STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

మంచుకత్తులు

మంచుకత్తులు

4 mins
14


 మండపేటలో దమయంతి పెసరట్టు మాంఛి ఫేమస్. ఆ పెసరట్టుకోసమే చుట్టుపక్కల ఉన్న పాలతోడు, ఇప్పనపాడు, వేములపల్లి, మోదుకూరు నుంచికూడా కుర్రకారు సైకిళ్ళమీద ఝూమ్మని మండపేటలో వాలతారు. ఏ పనిమీద మండపేట వచ్చినా దమయంతి హోటలు ముందు ఆగకుండా ఊళ్ళు చేరరు. దమయంతి మెప్పు పొందటానికి తాపేశ్వరంనుండి వచ్చే కుర్రకారు పెద్దపెద్ద చేపల్లాంటి కాజాలని బహుమతిగా ఇచ్చి సంతోషపడుతూ ఉంటారు. చుట్టుపక్కల పల్లెటూళ్ళల్లో దమయంతి పెసరట్టుని తలుచుకోందే ముసుగెయ్యరంటే నమ్మబుద్ది కాదు, కానీ అది పచ్చినిజం.


 ఇనప సామాన్లమ్ముకునే సత్తిపండు రాజమండ్రి గోదారి పుష్కరాల్లో దమయంతిని చూసి మనసుపడి, మూడుముళ్ళు వేసి మండపేట తీసుకొచ్చాడంటారు. ఇనపసామాన్ల కొట్లో పాత సిలెండరుపేలి సత్తిపండు చచ్చిపోయినప్పటి నుండి మరో దారిలేక మండపేట కలవపువ్వు సెంటర్లో హోటలు పెట్టాలనుకుంది దమయంతి. ఇంకో వారం రోజుల్లో హోటలు పెడతానని చూచాయగా అక్కడా, ఇక్కడా అంది. అంతే చుట్టుపక్కల కుర్రకారంతా చందాలేసుకుని నాలుగురోజులు తిరక్కుండా కలవపువ్వు సెంటర్లో దమయంతిచేత హోటలు పెట్టించేశారు. పైసా ఖర్చు లేకుండా దమయంతి హోటలుకు యజమానురాలైపోయింది. దమయంతి అందం ముందు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఆడోళ్ళ అందం, గులాబీ పువ్వు ముందు నాచుపువ్వే. ఆ విషయం ఆళ్ళ మొగోళ్లే రహస్యంగా ఒట్టేసి ఒప్పేసుకుంటారు. దమయంతిని చూడటానికి ప్రత్యేకించి చుట్టుపక్క ఊళ్లనుంచి సైకిళ్లేసుకొచ్చే జనం కలవపువ్వు సెంటర్లో చాలామందే ఉంటారు. ఆకలేసినా వెయ్యకపోయినా దమయంతి పెసరట్టు తినేసి, చొల్లుకార్చుకుంటూ ఇక వెళ్ళక తప్పదా అన్నట్లు సైకిళ్లేక్కే జనం రోజురోజుకీ పెరిగిపోవటం మొదలెట్టారు. పెసరట్టుకి యాభై రూపాయలిచ్చి చిల్లర అడగటం మానేసి సైకిళ్లేక్కేస్తున్నారంటే పరిస్థితి తీవ్రతని అర్ధం చేసుకోవచ్చు.  


 సరిగ్గా ఆటైములోనే మోదుకూరునుండి రోజూ మండపేట వచ్చే వీర్రాజు కంట్లో పడింది దమయంతి. దమయంతికి వీర్రాజు నలమహారాజులా కనిపించాడు. మోదుకూరు చుట్టుపక్కల ఏభై ఎకరాలకు ఆసామీ వీర్రాజు. బ్రహ్మచారి అయిన వీర్రాజుకి ఆడవాసన కొత్తేమీ కాదు. పులికి లేడి ఎలాగో, వీర్రాజుకి లేడీ అలాగన్నమాట. పైగా అదే అతగాడి వీక్నెస్స్. దమయంతి నేతి పెసరట్లతో వీర్రాజుని ఆకట్టేసుకుంది. అంతకంటే ఎక్కువ అతని ఆస్తిమీద ప్రేమ ఎక్కువ అయ్యింది. పెసరత్తుచుట్టూ నెయ్యి వేసినట్లుగా, వీర్రాజు చుట్టూ ప్రేమ ఒలకబొయ్యసాగింది.  


