Gayatri Tokachichu

Classics

3  

Gayatri Tokachichu

Classics

సృష్టికర్త

సృష్టికర్త

1 min
216


సృష్టికర్త(లఘు వ్యాసము ).


పూర్వం భరద్వాజమహర్షి కైలాసశిఖరానికి వెళ్ళాడు. అక్కడ మహాతేజోసంపన్నుడైన భృగుమహర్షి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆ మహర్షిని సమీపించి భరద్వాజుడు దండప్రణామములాచరించి ఇలా ప్రశ్నించాడు.

"మహాత్మా!సముద్రాలు, కొండలు, మేఘాలు, భూమి, అగ్ని, వాయువులతో కూడిన ఈ లోకాన్ని నిర్మించిందెవరు? "

ఆ ప్రశ్న విని భృగుమహర్షి ఈ లోకం యొక్క సృష్టికర్త గురించి ఇలా వివరించాడు.

"విశ్వమూర్తి, సనాతనుడు, అవ్యక్తుడు, కూటస్థుడు, అక్షరుడు, నిర్లేపుడు, వ్యాపకుడు అయిన శ్రీమన్నారాయణుడు ఇంద్రియాతీతుడు. ఈ విశ్వానికంతటికీ ప్రభువు. ఆయన సృష్టి చేయగోరి తన సహస్రాంశము నుండి ఒక పురుషుడిని పుట్టించాడు. ఆ పురుషుడికి 'మానసపురుషుడు 'అని పేరు. ఆ మానసపురుషుడు ఆద్యంతరహితుడు,అభేద్యుడు, అజరామరుడు. ఆ పరమాత్మ నుండియే ప్రాణులు ఉద్భవించి నశిస్తూ ఉంటాయి. ఆ భగవంతుడు మొదటగా మహత్తత్త్వము నుండి అహంకారాన్ని సృష్టించాడు. అహంకారం నుండి ఆకాశం, అకాశం నుండి నీరు, నీటినుండి నిప్పు, గాలి ఏర్పడ్డాయి. నిప్పు గాలుల కలయిక ద్వారా భూమి ఏర్పడింది. మానసపురుషుడైన పరమాత్మ ఒక దివ్యమైన పద్మాన్ని సృష్టించాడు. ఆ పద్మం నుండి వేదనిధి అయిన బ్రహ్మ జన్మించాడు. ఆ బ్రహ్మ శ్రీమన్నారాయణుడి ఆజ్ఞానుసారం పంచభూతాత్మకమైన సృష్టినుండి సకలజీవరాశిని పుట్టించాడు.


పూజ్యుడైన మహావిష్ణువు మహాతేజస్వి. పర్వతాలు ఆయన ఎముకలు. భూమి ఆయనకు మేదస్సు, మాంసము. సముద్రాలు ఆయన రక్తం. ఆకాశం ఆయన ఉదరం. గాలి ఆయన నిశ్వాసం, అగ్ని ఆయన తేజస్సు. నదులు రక్తనాళాలు. సూర్య చంద్రులు ఆయన కళ్ళు. ఆకాశోపరిభాగం ఆయన శిరస్సు. నేల ఆయన పాదాలు. దిక్కులు భుజాలు. అచింత్యస్వరూపుడైన ఆ పరమాత్మను తెలిసికొనటం సిద్ధపురుషులకు కూడా సాధ్యం కాదు. పూజ్యుడైన విష్ణువు సర్వప్రాణుల యందు ఆత్మరూపంలో ఉన్నవాడు. ఆయనను అనంత, అచ్యుత నామాలతో మహర్షులు కీర్తిస్తూ ఉంటారు."

అని భృగుమహర్షి భరద్వాజునికి ఈ లోకాన్ని ఎవరు సృష్టి చేశారో తెలిపాడు.


Rate this content
Log in

Similar telugu story from Classics