Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

కప్పు తేనీరు

కప్పు తేనీరు

6 mins
251


*కప్పు తేనీరు*(కథ )


రెండు నెలలుగా మా ఆయనకు, నాకు మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. మా మామగారు పోయి మూడునెలలు అయ్యింది. అప్పటినుండి మా ఆయన ఒకటే నస. అత్తయ్యను తెచ్చి ఇంట్లో పెట్టుకుందామని. నాకు అత్తయ్యను తెచ్చి నెత్తిన పెట్టుకోవటం ఇష్టంలేదు. వచ్చిన దగ్గర్నుంచి నా మీద ఆవిడ పెత్తనం చేయటం మొదలుపెడితే నేనేం కావాలి? ఈ మానవుడికి అర్థంకాదు.


"అమ్మ ఒక్కతే వుంది ఒక్కతే ఉంది "అంటూ ఒకటే పాట.


మాకు ఇద్దరు ఆడపిల్లలు. సుజన, సుష్మ. స్కూల్ చదువుల్లో ఉన్నారు. మేముండేది మహారాష్ట్రలోని పూణే నగరంలో. మా ఆయన బ్యాంకులో రీజనల్ మేనేజర్.

మా మరిది వాళ్ళు హైదరాబాదులో ఉంటారు.అతడు చార్టెడ్ అకౌంటెంట్. ఇంట్లోనే ప్రాక్టీస్. మా తోడికోడలు దేవిక. సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా చేస్తోంది. వాళ్లకు ఒక బాబు, ఒక పాప. ఆ అమ్మాయికి ఉద్యోగం కాబట్టి మా అయన అత్తయ్యను వాళ్ల దగ్గర పెట్టటానికి ఇష్టపడటం లేదు. అత్తయ్యకు ఒంట్లో బాగాలేకపోతే ఉద్యోగం చేస్తున్న మరదలు చూసుకోలేదని మా ఆయనకు బాధ. అవును!నేను అందరికీ చేసిపెట్టడానికి ఖాళీగా దొరికాను మరి!ఒళ్ళు మండిపోతోంది ఈయన వైఖరికి.


మా మామగారు విజయవాడ దగ్గర నందిగామలో టీచరుగ పనిచేశారు. ఆ ఊర్లో ఆయనకు చాలా మంచి పేరు ఉంది. అక్కడే రెండిళ్ళు కట్టుకున్నారు. తిరిగుతూ తిరుగుతూ హఠాత్తుగా చనిపోయారు. కర్మాంతరాలు అయ్యాక అత్తయ్యను మా వెంట తీసికొద్దామనుకున్నారు మా ఆయన.


"ఇప్పుడే వద్దులేరా!ఇక్కడ అందరూ తెలిసిన వాళ్ళు. నాన్న పోయిన ఇంట్లోనే ఉంటానులే!మరీ నాకు ఒంట్లో బాగలేకపొతే అప్పుడు తీసికెళ్దువుగానీ!"అంది అత్తయ్య.


'నెత్తిన పాలుపోసింది 'అనుకున్నాను.


అదిగో!అప్పటి నుండి మా అయన గొడవ స్టార్ట్!కొన్ని రోజులు గొడవ, కొన్ని రోజులు మౌనయుద్ధం. ఇలా ఉంది మనశ్శాంతి లేకుండా.తను చెప్పినట్లే నేనెందుకు వినాలి? నన్నెందుకు అర్థం చేసుకోడు?


మధ్యాహ్నం నా స్నేహితురాలు మానస ఫోన్ చేసింది.


"ఏమంటున్నాడు మీ రాజేంద్ర భోగి?"అంటూ


"ఏమంటాడు? ఒకటే నస!పెద్ద తలనొప్పి అయిపోయింది. అత్తయ్యను తెచ్చిపెట్టుకుందామని గోల!నా రోజులు బాగాలేవు. ఖర్మ నెత్తిమీదకెక్కి కూర్చునేట్లుగా ఉంది!"


"నువ్వు ఒప్పుకోకు!ఇల్లు ఇరుకయిపోతుంది. పిల్లలకు ఇబ్బంది. నీకు, మీ ఆయనకు ప్రైవసీ ఉండదు. పెద్దవాళ్ళు కొంపలో ఉంటే ప్రతిదానికి ఆరాలు తీస్తూ ఉంటారు.మొన్నా మధ్య మా ఆయన కూడా ఇదే వేషం వేశాడు కానీ నేను గట్టిగా తగవులాడే సరికి ఊరుకున్నాడు."


