*** మీద కోపం ..
*** మీద కోపం ..
ఆమె మాటలు పూర్తి కాకుండానే చెంప చెళ్లుమనిపించాడు రాజారావు. రమణి నోట్లోకి చీర కొంగు కుక్కుకుంటూ ఏడుస్తోంది.
రాజారావు ఆమె ఇంటికి వెళ్లిపోయాడు. అతడికి కోపం వచ్చిందంటే ఆమె ఇంటికి వెళ్ళిపోతాడు. సౌదామిని అతడి జుట్టు నిమురుతూ ఉంటే ఆ కోపం చిటికెలో ఎగిరిపోతుంది.
ఆమె చూపు, నవ్వు, మాట అన్నీ అతడికి ఆహ్లాదమే. బొట్టు(తాళి) కట్టిన నెల రోజులకే మొగుడు ఆ సౌదామిని ఇంటికి పోయినా రమణి ఏమీ అనలేదు.
రోజూ మొగుడికి వండి పెట్టడం తప్ప అతణ్ణి అదుపులో పెట్టుకోవాలని రమణి ఎన్నడూ ప్రయత్నించలేదు. ఒకరు చెప్తే వినే రకమా రాజారావు.
పెళ్లైన ఇన్నేళ్లకి ఇప్పుడు అతనితో గొడవ పడాల్సి వచ్చింది. కొడుకుకు ఊహ తెలుస్తోంది. ప్రాపంచిక విషయాలు అర్థమవుతున్నాయి. తండ్రికి ఉన్న అక్రమ సంబంధం గురించి తెలిస్తే వాడి ప్రవర్తన ఎలా మారుతుందో అనే రమణి భయం.
ఆ భయంతోనే భర్తను సౌదామిని ఇంటికి వెళ్ళొద్దని అర్థించింది. మాటా మాటా పెరిగింది. ఏమని చెప్పమంటావ్. మీ నాయిన ముండలకోరు అని చెప్పమంటావా నీ కొడుక్కి అంది. ఆమె ఇంకా ఏదో అనబోతూ ఉండగానే రాజారావు చెయ్యి ఆమె చెంప మీద కమిలిపోయే అచ్చర వేసింది.
ముండ మీద కోపం పెళ్ళాం మీద చూపిస్తారా ఇలా అంటూ రాజారావు తల్లి తిడుతూ ఉంది.
ఓ రోజు రమణి నిర్ణయం తీసుకుంది. సౌదామినిని కలవడానికి ఆమె ఇంటికి బయలుదేరింది. ఇంట్లో ఎవ్వరికీ చెప్పలేదు.
రాజారావు, సౌదామిని సినిమాకు వెళ్ళారు. రమణికి ఈ విషయం తెలియదు.
హోరుమంటూ వర్షం కురుస్తోంది. ఆ చీకట్లో కురిసే వర్షం రమణి గుండెల్లోని అవమానపు సెగలను ఏమాత్రం చల్లార్చలేకపోయింది. ఊరికి కాస్త దూరంలో విసిరేసినట్టుగా కొన్ని ఇళ్ళు. వాటిలో ఒకటి సౌదామిని ఇల్లు.
వాన ఉధృతమైంది. గాలి వేగం హెచ్చింది. రమణి ముఖంలో ఏదో ప్రశాంతత. ఆమె ఊరు పొలిమేర దాటింది. మరుసటి రోజు నుంచి రమణి ఎవ్వరికీ కనిపించలేదు..
