తనతో నా పరిణయం
తనతో నా పరిణయం


మా ప్రేమ పెళ్ళిపీటలెక్కడానికి పడిన కష్టమంతా ఆరోజు ఆనందంలో మాయమయింది. ఆరోజు కోసం ఎన్ని కష్టాలు, ఎన్ని గొడవలు. అందరూ వ్యతిరేకించినవారే.అటువైపు అతడి ప్రమేయం లేకుండానే వాళ్ళ మేనత్తకూతురితో పెళ్ళి ఖాయంచేసారు.వాళ్ళ మేనత్తవాళ్ళు ఆస్తి,పొలం అంటూ చాలా ఆశచూపారు.మీరెన్ని చేసినా తననే పెళ్ళిచేసుకుంటానని అతడు మొండికేసాడు. మా ఇంట్లో అభ్యంతరాలకి నిద్ర,తిండిలేక నీరసపడిపోతున్న నన్ను చూసి ఏమయిపోతానోనని భయపడి పెళ్ళికి ఒప్పుకున్నారు.పెళ్ళిపనులన్నీ హడావుడి గా జరిగిపోతున్నాయి. అతడితో మాట్లాడే అవకాశం రాలేదు ఈ మధ్యలో. ఆరోజు రానేవచ్చింది. బంధుగణం అందరిమధ్య అంగరంగవైభవంగా మా పెళ్లి రాత్రి 9:30కె పూర్తయింది.పచ్చని పసుపుతాడై అతడు నా హృదయంపై చేరిపోయాడు.వెచ్చని కన్నీరు ఆనందాన్ని తోడుతీసుకుని చెంపలపై జారి గుండెలపై చేరి ఆ పసుపుతాడుని ముద్దాడాయి.మిగతా కార్యక్రమాలన్నీ పూర్తయ్యేసరికి 11గంటలయింది.మా విడిదిల్లు మా అత్తగారి ఇంటి ముందే ఇచ్చారు..ఉదయాన్నే అన్నవరం వెళ్ళాలని పడుకోవడాని
కి నన్ను విడిదింటికి ఆయనని వాళ్ళింటికి తీసుకువెళ్ళారు.ఆ ఎడబాటు కూడా కష్టంగా తోచింది మా ఇద్దరికీ. ఒకరిని ఒకరు చూసుకుంటూ వెళ్తున్నాం.రేపటినుండి ఆ ముఖాలే చూసుకోవాలి పదండి పదండి అనడంతో మా మోములు మందారాలవగా సిగ్గుతో తలదించుకున్నాం.కొంతసేపటికి కరెంట్ పోయింది. అసలే ఎండాకాలం.తెచ్చిన జనరేటర్ కూడా పాడయిపోయింది.ఇంక ఇంట్లో ఉండలేక అందరూ బయటమంచాలేసి ఆరుబయట కూర్చున్నాం.తను నెమ్మదిగా నా పక్కన ఇంకోమంచంలో పడుకున్న మా బాబాయ్ పక్కన చేరారు. మాటలాడటం మొదలు పెట్టారు. నేను సిగ్గుపడుతూనే మాట్లాడా.మాట్లాడుతూ మాట్లాడుతూ కరెంట్ రావడంకూడా గమనించకుండా మాట్లాడేసుకుంటున్నాం.అందరూ ఇకచాల్లే పడుకోండి.రేపు అన్నవరం వెళ్ళాలి అనేంతవరకు గమనించలేదు. ఒకరినొకరు ఇష్టపడ్డాక మేమంత పబ్లిక్ గా మాట్లాడిన సందర్భం అదే. తర్వాత రోజు అన్నవరం వ్రతంలో ఇద్దరం పోటీపడీ కునికిపాట్లుపడడం వేరే సంగతి.అదే నా జీవితంలో మర్చిపోలేని రోజు.ప్రాణంగా ప్రేమించిన నా జీవితభాగస్వామి నా చెయ్యందుకున్నరోజది.