Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

మమకారం

మమకారం

7 mins
31


సుమతి "సాహితి సామ్రాట్ "నెలవారి పోటీల్లో జనవరి నెలలో ప్రథమ బహుమతి పొందిన నా కథ

టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.


మమకారం (కథ )


ఉదయం ఆరుగంటలు. పారిజాతపూలు ఏరుకొంటోంది భారతి. గేటు తీసికొని బిల్డర్ దుర్గారావు వచ్చాడు.


"ఇంత పొద్దున్నే వచ్చావేమిటి దుర్గారావూ!"అంది భారతి.


"ఈ రోజు గవర్నమెంట్ ఇంజనీరు వచ్చి బిల్డింగ్ కొలతలు వేసికెళ్తారమ్మా!మీరు ఎక్కడికన్నా వెళ్తారేమోనని ముందుగా చెప్పటానికి వచ్చాను."అన్నాడు దుర్గారావు.


"ఎక్కడికీ వెళ్లనులే!వాళ్ళను తీసికొనిరా!"అంది భారతి.


దుర్గారావు వెళ్లిపోయాడు. ఉస్సురని నిట్టూరుస్తూ ఇంట్లోకి వచ్చింది భారతి.


విజయవాడ పాయకాపురంలో ఒక ఎనిమిదివందల గజాల ఇల్లు భారతిది. భర్త కేశవరావు ఇరిగేషన్ డిపార్ట్మెంటులో ఉద్యోగం. నలభైఏళ్ల క్రితం 'ఉడా 'వాళ్ళు రెండొందల గజాల ప్లాట్లు అమ్ముతుంటే ఒక నాలుగు ప్లాట్లు కొన్నాడు కేశవరావు. అప్పట్లో పాయకాపురానికి మట్టిరోడ్డు మాత్రమే ఉండేది. డ్రైనేజి లేదు. చుట్టూ పొలాలు. ఊరి చివర విసిరేసినట్లుండేది. పిల్లల కాలేజీ చదువులయ్యాక అక్కడ ఇల్లు కట్టాడు కేశవరావు. ఇల్లు ఒక మూలకు కట్టి ఈశాన్యంలో చోటు బాగా వదిలాడు. చుట్టు పక్కల అప్పుడప్పుడే ఇళ్ళు వస్తున్నాయి. డ్రైనేజి వచ్చినా రోడ్డు అధ్వాన్నంగా ఉండేది. ఏ కొంచెం వాన పడినా అంతా బురదమయం. ఆఫీసునుండి స్కూటర్ మీద వచ్చినా కేశవరావు మట్టికొట్టుకొని వచ్చేవాడు. ఉన్నది పల్లెటూరు లాంటి వాతావరణం.చోటు ఎక్కువ ఉండటంతో రకరకాల చెట్లు వేసుకొన్నారు.వాళ్లకు ఇద్దరు మగపిల్లలు సతీష్, ప్రకాషులు.పిల్లలు చదువులంటూ వెళ్లిపోవటంతో ఆ చెట్లతోటే కాలక్షేపం చేసేవారు భారతి, కేశవరావులు. క్రింద ఉన్నచోటులో మామిడి, జామ, పనస, బత్తాయి లాంటి పెద్ద పెద్ద చెట్లు వేసి మేడమీద కుండీల్లో కూరగాయలు, ఆకుకూరలు పండించేవాళ్ళు దంపతులిద్దరు. పండిన పళ్ళు, కూరగాయలు చుట్టు పక్కల వాళ్లకు పంచిపెట్టడమే కాకుండా బంధువుల ఇళ్లకు కూడా పంపించేవాళ్ళు. కాలం గడిచింది. ఊరు పెరిగింది. ఇప్పుడు పాయకాపురం జనసమ్మర్ధం ఉన్న ప్రదేశం. కొత్తగా అపార్ట్మెంట్లు వెలుస్తున్నాయి. పిల్లల పెళ్లిళ్లయ్యాయి. పెద్దవాడు సతీష్ మహారాష్ట్రలోని పూనాలో, చిన్నవాడు ప్రకాష్ అమెరికాలో స్థిరపడ్డారు.

