Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

బిడ్డ -గొడ్డు

బిడ్డ -గొడ్డు

6 mins
419



*బిడ్డ - గొడ్డు*


(కథ )



గోదావరి జిల్లాలోని కొత్త పేట మండలకేంద్ర ఆసుపత్రి. ఆ రోజు రోగులు ఎక్కువమంది ఉన్నారు. ఆ ఆసుపత్రిలో ఒక డాక్టరమ్మ,ఒక కాంపౌండరు, ఇద్దరు నర్సులు ఉన్నారు.

అమరవోలు గ్రామం నుండి భార్య వనజతో వచ్చాడు రాఘవ. వనజ నెల తప్పింది. పెళ్లయిన నాలుగేళ్లకు భార్య నెల తప్పటంతో చాలా సంతోషంగా ఉంది రాఘవకు. ఇద్దరూ ఆసుపత్రి బయట బల్ల మీద కూర్చున్నారు. వీళ్ళ వంతు వచ్చాక పిలిచింది నర్సు.

వనజను పరీక్ష చేసింది డాక్టరమ్మ సరోజ. వేవిళ్లతో నీరసంగా ఉంది వనజ.


"ఈ టాబ్లెట్లు వాడండి!రెండో నెలకదా!జాగ్రత్తగా ఉండాలి. పూర్తిగా విశ్రాంతి కావాలి. బరువు పనులు చెయ్యవద్దు!నీళ్ల బిందెలు లాంటివి ఎత్తవద్దు!గర్భం నిలవటానికి ఆరువారాలు వారానికొక ఇంజక్షన్ చేయించుకోవాలి!మూడోనెల దాటాక కొంచెం పనులు చేసుకోవచ్చు!"అంటూ జాగ్రత్తలు చెప్పి మందులు వ్రాసి ఇచ్చి, వనజకు ఇంజక్షన్ చేసింది డాక్టరమ్మ.

మందులు తీసికొని ఆటోలో ఊరికి వచ్చారు రాఘవ, వనజలు.

రాఘవకు ఊర్లో మూడెకరాల పొలం, రెండు ఆవులు, రెండు ఎద్దులు, బర్రెలు నాలుగు ఉన్నాయి. తల్లి మంగమ్మ. చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. మంగమ్మ ఆవులను, బర్రెలను పెట్టుకొని పాలు పాలకేంద్రానికి పోస్తూ, ఉన్న ఎకరా పొలంలో కూరగాయలు పండించి గొడ్డులా కష్టపడి బిడ్డను పెంచిపెద్ద చేసింది. రాఘవను బి. కామ్. దాకా చదివించింది.చదువయ్యాక వ్యవసాయం, పశువుల పోషణలో శిక్షణ తీసికొన్నాడు రాఘవ. నూతనమైన సాగు పద్ధతుల్లో వ్యవసాయం చేసి ఎకరా పొలాన్ని మూడెకరాలు చేశాడు.

తన అన్నకూతురు వనజను కోడలిగా తెచ్చుకొంది మంగమ్మ.


డాక్టరమ్మ చెప్పిన జాగ్రత్తలు తల్లితో చెప్పి పొలానికి వెళ్ళాడు రాఘవ.

రాఘవకున్న రెండావుల్లో చిన్నావు ఈత కొచ్చింది.

కోడలికి చిన్నమెత్తుపని చెప్పకుండా అంతా తానే చూసుకొంటోంది మంగమ్మ. ఏదన్నా పని చేద్దామని వనజ వస్తే "మూడో నెల దాటనీవే!జాగ్రత్తగా ఉండాలి కదా!"అనేది. వనజకు మూడో నెల వచ్చింది.నీరసం కాస్త తగ్గింది. కోడలి నోటికి సహించే పదార్థాలు చేసిపెడుతోంది మంగమ్మ.


నాలుగురోజులుగా వాన దంచికొడుతోంది. నాలుగోరోజు రాత్రి ఉరుములు, మెరుపులతో భారీ వర్షం. పశువుల కొష్టం పడిపోతుందేమోనని భయం వేసింది మంగమ్మకు.


"ఈ వానకు కొష్టం పడిపొతే గొడ్లకు దెబ్బ. వెళ్లి కట్లు విప్పు!రేపు మళ్ళీ వస్తాయిలే!"అంది కొడుకుతో.


రాఘవ వెళ్లి పశువుల కట్లు విప్పాడు.

కొష్టం బయటికి వెళ్లాయి పశువులు.