"ఇల్లు ఇరుకవుతుందంటే మా ఆయన ఇంకో ఇల్లు నాలుగు బెడ్రూములది తీసికొంటానన్నాడు. మాటకు మాట సమాధానం చెప్తుంటే ఏం చెయ్యను? అంతా నా ఖర్మ!"

నిస్పృహగా చెప్పాను.


"ఎదో ఒక ఉపాయం ఆలోచించు..."మానస మాట పూర్తికాలేదు అప్పుడే బెల్లు మ్రోగింది.

ఫోన్ పట్టుకునే తలుపు తీశాను.


మా డ్రైవర్ తుకారామ్."మా అమ్మకు ఒంట్లో బాగలేదు మేమ్ సాబ్!దవాఖానాకు తీసికెళ్లాలి. ఒక వెయ్యిరూపాయలు కావాలి మేమ్ సాబ్!"అన్నాడు హిందీలో.


'వీడొకడు 'అనుకుంటూ "మానసా!మళ్ళీ చేస్తానే!నువ్వు ఫోన్ పెట్టెయ్!" అంటూ వాడికి వెయ్యిరూపాయలు ఇచ్చి నోట్సులో వ్రాసి పెట్టుకున్నాను.


మా పనిమనిషి, డ్రైవర్ నెల మధ్యలో అప్పుడప్పుడు నా దగ్గర అవసరానికి డబ్బులు తీసికొంటూ ఉంటారు.నేను వాళ్లకు ఎంత ఇచ్చింది నోట్సులో వ్రాసిపెట్టుకొని జీతంలో తగ్గించుకుంటూ ఉంటాను.



రాత్రికి మా అయన బ్యాంక్ నుండి వచ్చాడు .నేను ముభావంగా ఉన్నాను. ఆయన కూడా ఏమీ మాట్లాడకుండా ఇంత తిని రూములోకి వెళ్లిపోయాడు. నేను వంటిల్లు సర్దివచ్చేసరికి పుస్తకం చదువుకొంటున్నవాడల్లా చటుక్కున పుస్తకం పక్కన బెట్టి "రేపు బ్యాంకులో పని చాలా ఉంది. త్వరగా వెళ్ళాలి. పొద్దున్నే లేపు!"అంటూ ఇంకో మాటకు ఆస్కారం ఇవ్వకుండా దుప్పటి బిగించాడు.


'అంటే నాతో మాట్లాడ్డం కూడా ఇష్టం లేదన్నమాట...'అనుకుంటూ నేను కూడా ఇటు తిరిగి పడుకున్నాను.


' ఎంతకాలం పంతంగా ఉండగలడు? నా కంటే వాళ్ళ అమ్మ ఎక్కువయింది. పెళ్లయి పదహారేళ్లు. ఇంతగా ఎప్పుడూ మా మధ్య కోపాలు రాలేదు. ఏదో ఒకటి రెండు విషయాలకు అలకలు వచ్చినా వెంటనే సమసిపోయేవి. ఏమిటో... నా ఆలోచనాధోరణి తప్పా? ఆవిడ అక్కడ బాగానే ఉంటుంది కదా!ఈయనకు ఎందుకంత ఆరాటం?...'


ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాను.


రెండోరోజు శ్రావణమంగళవారం. పొద్దున నుండి తుప్పర పడుతోంది. పూణేలో వాన పట్టుకుంటే ఓ పట్టాన వదలదు. నాచుగా పడుతూనే ఉంటుంది. శ్రావణమంగళ వారాలూ, శుక్రవారాలూ సాయంత్రం' గోర్పడి'లో ఉన్న వేంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి,అక్కడున్న ఉన్న ముత్తైదువలకు వాయనాలు ఇచ్చిరావటం నాకు అలవాటు.' గోర్పడి' లో ఎక్కువ మంది తెలుగువాళ్ళు ఉంటారు.నాకు వాళ్ళతో మొదటినుండీ స్నేహం ఉంది.

మా ఆయన నాకోసం కారును ఇంట్లోనే పెట్టివెళ్లాడు. వాన పడుతూనే ఉంది.

మధ్యాహ్నం మా ఆయన ఫోన్ చేశాడు.


"గోర్పడిలో ఫ్లైఓవర్ దగ్గర గోడ కూలిందట. నువ్వు ఈ రోజు గుడికి వెళ్లకు!ట్రాఫిక్

మళ్ళిస్తున్నారు. వచ్చేసరికి లేట్ అవుతుంది. ఇబ్బంది పడతావు. మన సొసైటీలో ఎవరికైనా వాయనాలు ఇచ్చెయ్!"


మా ఆయన కంఠంలో నా పట్ల ఆరాటం ధ్వనిస్తోంది.