రిటైర్ అయ్యి ప్రశాంతంగా గడుపుతుంటే ఐదేళ్ల క్రితం కేశవరావు గుండెపోటుతో హఠాత్తుగా మరణించాడు. అతడు పోయాక అంతపెద్ద ఇల్లు తనకెందుకని అక్కడే కాలేజీలో లెక్చరర్ గా పని చేస్తున్న రాఘవేంద్ర కుటుంబానికి అద్దెకిచ్చింది భారతి. భారతికి ఏం కావాలాన్నా తెచ్చిపెడుతూ, "పిన్నిగారూ!పిన్నిగారూ!"అంటూ బాగా కలిసిపోయారు రాఘవేంద్రవాళ్ళు.


ఈమధ్య భారతికి కొద్దిగా బి. పి. వచ్చింది. పిల్లలకు తల్లిని ఒంటరిగా ఉంచటం ఇష్టంలేదు. పూనాలో వచ్చి ఉండమన్నాడు పెద్దకొడుకు సతీష్. చిన్నవాడు ప్రకాష్ కూడా పూనా వెళ్ళమని తల్లికి గట్టిగా చెప్పాడు. భారతికి కూడా వంటరిగా ఉండటం అధైర్యంగా ఉంది. అయితే అన్నదమ్ములిద్దరూ ఇంటిని డెవలప్మెంటుకు ఇద్దామనుకొన్నారు.


ఆ స్థలంలో అపార్ట్మెంట్ వేస్తే వీళ్లకు చెరో మూడు అపార్ట్మెంట్లు ఇస్తామన్నాడు బిల్డర్ దుర్గారావు. పిల్లలిద్దరు తల్లిని ఒప్పించారు. భారతికి ఇష్టంలేకపోయినా పిల్లలకోసం ఒప్పుకుంది. రాఘవేంద్ర రెండు నెలల్లో మరో ఇల్లు చూసుకుంటానన్నాడు. భారతికి దిగులుగా ఉంది. ఇంటి స్వరూపం మారుతుంది. చెట్లను చూస్తే బాధగా ఉంది. దాదాపు రోజంతా ఆకులను, కొమ్మలను పట్టుకొని మాటిమాటికీ నిమురుతూ ఉంటోంది.

రేపోమాపో దుర్గారావు వచ్చి చెట్లను కొట్టేస్తాడు. తను ప్రేమగా పెంచుకున్న చెట్లు... ఎన్నో ఏళ్ల అనుబంధం... గొడ్డలి వేటుతో ఛిద్రమై.. శూన్యమై... ఎవరికీ చెప్పుకోలేని బాధ.. మళ్ళీ మనసుకు వేదాంతం చెప్పుకొంటోంది. ఏది శాశ్వతం? అన్నీ వదిలి వెళ్లవలసిందే... నాది నాది అనుకోవటం వెఱ్ఱి భ్రమ. భర్త వెళ్లిపోయాడు. తను కూడా ఎప్పుడు వెళ్తుందో!ఎందుకీ మమకారం...

ఏదో బాధ.. మళ్ళీ వైరాగ్యం..

పరధ్యాన్నంగా పేపర్ తిప్పుతోంది.అందులో ఒక వార్త ఆమె దృష్టికి వచ్చింది.


'సెక్రటేరియట్ ఉన్న పెద్ద చెట్లను తొలిగించి వేరొక చోట పాతి రసాయనాలు వేసి బ్రతికించిన అధికారులు.'

పేపర్ పట్టుకొని రాఘవేంద్ర పోర్షనులోకి వచ్చింది భారతి. టిఫిన్ చేస్తున్నాడు రాఘవేంద్ర.


"ఇది చూడు రఘూ!ఇలా మన చెట్లను మరోచోట పెంచుకోవచ్చా?"


పేపర్ చూశాడు రాఘవేంద్ర.

"అవును పిన్నిగారు!ఈ మధ్య ఇలా చేస్తున్నారు. నేను కూడా చదివాను. కానీ మన చెట్లను మరోచోట పెట్టాలంటే చోటు కావాలి కదా!అసలు ఖర్చు ఎంత అవుతుందో?"


"అదిసరే!నువ్వు దీని గురించి కనుక్కుంటావా?"ఆశగా అడిగింది భారతి.


