Gayatri Tokachichu

Inspirational

4  

Gayatri Tokachichu

Inspirational

సర్. సి. వి. రామన్

సర్. సి. వి. రామన్

4 mins
256


భారతరత్న సర్ సి. వి. రామన్.


టీచర్ :పిల్లలూ!మీలో అందరూ నిన్న నేను ఇచ్చిన హోమ్ వర్క్ చేశారా? "


కిరణ్ :"నేను చెయ్యలేదు టీచర్!"


టీచర్ :"ఎందుకని కిరణ్? "


కిరణ్ :"నిన్న మా బాబాయి పెద్ద చదువులు చదవటానికి అమెరికా వెళుతున్నాడు. మేమందరమూ నిన్న విమానాశ్రయానికి వెళ్ళాము టీచర్!అందుకని హోమ్ వర్క్ చెయ్యలేదు. "


రాజు :టీచర్!మనం పెద్ద పెద్ద చదువులు చదవాలంటే విదేశాలకు వెళ్ళాల్సిందే కదా టీచర్!అంత డబ్బు మన దగ్గర లేకపోతే ఏం చెయ్యాలి? "


టీచర్ :"మీ అభిప్రాయం తప్పు. మన దేశంలోనే చదివి,గొప్ప శాస్త్రవేత్తలయి, విదేశీయుల చేత గొప్ప గొప్ప పురస్కారాలు అందుకున్న వారు మన దేశంలో చాలా మంది ఉన్నారు. వారిలో 'నోబుల్ ప్రైజ్ 'తెచ్చుకొన్న సర్. సి. వి. రామన్ గారి గురించి మీకు ఈ రోజు చెప్తాను. శ్రద్ధగా వినండి!"


పిల్లలు :(ఉత్సాహంగా )"చెప్పండి టీచర్!"


చంద్రశేఖర్ వెంకటరామన్ 1888 నవంబర్ 7 వ తేదీన తమిళనాడులోని తిరుచునాపల్లిలోని అయ్యన్ పెటాయ్ గ్రామంలో జన్మించాడు. తల్లి పార్వతి అమ్మాళ్, తండ్రి చంద్రశేఖర్ అయ్యర్. తండ్రి భౌతికశాస్త్ర అధ్యాపకుడు. ఆయన తండ్రి భౌతిక శాస్త్ర అధ్యాపకులవటంతో అతనికి భౌతికశాస్త్రం పట్ల ఆసక్తి ఎక్కువయింది. తండ్రి కొంతకాలం విశాఖపట్నంలో ఉద్యోగం చెయ్యటంతో రామన్ ప్రాథమిక విద్యాభ్యాసం విశాఖపట్నంలో సాగింది. తన 12 వ ఏట మెట్రిక్యులేషన్లో ఫిజిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించాడు.

తరువాత రామన్ తండ్రి మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో గణితం మరియు భౌతికశాస్త్రంలో లెక్చరర్ గా చేరాడు. రామన్ కూడా 1902 లో ఈ కళాశాలలో చేరి బి. ఎస్సి. డిగ్రీ పూర్తి చేశాడు. అందులో అతను మరలా గోల్డ్ మెడల్ సాధించాడు. 1907 లో మద్రాసు విశ్వవిద్యాలయంలో ఎమ్. ఎస్సి. పూర్తి చేసి కలకత్తా ప్రభుత్వ ఆర్ధికశాఖలో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ గా చేరాడు.

ఉద్యోగం చేస్తూ ఉన్నా భౌతికశాస్త్రంలో పరిశోధనలు చెయ్యాలని 1917 లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి కలకత్తా యూనివర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్ గా చేరి, ఉద్యోగం చేస్తూనే రాత్రి పూట కలకత్తాలోని ఇండియన్ అసోసియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్స్ లో పరిశోధన కొనసాగించాడు.


అతని పరిశోధనని 'రామన్ ప్రభావం '(ఎఫెక్ట్ )అంటారు.అది ఏమిటో వివరంగా తెలుసుకొందాము.

కాంతి ఒక పదార్థం మీద పడ్డప్పుడు ఆ కాంతిలోని కిరణాలు ఆ పదార్థంలోని అణువులను గుద్దుకొంటాయి. ఉదాహరణకు గోడమీదకు బంతిని విసిరితే ఆ బంతి పరావర్తనం చెంది వెనక్కి వస్తుంది. అదే విధంగా కాంతి ఒక యానకంలోని రేణువులను రేణువులను గుద్దుకొన్నప్పుడు ఆ కాంతి కిరణాలు పరావర్తనం చెంది వెనక్కు వస్తాయి. కాంతి కిరణంలోని తేజాణువులను (ఫోటానులను )రంగు బంతులతో పోల్చవచ్చు. ఏ రంగు బంతిని యానకం (యన్ ఆప్టికల్ మీడియం )మీదకు విసిరామో అదే రంగు బంతి తిరిగి వస్తే దానిని 'రేలి పరిక్షేపం 'అంటారు. అనగా ఏ రంగు కిరణం లోపలికి వెళితే అది పరావర్తనం(రిఫ్లెక్షన్స్ )చెంది అదే రంగుతో బయటికి వస్తే ఆ ప్రక్రియ 'రేలి పరిక్షేపం '(ప్రోపగేట్డ్) అంటారు.

