Triveni K

Drama

4.2  

Triveni K

Drama

ఎలా చెప్పను

ఎలా చెప్పను

8 mins
712


అప్పుడే బస్సుదిగివస్తున్న శృతి కి ఎదురుగా స్కూటీతో నిలబడిన అక్క పల్లవి కనిపించేసరికి ఆనందంగా పల్లవీ అంటూ పరిగెత్తుకెళ్ళి హత్తుకుపోయింది.

"చీ వదులు వెళ్దాం. ఏదో సంవత్సరాల తరువాత కలిసినట్టు హత్తుకుపోతున్నావ్.క్రిందటి నెలేగా పండగకని వచ్చావ్.ఇంతలోనే బెంగా" అంది పల్లవి స్కూటీ స్టార్ట్ చేస్తూ.

"ఛ అదేమీలేదు.ఈ మధ్యనే మా ఫ్రెండ్ వాళ్ళక్క స్టేట్స్ నుండి వస్తుంటే ఎయిర్పోర్ట్ కెళ్ళాం.అక్కడవాళ్ళిలాగే హగ్ చేసుకున్నారు తెలుసా.నీకేం తెలీదు పో.ఒట్టి పల్లెటూరు బైతు" అంది స్కూటీపై కూర్చుంటూ.

"అవును తమరిప్పుడు ఉంటున్న హాస్టల్లోనే ఉంటూ తమరు చదువు వెలగపెడుతున్న కాలేజ్ లోనే చదివాను నేను కూడా. అంతకిమించిన సిటీలో తమరెక్కడున్నారో మరి."

"అయ్యో పల్లూ(శృతి కి ప్రేమెక్కువైతే అలాగే పిలుస్తుంది) చదివింది ఎంతనికాదు ఎంత అప్డేట్ అయ్యామన్నది ముఖ్యం.నువ్వు నాకంటే ముందే బి.టెక్ చేస్తే ఎందుకు. ఇంకా అమ్మకూచీవేగా.జాబ్ కూడా చెయ్యనని ఇంటిదగ్గర కూర్చున్నావ్.నేనో రెండు నెలల్లో జాబ్లో జాయినవుతా.హైదరాబాద్లో మకాం. నాకు నచ్చిన అబ్బాయిని చూసి పెళ్ళాడేస్తా. చూసుకో."

"అలాగే అలాగే ఆ మాటేదో నాన్నతో చెప్పు నిజంగానే పెళ్ళిచేస్తారు" అంది పల్లవి. స్కూటీని మట్టిరోడ్డులో జాగ్రత్తగా నడుపుతూ.

చుట్టూ ఉన్న పచ్చనిపొలాలు వాటి పైనుండి వస్తున్న చల్లటి గాలిని ఆస్వాదిస్తూ కూర్చున్న శృతి ఎదురుగా వస్తున్న బైక్పై వ్యక్తి ని ఆశ్చర్యంగా చూస్తూ "అబ్బా" అంది గట్టిగా. పల్లవి "శృతి ఎందుకే అలా అరిచావ్.ఉన్నావా పడిపోయావా "అంది వెనుకకు తిరిగి చూస్తూ.

."నిజంగానే పడిపోయా .ఆ ఎదురుగా బుల్లెట్పై వస్తున్న హీరోకి" అంది శృతి.

అప్పుడుచూసింది పల్లవి ఎదురుగా వస్తున్న బుల్లెట్ని.అప్పటివరకు దుమ్మురేపుకుంటూ స్పీడ్ గా వస్తున్న బుల్లెట్ వాళ్ళ దగ్గరకు వస్తూనే స్లో అయింది.

స్కూటీపై ఉన్న అమ్మాయిలను చూస్తూ అతడి మోములో నవ్వు విరిసింది.ఆ నవ్వు అందమైన అతడి ముఖానికే వన్నెతెచ్చింది.

"ఆ నవ్వు చూస్తుంటే ఏ అమ్మాయైనా మనసు పారేసుకోదు నేనుకూడా అంతే" అంది శృతి.

పల్లవి ముఖం కోపంతో జేవురించింది."ఏంటే ఆ పిచ్చిమాటలు .ఎవడినిపడితే వాడిని పట్టుకుని మనసుపారేసుకున్నా అంటావ్.తిక్కా నీకు" అంది.

