మాస్టారు
మాస్టారు


ఉదయాన్నే ఫోన్ ఓపెన్ చేసి వాట్సప్ మెసేజ్ చదువుతుండగా స్కూల్ స్నేహితుల సమూహంలో ప్రసాద్ మాస్టారికి కన్నీటి వీడ్కోలు అని మెసేజ్ తో పాటు ఒక ఫొటో పెట్టారు. అందెందుకో అసలు ఓపెన్ అవడంలేదు.ఎవరో తెలుసుకోవాలని ప్రయత్నించి విసుగొచ్చి ఎవరూ అని అడిగినా ఎవరూ ఆన్లైన్ లేకపోవడంతో చేసేదేంలేక ఊరుకున్నాను.ఎందుకంటే మా స్కూల్లో ముగ్గురు ప్రసాద్ మాస్టార్లు ఉన్నారు. మనిషిని ఆగినా కానీ ఆలోచనలు పన్నెండేళ్ళ వెనక్కి పరిగెత్తాయి.మా పదోతరగతి రోజులవి..అందరికంటె పిల్లలకు చనువిచ్చిన మాస్టారంటే లెక్కల ప్రసాద్ మాస్టారే.. ఆటపట్టించే పిల్లలకు ఎక్కువగా ఆయనే దొరికేవారు.ఎవరెంత అల్లరి చేసినా చెవిమెలిపెట్టి అల్లరిపిడుగా అనడంతప్ప ఒకదెబ్బ కొట్టేవారుకాదు..మిగతా మాస్టర్లు" భయంచెప్పకుండా నెత్తికెక్కించుకుంటారేమండీ అంటే పిల్లలకు ప్రేమతో నేర్పించాలి కానీభయపెట్టికాదండీ " అంటూ నవ్వేసేవారు..అదేంటో ఆయన చెప్పే పాఠాలయినా మాటలయినా అంతే శ్రద్దగా వినేవారు మళ్ళీ.ఎవరైనా ఏదైనా పోటీలలో గెలిస్తే ఆయన ప్రత్యేకంగా బహుమతులు ఇచ్చేవారు..అంతే గా ఎంతకాలం కలిసినడిచామన్నదికాదు ఉన్నంతలో తలుచుకోగానే మంచి జ్ఞాపకంగా మనసులో మెదిలేవారేగా నిజమైన వ్యక్తిత్వంగలవారు. రోజులు గడిచాయి మిగతా సబ్జెక్టు లు ఎలాఉన్నా అందరూ లెక్కలు మంచి మార్కులు సాధించారు.. ఇంటర్లో వేరువేరు కాలేజీలు.. తర్వాత చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాలు , పెళ్ళిళ్ళంటూ వేరువేరుగా అయిపోయాం.
రెండేళ్ళ క్రితం జరిగిన స్నేహితుల సమ్మేళనం లో కలిసినప్పుడు ఆయన తన విద్యార్థులను చూసి పొంగిపోవడమే గుర్తొచ్చింది.. అదే ఆయనని కలవడం. తర్వాత నా జీవితం నా ఉద్యోగం అంటూ పరుగులు,ఉదయాన్నే ఎవరో పంపిన మెసేజ్ లతో గుర్తుపెట్టుకొని చెప్పే శుభోదయాలు తప్ప ఎవరితోనూ పెద్దగా లేని సంబంధబాంధవ్యాలు.ఇంతలో ఆలోచనలకు విరామమిస్తూ నోటిఫికేషన్.స్నేహితుల సమూహం నుండి.. "మన లెక్కలమాస్టారు ప్రసాద్ గారే"నని..ఒక్కక్షణం కళ్ళలోతడి కలిగింది. "పెద్దదినం ఎప్పుడు.? ఒకసారి అందరూ వెళ్ళొద్దామా? అని అడిగాను.. ఎక్కడ కుదురుతుంది, అది నేను ఇప్పుడే చూసాను.ఈరోజే పెద్దదినం అని,అయినా అక్కడ మనకి ఎవరు తెలుసని..ఇంతదూరం నుంచి వెళ్ళినా ఏంచేయగలం అంతా అయిపోయాక" అంటూ ఎవరికారణాలు వారివి..పోనీ ఎవరికైనా అడ్రస్ తెలుసా ఉండబట్టలేక అడిగాను.. ఎవరూ తెలుసనలేదు బహుశా తోడురమ్మంటానని కాబోలు. సరే నా మనసుమాత్రం నొచ్చుకుంది ఎందుకంటే నా పదోతరగతి పూర్తయ్యాక ఇంటర్లో జాయినవ్వడానికి ఇంట్లో ఒప్పుకునే పరిస్థితి కాదు..అమ్మావాళ్ళని ఇబ్బందిపెట్టలేక ఊరుకుంటే మాస్టారే ఆయన స్నేహితుడి కాలేజ్ లో సీట్ ఇప్పించారు..నా మార్కులకి ఫీజు లేకపోయినా పుస్తకాలు లాంటి ఖర్చులు ఆయనే భరించారు.తర్వాత కూడా అవసరానికి ఆయన రాకున్నా ప్రిన్సిపల్ సహాయం చేసేలా మాట్లాడారు... ఇప్పుడు స్నేహితులను అంటే ఏంలాభం..చదువయిపోయాక ఆయన యోగక్షేమాలు విచారించని నాకంటే అవకాశవాదులు కాదుగా.అందుకే మనసులోనే ఆయనకి అశ్రునివాళిని అర్పించి నాదైనందిన కార్యక్రమంలో పడిపోయాను.