భారతికి చెట్లంటే ఎంత ప్రాణమో రాఘవేంద్రకు బాగా తెలుసు.


"అన్ని వివరాలు ఉద్యానవన అధికారులను కనుక్కుంటాను. అందులో పనిచేసే ఒకతను మాకు దూరపు బంధువు కూడా!సాయంత్రం వస్తూ వస్తూ అతనితో మాట్లాడి వస్తాను. ఏదో మార్గం ఉంటుందేమో చూద్దాం!"అన్నాడు.

ఉత్సాహం వచ్చింది భారతికి. పూనాలో సతీష్ అపార్ట్మెంట్ ఖరీదైన కాలనీలో ఉంటుంది. స్విమ్మింగ్ పూల్, గార్డెన్, వాకింగ్ ట్రాక్, చుట్టూ చెట్లు... ఆహ్లాదంగా ఉండే కాలనీ అది.

'అక్కడ ఈ చెట్లను వేయటానికి అవకాశం ఉంటుందేమో చూడాలి.'అనుకొంది భారతి.

సతీషుకు ఫోన్ చేసి విషయం చెప్పింది.


"నీకేమన్నా పిచ్చా అమ్మా!విజయవాడ నుంచి పూనాకు చెట్లు తేవటం ఏమిటి? ఇక్కడ ఓ పదో ఇరవైయ్యో కుండీలు పెట్టుకొని నీ ఇష్టమైన మొక్కలు తెచ్చుకొని పెంచుకో!"

చికాకు పడ్డాడు కొడుకు.

'వీడికి చెప్పటం నాదే బుద్ధితక్కువ.'అనుకుంది భారతి.

మధ్యాహ్నం దుర్గారావు ఇంజనీరును తీసుకొచ్చాడు.


"దుర్గారావు!నేను చెప్పేదాకా చెట్లు కొట్టే పని చెయ్యొద్దు!రాఘవేంద్ర వాళ్ళు ఖాళీ చెయ్యటానికి ఇంకా రెండునెలలు టైం ఉంది కదా!అప్పుడు చూద్దాం!"అంది.


"సరేనమ్మా!"అన్నాడు దుర్గారావు.


సాయంత్రం రాఘవేంద్ర ఎప్పుడొస్తాడా అని ఎదురుచూస్తూ వరండాలోనే కూర్చుంది. ఎనిమిదింటికి బైక్ చప్పుడు వినంగానే చాటంత ముఖం చేసుకొని గేటు తీసింది భారతి.


"పిన్నిగారూ!శుభవార్త!ఉద్యానవనం వాళ్ళతో మాట్లాడి వస్తున్నాను. వాళ్లు వచ్చి చెట్లు తీసి రసాయనాలు వేసి పెడతారట!మనం ఆ చెట్లను ఇంకోచోట పాతితే ఎనభైశాతం బ్రతికే ఛాన్స్ ఉందన్నారు. మనకు చోటు దొరకకపోతే వాళ్ళే తీసికెళ్లి పెడతారట!కానీ మిషన్లతో చెట్లు పెకలించటానికి, జాగ్రత్తగా మందులు వెయ్యటానికి కొంచెం ఖర్చు ఎక్కువే అవుతుంది. అది మనమే పెట్టుకోవాలి!"

రాఘవేంద్ర మాటలకు సంతోషం వేసింది భారతికి.


"చాలా సంతోషం రఘూ!నాకు పూనాకు టికెట్టు బుక్ చెయ్యి!నేను పూనా వెళ్లి చూస్తాను. అక్కడ చోటు లేకపోతే ఇక్కడే ఎక్కడైనా చెట్లకు చోటు దొరుకుతుందేమో చూద్దాం!"అంది భారతి.


రాఘవేంద్ర టికెట్టు బుక్ చేశాడు. కోణార్కలో పూనాకు బయలుదేరింది భారతి.కారు తీసికొని స్టేషనుకు వచ్చాడు సతీష్.