అతడి బైక్ వారిని దాటుతుండగా అరిచింది పల్లవి."ముందు చూసుకుని పోరా లేకపోతే పోతావ్" అని.

అప్పుడే గమనించాడేమో ఏమో ఎదురుగా ఉన్న గోతిని.సడన్ బ్రేక్ తో ఆపాడు కీచుమన్న శబ్ధంతో.

ముందుకు దూసుకుపోతున్న స్కూటీపై ఉన్న శృతి గమనించింది.

."ఏంటే పల్లు వాడంటే గిట్టదన్నట్టు బిల్డప్ ఇస్తూ వాడికి జాగ్రత్తలు చెబుతున్నావు.అతడేదో నీ భర్తలాగ."

"నోర్ముయ్.నేనేదో మామూలుగా అన్నాను. వాడికి అలా హెల్పయింది అంతే."

శృతి"అవునే పల్లు వాడిదంతా వాళ్ళ అమ్మపోలిక కదూ.అందుకే అంత క్యూట్గా ఉంటాడు ".

"ఛ.ఇంక ఆపుతావా నీ భజన.ఇందాకటి నుండి వినలేకచస్తున్నాం.వాడు వాడి మొఖం.నీకే నచ్చాలి.అయినా నాన్నకి ఈ విషయం తెలిస్తే ఏమవుతుందో నీకు తెలుసుగా.వాళ్ళంటేనే గిట్టదు నాన్నకి.ఇంక వాడి విషయం మాట్లాడకు ఒకేనా."అంది పల్లవి.

శృతి సరేనన్నా మనసు మాత్రం ఆ బుల్లెట్ వీరుడితో కథలల్లుతోంది.

వీళ్ళ మాటల్లోనే ఇంటికి వచ్చేసారు.ఊరిపెద్దల్లో ఒకడైన మాధవరావు ముద్దుల కూతుళ్ళే పల్లవి, శృతి.

ఈ మధ్యనే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్ కొట్టింది శృతి. రెండు నెలల్లో జాయినింగ్ ఉంది.

స్కూటీదిగుతూనే ఎదురుగా వస్తున్న తల్లిని తండ్రి ని పరుగెత్తికెళ్ళి చుట్టేసింది శృతి.

తన సరదా సంభాషణలతో ఇంటికి పండగకళ తీసుకొచ్చేసింది . పల్లవి అదంతా చూస్తూ ఆనందిస్తుంది.శృతిది దుడుకుస్వభావమైతే

పల్లవిది నెమ్మదితనం.తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా ఏ పనిచేయదు పల్లవి.

శృతి అనుకుంటే తల్లిదండ్రులను ఒప్పించయినా ఆ పనిచేసి తీరుతుంది.అలా శృతి చేసే సందడితో సరదాగా గడుస్తున్నాయి రోజులు.

ఒకరోజు ఉదయమే పల్లవి శృతి కోసం ఇల్లంతా వెతికి వెతికి తల్లిదగ్గరకు వెళ్ళింది అడగడానికి.

"శృతి మీ నాన్నకి టిఫిన్ తీసుకువెళ్ళిందే పొలానికి.మీ నాన్న తెల్లవారుజామున పొలాన్ని దున్నించాలని వెళ్ళారు. పాలేరుకు ఇస్తానే అంటే వినకుండా ఇది వెళ్ళింది.నువ్వింకా లేవలేదని నన్ను చెప్పమంది. వచ్చేస్తుందిలే" అంది రాజేశ్వరి.

"లేదులేమ్మా నేనువెళతాను పొలం చూసి వస్తాను. ఇద్దరం సరదాగా పొలమంతా తిరిగి వస్తాం" అంటూ బయలుదేరింది.

"సరే అయితే జాగ్రత్త. మామిడి తోపుదగ్గర ఉన్న పొలంలో ఉంటారు "అంటూ చెబుతున్న రాజేశ్వరి మాటలకు

"సరేసరే" అంటూ బయటకు పరుగుతీసింది.పల్లవి పొలం చేరే సమయానికి తండ్రొక్కడే ఉన్నాడు.దగ్గరుండి పొలం దున్నిస్తున్నాడు.

