Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

లేతమొక్క

లేతమొక్క

7 mins
56


తెలంగాణా మహిళా కథల పోటీలో పదవ బహుమతి వచ్చిన కథ.

స్వీయ రచన.

రచన :టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.


*లేతమొక్క*(కథ )


"ఏమేవ్!ఎక్కడ చచ్చావ్!" గావుకేక పెట్టాడు శ్రీనివాస్.


పరిగెత్తుకొని వచ్చింది సుజాత.


"నీ కెన్నిసార్లు చెప్పాను? నా షర్టుకు మ్యాచ్ అయ్యే టై తీసిపెట్టమని!తొందరగా బ్లూ కలర్ టై ఇచ్చి చావు!"


శ్రీనివాసుకు బ్లూ కలర్ టై క్షణంలో తెచ్చిపెట్టింది సుజాత.


నిద్రలేచింది మొదలు ఆఫీసుకు వెళ్ళేలోపు అరడజను సార్లయినా భార్యను తిట్టాల్సిందే.

అతడు కారు తీసికొని ఆఫీసుకు వెళ్ళంగానే 'హమ్మయ్య!'అనుకుంటూ ఊపిరి పీల్చుకొంది సుజాత.

సుజాతకు పెళ్లయి పదిహేనేళ్లయ్యింది. అత్తగారు, మామగారు ఉండేవారు.

మామగారు ఎప్పుడూ అత్తగారిని తిడుతూ ఉండేవారు.


"ఏమే!ఒసే!దరిద్రపు మొహమా!"అంటూ అత్తగారిని పిలవటం మొదట్లో చాలా వింతగా ఉండేది సుజాతకు. పుట్టింట్లో ఇలా ఎవ్వరూ ఉండరు. ఆమె తల్లి, తండ్రుల మధ్య అనురాగ బంధం చాలా పటిష్ఠంగా ఉండేది. చిన్నాన్నలు, పెద్దనాన్నలు కూడా తమ తమ భార్యలతో ఎంతో ప్రేమగా ఉండేవారు. అత్తగారింట్లో అందుకు విరుద్ధం. అక్కడ ఆడవాళ్ళను కించపరుస్తూ ఉండే మామగారిని చూస్తే కంపరంగా ఉండేది సుజాతకు.

 అత్తగారు చాలా మెతకమనిషి. అగ్గగ్గలాడుతూ, భయం, భయంగా పనులు చేస్తూ ఉండేది.

ఇక శ్రీనివాసు తండ్రిని ఎంతో గౌరవించేవాడు. తండ్రితో ఎంతో వినయంగా, విధేయతతో మసలుకొనే వాడు. తామిద్దరూ ఎక్కడికన్నా వెళ్ళాలన్నా తండ్రి అనుమతి కావాల్సిందే!

భార్యకు ఏమన్నా కొనాలన్నా తండ్రికి చెప్పాల్సిందే!

భార్యతో మాత్రం చాలా రిజర్వుడుగా ఉండేవాడు శ్రీనివాస్.

భార్యకు కాస్తకూడా చనువుఇచ్చే వాడుకాదు.


"ఒరేయ్!శ్రీనూ!భార్యను అదుపాజ్ఞల్లో పెట్టుకోవాలి!దద్దమ్మలాగా పెళ్ళాం మాటవిని పడి ఉండకు!మగ పుట్టుక పుట్టాక కాస్త దక్షత అన్నది నేర్చుకోవాలి. ఆడంగిరేకుల వెధవలాగా ఆడవాళ్ళతో అన్నీ వాగుతూ కూర్చోకు!"అంటూ మామగారు అరిచి అరిచి కొడుక్కు చెప్తుంటే సిగ్గుతో పాటు ఏడుపు వచ్చేది సుజాతకు.


పుట్టింటికి వెళ్లి తల్లితో చెప్పుకొంది.