వానో, వరదో వస్తే పశువులను వదిలివేస్తారు పల్లెటూర్లలో. వాన తగ్గాక ఇల్లు చేరాతాయి పశువులు.

రాఘవ ఏడాది క్రితమే ఇంటికి శ్లాబువేశాడు. అంతకు ముందు పెంకుటిల్లు. గుడిసె స్థాయి నుండి మేడ కట్టిన ఆసామి రాఘవ. కొష్టం మాత్రం పాకలాగానే ఉంది. దానిమీద రేకులన్నా వేద్దామనుకున్నాడు కానీ ఇంటికే తను అనుకున్నదానికంటే ఖర్చు ఎక్కువ అయ్యింది.

'ఈ వానకు కొష్టం కూలుతుందేమో 'అనుకున్నాడు రాఘవ.


రెండోరోజు పొద్దున్నకి వాన తగ్గింది. ఒక్క చిన్నావు తప్పమిగిలిన పశువులు ఇంటికి వచ్చాయి.

"ఈతకొచ్చిన గొడ్డు ఇంకా రాలేదేమిటో!"అంటూ కంగారు పడుతోంది మంగమ్మ.


"నే చూసొస్తాలే!"అంటూ తుండుగుడ్డ తలకు చుట్టుకొని బయలుదేరాడు రాఘవ. ఒక గంట అయినా రాఘవ రాలేదు.


"చిన్నావు ఎక్కడుందో?బావ ఎక్కడ వెదుకుతున్నాడో నేనుకూడా చూసొస్తా అత్తా!"అంటూ కదిలింది వనజ.


"జాగ్రత్త!ఉట్టిమనిషివి కాదు!జారి పడకుండా నెమ్మదిగా నడువు!"


అత్త మాటలకు తాలూపి ఇల్లు దాటింది వనజ.

ఇంటికి వెనకాల కొంచెం దూరంలో కాలువ ఉంది. వాన ఉధృతికి కాలువ నిండుగా ప్రవహిస్తోంది. అటు చూసింది వనజ.

కాలువ నీళ్లలో రాఘవ కనిపించాడు.


"ఏమైంది?"అనుకుంటూ వడివడిగా అటువైపు నడిచింది వనజ.


చిన్నావు కాలువలో పడి ఉంది. కాలువలో ఆవు కొట్టుకొని పోకుండా ఆవును పట్టుకొని ఒడ్డుకు లాగుతున్నాడు రాఘవ.


అక్కడ ఎవ్వరూ లేరు.చుట్టుప్రక్కల ఇళ్ళు తక్కువ. కాలువ దగ్గరికి వచ్చింది వనజ.

నీళ్లలోకి దిగింది. నీటి ప్రవాహం చాలా వేగంగా ఉంది.


"బావా!నువ్వు ఒడ్డుకు చేరి దీని కొమ్ములు పట్టుకొని లాగు!నేను వెనుక నుంచి తోస్తాను."అంటూ ఆవు వెనక భాగానికి వచ్చింది.


గంటనుండి కాలువలో పడి కొట్టుకుపోతున్న ఆవును అతికష్టం మీద ఒడ్డు దాకా లాక్కొచ్చాడు రాఘవ. ఒడ్డు మీదకెక్కించటం తన ఒక్కడివల్లా కావటం లేదు. ఏ కొంచెం పట్టు తప్పినా ఆవు కాలువలో నీటి ప్రవాహనికి కొట్టుకుపోతుంది.

ఒక వైపు కాళ్ళతో ఈతకొడుతూ రెండు చేతులతో తన శక్తి నంతా ఉపయోగించి ఆవును బలంగా ముందుకు నెడుతోంది వనజ.పావుగంట శ్రమ తర్వాత ఆవు రెండు కాళ్ళు ఒడ్డు మీద పెట్టింది. ఒడ్డుకు వచ్చి దాని రెండు కొమ్ములను పట్టుకొని బలంగా లాగుతున్నాడు రాఘవ. ఇంకో పది నిమిషాలు ఇద్దరూ తమ శక్తినంతా ఉపయోగిస్తే ఆవు ఒడ్డుమీదకొచ్చింది.


"దీనమ్మ!ప్రాణం తోడేసింది."అన్నాడు వగురుస్తూ రాఘవ.


భార్యను కాలువలోంచి బయటకు లాగాడు.

ఇద్దరూ చిన్నావును తోలుకొని ఇంటికి వచ్చారు.