పల్లవిని చూస్తూ

"నువ్వుకూడా వచ్చావా.ఎండలో ఎందుకమ్మా అంటే వినకుండా మామిడి తోట చూసి వస్తానని వెళ్ళింది శృతి. నువ్విక్కడే ఉండు వచ్చేస్తుంది" అంటున్న తండ్రితో "లేదులేనాన్న నేను కూడా మన మామిడి తోట చూసి వస్తా" అంటూ తోటలోకి దారితీసింది.

నిండా కాయలతో ఊగుతూ ఉన్న తోట కనులవిందుగా ఉంది అక్కడక్కడా పండిన కాయలను తింటూ కిచకిచలాడుతున్న పక్షులు ,మండిపోతున్న ఎండనుండి సేదతీర్చుతున్న చల్లనినీడ చాలా బాగా అనిపించింది పల్లవికి.

నడుస్తూ నడుస్తూ చాలా దూరం వచ్చేసింది. ఎదురుగా ఉన్న దృశ్యంచూసి శిలలా నిలబడిపోయింది.

తనకి కొంచెం దూరంలో శృతి, అర్జున్.శృతి మామిడి చెట్టుకు చేరబడి మాట్లాడుతుంటే అర్జున్ బైక్ పై కూర్చుని మాట్లాడుతున్నాడు.ఒకరిపై ఒకరు జోక్స్ వేసుకుంటూ నవ్వుతూ మాట్లాడుకుంటున్న వాళ్ళనిచూస్తూ మ్రాన్పడిపోయింది.

మొన్నేదో సరదాగా అంటుంది అనుకుందికానీ ఇలా అతడితో మాట్లాడటానికి ,కలవడానికి ఇంతదూరం వస్తుందనుకోలేదు. వాళ్ళనలా చూస్తూ కోపంతో రగలిపోయింది.

కొంతసేపటికి స్పృహలోకి వచ్చింది. తనవెనుక ఎవరో ఉన్నట్టనిపించి తలతిప్పిచూసింది. కోపంగా శృతివాళ్ళనే చూస్తున్న మాధవరావు.అసలే పల్లవి భయస్తురాలు పాములవీ కనపడితే భయపడుతుందేమోననే అనుమానంతో పల్లవిని వెతుక్కుంటూ వచ్చాడు మాధవరావు. కానీ అక్కడ అర్జున్ తో శృతిని చూసి నిశ్చేష్టుడయ్యాడు.

"శృతీ " అంటూ గట్టిగా అరవడంతో తుళ్ళిపడ్డ శృతి అక్కడ పల్లవిని, తండ్రిని చూసి షాక్ అయింది.భయంగా తండ్రి దగ్గరకు పరిగెత్తుకొచ్చింది.పదండి అన్న తండ్రి కేకతో అతన్ని అనుసరించారు మౌనంగా.

ఇంటికి వచ్చిన మాధవరావు నేరుగా అతని రూంలోకి వెళ్ళిపోయాడు. పల్లవి ఏం జరుగుతుందో ననే భయంతో బయట అటుఇటూ తిరిగేస్తుంటే శృతి తండ్రి గదిలోకి వెళ్ళి గడియ పెట్టింది.

శృతిని తండ్రి ఏమంటోడనే భయంతో కాళ్ళుచేతులు ఆడడం లేదు పల్లవికి. మనసు గతంలోకి లాక్కెలుతుంటే తను జారిపోయింది.

తనకి పన్నెండేళ్ళు వచ్చేవరకు మాధవరావు చెల్లెలు సుమిత్ర కుటుంబంకూడా వాళ్ళతోనే ఉండేవారు. సుమిత్ర ఒక్కగానొక్క కొడుకే అర్జున్. సుమిత్ర భర్త వీరేశం అతడి బావ మాధవరావు పట్ల ఎంతో వినయవిధేతలతో ఉండేవాడు.మాధవరావు తండ్రి చనిపోయినప్పుడు జరిగిన ఆస్తిగొడవలలో తన బంధువుల చెప్పుడుమాటలు విని మాధవరావు ని ఎదిరించాడు వీరేశం.