"ఇక్కడ సొసైటీలో మన ఇష్టాలేవీ చెల్లవమ్మా!నీకు చెబితే అర్థం కాదు. ఆ గార్డెన్లో చెట్లు వాళ్ళే పెంచుకొంటారు. అపార్ట్మెంట్స్ నిర్వహించే కమిటీ ఉంది. వాళ్లంతా మరాఠీలు. మనల్ని 'మద్రాసీలు 'అంటారు.వాళ్ళకు మనమాట వినాలని రూలు ఉండదు కదా!అయినా చెట్లకోసం అంత ఆరాటం అవసరమా!"విసుగ్గా ఉంది సతీషుకు.


రెండో రోజు కాలనీ అంతా తిరిగింది. గార్డెనులో, వాకింగ్ ట్రాక్ చుట్టూ ఒక క్రమపధ్ధతిలో చెట్లు పెంచి ఉన్నాయి. గార్డెనులో తోటమాలి 'బండు 'కనిపించాడు. సంభాషణ అంతా హిందీలో జరుగుతోంది.

"ఇక్కడ ఎవరన్నా కొత్త చెట్లు తెచ్చి వేస్తుంటారా?"అడిగింది భారతి.

"ఎవరన్నా అపార్ట్మెంట్ ఖాళీ చేస్తుంటే వాళ్ళ కుండీలు తెచ్చి పెడతారు మౌసీ!"అన్నాడు బండు.'మౌసీ 'అంటే 'పిన్ని 'అని అర్థం.


మూడోరోజు మళ్ళీ కాలనీ అంతా కలియతిరిగింది.గార్డెన్ గోడ దగ్గర ఒక చోట చిన్న గేటు ఉంది. దానికి తాళం వేసి ఉంది.గేటు కమ్మీలోంచి చూసింది.లోపల కొన్ని పిచ్చి మొక్కలు పెరిగి ఉన్నాయి. కొన్ని రాళ్లు, ఇటుకలూ, పనికిరాని ఇనుపసామాన్లు ఉన్నాయి. స్థలం త్రికోణం లాగా ఉంది. దాదాపు నూటయాభై గజాలు ఉంటుంది.అప్పుడే అటుగా బండు వచ్చాడు.

"అదేమిటి?"అని అడిగింది భారతి.

"కొంత స్థలం పార్కింగుకు పెట్టారు. అప్పుడు ఈ చోటు క్రాస్ లాగా వచ్చింది.ఎందుకూ పనికి రాని చోటు అది.దాంట్లో సొసైటీ బిల్డింగ్ కట్టగా మిగిలిన సామాన్లు పెట్టారు. పిల్లలెవరూ అటువైపు వెళ్ళకుండా గేటు పెట్టి తాళం వేశారు "వివరించాడు బండు.


సొసైటీ అధారటీస్ చైర్మన్ ఫోన్ నంబర్ బండు దగ్గర తీసికొని, అతడికి ఫోన్ చేసింది భారతి.అతడి పేరు రాహుల్ కర్నేకర్.మరాఠీ.


తనను తాను పరిచయం చేసుకుంది.


"మీతో మాట్లాడాలి!"అంది భారతి.


"పదకొండింటికి ఆఫీసుకు రండి!"అన్నాడతడు.


అతడు చెప్పిన టైముకు సొసైటీ ఆఫీసుకు వెళ్ళింది.


"మీకు ఏం కావాలి?".


 అతడు అరవైఏళ్ళు దాటినవాడు. రిటైర్ అయిన ఆర్మీ ఆఫీసర్.

అంతా వివరించింది భారతి. తను ఏం చెయ్యాలనుకుంటుందో కూడా చెప్పింది.


"మీకు వీలయితే నా చెట్లు పాతిపెట్టడానికి గార్డెన్ ప్రక్కన ఆ పనికి రాని ఖాళీ స్థలం ఇస్తారా!"

గడ్డం నిమురుకుంటూ ఆలోచించాడు రాహుల్.భారతి చెప్పింది వినంగానే అతడికి భారతికి సహాయం చేయాలనిపించింది. కారణం పర్యావరణం గురించిన స్పృహ ఈ మధ్య అందరిలో కలుగుతూ ఉండటం. చెట్లు పెంచటం అన్నది కనీస బాధ్యతగా అన్ని మీడియాల్లో ప్రచారం జరుగుతూ ఉండటం.