ఒంటి మీదున్న బట్టలన్నీ తడిసి ముద్దయ్యాయి. కడుపులోంచి చలి పుడుతోంది వనజకు.గజగజా వణికి పోతూ ఉంది.

వీళ్ళను చూస్తూనే "ఏమైందిరా?"అంది మంగమ్మ.


"కాలువలో పడిందత్తా!ఇద్దరం దీన్ని బయటికి లాగే సరికి ఇంతసేపయ్యింది."అంది వనజ.


కళ్ళు పెద్దవి చేసుకొని "నువ్వు కాలువలో దూకావా?"అంటూ మంగమ్మ అరిచింది.


అప్పటికి కానీ వనజకు అర్థం కాలేదు. దిమ్మ తిరిగినట్లు చూశాడు రాఘవ.


'అంత బలమైన గొడ్డును నీళ్లలో ఈత కొడుతూ లాగితే కడుపులో బిడ్డకేమవుతుందో?"

ఊహించటానికి కూడా భయం వేసిందతడికి.బట్టలు మార్చుకొని 

భార్య దగ్గరికి వచ్చాడు. రగ్గు కప్పుకొని పడుకొని ఉంది వనజ.

వనజ పొట్టమీద చెయ్యి వేశాడు.


"ఏమన్నా అవుతుందా బావా!"అంది వనజ పాలిపోయిన మొహంతో.


"ఏమీ కాదు. అయినా రేపు ఆసుపత్రికి పోదాము!"అంటూ భార్యను గుండెల్లోకి తీసికొని ఆమె తలనిమురుతూ ఉన్నాడు రాఘవ.

అతడి గుండెలో గువ్వలా ముడుచుకొంది వనజ.


రాత్రి రెండింటికి చిన్నావు "అంబా!అంబా!"అంటూ అరవటం మొదలుపెట్టింది. దాని అరుపుకు ముగ్గురూ లేచి కూర్చున్నారు. కరెంటు లేదు. లాంతరు తీసికొని కొష్టం దగ్గరికి వెళ్ళాడు రాఘవ. ఆవు నొప్పులు పడుతోంది.కాసేపట్లో ఈనుతుందనిపించింది మంగమ్మకు.

వనజను మంచం దిగొద్దని చెప్పి రాఘవ పక్కనే కూర్చుంది మంగమ్మ. ఒక గంటసేపటికి చిన్నావుకు పెయ్యదూడ పుట్టింది. దూడను తుడిచి ఆవుకు కాస్త గడ్డి పెట్టి లోపలికి వచ్చాడు రాఘవ.


వనజకు కొద్దిగా కడుపులో నొప్పి మొదలైంది. నిస్త్రాణంగా ఉన్న భార్యను చూస్తే దిగులు పుట్టింది రాఘవకు.

వేడి నెయ్యి పూసి తమలపాకులను వనజ పొట్టమీద కాపడం పెడుతూ వేయిదేవుళ్ళకు మొక్కుకుంటూ ఉంది మంగమ్మ.

తెల్లవారేసరికి వనజకు కడుపులో నొప్పి ఎక్కువ అయ్యింది. ఆటోలో నాలుగు

కిలోమీటర్లు ఉన్న ఆసుపత్రికి తీసికొని వచ్చాడు రాఘవ. అప్పటికి డాక్టరమ్మ రాలేదు నర్సు చూసి వనజకు ఇంజక్షన్ ఇచ్చింది. కాసేపటికి డాక్టరమ్మ వచ్చింది.

వనజను పరీక్ష చేసి పెదవి విరిచింది.


"గర్భం నిలిచేట్లు లేదు. ఈ రోజు ఇక్కడే వుంచు!"అంటూ ఇంకో ఇంజక్షన్ చేసింది. సాయంత్రానికి వనజకు గర్భం పోయింది.

"మూడో నెల దాకా అస్సలు శ్రమ ఏమీ చెయ్యకూడదు. గర్భసంచి కొంచెం బలహీనంగా ఉంది. మందులు ఇస్తాను. ఈసారి జాగ్రత్తలు తీసికొందాము!"


రాత్రికి భార్యాభర్తలిద్దరు ఇంటికి వచ్చారు. ఆకాశం నిర్మలంగా ఉంది.

రాఘవ మనసులో ముసురు పట్టింది.కొష్టంలో చిన్నావు పెయ్యదూడను నాకుతూ ఉంది. పశువులకు గడ్డి వేసి ఇంట్లోకి వచ్చాడు.