"ఆస్తిపాస్తి ఉన్న సంబంధం. ఒక్కడే కొడుకు. అత్తగారు గయ్యాళి గంప అయితే బాధపడాలి కానీ మామగారు ఆవిడమీద అరుస్తూ ఉంటే నువ్వెందుకు బాధపడటం? అల్లుడు కాస్త రిజర్వుడు టైపు అయితే కాస్త నువ్వే సర్దుకుపోవాలి!మన తాహతుకు మించిన సంబంధం. రేపు మీ మామగారు 'హరీ 'అంటే పెత్తనం అంతా నీదే!ప్రతి ఇంట్లోనూ రకరకాల సమస్యలు ఉంటాయి. మనకు నచ్చినట్లే అందరూ ఎలా ఉంటారు? అల్లుడుగారికి ఏ తాగుడో, చీట్లాటో ఉంటే దిగులు పడాలి. అట్లాంటివి లేవుకదా!నీ తర్వాత చెల్లెలి పెళ్లికూడా ఉంది. పెద్దదానివి. కాస్త ఆలోచించు!చిన్న చిన్న సమస్యలని భూతద్ధంలో చూడటం మానుకో!పిల్లలు పుట్టాక మగవాళ్లకు బాధ్యత వస్తుంది. మెల్లగా అతడికి సర్దిచెప్పుకుందువు గాని!"


తల్లి మాటలకి ఏమనాలో తోచలేదు సుజాతకు.


తల్లి చెప్పింది ఒకటి మాత్రం నిజం. తండ్రి తిరిగి తిరిగి ఈ సంబంధం తెచ్చాడు. జాతకాలు నప్పలేదనో, పిల్ల మరీ పీలగా, పొట్టిగా ఉందనో, కట్నకానుకలు సరిపోలేదనో ఏదో కారణం చేత సంబంధాలు కుదిరేవి కాదు. ఆ సమయంలో ఈ సంబంధం వచ్చింది.

వాళ్లకు పిల్ల నచ్చిందనటంతో తండ్రి కాస్త రిలీఫ్ ఫీలయ్యాడు. కట్నకానుకలు, లాంఛనాల దగ్గర కొంచెం బేరాలు జరిగినా మధ్యవర్తి తెలివితేటలతో మొత్తానికి సంబంధం కుదిరింది.


పెళ్ళిలో ఎప్పుడెప్పుడు ఏమి పెట్టాలో మామగారు కచ్ఛితంగా కాగితం మీద రాసి ఇచ్చాడు. అక్కడ కూడా కొన్ని సర్దుబాట్లు మధ్యవర్తి చేయించాడు. చిన్న చిన్న అలకలతో పెళ్లి తంతు పూర్తయ్యింది.


ఈ వరస చూచి చిన్నాన్న "ఏమిటో!అన్నయ్యా!పెళ్లికొడుకును చూస్తే కొంచెం రిజర్వుడు మనిషనిపిస్తోంది.వియ్యంకుడు పేచీకోరులాగా ఉన్నాడు. నాకెందుకో మన పిల్ల గురించి దిగులేస్తుంది "అన్నాడు.


"ఏమనుకున్నా ఆ మూడుముళ్ళు పడ్డాక మనమేం చేస్తాము!పిల్ల రాత ఎట్లా వుందో? భగవతుడిని నమ్ముకో తల్లీ!అంది మేనత్త.


కొంత భయంతో , కొంత తండ్రికి భారం తగ్గిందనే భావంతో భర్త చేయిపట్టుకొని అత్తగారింటికి వచ్చింది సుజాత.


బాబు, పాప పుట్టారు. నాలుగేళ్ల క్రితం మామగారు పోయారు.