అంతే "బావా బావా " అంటూ తన దగ్గర మర్యాదగా నడుచుకునే వీరేశం నోటికొచ్చినట్లుగా మాట్లాడుతుంటే వినలేక ఆస్తిలో సగభాగం ఇచ్చేసి వాళ్ళతో సంబంధాలు తెంచేసుకున్నాడు.

ప్రాణంగా చూసుకునే చెల్లెలినికూడా దూరం పెట్టి మాట్లాడటం మానేశాడు.అప్పుడే వాళ్ళు ఊరికి ఇంకో వైపున్న ఇంటికి మారిపోయారు.

అలాంటిది వాళ్ళకొడుకుతో రహస్యంగా మాట్లాడుతున్న శృతి పట్ల ఏం నిర్ణయం తీసుకుంటాడోనని తను భయపడి చస్తుంటే ఇదేమో ధైర్యంగా లోపలికి వెళ్ళి తలుపేసుకుందని దడపట్టుకుంది పల్లవికి.లోపలి నుండి వినిపిస్తున్న అరుపులు ఆగిపోయి నిశ్శబ్దంగా ఉంది.

నిలువెల్లా చమటతో తడిచిపోయిన పల్లవికి ఊరటనిస్తూ గంట తరువాత తండ్రి గదిలోనుండి సంతోషంగా పరుగెత్తుకొచ్చింది శృతి. వస్తూనే పల్లవిని చుట్టేస్తూ

"పల్లూ నాన్న అర్జున్ బావతో పెళ్లికొప్పుకున్నారు "అంటున్న శృతిని ఆశ్చర్యంగా చూసింది పల్లవి.

"ఏమంటున్నావే? నాన్న ఒప్పుకున్నారా.వాళ్ళంటే నచ్చదుగా నాన్నకి.మరిఎలా."

"అయ్యో పల్లూ నాన్నకు వాళ్ళంటే ఎందుకు నచ్చదు. మామయ్యతో గొడవవల్లేగా.అత్తంటే ఎంతిష్టమో నీకు తెలుసుగా.కేవలం వాళ్ళమధ్య ఉన్నది ఇగో సమస్య అంతే.అందుకే మామయ్య చేతే కాల్ చేపించి సారీ చెప్పించాడు బావ. అంతే అప్పటివరకు ఎగిరిన నాన్న కూల్ అయిపోయాడు.బహుశా చెల్లెలితో కలవడానికి నాన్నకూడా ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారేమో.

అంతా అయోమయంగా ఉంది పల్లవికి. ఇదంతా నిశ్శబ్దంగా వింటున్న వాళ్ళతల్లి రాజేశ్వరి ఆనందంగా శృతిని దగ్గరకు తీసుకుని నుదిటిపై ముద్దుపెట్టింది.

ఎప్పుడో జరిగిన గొడవలకి తన ఆడపడుచుతో మాట్లాడకుండా అయింది ఇన్నాళ్లూ.

చెల్లెలితో మాట్లాడక ఆయనెంత భాదపడుతున్నారో అనుకుంది.

ఇదిజరిగిన రెండు రోజుల తర్వాత పొద్దున్నే రెండు చేతులలో పట్టుచీరలు పట్టుకుని వచ్చింది శృతి.

శృతి:"పల్లూ నీకిందులో ఏ చీర నచ్చిందో చెప్పవే" అంది.

పల్లవి:"ఎందుకే."

"ముందు చెప్పు పల్లూ."

పల్లవి:"ఈ పేరట్ గ్రీన్ చాలాబాగుంది."

శృతి:"సరే నేనిది కట్టుకుంటా.నువ్విందులో ఏదోకటి సెలెక్ట్ చేసుకొని కట్టుకో సరేనా".

పల్లవి:"అదేంటి అది నచ్చిందంటే నువ్వు కట్టుకుంటానంటున్నావు. మళ్ళీ నన్నింకొకటి సెలెక్ట్ చేసుకో అంటున్నావు.ఇంతకీ ఎందుకు. ఇంట్లో ఏమైనా పూజా. "

శృతి:"కాదు పెళ్ళిచూపులకి వస్తున్నారు. "

పల్లవి:"ఎవరికి."