నీరసంగా పడుకొని ఉన్న భార్యను చూస్తే బాధ వేసింది రాఘవకు.

వనజ కళ్ళలోంచి నీళ్లు కారుతున్నాయి.

'గొడ్డు కోసం బిడ్డను పోగొట్టుకొంది తను. ఎవరినైనా పిలుచుకొని రావచ్చు కదా!నీటి ప్రవాహానికి చిన్నావు కొట్టుకు పోతుందేమో అనుకుంది కానీ.....'


భార్య కన్నీరు తుడిచాడు రాఘవ.


"మన కేమైనా వయసయిపోయిందా?చెప్పు!అట్లా దిగులు పడితే ఎట్లా!ఈసారి జాగ్రత్తగా ఉందాము. లే!లేచి కాస్త అన్నం తిందువుగానీ రా!"అంటూ భార్యను లేపాడు.

ఆ రాత్రి ముగ్గురూ నిద్రపోలేదు.

రెండో రోజు 

పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు పరామర్శ చెయ్యటానికి వచ్చారు. జరిగినదాని కంటే అందరూ తలోమాట అనటం బాధగా ఉంది రాఘవకు.


"గొడ్డు కోసం బిడ్డను పోగొట్టుకుంటార్రా!తెలివితక్కువ దద్దమ్మలు కాకపొతే!ఇప్పుడసలే ఎవరికీ పిల్లలు అంత తొందరగా పుట్టడం లేదు."అన్నాడు నరసింహం.


నరసింహం రాఘవకు దూరపు బంధువు. తండ్రి లేని రాఘవ సమర్ధుడయ్యి మేడ కట్టుకొని స్థితిమంతుడయ్యాడని ఈర్ష్య. నరసింహం కుళ్ళు బుద్ది రాఘవకు తెలియంది కాదు.


"రాక రాక పిల్లదానికి కడుపు రావటం, పోవటం కూడా అయిపోయింది.అసలు పిల్లలు పుట్టే రాత వుందో లేదో మనవాడికి!"అన్నాడు ఎకసెక్కెంగా.


"పిల్లలు పుట్టకపొతే గొడ్లనే నా బిడ్డలనుకుంటా మామా!"అన్నాడు రాఘవ ఉక్రోషంగా.


వనజ మాత్రం అంతతొందరగా మామూలు మనిషవలేకపోయింది. నీరసం తగ్గగానే పశువులకు పచ్చగడ్డి కోసుకొందామని పొలానికి వచ్చింది.

రాఘవ పొలానికి కొంచెం దూరంలో పెద్ద వేపమాను ఉంది. పొలాల్లో పనిచేసే ఆడవాళ్లు ఆ చెట్టుకు చీరలతో ఉయ్యాలలు కట్టి వాళ్ళ బిడ్డలను వాటిల్లో పడుకోబెడతారు.

చెట్టుకింద కూర్చుని బిడ్డలకు పాలిస్తూ ఉంటారు. వేపమానును చూడంగానే దుఃఖం పొంగుకు వచ్చింది వనజకు. కొడవలి చేత్తో పట్టుకొని శూన్యంలోకి చూస్తున్న భార్యను చూసి చేస్తున్న పని ఆపి దగ్గరికి వచ్చాడు రాఘవ.


"నువ్వు దిగులు పడితే మనకు పిల్లలు పుడతారా? చెప్పు!అయిందేదో అయ్యింది. ఇందులో నా తప్పు మాత్రం లేదా? ఇంకెవరినైనా పిల్చుకురమ్మని చెప్పాల్సింది. నువ్వు కాలువలో దిగుతుంటే డాక్టరమ్మ చెప్పిన జాగ్రత్తలు గుర్తుకు రాలేదు. అంతా మన దురదృష్టం. మనసు సర్దుకొని నువ్వు కళకళలాడుతూ ఉంటే నాకు బాగుంటుంది. నీ నవ్వు లేకపొతే ఉండలేనే!కాస్త తీరిక చూసుకొని అన్నవరం వెళ్ళొద్దాము!సత్తెన్న దగ్గర వ్రతం చేసుకొని వద్దాము!ఆ స్వామి మన మీద దయ చూపిస్తాడే!"


భర్త మాటలకు బదులు చెప్పలేదు వనజ. మౌనంగా గడ్డి కోసుకోసాగింది.


పై నెలలో అన్నవరం వెళ్లి వ్రతం చేసుకొన్నాడు రాఘవ.