"వచ్చే బుధవారం సొసైటీ మీటింగ్ ఉంటుంది. మీ ప్రపోజల్ మెంబర్సుతో చెప్తాను. వాళ్ళు ఒప్పుకోవాలి. మీటింగుకు మీరు కూడా రండి!"అన్నాడు సాదరంగా.


"మీరు నాకు సపోర్ట్ ఇస్తే చాలు! సొసైటీకి డబ్బులు కట్టమంటే కడతాను. నా చెట్లు పెంచుకోవటానికి చోటు ఇస్తే చాలు.ఎక్కువ లేవు. ఒక ఇరవై, ముప్ఫయి దాకా ఉంటాయి.అంతే."ప్రాధేయపడుతున్నట్లుగా అడిగింది భారతి.

రాహుల్ నవ్వాడు.

"బెహన్ జీ!మీరు అడిగేది చెట్లకోసమే కదా!ఆక్సిజన్ అందరికి వస్తుంది.సొసైటీ కమిటీ మెంబర్స్ అందరికీ చెప్పి చేద్దాం!మంచి పనికి అడ్డం ఎవరు చెప్తారు? "


భారతి మొహంలో కళ వచ్చింది.

బుధవారం సొసైటీ కమిటీ మీటింగుకు వెళ్ళింది.


చాలాసేపు తర్జన భర్జనల తర్వాత అందరూ ఒప్పుకున్నారు. అక్కడ ఉన్న చెత్త తీయించటానికి కొంత డబ్బు సొసైటీకి భారతి కట్టాలని తీర్మానం చేశారు.


"మనం ఇక్కడ ఉన్న ఉద్యానవన అధికారులతో మాట్లాడదాం!వాళ్ళ సలహా తీసికొంటే మంచిదే కదా!"అన్నాడు రాహుల్.

అతడు పూనా అధికారులతో మాట్లాడాడు.

వాళ్ళు రెండురోజుల తర్వాత ఆఫీసుకు రమ్మన్నారు.


వాళ్ళు చెప్పిన టైంకు రాహుల్ కారులో ఆఫీసుకు వెళ్ళింది.


శివాజి భట్నాగర్.నలభైఏళ్ళుంటాయి.


"మేడం!చెట్లు పాతేటప్పుడు కెమికల్స్ వెయ్యాలి. మీరు షుమారు ఇరవై ముప్ఫయి చెట్లు అంటున్నారు. దాదాపు ముప్పై వేలు పైనే అవుతుంది. మా సిబ్బంది వచ్చి పని చేస్తారు."


"చెట్లు బ్రతకటం గ్యారెంటీ కదా!"అడిగింది భారతి.


"అంటే దాదాపుగా బ్రతుకుతాయి. కానీ ఒక్కోసారి బ్రతకక పోవచ్చు. వందశాతం గ్యారెంటీ ఇవ్వలేము. మేము ఒక వంద చెట్లు ఈ పద్దతిలో నాటితే దాదాపు ఇరవై చనిపోతాయి.అన్నీ బ్రతకటం లేదు. అందుకే ముందే చెప్తున్నాను. ఖర్చు ఎక్కువ అవుతుంది. మీరు ఆలోచించుకోండి!"


"నేను డబ్బు పెడతాను. అక్కడినుండి జాగ్రత్తగా తెచ్చిపెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు రెడీగా ఉంటారు కదా!"


శివాజి భట్నాగర్ కు చిత్రంగా ఉంది. భారతి పట్టుదల చూస్తే ముచ్చట వేసింది. ఆమెకు చెట్లమీద ఉన్న ప్రేమ అతడిని కదిలించివేసింది.


"మీరు అక్కడి నుండి జాగ్రత్తగా, త్వరగా తీసికొని రండి!ఒక్క రోజులో తేగలరా!టైమ్ ఎక్కువ అయితే బ్రతకటం కష్టం."


"నేను ప్రయత్నిస్తాను!"అంటూ రెండుచేతులు జోడించి నమస్కారం చేసి కదిలింది భారతి.


కొడుకు సతీషుకు, కోడలు తన్మయికి ఈ పనంతా శుద్ధ దండగలాగా అనిపించినా భారతిని బాధపెట్టడం ఇష్టం లేక ఊరుకున్నారు.

మళ్ళీ విజయవాడ వచ్చింది భారతి.


