసెలు
పది రూపాయలకు నాలుగు ఇడ్లీలు
పది రూపాయలకు మూడు పూరీలు
పది రూపాయలకు ప్లేట్ ఉప్మా
ఇలా అన్నీ పదిరూపాయలతోనే ఇస్తున్నాం.
మీరు మంచివారు.మీకు దేవుడు ఎప్పుడూ అన్యాయం చేయడు.మంచే చేస్తాడు వదినా
అంటుండగా నే లోపల నుంచి సుబ్రహ్మణ్యం వచ్చాడు.
సుబ్రహ్మణ్యం"రంగా కొన్ని రోజుల మా చేతి చలువకే నువ్వు ఇంత చేస్తున్నావు.
కడుపున పుట్టిన వాళ్ళకే మేం బరువైపోయాము
ఆకలితో అవమానంతో చితికిపోయాము
ఈ కట్టె ఇలా ఆఖరున అనాథగా పోవాల్సిన సమయాన దేవుడిలా నువ్వు ఆదుకుంటున్నావు.
మూడుపూటలా కడుపు నింపుతున్నావు.
నీ ఋణం తీర్చుకోలేము
అంటూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు.
రంగనాథ్ "అన్నయ్యా ఈ జీవితం నీ దయ.
నేను నీ పెంపకంలో మంచి ని చూశా.మంచిగా మారా. అంతే. సంతోషంగా ఉండండి.అవసరమైనపుడు వస్తూ ఉంటాను"అంటూ సెలవు తీసుకున్నాడు
ప్రతి తల్లిదండ్రీ పిల్లలను మాత్రమే కనగలరు. వారి మంచి బుద్ధులను గుణగణాలను కాదేమో
వారిని కష్టపడి పెంచగలరు
అలాగే పిల్లలు కూడా మంచి సంస్కారంతో ఉండడం అనేది అదృష్టం.
బాధ్యతలెరిగి ప్రవర్తించే పిల్లలు ఏ నూటికో కోటికో.
సమాజం పట్ల
బంధువుల భయం వల్ల
కాకుండా మనస్ఫూర్తిగా తల్లిదండ్రుల బాధ్యత ను ఇష్టంగా చూసుకునే పిల్లలు తక్కువ.
ధనిక మధ్యతరగతి కుటుంబాల్లో ఆర్థిక స్థితి ఉండి ఇంట్లో వృద్ధుల సౌకర్యాలకు లోటు ఉండకపోవచ్చు.
కానీ పేదరికంలో మగ్గే కుటుంబాలకు మాత్రం వృద్దాప్యం ఓ శాపం అనే చెప్పచ్చు.
నా మాట: ఇప్పుడు ఈ వృద్దాప్య పెన్షన్ వస్తుండటంతో చాలా మంది వృద్ధులు తమ ఇంట్లో గౌరవంగా ఆత్మాభిమానం తో జీవిస్తున్నారు.
ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడమే అసలైన సంక్షేమం కూడా.
సమాప్తం
సర్వేజనా సుఖినోభవంతుం...