"స్వామీ!నా ఇల్లు నిలబెట్టు!ఒక్క నలుసునివ్వరాదా!బిడ్డ నెత్తుకొని వచ్చి మళ్ళీనీ దగ్గర వ్రతం చేసుకుంటా !"అంటూ పదేపదే వేడుకున్నాడు.


ఆ ఏడాది రాఘవ పశువుల కొష్టానికి గట్టివి సిమెంట్ రేకులు వేయించాడు.

'వానొచ్చినా, వరదొచ్చినా గొడ్లకేం ఫర్వాలేదు 'అనుకున్నాడు తనలో తాను.


రెండేళ్లు గడిచాయి. మళ్ళీ ఇంకో ఆవును కొన్నాడు రాఘవ. కొత్తావుకు కోడెదూడ పుట్టింది.


డాక్టరమ్మ ఇచ్చిన మందుల ప్రభావమో,దేవుడు కరుణించాడో గానీ వనజ మళ్ళీ నెల తప్పింది. మంగమ్మ వనజను కాలు కింద పెట్టనివ్వటం లేదు. ఎప్పటి కప్పుడు డాక్టరమ్మకు చూపించుకొంటూ జాగ్రత్తగా ఉంటోంది వనజ. వానాకాలం అవటంతో ఎండుగడ్డి తెచ్చి కొష్టంలో వేశాడు రాఘవ.

అప్పటికి వనజకు తొమ్మిదోనెల నిండబోతోంది. ఈ వారం దాటితే ఎప్పుడన్నా కాన్పు కావచ్చంది డాక్టరమ్మ. వనజ తల్లి, తండ్రి, తమ్ముడు వచ్చి ఉన్నారు. వనజ పుట్టిల్లు మండలకేంద్రానికి చాలా దూరం. ఆసుపత్రికి రావటం కష్టం. రోడ్డు ఎప్పుడూ సరిగ్గా ఉండదు. గతుకులు, గుంటలు ఎక్కువ. కడుపుతో ఉన్నపిల్లతో అక్కడి నుండి ప్రయాణం కష్టమని వనజని పుట్టింటికి పంపించకుండా తన దగ్గరే ఉంచేశాడు రాఘవ. అందుకని అత్తామామా, బావమరిది అల్లుడి ఇంట్లో ఉన్నారు.


రాత్రంతా వాన పడుతూనే ఉంది. తెల్ల వారికి వాన కాస్త తగ్గింది. వనజకు నొప్పులు మొదలయ్యాయి. నాలుగు కిలోమీటర్లు ఉండే మండల కేంద్రానికి వెళ్లాలంటే మధ్యలో వానకు రోడ్డు కోసుకుపోయింది. ఆటో నడిపే సూర్యం రాఘవకు బంధువు.ఇంట్లోనే ఉన్నాడు. తన ఎద్దుల బండిని తయారుచేశాడు రాఘవ.


"బండి మాత్రం ఎట్లా పోతుందిరా!"రోడ్డు కోసుకుపోయింది కదా!"అన్నాడు సూర్యం.


"మోసుకొని వెళదాంలే!"అంటూ బండిలో నులక మంచమొకటి పెట్టాడు రాఘవ.

రాఘవకు తోడుగా ఓ పదిమంది బయలుదేరారు. వనజను, అత్తను,మామను ఆటోలో కూర్చోబెట్టి తల్లితో, బంధువులతో వెనకాల బండిని తోలుకుంటూ వచ్చాడు రాఘవ. సగం దూరం ఆటోలో ప్రయాణం.

రోడ్డు కోసుకొని పోయిన చోట నులక మంచం మీద వనజను పడుకోబెట్టి మోసుకెళ్లారు.

పల్లపు చోట గుంత పడింది.మెల్లగా ఎద్దులను గుంతలోకి ఒడుపుగా దించాడు. ముందు నడుస్తూ బండిని పల్లం లోనుంచి తోలుకొచ్చాడు.మొత్తానికి ఎద్దులతో సహా బండి మెరక మీద కొచ్చింది.

మళ్ళీ వనజను బండిలో కూర్చోబెట్టి కొంతదూరం పోయాక కాలువ అడ్డం వచ్చింది.