ఒక కోటి తేజాణువులను యానకం మీదికి వదిలితే అందులో ఒకటో రెండో రంగుమారి బయటకు వస్తున్నాయి. భౌతికశాస్త్రంలో కాంతి కెరటం యొక్క తరంగ ధైర్యం (వెవ్ లెంత్)రంగుని సూచిస్తుంది. అంటే పతనమైన కాంతి కిరణం ఒకటైతే పరావర్తనం చెంది తిరిగి వచ్చిన కిరణాలలో కొన్నింటి తరంగ ధైర్యం (రంగు )తేడాగా ఉంటోంది. పారదర్శకంగా ఉన్న ఘన, ద్రవ, మరియు వాయు మాధ్యమం గుండా కాంతిని ప్రసరింప చేసినప్పుడు అది తన స్వభావాన్ని మార్చుకుంటుంది.ఈ దృగ్విషయానికి 'రామన్ ప్రభావం 'అని పేరు పెట్టారు.1928 ఫిబ్రవరి 28 న రామన్ ఈ ప్రయోగాన్ని ప్రపంచానికి తెలియచేశాడు. రామన్ ఎఫెక్ట్ ను కనుగొన్న సందర్భాన్ని పురస్కరించుకొని భారతదేశంలో ఫిబ్రవరి 28 వ తారీఖును' జాతీయ విజ్ఞాన దినోత్సవం' (నేషనల్ సైన్స్ డే ) గా జరపాలని ప్రభుత్వం ప్రకటించింది.


'రామన్ ప్రభావం 'పూర్తిగా అర్థం కావాలంటే' తేజాణువు' (ఫోటాన్ )అంటే ఏమిటో, 'కంపాణువు '(ఫోనాన్ - ఫోనాన్ )అంటే ఏమిటో కొద్దిగా తెలియాలి.' తేజాణువు 'అంటే కాంతి రేణువు. 'కంపాణువు 'అంటే కంపన రేణువు. ఈ కంపనాలు ఎక్కడి నుండి వస్తున్నాయి? ఒక పదార్థంలో ఉన్న అణువులు కదలకుండా నిలబడలేవు. అలా కంపిస్తూనే ఉంటాయి. యానకం ఘనరూపంలో కానీ, ద్రవరూపంలో కానీ ఉన్నప్పుడు ఆ పదార్థంలోని అణువులు వ్యష్టిగా కాకుండా ఉమ్మడిగా ప్రకంపనలు పొందుతూ ఉంటాయి. ఈ ఉమ్మడి ప్రకంపనలలో ఉన్న శక్తి స్వరూపాన్ని కంపాణువు (ఫోనాన్ )అని అభివర్ణించవచ్చు.


భౌతికశాస్త్రంలో రామన్ ప్రభావం (ఎఫెక్ట్) యొక్క ఉపయోగాలు.


ఒక పదార్థంలో ఉన్న అణువుల కంపనాల గురించి సమాచారం చెబుతుంది కనుక రామన్ ప్రభావం ఉపయోగించి రామన్ ప్రభావం ఉపయోగించి ఆ పదార్థంలో ఉన్న అణువుల నిర్మాణ శిల్పం తెలిసికోవచ్చు. కనుక రామన్ ప్రభావం(ఎఫెక్ట్ )ద్వారా రాసాయనిక పదార్థాలలో అణు,పరమాణువుల నిర్మాణాల పరిశీలనకు మార్గం సులభతరమయ్యింది.


అణు నిర్మాణం, అణువుల ప్రకంపనల అవస్థలు, అణుధర్మాలు అధ్యాయనం చేయవచ్చు.


స్పటికంలో పరమాణువుల అమరిక, స్పటికజాలకం, స్పటికీకరణ వంటి విషయాల గురించి తెలుసుకోవచ్చు.


రేడియో ధార్మికత, అణుశక్తి, పరమాణుబాంబు వంటి విషయాలు తెలిసికోవచ్చు.


అన్ని రాళ్ళను సానబెట్టినప్పుడు వాటి ఆకృతి, స్పటిక జాలక స్థానభ్రంశము వంటి విషయాల అవగాహనకు రామన్ ఫలితం ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని ఆధారంగా గృహాల్లో అందమైన మొజాయిక్ ఫ్లోరింగుకు ఉపయోగిస్తున్నారు.


కర్బన రసాయన పదార్థాల అమరికలో శృంఖలాలు, వలయాలు కనుగొని ఆరోమాటిక్ స్వభావ నిర్ణయం వీలవుతుంది.