శృతి:"ఇంకెవరికి నీకే.అర్జున్ బావ వాళ్ళ చిన్నాన్నగారి అబ్బాయి నిన్నెక్కడో చూసాడంట. నచ్చావంట.నాన్నకి కూడా నచ్చిందా సంబంధం. అందుకే ఇవాళ రమ్మన్నారు వాళ్ళని".

పల్లవి:"ఏంటే ఇది .నాకు చెప్పకుండా పెళ్ళిచూపులు ఏర్పాటు చేస్తారా.నీ పెళ్ళికి అడ్డంగా ఉన్నానని నన్ను పెళ్లి చేసి తోలేయాలనిచూస్తున్నావా."

శృతి:"మరేం చేయమంటావ్ .నువ్వు ఎవరినైనా ఇష్టపడతావేమో అనుకుంటే నీకంత సీన్లేదు.అందుకే పెద్దరికం తీసుకుని సంబంధాలు చూడాల్సొచ్చింది.ఏం చేస్తాం "అంది ఏదో కష్టపడ్డట్టు నుదుటిమీద చెమట తుడుచుకుంటూ.

"అమ్మా శృతి, పల్లవి తయారయ్యారా పెళ్ళివాళ్ళు వచ్చేస్తున్నారంట.."

"హా !అమ్మా. రెడీ" అంది శృతి నుదిటనున్న పాపిటబిల్ల సరిచేసుకొని మరోసారి అద్దంలో తనని తాను చూసుకుంటూ.

తయారయ్యి అద్దంముందు మౌనంగా కూర్చున్న పల్లవి ఏదో అనుమానంగా "అవునే నాకు పెళ్ళి చూపులయితే నువ్వెందుకు ఇంతలా తయారవుతున్నావ్."

"అదా అర్జున్ బావవాళ్ళుకూడా వస్తున్నారు. అఫీషియల్ గా నాకుకూడా ఇప్పుడే పెళ్ళిచూపులు.

అందుకే ఇంతలా.సరే నువ్వేంటి ఇంత డల్గా ఉన్నావ్.నీకీ పెళ్ళిచూపులిష్టంలేదా " అంది.

పల్లవి:"అదేంలేదు ఇంతసడెన్గా అంటే నాకేం అర్థంకాలేదు." అంతే.

శృతి:"ఓకే ఓకే" అంటూ మళ్ళీ మేకప్ సరిచేసుకోవడంలో పడిపోయింది శృతి.

హాల్లో అప్పటికే వచ్చిన ఊరిపెద్దలు కూర్చున్నారు.

మరోఅరగంటలో వచ్చిన కార్లోనుండి దిగారు అర్జున్, వాళ్ళ అమ్మానాన్న.మరో కారులో వచ్చిన అర్జున్ చిన్నాన్న కుటుంబంకూడా మరికొంత మంది పెద్దలతో దిగారు. అందరనీ అప్యాయంగా ఆహ్వనించారు మాధవరావు, రాజేశ్వరి. సుమిత్ర అయితే అన్నయ్యని,వదినని చూసి కళ్ళనీళ్ళు పెట్టుకుంది.

వీరేశం తనతప్పుకి నేరుగా తనబావగారిని మరోసారి క్షమాపణలు అడిగితే, మాధవరావు ఆప్యాయంగా హత్తుకొని ఓదార్చాడు.

అందరూ హాల్లోవేసిన సోఫాలలో కూర్చున్నారు.వీరేశం బావపక్కనే కూర్చొని తన తమ్ముడికొడుకు పవన్ గురించిన వివరాలు చెబుతున్నాడు.

ఇంతలో అమ్మాయిలని పిలిపించండన్న పెద్దవాళ్ళ మాటలతో చేతులలో టీ కప్పులున్న ట్రేలతో వచ్చారు శృతి ,పల్లవి.

బంగారు బొమ్మల్లా ఉన్న వాళ్ళని చూస్తూనే సుమిత్ర ఉబ్బితబ్బిబ్బయింది.