'నన్ను ప్రేమించే నా భర్తతో నేను అనవసరంగా గొడవ రేపెట్టుకొంటున్నానా? అత్తయ్య విషయంలో మరీ పంతానికి పోతున్నానా?... ఏమిటో!నా అభిమానం మా ఆయనకు నాకూ మధ్య అరలను తెరలను సృష్టిస్తోందా?..'


ఐదింటికి డ్రైవర్ తుకారామ్ వచ్చాడు.


సొసైటీలో కనీసం పదిఇళ్లకన్నా తిరిగి తిరిగి వాయనాలు ఇవ్వాలంటే మా సొసైటీలో చాలా మంది ఆడవాళ్లు ఉద్యోగాలు చేసేవాళ్ళు. గృహిణులుగా ఉన్న వాళ్ళు తక్కువ. అందులో నాకు తెలిసిన తెలుగు వాళ్ళు లేరు. పూణే వాళ్లకు శ్రావణ మాసం నోములు తెలియవు. శ్రావణమాసం అంతా పరమశివునికి చాలా ముఖ్యంగా పూజలు చేస్తారు.శ్రావణ సోమవారాలు ఉపవాసాలు ఉంటారు. కొంతమంది నెలంతా ఉపవాసం ఉంటారు. ఇక్కడి వాళ్ళు వరలక్ష్మీ వ్రతం చెయ్యటం నేను చూడలేదు.నేను ఏదన్నా గుడికి వెళ్లి వాయనాలు ఇచ్చి వద్దామనుకున్నాను.


"దగ్గర్లో ఏదన్నా గుడి ఉందా?"అడిగాను తుకారాంని.


"మా ఇంటికి దగ్గర్లోనే భవానీ మందిర్ ఉంది "అన్నాడతడు.


నేను బుట్టల్లో వాయనాలు పట్టుకొని కారులో కూర్చున్నాను.

చిన్న చిన్న సందుల్లోంచి కారును తీసికెళ్తున్నాడు తుకారాం . చిన్న చిన్న కిరాణా షాపులు, ఎక్కువగా రేకుల ఇళ్ళు, అక్కడక్కడ పెంకుటిళ్లు. కూలీ నాలీ చేసుకునేవాళ్ళ బస్తీ అది. ఆ ఇరుకు సందుల్లో మా కారు వెళ్ళటం కూడా కష్టం.


మొత్తానికి ఒక చిన్న భవానీ మందిరం దగ్గర కారును ఆపాడు తుకారాం.


"వాయనాలు ఇవ్వటానికి పుచ్చుకోవటానికి ముత్తైదువలు కావాలి!"అన్నాను.


"మా ఆవిడను, పిల్లల్ని, బస్తీలో ఆడవాళ్ళని తీసికొని వస్తాను. మీరు మందిరంలో కూర్చోండి!ఇక్కడ కారు పార్క్ చెయ్యకూడదు. నేను పార్కింగులో కారు పెట్టి వస్తాను "అన్నాడు.


"సరే "అంటూ మందిరంలోకి వెళ్ళాను.


ఇక్కడ మందిరాల్లో పూజారులు ఉండరు. దేవుణ్ణి అందరూ తాకి పూజలు చేస్తారు. దీపపు కుందిలో నెయ్యిపోసి అక్కడే కూర్చొని స్తోత్రపారాయణం చేసుకుంటున్నాను.


కొద్దిసేపటికి ఒక ముప్ఫయేళ్ల ఆవిడ ముగ్గురు ఆడపిల్లలతో వచ్చింది.


"నేను పుష్పని. తుకారామ్ భార్యను "అంటూ పరిచయం చేసుకుంది.


ఇంకా కొంతమంది ఆడవాళ్లుకూడా వెనకాలే వచ్చారు.

నేను అందరికీ బొట్లు పెట్టి వాయనాలు ఇచ్చాను.


"మా ఇల్లు ఇక్కడే మేమ్ సాబ్!మీరు మా ఇంటికి వచ్చి హల్దీ కుంకుమ్ తీసికొని వెళుదురుగానీ!"అంది పుష్ప.


సందేహంగా చూశాను.'వెళ్ళనా!వద్దా! పోనీ వెళ్తేనో!'ఆలోచిస్తున్నాను.



పుష్ప కాస్త నల్లగా ఉన్నా కళగల మొహం. స్వచ్ఛమైన నవ్వు. అమ్మవారి సన్నిధిలో అక్కడ వాళ్లకు వాయనాలు ఇచ్చాను. నేను కూడా పసుపు కుంకుమ పెట్టించుకుంటే మంచిది కదా!


"సరే పద!"అన్నాను. పుష్ప మొహం వెలిగిపోయింది.