అప్పట్నించి ఆయన ఆవహించాడో ఏమో కానీ శ్రీనివాసు కూర్చుంటే లేస్తే సుజాతను తిట్టడం అలవాటు చేసుకున్నాడు. అచ్చంగా తండ్రిలాగా పిచ్చి పిచ్చి తిట్లు తిట్టడం, అప్పుడప్పుడూ చెయ్యిచేసుకోవటం సుజాతకు నరకంగా ఉంటోంది. దేనికి అరుస్తాడో, దేనికి ప్రేమగా ఉంటాడో అతడికే తెలీదు. సాయంత్రం అవుతుంటే మనసులో భయం మొదలవుతుంది.




అత్తగారు మామగారి ప్రవర్తనకే అలిసిపోయింది, అరిగిపోయింది. ఆవిడ తిండి తినటానికి మాత్రమే హాల్లోకి వస్తుంది. మిగిలిన సమయం అంతా తన గదిలో ఉన్న టి. వి. లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చూస్తూ ఉంటుంది.


అప్పుడప్పుడూ కోడలితో "ఆడవాళ్లు బ్రతుకులంతే!మన జన్మలు మొగుళ్ళ ఆధీనంలో తెల్లవారాల్సిందే!ఏంచేస్తాం!పూర్వజన్మ కర్మ అనుభవించాల్సిందే!"అంటూ కొంచెం అనునయంగా వేదాంతం చెప్తుంది.ఆవిడ నెమ్మదితనం వలన సుజాతకు కొద్దిగా అయినా ఆ యింట్లో శాంతి లభిస్తోంది.



కొడుకు రాజేష్, కూతురు సౌమ్య. తండ్రి తల్లిని అస్తమానం తిడుతూ ఉంటే సౌమ్యకు కష్టంగా ఉండేది. శ్రీనివాసు పిల్లలతో కూడా అంటీ ముట్టనట్లు ఉంటాడు.పిల్లలకు ఎక్కువ చనువు ఇవ్వకూడదని అతని సిద్ధాంతం. కొడుకు రాజేషుకు పదమూడేళ్లు. వాడి కంటే సౌమ్య చిన్నది. సౌమ్య తల్లి వెనకాలే ఉంటుంది కానీ రాజేషుకు మాత్రం తల్లి పట్ల నిరసన భావం పెరుగుతూ వస్తోంది. తండ్రి తల్లిని కొట్టినా తిట్టినా అది సహజమే అనే భావం ఆ చిన్న వయసులోనే వాడిలో మొలకత్తటం ప్రారంభమైంది.


కొడుకు బుద్దిగా చదువుకొంటున్నందుకు సుజాతకు సంతోషంగా ఉంది కానీ వాడు కూడా భవిష్యత్తులో శ్రీనివాసులాగా అవుతాడేమోనని భయం ఆమెను పీడిస్తూ ఉంది.' ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?'


అచ్చంగా మామగారు ఎలా ప్రవర్తించేవాడో శ్రీనివాస్ ధోరణి కూడా అలాగే తయారయ్యింది. రాజేష్ కూడా అలాగే... అచ్చం తండ్రిలా.. తను తిట్లు తింటూ అత్తగారిలాగా... రేప్పొద్దున కోడలు వస్తే తనలాగా.. ఇలాగే సాగిపోతుందా!.. ఆలోచిస్తే భయంకరంగా ఉంది సుజాతకు. స్త్రీని గౌరవించటం రాని భవిష్యత్తరము కళ్ల ముందు కదలాడుతూ ఉంది. దీనిని నివారించలేమా!


ఏదో ఒకటి చెయ్యాలి!


ఆరోజు శ్రీనివాసు ఆఫీసు పనిమీద ఊరెళ్ళాడు. మరో వారం రోజులకు గానీ రాడు. అత్తగారితో చెప్పి తన స్నేహితురాలు దగ్గరికి వెళ్ళింది సుజాత.

పద్మజ భర్త మురళి చాలా సౌమ్యుడు.ఆ దంపతులకు సుజాత పడుతున్న బాధ తెలుసు. కోపధారి మొగుడితో సుజాత పడే బాధలు పద్మజ భర్తకు అప్పుడప్పుడూ చెప్తూ ఉంటుంది.


