కమ్మనైన అమ్మభాష
కమ్మనైన అమ్మభాష
కమ్మనైన అమ్మ భాష
********************
అనగా అనగా ఒక ఊరు. ఆ ఊరిలో షావుకారు ఒక పిల్లిని పెంచుకున్నాడు. కొన్నాళ్ళకు ఆ పిల్లి నాలుగు పిల్లల్ని పెట్టింది. ఆ పిల్లలకు ఆట, పాట, వేట నేర్పుతూ అల్లారుముద్దుగా చూసుకునేది. ఆఖరి పిల్ల మాత్రం తల్లి చెప్పిన మాట వినేది కాదు. ఇతర పక్షుల, జంతువుల అరుపులను అనుకరించేది.
"అమ్మ భాష కమ్మనైనది మన భాషను కాదనుకుని ఇతర జంతువుల భాషలు ఎందుకు అనుకరిస్తున్నావు?" అని తల్లి మందలించేది. అయినా తల్లి మాట పెడచెవిన పెట్టింది పిల్లిపిల్ల.
ఇలా కాలం గడిచింది. కొన్నాళ్ళకు పిల్లి పిల్ల 'మ్యావ్ మ్యావ్' అనడం మర్చిపోయింది. ఇతర పక్షుల, జంతువుల అరుపులు అరవడం మొదలుపెట్టింది. అలా అరుచుకుంటూ, అరుచుకుంటూ దారితప్పి అడవిలోకి వెళ్ళిపోయింది.
పిల్ల కనిపించకపోయేసరికి గాభరాపడింది తల్లిపిల్లి. చుట్టూ వెతికింది. ఎక్కడా కనపడకపోయేసరికి ఎంతగానో విలపించింది.
కొంతసేపటికి అడవిలోకి వెళ్ళిన పిల్లిపిల్లకి ఆకలి, దాహం వేసాయి. నీరసం వచ్చింది. ఆకలి ఆకలి (మ్యావ్ మ్యావ్) అని సహజమైన తన అరుపును మరచి ఇతర పక్షుల మాదిరిగా అరవసాగింది.
దాని భాష అడవిలో పక్షులకు, జంతువులకు అర్థం కాలేదు. సహాయం చేయదలచి దగ్గరికి వెళ్ళబోతే అడవి జంతువులను చూసి పరుగులు తీసింది పిల్లిపిల్ల. ఇంతలో అడవి పిల్లి ఎదురైంది. తన తల్లి లాగ ఉండటంతో తేరిపార చూసింది. దగ్గరకు వెళ్ళింది.
అడవి పిల్లి, దానిని దగ్గరకు చేరదీసి ఆహారాన్ని ఇచ్చింది. మాటలు నేర్పింది. ఒక్కొక్కటిగా పిల్లి పిల్లకు గుర్తుకువచ్చి జరిగినదంతా చెప్పింది. అది విని “ఇతర భాషలు నేర్చుకోవడం (ఇతర పక్షుల, జంతువుల అరుపులు అనుకరించడం) తప్పుకాదు కానీ మన మాతృ భాషను మరిచిపోతే మన మనుగడకే ముప్పు.” అని చెప్పింది అడవి పిల్లి.
"అది నాకు అనుభవం ద్వారా ఇప్పుడు అర్థమైంది" అంది పిల్లి పిల్ల. అడవి పిల్లి సాయంతో తల్లి ఒడిని చేరింది. కమ్మనైన అమ్మ భాషను శ్రద్ధగా నేర్చుకుని చక్కగా మాట్లాడసాగింది. “మ్యావ్ మ్యావ్” అంటూ ఉంటే “అమ్మ భాషే ముద్దు అన్య భాషలు వద్దు” అంటూ తల్లి పిల్లి మురిసిపోయింది.
(సృజన క్రాంతి దినపత్రికలో 01-9-2024 న ప్రచురితమైంది)