 "చెట్లు తీసికెళ్ళటానికి ట్రైన్ వాగన్ అయితే త్వరగా చేరాతాయి "అన్నాడు రాఘవేంద్ర.

భారతి ఒప్పుకోలేదు.ట్రైన్ లో ఎలా ఎక్కిస్తారో ఏమో!ట్రక్కు మాట్లాడమంది.

ట్రక్కువాడు సూర్యం. విజయవాడ నుండి పూనా 850 కిలోమీటర్లు. హైవే మీద ప్రయాణం. దాదాపు ఇరవై గంటలు పడుతుంది. ఎక్కడన్నా ట్రాఫిక్ జామ్ అయితే ఇంకో నాలుగైదు గంటలు. మొత్తంగా ఒక రోజు.ఖర్చు అరవైవేల పైనే అవుతుంది.ఇక్కడ చెట్లు తీయటానికి మిషనరీ నలభైవేలు, కెమికల్సుకి మరో ఇరవై, ట్రక్కు అరవై, ఎక్కడో ముప్ఫయ్ అంతా కలిపి ఇరవై చెట్లకోసం దాదాపు లక్షన్నర. ఇంత ఖర్చు.. చెట్లకోసం... అవసరమా!...

పెద్దావిడ చెబితే వినే స్థితిలో లేదు. ఒక వేళ ఇంత చేసినా చెట్లు బ్రతక్కపోతే!....

ఏమీ తోచటం లేదు రాఘవేంద్రకు.

సతీషుకు ఫోన్ చేశాడు.

"ఏం చెయ్యను? అమ్మ చాదస్తం. నా మాట వింటుందన్న నమ్మకంలేదు."విసుగ్గా చెప్పాడు సతీష్.


రాత్రి తల్లికి ఫోన్ చేశాడు.

కొడుకు చెప్పింది తీరిగ్గా విన్నది భారతి.


"నేను మూడుపేటల గొలుసు చేయించుకోనా!"


చెట్ల గురించి మాట్లాడుతుంటే గొలుసు అంటుందేమిటో అనుకుంటూ

"చేయించుకోమ్మా!రేపు కంసాలి రామాచారిని నీ దగ్గరికి రమ్మని చెప్పనా!"అన్నాడు సతీష్.


"మూడు పేటల గొలుసు నాలుగు తులాలు పెట్టి చెయ్యాలంటే ఎంత అవుతుందో లెక్కవెయ్యి!"

"ఎంత అయితే ఏమిటమ్మా!నీకు నచ్చింది చేయించుకో!"


కాదు!కాదు!షుమారుగా ఎంత అవుతుందో చెప్పు!"


మనసులో లెక్క వేశాడు సతీష్.


"తులం బంగారం ఇప్పుడు యాభైవేలు ఉంది. షుమారు రెండు లక్షల పైన అవుతుంది."ఆలోచిస్తూ చెప్పాడు సతీష్.


"ఇంక మాట్లాడకు!నేను చెట్లు తీసికొని వస్తున్నాను."ఫోన్ పెట్టేసింది భారతి.

సతీషుకు అర్థం అయ్యింది.


విజయవాడలో చకచకా పనులు జరుగుతున్నాయి.

తల్లి చెప్పినట్లు పూనాలో  అధికారులతో మాట్లాడి చెయ్యాల్సిన పనులు చేయిస్తున్నాడు సతీష్.

మంచిరోజు చూసి చెట్లకొమ్మలు కత్తిరించారు పనివాళ్ళు. చెట్లపైన దాదాపు ఇరవై దాకా పక్షి గూళ్లు ఉన్నాయి. పనివాళ్ళు కొమ్మలు నరుకుతుంటే పక్షులు పెద్ద పెట్టున అరవటం మొదలు పెట్టాయి. పక్షి గూళ్లను జాగ్రత్తగా తీయించి మేడపైన కుండీల దగ్గర మొక్కల దగ్గర పెట్టించింది.అరుస్తూ ఉన్న పక్షులు తమ గూళ్లు క్షేమంగా ఉండటంతో కాసేపటికి శాంతించాయి.చెట్లను రేపు పెకలిస్తామని చెట్లకోసం గుంతలు త్రవ్వించమని సతీషుకు, రాహుల్ కు ఫోన్ చేసింది భారతి.అంతా రెడీగా ఉంచుతామని రాహుల్ చెప్పటంతో ఊపిరి పీల్చుకొంది.