ఇంకో కొడుకుంటే ఇద్దరూ తనకోడల్లే అయ్యేవారనుకుంటూ అలానే చూస్తూ ఉండిపోయింది. యు ఆకారంలో వేసిన సోఫాలలో అర్జున్ మధ్యవైపు కూర్చుంటే అతనికి పక్కగా పవన్ కూర్చున్నాడు. అమ్మాయిలిద్దరూ చెరోవైపు ట్రేలలో టీని ఒక్కొక్కరుగా అందించుకుంటూ వచ్చేసరికి ఇద్దరూ ఒక్కసారే అబ్బాయిలకు టీ అందించారు. అప్పుడు చూసారు.ఎదురుగా ఉన్నవాళ్ళని అనుకోకుండా పల్లవి అర్జున్ కి, శృతి పవన్కి అందించారు.తర్వాత సుమిత్ర అమ్మాయిలిద్దరినీ తన పక్కన కుర్చోబెట్టుకుంది.

పల్లవి,శృతి స్త్రీ సహజమయిన సిగ్గుతో తలదించుకుంటే అబ్బాయిలిద్దరూ తలెత్తి ఇలాంటి అనుభూతి మళ్ళీ రాదనుకుంటూ అమ్మాయిలను ఓరకంట చూస్తున్నారు.

సరే మాధవరావు ఎంత ఒక అబ్బాయి నీ మేనళ్ళుడయినా ఇంకో అబ్బాయి అమ్మాయి తో మాట్లాడాలనుకుంటాడుగా.ఆ ఏర్పాట్లు చూడండి అనడంతో నేను కూడా మాట్లాడాలి అన్నాడు అర్జున్.

"సరే అమ్మాయిలు మీరు మీ రూముల్లోకి వెళ్ళండి. అబ్బాయిలొచ్చి మాట్లాడతారు" అనడంతో రాజేశ్వరి అమ్మాయిలిద్దరినీ తీసుకుని వెళ్ళిపోయింది.

పల్లవి తన గదిలో ఉన్న కిటికీలోనుండి బయటకు చూస్తూ ఉంది.లోపలికి ఎవరో వచ్చినట్టు అయిన అలికిడి కి తలతిప్పిచూసింది.

ఎదురుగా అర్జున్. ఒక నిమిషం ఏమీ అర్థంకాక అలా చూస్తూ ఉండిపోయింది. మరునిముషంలో తేరుకుని మీరేంటి ఇక్కడ అంది కంగారుగా.

"ఏంలేదు నీవల్లేగా నా పెళ్లి జరుగుతోంది.థాంక్స్ చెబుదామని పవన్ని పదినిమిషాలు పర్మిషన్ అడిగా".

"ఓ అందుకా.అయినా నేనేంచేసాను" అంటూ మళ్ళీ అటు తిరిగి నిల్చుంది.

"అవుననుకో. నువ్వు అనుకోకుండా వచ్చినా మామయ్య నీకూడా వచ్చేగా మమ్మల్ని అక్కడచూసారు.

లేకపోతే ఎలా చెప్పాలా అని ఒకటే కంగారు పడ్డాం.అయినా చిన్నప్పటి నుండి నిన్ను చూపించి నువ్వే నాభార్యవనేది మా అమ్మ. కానీ ఏం చేస్తాం.నీకు నేనంటేనే నచ్చదు.కాలేజ్ లో కూడా నీతో మాట్లాడాలనుకుంటే పట్టించుకునేదానివేకాదు. పైగా నన్ను చూస్తేనే తిట్టేదానివి.ఏదో మీ చెల్లెలు నన్ను ఇష్టపడబట్టికానీ లేకపోతే మాఅమ్మ కోరిక నెరవేరేదా" అన్నాడు అర్జున్.

"సరేలే ఇప్పుడు మా తమ్ముడికి భార్యవవుతున్నావు. ఇంతకీ నిన్ను మరదలివనాలా లేక మీ చెల్లెలిని చేసుకుంటున్నాను కాబట్టి వదినా అనాలా."అంటున్న అర్జున్ ని చివ్వున తలెత్తిచూసింది పల్లవి.

