Triveni K

Children Stories

4  

Triveni K

Children Stories

జ్ఞాపకం

జ్ఞాపకం

1 min
491


   


బాల్యంలో చేసిన ప్రతిపని ఇప్పుడు అద్భుతంగా అనిపిస్తుంది .మట్టితో బొమ్మలు చేసి వంటలు వండుకోవడం .పచ్చి మట్టిపాత్రలలో వంటచేద్దామని మంట పెట్టి నీళ్ళుపొయ్యగానే అది కరిగిపోతే ఎక్కెక్కిఏడవడం ఎంత మధురమో తలుచుకుంటే. నాన్నమ్మ రాత్రుళ్ళు ఉప్పు,కారంవేసి ఉడకపెట్టిన తేగలు,పెండలం దుంపలు రాత్రంతా మంచులో పెట్టీ ఉదయాన్నే ఇచ్చేది.అదెంత రుచిగా ఉండేవంటే అమృతంలా. ఇప్పటి రెస్టారెంట్ లో బోల్డన్ని డబ్బులు పోసి తింటున్న ఏవీవాటికి సరితూగవు.అప్పటివరకు పట్టణంలో ఉన్న నేను గ్రామంలో మొట్టమొదటిసారి చూసిన కార్తీకమాసం పూజలు.తెల్లవారుజామున నాలుగింటికే పిల్లలు, ఆడవాళ్లు కలసి పూజా సామాగ్రి పట్టుకుని నేలబావి దగ్గరికి వెళ్ళడం.అది వర్షాకాలపు వర్షాలకు నిండి అంచువరకు నీరొచ్చేస్తే దాని అంచును కూర్చుని చెంబుతో నీళ్ళు పోసుకుని తెచ్చిన సామానుతో గౌరమ్మనుచేసి పూజచేసి దీపాలు వెలిగించి అరటిదొప్పలో నూతిలో వదలడం,అప్పుడే గుడినుండి వినబడే అయ్యప్పస్వాముల భజనలు ఆ అందమైన దృష్యాన్ని చూడడానికి పొద్దున్న ఏడుగంటలవరకూ లేవని నేను నాలుగింటికే వాళ్ళతో తయారయిపోవడం నాకిష్టమయిన బాల్య స్మృతి.అలాంటివే స్కూల్ రోజులు. అవి జీవితంలో సగం అందమైన జ్ఞాపకాలను కలిగిఉంటాయి. అలా ఓరోజు తొమ్మిదో తరగతి చదువుతున్న రోజుల్లో టీచర్ రాలేదని చక్కగా తలుపుదగ్గరకు వేసేసి కళ్ళగంతలు ఆడుతున్నాం.సడన్గా మా లెక్కలసార్ లోపలికి వచ్చేసారు. అందరం దడుచుకొని ఎవరిచోట్లో వాళ్ళు కూర్చున్నాం.పాపం కళ్ళకి గంతలు కట్టుకున్న అమ్మాయి మాత్రం వెతుక్కుంటూ వెళ్ళి సార్ చేయి పట్టుకుని ఔట్ ఔట్ అని అరుస్తుంటే చుట్టూ నిశ్శబ్దంగా ఉండేసరికి కళ్ళగంతలు విప్పిచూసి నిలువు గుడ్లేసుకుని నిలబడింది.అంతే తరువాత వరుసగా ఆయన చేతిలో బెత్తంతో సామూహిక వివాహాలు చేసేసారు అందరికీ.మొదటి సారి స్టేజీపై బహుమతి తీసుకున్న రోజు, అమ్మ ఒంట్లో బాగోకపోతే సహాయపడితే అమ్మ నా బంగారు తల్లే అని మెచ్చుకున్నరోజు కదా నిజమైన మధురస్మృతి.



Rate this content
Log in