రెండోరోజు ఉద్యానవన అధికారులు చెట్లను పెకలించటం మొదలు పెట్టారు. భగవంతుడిని ప్రార్థిస్తూ కూర్చుంది భారతి.అన్ని చెట్లను పెకలించేసరికి సాయంత్రం అయ్యింది. పెద్దపెద్ద గోనెపట్టాల్లో రసాయనాలు కలిపిన మట్టిలో చెట్లను వేర్లతో సహా జాగ్రత్తగా చుట్టి చుట్టి పెట్టారు.వాటిని ట్రక్కులోకి ఎక్కించారు. ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయ్యి ప్రయాణం ఆలస్యమయితే చెట్లను తడపడానికి నీళ్ల డ్రమ్ముకూడా పెట్టారు.

తెల్లవారి నాలుగింటికి ట్రక్కు బయలుదేరింది.

రాఘవేంద్ర కూడా పూనా వస్తానన్నాడు. ఒకసారి వెనక్కు తిరిగిచూసింది భారతి.బోసిగా ఉన్న ఇల్లు.....కళ్ళనీళ్లు తుడుచుకొని కారు ఎక్కింది.

హైవేమీద ప్రయాణం. అక్కడక్కడా ట్రక్కు ఆపి చెట్ల ఆకులు' వాడాయేమో 'అని చూస్తూ ఉన్నాడు రాఘవేంద్ర. దాబాల దగ్గర ట్రక్కు ఆగినప్పుడల్లా క్లీనర్ ట్రక్కు ఎక్కి చూసేవాడు. రాహులుకు,శివాజీకి కనీసం పదిసార్లయినా ఫోన్ చేసిఉంటుంది భారతి. ఆవిడ ఆరాటానికి విసుక్కోకుండా జవాబిస్తున్నారు వాళ్లిద్దరు.


ఆరోజు అర్థరాత్రి రెండింటికి పూనా చేరింది ట్రక్కు.

రెండోరోజు తెల్లవారే సరికి సిబ్బందిని తీసికొని వచ్చాడు శివాజి.

శివాజీ పర్యవేక్షణలో ఆ సాయంత్రానికి చెట్లను భూమిలో పాతిపెట్టారు సిబ్బంది.

తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసికోవాలో భారతికి, బండుకు వివరించాడు శివాజి.


రెండో రోజు నుండి నీళ్లుపోస్తూ, చెట్ల చుట్టూ తిరుగుతూ ఉండేది భారతి. నెలరోజులు గడిచాయి.జామ, సపోటా చెట్లు తప్ప మిగిలిన వన్నీ బ్రతికాయి.చెట్లు చివుర్లు వేస్తున్నాయి. చివుర్లు, ఆకులు లెక్కపెట్టుకుంటూ, శ్రద్ధగా చెట్లను పెంచుకుంటూ ఉంది. సంవత్సరం గడిచింది. మళ్ళీ కార్తీకమాసం వచ్చింది.ఆ చిన్న గార్డెనుకు 'నందనవనం 'అని పేరు పెట్టింది.

ఉసిరిక చెట్టుక్రిందదీపం పెట్టి కూర్చుని పురాణం చదువుకుంటోంది భారతి. కాలనీలో ఉన్న అపార్ట్మెంట్సులో కొంతమంది తెలుగువాళ్ళు ఉన్నారు. వాళ్ళుకూడా ఉసిరిక చెట్టుక్రింద దీపాలు పెట్టుకుంటూ భారతిని పలకరించారు. వాళ్లకు నవ్వుతూ జవాబిచ్చే భారతిని చూసి వెన్నెల్లో చెట్లుకూడా నవ్వుతూ, వాటి ఆకులను సుతారంగా కదిలిస్తున్నాయి.

ఆ దృశ్యాన్ని కృత్తికా నక్షత్రానికి చూపిస్తున్నాడు చంద్రుడు. వెన్నెల భువినిండా పరుచుకొంది.ప్రకృతి పరవశించింది.


సమాప్తం.


Rate this content
Log in

Similar telugu story from Classics