కుశలప్రశ్నలు అయ్యాక తన బాధ వాళ్ళతో చెప్పుకుంది సుజాత.


"బాబు ఇప్పుడు బాగానే చదువుకొంటున్నాడు. కానీ నేనంటే కొంచెం కూడా లక్ష్యపెట్టడు. రేప్పొద్దున మా అయన లాగా మారతాడనిపిస్తోంది. ఆడవాళ్ళను గౌరవించటం మా ఇంటావంటా లేదు. వాడు కూడా వాడి భార్యను కించపరుస్తూ, హింసిస్తూ మా వంశాచారం కొనసాగిస్తాడనిపిస్తోంది. ఏం చెయ్యాలో తెలియటం లేదు. వాడికిప్పుడు పదమూడేళ్లు. నాతో కొంచెం కూడా ప్రేమగా ఉండడు. ఈ మధ్య నా మీద చాడీలు చెప్పి వాళ్ళ నాన్న చేత తిట్టించడం చేస్తున్నాడు......భరించలేక పోతున్నాను..."


సుజాత కంఠం దుఃఖంతో పూడుకుపోయింది.


మురళి, పద్మజ కదిలిపోయారు.


"ఊరుకోమ్మా!ఈ సమస్యని కొంచెం ఓర్పుగా టాకిల్ చెయ్యాలి. ఆలోచిద్దాము. నువ్వు దిగులు పడితే సమస్యకు పరిష్కారం దొరకదు. మన ప్రయత్నం మనం చేద్దాము. నువ్వు కాస్త పాజిటివుగా ఆలోచించమ్మా!పిల్లవాడిలో మంచి అలవాట్లు, చదువే కాదు ఉన్నతమైన సంస్కారం ఉండటం కూడా ఆవశ్యకం. నాకు తెలిసిన స్నేహితుడు ఉన్నాడు. అతడు సైక్రియాటిస్ట్. అతడు కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాడు. నేను అతడిని కనుక్కుంటాను."అంటూ ఓదార్చాడు మురళి.


"మా ఆయనలో ఉన్న మృగలక్షణాలు పిల్లవాడికి కూడా వస్తాయని నాకు భయంగా ఉంది. నా జీవితం నాశనమయినట్లు ఇంకో తల్లి కన్న బిడ్డ జీవితం వీడిచేతిలో నాశనమవుతుందనే భావన నాకు మనశ్శాంతి లేకుండా చేస్తోంది."అంది సుజాత.


"బాధపడి ప్రయోజనం లేదు సుజాతా!మన ప్రయత్నం మనంచేద్దాం!రేపు డాక్టర్ దగ్గరికి వెళ్దాం!"అనునయించింది పద్మజ.


రెండోరోజు పద్మజ, సుజాత కలిసి మురళి ఫ్రెండ్ డాక్టర్ చంద్రశేఖర్ దగ్గరికి వెళ్లారు. అప్పటికే అక్కడికి మురళి వచ్చి చంద్రశేఖరుతో మాట్లాడుతూ ఉన్నాడు.


సుజాత తన సమస్య అతడికి వివరించింది.


"మీరు చాలా మంచిపని చేశారు మేడం!చాలా మంది పేరెంట్స్ పిల్లలకు ర్యాంకులు ఎలా వస్తున్నాయో అని ఆలోచిస్తారు తప్ప వాళ్ళ క్యారెక్టర్ గురించి ఆలోచించరు. పిల్లవాడు మంచి మనిషిగా తయారవ్వాలి అంటే పెద్దవాళ్ళు కొంచెం శ్రద్ద పెట్టాలి. మొక్కై వంగనిది మానయ్యాక వంగుతుందా? లేత వయసులో పిల్లలు పెద్దవాళ్ళను చూచి నేర్చుకుంటూ ఉంటారు. పిల్లలు సరియైన వ్యక్తిత్వాన్ని బిల్డప్ చేసుకుంటున్నారా లేదా అనే వివేకం ఈ నాటి పేరెంట్సులో లోపించిందనిపిస్తోంది. లేకపొతే ఈ రోజు ప్రీతి, నిర్భయ, దిశల లాంటి అభాగినుల సంఖ్య రోజురోజుకూ పెరగదుకదా!ఆడపిల్లల పట్ల గౌరవభావం పెంపొందించే కార్యక్రమాలు మేము చేస్తూ ఉంటాము. మీ అబ్బాయి గురించి బెంగపడకండి!వాడిలో తప్పకుండా మార్పు వస్తుంది!"