రాఘవ కాలువలోకి దూకి లోతు చూశాడు. ఫర్వాలేదు. బండికి సగం దాకా మాత్రం నీళ్ళొస్తాయి. ధైర్యం చేసి బండిని దింపాడు. ఎద్దుల ప్రక్కన వనజ తండ్రి గోవిందయ్య ఈత కొడుతూ వస్తున్నాడు. బండిలో ఆడవాళ్లను మాత్రం కూర్చోబెట్టి అందరూ ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు చేరారు. ఎద్దులను చాకచక్యంగా నడుపుతూ ఒడ్డుకు చేర్చాడు రాఘవ.

మొత్తానికి అందరి సహకారంతో వనజ క్షేమంగా ఆసుపత్రికి చేరింది.


డాక్టరమ్మలేదు. ఆమె ఇంటికి పరిగెత్తాడు వనజ తమ్ముడు శీను.


అప్పటికే నర్సు ఇంజక్షన్ ఇచ్చి వనజకు సెలైను పెట్టింది.


ఒక అరగంటకు డాక్టరమ్మ వచ్చింది. ఆ అరగంట నరకం చూశాడు రాఘవ.

డాక్టరమ్మ వనజను చూసి అంతా బాగానే ఉందని, సుఖ ప్రసవం అవుతుందని చెప్పటంతో అందరూ వూపిరి పీల్చుకున్నారు.


మధ్యాహ్నటికి వనజకు కాన్పు చేసింది డాక్టరమ్మ.


"ఆడపిల్ల. తల్లీ, బిడ్డ క్షేమం "అంది నర్సు బయటికి వచ్చి.


"హమ్మయ్య!"అనుకున్నాడు రాఘవ. అతడి మనసు ఆనందంతో పొంగిపోయింది.


"ఇంతా కష్టపడితే ఆడపిల్ల పుట్టిందీ!ఏందోలేరా నీ జాతకం!అన్నాడు నరసింహం.

నరసింహంకు ముగ్గురూ మగపిల్లలే.


"ఆడపిల్ల అయితే ఏంది మావా!ఈ రోజుల్లో ఎవరైనా ఒకటే!మగపిల్లలేమన్న ఎత్తి పోస్తారా?"అన్నాడు సూర్యం.


"ఆడపిల్లయితే మనకేం ఒరగబెడుతుంది? పెంచి, పెద్దచేసి పంపించాల్సిందే కదా!మన చేత ఖర్చు పెట్టిస్తది. కట్నం, కానుకా అంటూ..."

నరసింహం మాట ఇంకా పూర్తికాలేదు 


 "ఖర్చు ఖర్చు అంటావేం!ఆడపిల్ల లేకుండా నీకు జరుగుతుందా!నాకు జరుగుతుందా?నీ నోటికి ముద్ద రావాలంటే అత్త పెట్టాల్సిందే!నీ ముగ్గురు మగరాయుళ్లను ఆడపిల్ల లేకుండా పిల్లల్ని కనమను!కంటారేమో!"

ఛర్రున లేచాడు రాఘవ.


"పిల్ల పుట్టిన వేళ శుభమా అంటూ మంచి మాటలు మాట్లాడక వూరికే గొడవ. నువ్వు ఊరుకోరా!ఏదో మామ నిన్ను ఒక మాట అనకూడదా? నువ్వు పడకూడదా?"సర్ది చెప్పింది మంగమ్మ.


"మహాలక్ష్మి పుట్టిందని అనొచ్చుగా!"అంటూ తుండుగుడ్డ విసురుగా దులిపి భుజం మీద వేసుకొన్నాడు రాఘవ.


ఆరోజు సాయంత్రం అందరూ వనజని తీసికొని ఊరికి బయలుదేరారు.కాలువ దగ్గర నీటి ప్రవాహం కాస్త తగ్గింది. బండిని లాగుతున్నాయి ఎద్దులు.ఇప్పుడు అదనంగా ఒక చిన్నారి కూడా ఉంది బండిలో.

అందరూ ఇంటికి వచ్చారు.


ఆ రాత్రి లాంతరు వెలుగులో చిన్నపాపని చేతుల్లోకి తీసికొని "బంగారు తల్లి చందమామ లాగా ఉంది "అంటూ పాపను గుండెకు హత్తుకున్నాడు రాఘవ. మెరిసే కళ్ళతో నవ్వుతూ రాఘవను చూసింది బాలింతరాలు వనజ.

కొష్టంలో కొత్తావు దూడను నాకుతూ ఉంది. ఇంటా, బయటా, ఇంట్లో అందరి హృదయాల్లో వెన్నెల నిండిపోయింది.


సమాప్తం.




Rate this content
Log in

Similar telugu story from Classics