మందిరానికి కొద్దిదూరంలో రేకుల ఇల్లు. ముందు చిన్న వరండా. వరండాకి మెష్ ఉంది. అది ఇల్లు అనటానికి లేదు. ఒకటే చిన్నగది. మా వంటిల్లు కంటే రెట్టింపు ఉంది. వరండాలో ఇద్దరు ముసలివాళ్ళు ఉన్నారు. తుకారామ్ తల్లితండ్రులు కాబోలు. ముసలాయన చాప మీద కూర్చుని ప్రక్కనే ఉన్న చెత్త బస్తాలోంచి ప్లాస్టిక్ కవర్లు ఏరి విడివిడిగా పెడుతున్నాడు. ముసలావిడ అక్కడే నిస్త్రాణంగా కూర్చుని ఉంది. నన్ను చూడంగానే నమస్కారం పెట్టారు వాళ్ళు.

లోపల ఒకటే మంచం. మంచం క్రింద సామాను. ఆ ప్రక్కన బల్లమీద గ్యాస్ స్టవ్. ఆ పైన

అల్మరాలో సామాను.


'అంత చిన్న గదిలో ముగ్గురు పిల్లలతో అంతమంది ఎలా ఉంటారు?' మనసులో అనుకున్నాను.


"మీకు చాయ్ ఇస్తాను!"అంది పుష్ప.


"వద్దు!వద్దు!"అన్నాను మొహమాటంగా.


"నేను చాయ్ బాగా చేస్తాను. కొంచెం రుచి చూడండి!"అంది పుష్ప.


"సరే!"నంటూ పిల్లల్ని పలకరించాను. ముగ్గురు ఆడపిల్లలు స్కూల్ చదువులో ఉన్నారు.


"మీ రెక్కడ పడుకుంటారు? ఇంకో మంచం ఇక్కడ పట్టేట్టు లేదు "

అన్నాను. ఆ మాట అన్నాక నాలిక కరుచుకొన్నాను. మరీ తెలివితక్కువ ప్రశ్న వేశానని.


"మేము మంచం మీద, మమ్మా, పప్పా క్రింద చాప మీద "అంది పెద్దపిల్ల సహజంగా.


"తాతయ్య, బామ్మ వరండాలో ఉంటారు. మరీ అంత పెద్ద వాన వస్తే అందరం ఇంట్లోనే."


నాకు విచిత్రంగా అనిపించింది.ఇంత చిన్న గదిలో అంతమందా!ఆమ్మో!


"మీ మామగారికి తుకారామ్ ఒక్కడే కొడుకా?"అడిగాను పుష్పని.


"మా మామగారికి నలుగురు పిల్లలు. మా పెద్ద మరిది సాధూరామ్ షోలాపూరులో ఫ్యాక్టరీలో పని చేస్తాడు. ఇంకో మరిది శివాజి ఇక్కడే ప్రక్కనే ఉంటాడు. మా ఆడబడుచు నీల రాధేగావ్ లో ఉంటుంది. వాళ్లకు రెండెకరాల పొలం ఉంది. వ్యవసాయం. మా అత్తకూడా నాలాగా నాలుగిళ్లల్లో పని చేసేది. ఈ మధ్య మానేసింది. ఇప్పుడు అత్తకు బాగాలేదు. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి."


పుష్ప కప్పుతో తేనీరు ఇచ్చింది. నాకు పూణే వచ్చే దాకా తేనీరు అలవాటులేదు. ఇక్కడికి వచ్చాక ఎవరింటికి వెళ్లినా త్రాగటం,ఎవరు మన ఇంటికి వచ్చినా తేనీరు ఇవ్వటం అలవాటయింది.

పుష్ప పెట్టిన తేనీరు చాలా రుచిగా ఉంది. బయట సన్నగా వాన. చేతిలో వేడివేడి తేనీరు. తాజ్ హోటల్లో కంటే బాగుంది.


"చాయ్ బాగుంది!"అన్నాను మనస్ఫూర్తిగా మెచ్చుకుంటూ.

నవ్వింది పుష్ప.


పిల్లలు బయటికి వెళ్లారు.


"మీ అత్తగారు మామగారు ఉంటే మీ సంపాదన సరిపోతుందా? పైగా ముసలివాళ్ళు. నువ్వు ఒక్కదానివే చూసుకోవాలి కదా!కష్టంగా ఉండదూ!"అన్నాను.


సాధారణంగా ఇలాటి ప్రశ్న ఎవరైనా అడిగితే వాళ్ళ కష్టాలన్నీ ఏకరువు పెడతారు మన జాతి వాళ్ళు.