చంద్రశేఖర్ మాటలతో కొంచెం నమ్మకం వచ్చింది సుజాతకు.


"ముందు మనం స్కూల్ ప్రిన్సిపాలుని కలుద్దాము!"అన్నాడు చంద్రశేఖర్.


అందరూ కలిసి రాజేష్ చదివే స్కూలుకు వెళ్లారు.


అప్పాయింటుమెంటు తీసికొని ప్రిన్సిపాల్ రూములో కూర్చున్నారు.


"రాజేష్ చాలా చక్కని స్టూడెంట్. ఎప్పుడూ చదువులో ముందుంటాడు. అతడితో ప్రాబ్లెమ్ ఏమిటి?"అడిగింది ప్రిన్సిపాల్ వసుధ.


టూకీగా సమస్య ఆమెకు వివరించాడు చంద్రశేఖర్.


"మేడం!ఒక్క రాజేష్ అని కాదు. ఈ రోజు సమాజంలో పిల్లలకు తోటివారిపట్ల బాధ్యతగా మెలగటం, ప్రేమగా చూసుకోవటం, లింగ, జాతి, మత, కుల వివక్ష లేకుండా పెరగటం చాలా అవసరం. సమాజంలో డ్రగ్స్ ఒకవైపు రాజ్యమేలుతున్నాయి. వికృతమైన చేష్టలకు , హింసాత్మక ప్రవృత్తికి యువత అలవాటు పడుతోంది. హైస్కూల్ స్థాయి నుండి పిజి స్థాయి దాకా పిల్లల క్యారెక్టర్ గురించి పేరెంట్స్ ఆందోళన పడుతున్నారు. దీనిని అరికట్టడానికి అందరం కలిసి కృషి చెయ్యాలి. ఇది సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత. మీరు అనుమతిస్తే వారానికి రెండు క్లాసులు మగపిల్లలకు వేరుగా, ఆడపిల్లలకు వేరుగా మా వాళ్ళు తీసికొంటారు. వ్యక్తిత్వవికాసం గురించి, మోరల్స్ గురించి పాఠాలు చెప్తారు. దానివల్ల కొంత మార్పు రావచ్చు. రాజేష్ ఒక్కడినే పిల్చి వార్నింగ్ లాగా ఇస్తే ఇంకా మొండిగా తేలిపోతాడు."


వసుధ ఆలోచించింది.


"మీరు చెప్పింది బాగానే ఉంది.మోరల్ క్లాసులు తీసికోవాలి అంటే నేను అడ్జస్ట్ చెయ్యాలి. నేను యాజమాన్యంతో మాట్లాడి చెప్తాను.నేను కూడా రాజేష్ మీద ప్రత్యేక శ్రద్ధ తీసి కొంటాను."అంది వసుధ.


ఆవిడ దగ్గర సెలవు తీసికొని ఎవరిళ్లకు వాళ్ళు వచ్చారు.


రెండు రోజుల తర్వాత వసుధ సుజాతకు ఫోన్ చేసింది. మోరల్ క్లాసులు వారానికి రెండు అడ్జస్ట్ చేస్తానని, అయితే ఏమి చెప్తారో మెటీరియల్ తనకు ఇవ్వాలని, ఆ ప్రకారంగా పిల్లలకు బోధించాలని, ఇతరమైన విషయాలు పిల్లల బుర్రల్లో చొప్పించ కూడదని కండిషన్ పెట్టింది.