 వీర్రాజు, దమయంతిని మొదటి చూపులోనే మనసులో అట్టేబేట్టేసుకున్నాడు. వీర్రాజు మనసుపొరల్లో దమయంతి, పూతరేకుల మధ్యలో పంచదారలా అయిపోయింది. పాతికేళ్ళప్పటి నుండీ మండపేటంతా మరాడించేసిన వీర్రాజుకి, దమయంతి అందం అప్పుడే అచ్చోసిన పంచదార చిలుకలా అనిపించింది. దమయంతి అందమంతా బుగ్గనపడే సొట్టల్లోనే ఉందంటాడు వీర్రాజు. కాదు కాదు ఆమె నడుము, కోటిపల్లి తీర్థంలో మేకుకి తగిలించి సాగదీసిన నూపప్పు అద్దిన జీడిలా ఉంటుంది అంటుంది అతగాడి మనసు. ఓ మంచి ముహూర్థంలో “మనం పెళ్లి చేసుకుందాం” మనసులో మాట బయటపెట్టాడు వీర్రాజు చుట్ట నములుతూ. “ఆలోచించుకోడానికి నాలుగురోజులు టైమిస్తావా, అదీ లేదా!” ప్లేట్లో మరో వేడివేడి పెసరట్టు వేస్తూ హాస్యమాడింది దమయంతి.


 నిజానికి వీర్రాజుకంటే దమయంతి పాతికేళ్ళ చిన్నది. ఆమె ఇష్టపడింది అతని ఆస్తిని చూసికానీ, కాపురం వెలగబెడదామని కాదు. ఆ విషయం వీర్రాజుకి తెలియకపోయినా దమయంతికి బాగా తెలుసు. ఈడికున్న షుగరు, బి పిలతో ఎప్పుడో పడవ ముంచేస్తాడు. పైగా ఈడికి ముందు వెనకా ఎవరూ లేరు అన్న కోణంలోంచి కూడా దమయంతి ఆలోచిస్తోంది. వీర్రాజు ఎంత మంచోడో అంతకు పదిరెట్లు చెడ్డోడుకూడా. రెండేళ్లక్రితం పరాచకాలాడాడని ఇంటిటికీ పేపర్లేసే సత్తిపండుని పండు కోసినట్లు కోసేశాడు. అప్పు తీసుకుని నామం పెట్టాడని చిన్న బజారులో చింతపండు అమ్ముకునే జగ్గారావు కుడికాలు జాయింట్లు తీసేసి కుంటోడిని చేసేశాడంటారు. అందుకే వీర్రాజు లైనులోకొచ్చేసరికి కలవపువ్వు సెంటరులో కుర్రకారంతా బిక్కమొహాలేసుకుని పాత సినిమా పోస్టర్ని చూసినట్లు దమయంతిని చూడటం తప్ప ముదుకు వెళ్లలేకపోయారు. ఓ మంచి ముహూర్తం చూసి దమయంతిని చిన్నతిరపతి గుడిలో పెళ్లి చేసుకున్నాడు

ఓ మంచి ముహూర్తం చూసి దమయంతిని చిన్నతిరపతి గుడిలో పెళ్లి చేసుకున్నాడు వీర్రాజు. పెళ్లిచేయాలి అని పంతులుగారిని అడిగినప్పుడు “పెళ్లికొడుకేడీ” అన్నందుకు పంతులుగారిని తిట్టని తిట్టు తిట్టకుండా తిట్టాడు. ఆయనే మండపేటలో ఉండిఉంటే ఆ మాటన్నందుకు నాలిక బయటకులాగి కోసేసుండేవాడు. పంతులుగారు మారుమాటాడకుండా పెళ్లి కానిచ్చేశారు. అక్కడక్కడా తెల్లవెంట్రుకలున్న దమయంతికి, అక్కడక్కడా నల్లవెంట్రుకలున్న వీర్రాజుకి పెళ్లి జరుగుతుంటే గుడిమండపంలో జనం గుసగుసలాడుకోవడం దమయంతి చెవిన పడకపోలేదు.