"మా అత్త నలుగురు పిల్లల్ని పెంచి పెద్ద చేసింది. మొన్న మొన్నటి దాకా పని చేస్తూనే ఉంది. ఇప్పుడే కాస్త మూలపడింది. నేను పనికి వెళ్లినా ఇంట్లో చూసుకుంటుంది. ఒకరికొకరం అంటూ లేకపొతే ఎలాగా? మా మరిది వాళ్ళు కూడా చూసుకుంటారు. మన వాళ్ళని మనమే వదిలేస్తామా?"


మనసుమీద ఛళ్ళున చరిచినట్లయింది.


"కోడళ్ళను ఏమన్నా అంటుందా?"


ఈ ఉమ్మడి కుటుంబాల్లో అత్తగారి దాష్టికం ఎక్కువే ఉంటుంది.


"ఏదో అంటుంది కానీ నేను పట్టించుకోను. పొద్దున పనికి వెళ్లి మధ్యాహ్నం వస్తాను. మళ్ళీ సాయంత్రం ఓ రెండు గంటలు పని. ఈ లోపల పిల్లల్ని చూసుకొంటుంది. నేను మా అత్తకు చెయ్యటంకంటే ఇంట్లో ఉండి ఆవిడ మా పిల్లలకు ఎక్కువే చేస్తుంది. అప్పుడప్పుడు విసుగు పుట్టి మమ్మల్ని తిట్టినా మేమెవ్వరం పట్టించుకోము."


నేను ఆలోచనలో పడ్డాను. నా మనసులో కట్టుకున్న అరలు, తెరలు మెల్లగా తొలిగిపోతున్నాయి. స్వచ్ఛమైన పుష్ప నవ్వు మనోహరంగా ఉంది. అచ్చంగా అమ్మవారి మందహాసంలా.ఆ నవ్వులో ఉన్న తృప్తి నాలో పది జన్మలు ఎత్తినా రాదేమో!


"మేమ్ సాబ్!వెళ్దామా!"అంటూ వచ్చాడు తుకారాం.


పుష్ప నాకు పసుపు కుంకుమ పెట్టింది. పర్సులోంచి డబ్బులు కొంచెం తీసి పిల్లల చేతిలో పెట్టి కారులోకి వచ్చి కూర్చున్నాను.కారు కదిలింది.


ఇంటికొచ్చాను. పిల్లలిద్దరికీ అన్నాలు పెట్టాను. మా ఆయనకిష్టమైన లేతనీలిరంగు చీర కట్టుకున్నాను. మనసంతా తేలిగ్గా ఉంది.


మా ఆయన వచ్చాడు. నా ముఖంలో ప్రసన్నత చూసి చిన్నగా నవ్వి "అందరిళ్లకు వెళ్లి వాయనాలు ఇచ్చి వచ్చావా!"అన్నాడు.


సోఫాలో తన ప్రక్కన కూర్చున్నాను.


తన చేతిని నా చేతుల్లోకి తీసికొని "రేపటికి టికెట్ బుక్ చెయ్యండి!నేను వెళ్లి అత్తయ్యను తీసికొని వస్తాను."అన్నాను మృదువుగా.


మా అయన నమ్మలేనట్లు చూశాడు నా వైపు. నా కళ్ళల్లో కనిపించే భావంకోసం వెదుకుతున్నాడు.


"ఏమిటీ?"అన్నాను.


మా అయన నా చుబుకం పట్టుకొని నా కళ్ళల్లోకి చూస్తూ నా మనసులోని భావాన్ని చదవాలని ప్రయత్నం చేస్తున్నాడు.నా కళ్ళల్లో నా మనసులోని భావం ప్రతిఫలిస్తుంటే నా మోముని రెండు చేతుల్లోకి అపురూపంగా తీసికొన్నాడు.


"నిజంగా!అమ్మను తెచ్చుకుందామా!"అంటూ నన్ను హృదయానికి గట్టిగా హత్తుకున్నాడు.

ఆ పరిష్వంగంలోని హాయిని అనుభవిస్తూ కళ్ళుమూసుకున్నాను.


ఒక కప్పు తేనీరు నాకు చక్కని పాఠం నేర్పించింది.


నేను కొంచెం మారాను. ఎంత మారాను అంటే నెల మధ్యలో తుకారామ్ కానీ పనిమనిషి కానీ నన్ను డబ్బులు అడిగితే నోట్సులో వ్రాసి పెట్టుకోవటం లేదు.పూర్తి జీతం ఇచ్చేస్తున్నాను.


సమాప్తం


******************************************************


Rate this content
Log in

Similar telugu story from Classics