"ఇంతకీ నీకు మా తమ్ముడు నచ్చాడాలేదా" అంటున్న అర్జున్ మాట పూర్తవకముందే పరుగునవచ్చి అతడి గుండెలపై వాలిపోయింది.అప్పటికే కన్నీళ్ళతో తడిసిన ఆమె కళ్ళు అతడి గుండెలను తడిపేస్తుంటే

" అవును నువ్వంటే నాకు నచ్చదు.నేనంటే ప్రాణమిచ్చే నాన్నకు మీరంటే నచ్చదని తెలిసినా నిన్ను పిచ్చిగా ప్రేమిస్తాను కదా అందుకే నువ్వంటే నచ్చదు.నీకోసం ఎప్పడూ నాన్నని వదలిఉండని నేను హాస్టల్ లో ఉండిమరీ చదువుకునేలా చేసావుగా అందుకే నువ్వంటే నచ్చదు.నాలుగేళ్ళ పాటు నా ఎదురుగా తిరుగుతూ అప్పుడప్పుడూ నాలో ఉన్న ప్రేమను నీతో చెప్పమని ప్రేరేపించేవాడివిగా అందుకే నువ్వంటే నాకు నచ్చదు. ఉద్యోగం చెయ్యకుండా ఊర్లో ఉండి మీ నాన్నకి సాయం చేస్తానంటూ నేనుకూడా ఉద్యోగం చెయ్యకుండా చేసావుగా అందుకే నువ్వంటే నాకు ఇష్టంలేదు.నేను నా ప్రేమను చెప్పలేకపోతే నా చెల్లెలితో పెళ్ళికి రెడీ అయిపోయావుగా అందుకే నువ్వంటే నాకిష్టంలేదు.నాకిష్టంలేదు" అంటూ రెండు గుప్పిళ్ళతో అతడి గుండెలపై కొడుతూ వెక్కిళ్ళుపెట్టి ఏడుస్తున్న పల్లవి రెండుచేతులను పట్టుకుని ఏడ్చి ఎర్రబారిన ఆమె కళ్ళలోకి చూస్తూ గట్టిగా తనవైపు లాక్కున్నాడు. మళ్ళీ అతడి గుండెలపై వాలిన ఆమెను చేతులతో చుట్టేస్తూ

"మరెందుకు పిచ్చి ఇంతప్రేమను మనసులోనే దాచుకున్నావు.చెప్పొచ్చుగా.మీ నాన్నకి భయపడి నన్ను దూరం చేసుకుందామనుకున్నావ్ కదూ" అన్నాడు లాలనగా.

"నీకళ్ళలో కనిపించే ప్రేమను అర్థంచేసుకోలేనంత పిచ్చివాడిననుకున్నావా.నేను ఎదురుపడితే మెరిసే నీ కళ్ళలోని ఆనందం నాకర్థంకాలేదనుకున్నావా " అంటూ ఆమె నుదిటిని ముద్దాడాడు.

"ఆమాటల కన్నా అతడి సాంగత్యమే ఆమెను సేదదీర్చుతోంది.

"మరి మనం పెళ్ళిచేసుకుందామా "అన్నాడు అర్జున్. అతడి కౌగిలిలో ఒదిగిన ఆమె "ఊ "అంది ట్రాన్స్లో ఉన్నట్టు.

మరి మేమేమయిపోవాలి అని వెనుకనుండి రెండుగొంతులు వినిపించాయి ఒకేసారి. అంతే అతడినుండి దూరం జరిగి చూసింది ఎదురుగా పవన్,శృతి.

ఒక్క క్షణం జరిగింది గుర్తుచేసుకుని సిగ్గుతో "క్షమించు శృతి నేనేదో బావపై ఇష్టాన్ని దాచుకొని దాచుకొని ఒక్క సారిగా తనని ఇంతదగ్గరగా చూసి తట్టుకోలేక బయటపడిపోయా. నన్ను క్షమించు" అంటూ తలవంచుకుంది.

"నువ్వేంటి బావ నన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి ఇప్పుడు మా అక్కని చేసుకుంటానంటున్నావ్" అంది కోపంగా.

"ఏం చేయను శృతి. ఎంతయినా ఫస్ట్ లవ్ కదా అలాతను అంతదగ్గరయ్యేసరికి కాదనలేకపోయా" అన్నాడు అమాయకంగా ముఖంపెట్టి.

అప్పటివరకు ప్రేమగా కబుర్లు చెప్పిన వ్యక్తి శృతిని చూడడంతోనే ప్లేటు ఫిరాయించడంతో కోపంగా చూసింది పల్లవి.

