అపరిచితుడు
అపరిచితుడు


మొదటిసారి బస్సులో ఒంటరిగా ప్రయాణం. అమ్మకి వీలుపడక పిన్ని బాధపడలేక పరీక్షలు అయిపోయాయని, స్కూలుకు సెలవులని బస్సు ఎక్కించింది.నా గుండెల్లో బెరుకుగా ఉంది. అందరూ నన్నే చూస్తున్నారనే భయం ఒకవైపు. ఇంతలో ఒకవ్యక్తి వచ్చి నాపక్కనకూర్చున్నాడు. అతడిని చూస్తే కరుకుగెడ్డం,గంభీరమైన ముఖం.నాకు ఎందుకో తెలియని ఇబ్బంది. చేతులు అవసరంలేకపోయినా నలిపేస్తూ, తదేకంగా కిటికీలోనుండి బయటకు చూస్తున్న నన్ను ఎక్కడికివెళ్తున్నావ్?అన్నాడు. తుళ్ళిపడి ఇటుతలతిప్పి మాపిన్నివాళ్ళింటికి అన్నాను.ఎవరూ రాలేదా నీతో అన్నారు. లేదనితలూపాను అడ్డంగా. భయపడకూడదుఇలా.ఆడపిల్లలు ఎంత సాధిస్తున్నారో తెలుసా? అంటూఎన్నో గొప్పవిషయాలుచెప్పారు. ఆశ్చర్యంగా చూస్తూ వింటున్న నాతో స్కూల్ తర్వాత ఏం చదువుతావ్? అంటూ మాటలు కలిపారు. నాలో బెరుకు తగ్గిన తర్వాత ఆయన చేతిలోని వీక్లీ నాకిచ్చి పేదరికాన్ని జయించిన ఆడపిల్ల కథ ఉంది చదవమంటుండగా బస్సు ఆగింది. కొంతమంది కాలేజ్ పిల్లలు బిలబిలమంటూ బస్సెక్కారు.నేరుగా ఈయన దగ్గరకు వచ్చి సార్ కాలేజ్కి ఎందుకు రాలేదు? అన్నారు. పనుండిరాలేకపోయానురా అంటూ వాళ్ళతో మాటల్లో పడ్డారు. ఆయన లెక్చరర్ అని అర్థంఅయింది. ఆయన విద్యార్థులు అందరూ బస్సులో తలోచోట సర్థుకున్నారు.ఆ వెనుక ఒక అమ్మాయుంది చూడు అంటూ వెనుక కూర్చున్న ఒకమ్మాయిని చూపించారు. ఆ అమ్మాయి కరాటేలో రాష్ట్రస్థాయి బహుమతులు గెలుచుకుంది తెలుసా? అన్నారు. అమ్మాయిలు కూడా నేర్చుకుంటారా! అమాయకంగా అడిగాను.అమ్మాయిలకే చాలా అవసరం. అందరూ నీలా భయపడుతూ ఉంటే ఎలా.అందరూ పెద్దపెద్ద చదువులు చదువుతున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. వారంతా తమ రక్షణకోసం,కుటుంబానికి ధైర్యం కోసం నేర్చుకుంటారు.అంతే కాకుండా అది కూడా ఒక కళే.దానితో బోలెడన్ని పోటీలు ఉంటాయి.బహుమతులూ గెలుచుకుంటారు.అందరిలోనూ ప్రత్యేకత చాటుకుంటారు.నువ్వు బాగా చదువుకో.మంచి స్థాయిలో ఉండాలని ప్రయత్నించు.మంచి మంచి పుస్తకాలు చదువు.వాటిలో చాలా జ్ఞానం ఉంటుంది. అది నీకు లోకాన్ని పరిచయం చేస్తుంది అంటూ అప్పటివరకూ నాకు తెలియని కొత్త ప్రపంచాన్ని చూపించారు. ఇంతలో నేను దిగవలసిన ఊరు వచ్చేసింది. మర్చేపోయాను ఆయన పేరు అడగలేదు అని బాధపడ్డాను.చేతిలో ఉన్న పుస్తకం చూస్తూ ఆయనపేరు తెలియకపోయిన అపరిచితుడు గా పరిచయమయిన ఆయన నాకు పుస్తకమనే నేస్తాన్ని జీవితాంతపుతోడుగా ఇచ్చారు అని ఆనందపడ్డాను.మొదటి సారి నా అడుగులు ఎటువంటి బెరుకు లేకుండా ముందుకు సాగడం నేను గమనించాను.