పలుచటి రాళ్ళల్లో స్పటిక నిర్మాణం ఎక్కువ వేడిమి, పీడనాల వల్ల ఖనిజాల స్వభావం, జీవ ఖనిజాల లక్షణాలు తెలుసుకోవచ్చు.


మిశ్రమలోహాలు, ఆ లోహాలు, ప్రవాహస్థితిలో ఉన్న లోహాల స్వభావ నిర్ణయం వీలవుతుంది.


వాహకాలు, అర్థవాహకాలు, అతివాహకాల స్వభావం తెలుసుకోవచ్చు.


మానవశరీరంలోని ప్రోటీన్లు,అమినో ఆమ్లాలు, ఎంజైములు,నూక్లియాన్ల ఆకృతి, క్రియాశీలత పరిమాణాత్మక విలువలను కనుక్కోవచ్చు.


డీ ఆక్సీరైబోనూక్లిక్ ఆమ్లం (DNA)మానవ శరీర నిర్మాణంలో అతి ప్రధాన పదార్థం. దీనికి కల వేర్వేరు నిర్మాణ దృశ్యాలను రామన్ వర్ణపట మూలంగా తెలుసుకున్నారు.


పిత్తాశయంలోని కొన్ని రకాల రాళ్లు, జీవ భాగాల ఆయస్కాంతత్వం గురించి తెలుసుకోవచ్చు.


మధుమేహం, కేన్సర్ రోగుల ప్లాస్మా పరీక్ష, కండరాల నొప్పులు, బలహీనతలకు లోనైన వ్యక్తుల జన్యులోపాలను తెలుసుకోవచ్చు.


వివిధరకలైన మందులు, ఔషధాలు డి. ఎన్. ఎ. పై చూపే ప్రభావాన్ని అంచనా వేయవచ్చు.


వాతావరణంలో కాలుష్యకారకాల ఉనికిని గుర్తించవచ్చు.


జలకాలుష్యకారకాలైన సీసం, ఆర్సనిక్, పాదరసం వంటి పదార్థాలను, కీటకనాశక పదార్థాలను, సింథటిక్ పైరిత్రాయిడ్ల ఉనికిని తెలుసుకోవచ్చు.


ప్లాస్టికులో రసాయనిక సమ్మేళనాన్ని కనుక్కోవచ్చు.


ఏక, ద్వి, త్రిబంధ నిర్ధారణకు ఉపయోగపడుతుంది.


ఆమ్లజని, నత్రజని వంటి సజాతి కేంద్రక అణువుల్లో కంపన మరియు భ్రమణశక్తి స్థాయిల గురించి తెలిసికోవచ్చు.


కాంతి స్వభావ నిర్ధారణ, వస్తువులలో కాంతికిగల పరస్పర చర్యా విధానం, పదార్థ ఉపరితలాలపై కాంతి క్రియా విధానం విషయాలు అధ్యయనం చేయవచ్చు.


ఘనపదార్థాల స్పటిక స్థితి, ద్రావణీయత, విద్యుత్ విఘటనం విషయాలు తెలుసుకోవచ్చు.


పరిశ్రమల్లో కృత్రిమ రసాయనిక సమ్మేళనాల పరిశీలనకు ఉపయోగపడుతుంది.


వైద్యరంగంలో అవసరమయ్యే మందుల విశ్లేషణకు ఉపయోగపడుతుంది 


 వీరి విలువైన పరిశోధనలకు 1930 లో 'నోబుల్ ప్రైజ్ 'వచ్చింది. 'నోబుల్ ప్రైజ్ 'అందుకున్న మొదటి ఆసియా ఖంఢమునకు చెందిన శాస్త్రవేత్త కావటం విశేషం.




రామన్ తన 82 సంవత్సరాల వయస్సులో1970 నవంబర్ 21 వ తేదీన తన స్వగృహంలో మరణించాడు.


ప్రతిభాశాలి, మేధావి అయిన సర్. సి. వి. రామన్ చేసిన పరిశోధనలు భౌతిక శాస్త్రంలో గొప్ప గొప్ప ఆవిష్కరణలు జరగటానికి దోహదపడినటువంటి ప్రయోగాలు నేడు మానవాళికి ఎంతో ఉపయోగకరం.


టీచర్ :చూశారా!పిల్లలూ!సర్ సి. వి. రామన్ తన చదువునూ, ప్రయోగాలనూ భారతదేశంలోనే చేసి ప్రతిష్టాత్మకమైన నోబుల్ ప్రైజ్ తెచ్చుకొన్నాడు. గొప్ప గొప్ప చదువులు విదేశాలలోనే ఉంటాయన్నది భ్రమ మాత్రమే. ఆ విషయం తెలిసికొని మీరు చదువుపై శ్రద్ధ పెట్టి ఉన్నత పదవులనలంకరించాలి. "


పిల్లలు :అలాగే టీచర్!


సమాప్తం.


Rate this content
Log in

Similar telugu story from Inspirational