ఒప్పుకుంది సుజాత. చంద్రశేఖర్ తన జూనియర్లను స్కూలుకు పంపించటం మొదలు పెట్టాడు. అప్పుడప్పుడు పద్మజ వచ్చి సౌమ్యను, రాజేషును తన ఇంటికి తీసికొని వచ్చేది. వాళ్ళ పిల్లల ప్రవర్తన చూచి రాజేషులో కొద్దికొద్దిగా మార్పు కలగసాగింది. అటువైపు స్కూల్లో వసుధ మేడం రాజేష్ చేత మంచి మంచి ఆర్టికల్స్ వ్రాయించి , డిబేట్లకు పంపించటం మొదలు పెట్టింది.


ఒకసారి రామకృష్ణమఠం వాళ్ళు వివేకానందుడి మీద వ్యాసరచన పోటీలు పెట్టారు. అక్కడ మురళి స్నేహితుడు ప్రకాశరావు మేనేజరుగా ఉన్నాడు. అతను రాజేషుని పిలిచి 'సెలవల్లో సేవా కార్యక్రమాలకు వస్తావా!'అని అడిగాడు.


అంతమంది పిల్లల్లో తనని అంత పెద్దాయన అడగటంతో పొంగిపోయాడు రాజేష్.

ఆ తర్వాత వచ్చిన దసరా సెలవల్లో రాజేష్ రోజూ రెండు గంటలు రామకృష్ణ మఠంలో గడిపాడు.


ఒక ఆరునెలలు గడిచాయి. అందరి కృషిఫలితంగా రాజేషులో చాలా వరకు మార్పు వచ్చింది. కొడుకులో వచ్చిన మార్పుని శ్రీనివాస్ గమనించాడు. అంతకు ముందులా కాకుండా కొడుకు సుజాతతో మాట్లాడటం, ఇంటిపనుల్లో సాయం చెయ్యటం, చెల్లెలికి చదువులో తెలియనివి చెప్పటం అతడికి నచ్చటంలేదు. కొడుకుని తనవైపుకు త్రిప్పుకొని సుజాత అధికారం చలాయించాలనుకొంటోందని అతడిలో కోపం, ఉక్రోషం తన్నుకొని వస్తున్నాయి. మూడురోజులకొకసారి ఏదో ఒక యుద్ధం ఇంట్లో జరుగుతూనే ఉంది. చిన్న వయస్సు అవటం వలన రాజేషుకు తండ్రి ప్రవర్తనకు ఎలా అడ్డు చెప్పాలో తెలియటం లేదు. కానీ సుజాత మాత్రం నిబ్బరంగా ఉంది. భర్త ప్రవర్తన ఆమెనిప్పుడు బాధించటంలేదు. అసలు అతడి గురించి ఆలోచించటం లేదు. కొడుకును, కూతురును చూసుకుంటూ రోజులు గడుపుతోంది.రాజేష్ తండ్రికి ఎంత నచ్చచెప్పాలని చూసినా శ్రీనివాస్ మాత్రం తన ధోరణి మార్చుకునే వాడుకాదు.


విసుగు పుట్టిన రాజేష్

"మనం నాన్నను వదిలి వెళ్దామమ్మా!ఈ హింస ఎన్నేళ్లు పడతావు?"అనేవాడు అప్పుడప్పుడు.


"వద్దులేరా!నాన్నను ఈ వయసులో వదిలి రాను.ఎంతైనా తాళి కట్టిన బంధం అంత సులభంగా వదులుకొనిరాలేను.నా జీవితం ఇంతే!నువ్వూ,చెల్లాయి బాగుంటే చాలు!"అని కొడుకుకు సర్ది చెప్పేది సుజాత.