ప్రయాణం మధ్యలో కొవ్వూరులో షుగరు పెరిగిపోయి కిందపడిపోయిన వీర్రాజుని రాజమండ్రి ఆసుపత్రిలో చేర్చింది దమయంతి. “షుగరు అయిదొందలు దాటింది, జాగ్రత్తగా మందులువాడి, పాత్యం చేయాలి. అడ్డమైన గడ్డీ తిన్నావంటే శాల్తీ లేచిపోతుంది. జాగ్రత్తగా ఉండు. ఫీజు రెండువేలు కౌంటరులోకట్టు” అని డాక్టరు గట్టిగా చెప్పాడు. చెప్పినవాడు డాక్టరా! విలనా అర్ధమవలేదు దమయంతికి. అలాగే అని తలూపి వీర్రాజు పర్సులోంచి డబ్బు తీసి, కౌంటరులో ఉన్న అమ్మాయిచేతిలో పెట్టి వీర్రాజుతో మండపేట ప్రయానమయింది దమయంతి.

ఇంటికెళ్ళాక కొన్ని రోజులకి దమయంతిని నిలువూనా బంగారంతో ముంచేశాడు వీర్రాజు. నగలు పెట్టుకుని అద్దం ముందు అరగంటసేపు సెంటర్లో నెహ్రూగారి విగ్రహంలా నిలబడిపోయింది. నగల మధ్యలో ఉన్న దమయంతిని కనుక్కోవడం వీర్రాజుకి చాలాసేపు పట్టింది.

వీర్రాజు దమయంతిని పువ్వుల్లోపెట్టి చూసుకుంటున్నాడు. ఓరోజు ఆలమూరునుంచి పెదపూడి జనార్ధనమూర్తి అనే ప్లీడర్ని తీసుకొచ్చి ఆస్తినంతా దమయంతి పేర్న రాసేశాడు. కాయితాల్ని ఆప్యాయంగా తీసుకున్న దమయంతి డబ్బు వస్తుందనుకుంది కానీ ఇంత త్వరగా ఇంత పెద్ద డబ్బు చేస్తుందనుకోలేదు. ఓరోజు మధ్యేన్నం పూట భోజనంచేసి, పెరట్లో విశ్రాంతి తీసుకుంటున్న వీర్రాజు నెత్తిమీద కొబ్బరిగెలపడి మంచమ్మీదే పోయాడు. వీర్రాజు పోయాడని దమయంతి చిటికెడు బాధపడింది కానీ క్రుంగి, కృశించి, నశించిపోలేదు. ఎందుకైనా మంచిదని నగలన్నీ బాంకు లాకర్లో పడేసింది.

అప్పుడొచ్చారు ఎక్కడాలేని అప్పులాళ్ళు. వీర్రాజుకి అన్నీ అప్పులున్నాయని విని ఆశ్చర్యపోయింది ఒక్క దమయంతే కాదు, సొంతూరు అయిన మోదుకూరూ ఆశ్చర్యపోయింది. ముదనష్టపు సచ్చినోడు, ఇన్ని అప్పులెట్టుకుని నాకెందుకీ ఆస్తి రాశాడో అర్ధమవక వీర్రాజుని తిట్టుకుంది దమయంతి. వచ్చిందే కట్నం అన్నట్లుగా అప్పులోళ్ళంతా అరగజంకూడా వదలకుండా అంతా పట్టుకుపోయారు. నెల తిరిగేసరికి కలవపువ్వు సెంటరులో దమయంతి మిరపకాయ బజ్జీలు వేయడం మొదలుపెట్టింది. పెసరట్లేసిన చోటే బజ్జీలేయడమంటే ఇదేనేమో అనుకున్నారంతా. అంతవరకు ఖాళీగా ఉన్న కుర్రకారంతా మళ్ళీ బిజీ అయిపోయారు.