"అందుకని మాకన్యాయం చేస్తారా " అంది సూటిగా ఇద్దరినీ చూస్తూ.

అప్పటికే సిగ్గుతో చితికిపోయిన పల్లవి "తప్పుచేసాను క్షమించు" అంటూ ఏడుస్తూ బయటకు పరుగుతీయబోయింది. ఎవరో చేయిపట్టి లాగడంతో ఆగిపోయింది.

తన ఎదురుగా నవ్వుతున్న అర్జున్

"చూడు పల్లూ తప్పచేసావు కదా అందుకే బావని పెళ్లి చేసుకొని ఈ పల్లెటూరిలోనే అత్తయ్య కి ,మామయ్యకి సేవలుచేస్తూ బతికేయి, అదేనీకు శిక్ష "అంది శృతి.

"అదేంటి త్యాగం చేస్తున్నావా.నాకేమీ అక్కరలేదు. బావని నువ్వే పెళ్ళిచేసుకో.మీరు సంతోషంగా ఉండండి" అంది పల్లవి జారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ.

"అదేంటండి శృతి అన్నయ్యని పెళ్ళిచేసుకుంటే నేనేమయిపోవాలి "అన్నాడు అప్పటివరకు బొమ్మలా అందంతా చూస్తున్న పవన్.

"అది బావని చేసుకుంటే మీకేమయింది" అంది పల్లవి పవన్ ని వింతగా చూస్తూ.

"ఏమయిందంటే వాడు లవ్ చేసిన అమ్మాయిని వాళ్ళ అన్న చేసుకుంటే బాధపడతాడుగా " అన్నాడు అర్జున్ నవ్వుతూ.

"హేయ్ నాకంతా గజిబిజి గా ఉంది సరిగ్గా చెబుతారాలేదా"

అరిచింది పల్లవి.

"అది నేను లవ్ చేసిన పవన్ ,అర్జున్ బావవాళ్ళ తమ్ముడని తెలిసి ఎలా అయినా నాన్నని ,అత్తయ్య వాళ్ళని ఒప్పించాలని ఊరువచ్చాను.ఇక్కడికి వచ్చాకే తెలిసింది నువ్వు బావని మూగనోము పట్టిమరీ ఇష్టపడుతున్నావని. అందుకే బావతో మాట్లాడి మన పెళ్ళిళ్ళు కోసం ఏం చెయ్యాలో అని ఆలోచిస్తుంటే నాన్న చూసేసారు.

ఏదో అత్తయ్య తో మాట్లాడించి నాన్నని కూల్ చేసాంకానీ, నువ్వు బావతో నీ మనసులో మాట చెప్పేంతవరకు బావ నిజం చెప్పొద్దనడంతో అబద్దాలు చెప్పాం. సారీ పల్లూ" అంటున్న శృతితో

"అంటే మీరిద్దరూ నాతో ఆడుకున్నారా" అంటూ పక్కనే ఉన్న షటిల్ బ్యాట్ చేతిలోకి తీసుకున్న పల్లవిని చూస్తూ పరుగు లంఖించుకున్నారు అర్జున్, శృతి.

హాల్లోకి పరిగెడుతూ వచ్చిన శృతి,అర్జున్ వెనుకే వస్తున్న పల్లవిని చూసిన పెద్దలు తాంబూలాలు తీసుకున్నాం తన్నుకుచావండి అంటారు.

వీళ్ళేమో ఇప్పుడే మొదలుపెట్టేసారు.ఇక మీరు తాంబూలాలు తీసుకోవచ్చు అనడంతో అక్కడ నవ్వులు విరిసాయి. ఆ నవ్వులకు సిగ్గు పడి నిలబడిపోయిన పల్లవి,శృతిలపక్కకి నవ్వుతూ అర్జున్ ,పవన్ చేరారు నిశ్చితార్థపుఉంగరాలు తొడగడానికి.

మరికొన్ని రోజుల్లో పెళ్ళితో ఒక్కటికాబోతున్న ఆ అందమైన జంటలను మీరూ ఆశీర్వదిస్తారు కదూ🙏🙏🙏Rate this content
Log in

Similar telugu story from Drama