కాలం గడిచిపోయింది. అత్తగారు చనిపోయింది. సౌమ్య పెళ్లయ్యింది. రాజేష్ తనకు నచ్చిన అమ్మాయి నీలిమను చేసుకుంటానన్నాడు. నీలిమ రాజేష్ ఆఫీసులో పనిచేస్తోంది.


'ససేమిరా' అన్నాడు శ్రీనివాస్.


"చిన్నప్పటి నుండి కోపం తప్ప ప్రేమించటం నీకు తెలుసా నాన్నా!అమ్మని ఎంత హింస పెట్టినా మాకోసం పడిఉంది.అధికారం చలాయించటం మానుకో నాన్నా!ప్రపంచంలో తండ్రులంతా నీలాగే ఉంటే ఉగ్రవాదులు తయారవుతారు.శేఖర్ అంకుల్, మురళి అంకుల్ వాళ్ళు ఎలా ఉంటారో చూడు నాన్నా!వాళ్ళ ఫ్యామిలీల్లో ఉన్న శాంతి మన ఇంట్లో ఉందా? ఎప్పుడూ యుద్ధవాతావరణం. భరించలేకపోతున్నాను నాన్నా!. అమ్మను తీసికొని నేను వెళ్లిపోతాను. ఈ కొంపలో నువ్వొక్కడివే ఉండు!అప్పుడు కానీ నీకు భార్యాపిల్లల విలువ తెలిసి రాదు!"


రాజేష్ మాటలకు కోపంతో గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు శ్రీనివాస్.


రెండోరోజు

"వాడిష్టమొచ్చినట్లు అఘోరించమను!ఇదంతా నీ తెలివితేటలు. నన్ను ఒంటరి వాణ్ని చేసి నామీద పగతీర్చుకొంటున్నావు. వడ్డీతో సహా అనుభవిస్తావు".అంటూ రుసరుసలాడాడు కానీ పెళ్లిమాత్రం తన అంతస్థుకు తగ్గట్లు చెయ్యాలన్నాడు.

మొత్తానికి పెళ్లి జరిగింది.


పూజగదిలోంచి శ్రీనివాస్ గంట వాయిస్తున్నాడు. అంటే అర్థం 

ప్రసాదం త్వరగా తెచ్చిపెట్టమని.


"దరిద్రపుమొహమా!ఎక్కడ చచ్చావు?"అంటూ "స్వామీ వెంకటేశ్వరా!భార్య ఒక మొద్దు. కొడుకు ఒక చవట. వాడు పెళ్ళాం గీచిన గీత దాటకుండా దద్దమ్మలాగా బ్రతుకుతున్నాడు. వీళ్ళ మధ్య నాగతి ఏమిటో నువ్వే కాపాడాలి తండ్రీ!"అని రొప్పుతున్న భర్తను చూచి


"ప్రపంచమంతామారినా ఈయన మాత్రం మారడు."అనుకుంటూ ప్రసాదం గిన్నె తెచ్చిపెట్టింది సుజాత.


రాజేష్ వరండాలో భార్యతో కబుర్లు చెబుతున్నాడు. ఇద్దరిదీ ఒకటే ఆఫీసు కావటంతో ఒకేసారి వెళ్లి సాయంత్రం ఇంటికి వస్తారు.చిలకాగోరింకల్లా ఉన్న కొడుకు కోడలిని చూసుకుంటూ సుజాత కాలం గడుపుతోంది.

సుజాత కోరిక నెరవేరింది. భార్యను, తల్లిని అపురూపంగా చూసుకొంటున్నాడు రాజేష్. అతడిప్పుడు బాధ్యత నెరిగిన మంచి కొడుకుగా,అనురాగం కురిపించే మంచి భర్తగా మాత్రమే కాదు సమాజానికి సేవచేసే సద్గుణవంతుడైన పౌరుడు కూడా.



సమాప్తం.


Rate this content
Log in

Similar telugu story from Classics