ఓ సాయంత్రంపూట పెదపళ్లనుంచి రాజశ్రీ కలవపువ్వు సెంటర్లోదిగి అటూ ఇటూ చూసి దమయంతి బజ్జీలబండి దగ్గరకివచ్చి, వీర్రాజు గురించి వాకబు చేయడం మొదలుపెట్టింది. పెదపళ్లలో రోల్దుగోల్డు వ్యాపారంపెట్టి, నాటకాల వాళ్ళకి రోల్దుగోల్డు నగలు సప్లయ్ చేసి బాగానే గడించింది. రెండునెలలక్రితం పౌరాణిక సినేమా తీస్తున్నానని నగలు తీసుకున్న వీర్రాజు అయిపుమచ్చ లేకపోతే మండపేట వచ్చింది రాజశ్రీ. నిజానికి రోల్దుగోల్డు వ్యాపారం పెట్టించింది వీర్రాజే. పెళ్లి అయిన మొదటిరాత్రి మంచం మీద బోర్లా పడుకుని రాజశ్రీతో రాజమండ్రి మైనురోడ్డులో బంగారంకొట్టు పెట్టిస్తానన్నోడు, పెళ్లి చేసుకున్నాక పెదపళ్లలో రోల్దుగోల్డు వ్యాపారం పెట్టించాడు. రోడ్డుమీదపడి సవరాలు అమ్ముకోవడంకన్నా ఇది బానేఉందని సరిపెట్టుకుంది రాజశ్రీ. దమయంతిని చూడగానే ఇట్టే గుర్తుపట్టేసిన రాజశ్రీ బండిముందున్న చెక్కబల్లమీద కూర్చుని గతాన్ని తవ్వడం మొదలెట్టింది. “మీ అమ్మ పోయిన తర్వాత రాజమండ్రిలో మళ్ళీ కనపడలేదుగానీ, సవరాలు ఎంత గిరాకీ అయిపోయావనుకుంటున్నావు. రెండొందలు పెడితేగానీ జానాబెత్తెడు సవరం రావటంలేదు. జుట్టుమరీ ప్రియం అయిపోయిందనుకో. వీర్రాజుబావ నామీద మనసు పారేసుకోబట్టి నా బతుకు ఇలా మీటరు పొడవు సవరంలా ఉందికానీ, లేకపోతే బతుకంతా జానాబెత్తెడు సవరమే అనుకో” రాజశ్రీ అంది. రాజశ్రీ సవరంబాష మాట్లాడుతున్నంతసేపూ చుట్టుపక్కల ఎవరైనా వింటారేమోనని తెగ ఇదైపోయింది దమయంతి.

రాజశ్రీ తనూ చిన్నతనంలో రాజమండ్రి సీతంపేట, ఆర్యాపురం, తుమ్మలావ వీధుల్లో తిరిగి సవరాలు, జుట్టు అమ్మడం, కొనడం వ్యాపారం చేశామని తెలిస్తే పరువుపోదూ! ఎంత త్వరగా రాజశ్రీని పంపించేస్తే అంత మంచిదనుకుంది దమయంతి. పైగా ఇది నిమిషానికోసారి వీర్రాజుబావ, వీర్రాజుబావ అంటోంది. చచ్చి ఎక్కడున్నాడోగానీ వీర్రాజుగాడు చాలమందినే పట్టేశాడు. పళ్ళు కొరికింది దమయంతి. దీన్ని ఇంకా ఇక్కడే ఉంచితే “బంగారం వాటా” అంటుంది. దీన్ని దూరం పంపేయాలని దృఢంగా అనుకుంది దమయంతి.

“అక్కా! వీర్రాజుబావ నిన్ననే గౌతమీలో హైదరాబాదు వెళ్లిపోయాడు. ఇంక మండపేట రాననిచెప్పాడు. ఒకవేళ రాజశ్రీ వస్తే నాగారం సెంటరులో చుట్టకాలుస్తూ నిలబడి ఉంటానని చెప్పు అన్నాడు. నువ్వు సాయంత్రం గౌతమీలో హైదరాబాదు వెళ్లిపోవడం మంచిది. లేకుంటే నాగారం సెంటరులో నగారా మోగించేస్తాడు మనోడు” అని ఆ సాయంత్రం రాజశ్రీని గౌతమీ ఎక్కించేసి, చేతిలో మిరపకాయ బజ్జీల పొట్లాం పెట్టి “వీర్రాజు బావ గుర్తొచ్చినప్పుడల్లా ఒక్కోటి తింటూ ఉండు” అని చెప్పి తిరిగొచ్చింది దమయంతి.

రాజశ్రీ వచ్చి బంగారంలో వాటా అడుగుతుందన్న భయంతో మండపేట బాంకు లాకర్లోంచి బంగారం కానీ బంగారాన్ని తీసి మూటకట్టుకుని, ఎవరికీ తెలియకుండా ఆ రాత్రే కోనసీమ వైపు వెళ్ళిపోయిన దమయంతి ఇప్పటివరకూ ఎవరికీ తారసపడలేదు.

సమాప్తం



Rate this content
Log in

Similar telugu story from Classics