అమ్మ
అమ్మ
గట్టుమీద రావిచెట్టు గోదాట్లో మొహం చూసుకుంటోందా అన్నట్లు వాలిపోయింది. ఎండలో రావిచెట్టు నిండా అద్దం ముక్కలు కట్టినట్లు ఆకులు మెరుస్తూ గాలికి ఊగు తున్నాయి. ఓ కొమ్మమీద రెక్కలు పూర్తిగా విచ్చుకోని పిల్లకు తల్లిపక్షి నోట్లో ఆహారం పెడుతోంది. ఆ దృశ్యం అమ్మను గుర్తుకు తెచ్చింది. కన్నీరు ఉబికి వచ్చింది. అమ్మతో నాకు చక్కటి అనుబంధం ఉంది. నారూపం అమ్మ పొట్టలో ఉంది అని తెలియగానే నాన్న మాయల మరాఠీ అయ్యాడు, తాళి తెస్తానని ఎగతాళిచేసి వెళ్లిపోయాడు. అమ్మ జీవితంలోంచి మాయమైపోయాడు. నాన్న చేసినపనికి పుట్టుమూగదైన అమ్మ మౌనంగా గోదారితో గోడు వెళ్లబోసుకుంది. నట్టేటిలోనే కాదు జీవితంలో కూడా ముంచేయవచ్చని వెక్కివెక్కి ఏడిచింది.
అమ్మ పనిమనిషి. నాలుగు ఇళ్ళల్లో గిన్నెలు తోమేది. తాను నిచ్చెనగా మారి నాకు ప్రపంచాన్ని చూపించటానికి ప్రయత్నించి కొంతవరకు సఫలమైంది. ప్రాణాలు తీసే రోగాన్ని భరిస్తూ నాచేయిని పొదివి పట్టుకు నడిపించేది. నన్ను గుండెలమీద పడుకోపెట్టుకుని నా అరచేతిని ముద్దుపెట్టుకుంటూ ఆనందపడేది. నువ్వు రాజువి అంటూండేది. అమ్మే నా ప్రాణం, అమ్మే నా ఊపిరి.
నేను రోడ్డుమీద రంగు సుద్దలతో బొమ్మలు వేసేవాడిని. చాలామంది మెచ్చుకునేవారు. కొంతమంది మెచ్చుకోలుతోపాటు డబ్బులుకూడా ఇచ్చేవారు. నా బొమ్మలమీద పడిన చిల్లర బాగానే ఉండేది. అమ్మను పనిమనిషి ఉద్యోగంనుండి మాన్పించడానికి ఆ డబ్బు సరిపోయేది. నెమ్మదిగా నేను చేయితిరిగిన చిత్రకారుడిని అయ్యాను. నాజీవితపు బండి నెమ్మదిగా గతుకుల రోడ్డుమీంచి నున్నటి తారు రోడ్డుమీదకి మారింది.
నేను ఒకరోజు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను. అది అమ్మ బొమ్మ వేయాలనే నిర్ణయం. ప్రతిరోజూ నా పనులన్నీ అయ్యాక అమ్మను ఎదురుగా కూర్చోపెట్టుకుని అమ్మ బొమ్మను అద్భుతంగా వేశాను. అమ్మ బొమ్మ నాకెంతో తృప్తిని ఇచ్చింది.
“ఆరోజు అమ్మ “ఒరే! కన్నా ఒక్కసారి నన్ను నేను చూసుకోనీరా, నన్ను నువ్వు ఎలా వేసావో చూస్తాను” అని సైగలుచేసి చెప్పింది. బొమ్మ కింద నీపాదాల దగ్గర నాపేరు రాసుకున్నాక రేపు చూపిస్తాను” అన్నాను. అమ్మ చిన్నగా నవ్వి నా అరిచేతులను ముద్దు పెట్టుకుంది.
మర్నాడు ఉదయ్యన్నే లేచి అమ్మకు కాఫీ అందివ్వబోయాను, కానీ ఆమె అందుకోలేదు. నేను వేసిన ఆమె బొమ్మ వేపు చూస్తూ ఉండిపోయింది. చిత్రంలో ఆమె పాదాలదగ్గర నా పేరు రాసుకోవాలి అనుకున్నాను కానీ అచేతనమైన ఆమె పాదాల మీద పడుకున్నాను.
పక్షి పిల్లకి ఆహారం అందించి ఎగిరిపోయింది, నా ఆలోచనల్లాగానే........
