Dinakar Reddy

Abstract Classics

4  

Dinakar Reddy

Abstract Classics

కలహ

కలహ

2 mins
241


అయ్యో! ఎంత పని చేశావమ్మా. అన్నను అడవులకు పంపి నాకు రాజ్యము కట్టబెట్టమని కోరావా. ఇది విన్న నాకు నామీదే అసహ్యము వేస్తోంది. అన్నను ఆపాలి అంటూ భరతుడు కైక మందిరము నుండి బయటకు పరుగెత్తాడు.


ఓ వైపు భర్త దశరథుడు రామా రామా నన్ను వీడిపోకు రామా అని రాజభవనం గోడలు సైతం కరిగిపోయేలా విలపిస్తున్నాడు.


కైకేయి అద్దం ముందర నిల్చుని తనలో తాను ఆలోచనలో పడింది.


దేవ దానవ సంగ్రామం..


కైక ! నా రథ చక్రం ఒరిగిపోతున్నది. అసుర విజృంభణ చెలరేగుతున్నది అని అన్నాడు దశరథుడు.

ఒరిగిపోతున్న రథ చక్రానికి తన చిటికెన వేలు ఆపుగా ఉంచి దశరథుని యుద్ధానికి ఆటంకం కలగకుండా చేసింది కైకేయి.


భీకర పరాక్రమంతో అసురలను దండించి విజయము చేకూర్చుకున్నాడు దశరథుడు.


కైకా! ఈనాడు నీవు చేసిన సహాయానికి బదులుగా నీకు రెండు వరాలిస్తున్నాను. కోరుకో. అని కైకేయి చేతిలో చేయి వేసి చెప్పాడు దశరథుడు.


స్వామీ. నాకు అవసరం వచ్చినప్పుడు తప్పక అడుగుతాను అని దశరథుని మనసును గెలుచుకుంది తను.


నేనేనాడూ రామచంద్రుని సవతి బిడ్డ లాగా చూడలేదే. మరి ఈనాడు నాకెందుకు కలిగింది ఈ దుష్ట ఆలోచన.

మంధర మాటలు విని నాకు మతి భ్రమించినదా. అమ్మా. అమ్మా. అంటూ గురుకులం నుండి వచ్చీ రాగానే నా దగ్గరికి పరుగెత్తుకుని వచ్చాడే రాముడు. నా రాముడు. ఆ రాముని పదునాలుగేండ్లు వనవాసం చేయమన్నానే. 


భరతుడు నన్ను రాక్షసిలా చూస్తున్నాడు. నా స్వామి దశరథుని గుండె పగిలేలా చేసిన నేను మనిషిని కాదు. రాక్షసినే. బ్రహ్మ రాక్షసిని.


కైకేయి అద్దములో ప్రతిబింబం ప్రేతము వలె అగుపించినది.

ఆ ప్రేతము మాట్లాడసాగింది.


నిన్ను చూసి నువ్వే భయపడుతున్నావే అని నవ్వింది. ఎవరు నువ్వు అని అడిగింది కైకేయి. నేనే నువ్వు. కలహను. 500 సంవత్సరాలు ప్రేతముగా ఉండి బాధింపబడిన నేను ధర్మదత్తుడనే విష్ణు భక్తుడు నాకు కార్తీక వ్రత పుణ్యము దారపోయటం వలన పాపముల నుండి విడుదల పొంది విష్ణు సాన్నిధ్యాన్ని పొందాను.


నేనే నీవు. ఆనాడు విష్ణు దూతలు చెప్పినట్లు నేను నీలా ధర్మదత్తుడు ఆ దశరథ మహారాజులా జన్మించాము.


కైకేయి! నీవు నిమిత్త మాత్రురాలివి. రామ చంద్రుడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువే. ఇదంతా విష్ణు మాయ. నీచే కోరబడిన కోరికలు రానున్న కాలములో రాముడు చేసే రాక్షస సంహారానికి నాంది పలుకుతాయి.


లోకము నిన్ను నిందించవచ్చు. అశేష ప్రజానీకం రాక్షసుల వల్ల పడుతున్న బాధను ఆ రామ చంద్రుడు తీర్చాలనే విధి నీ చేత అలా పలికించింది.


విష్ణు నామ స్మరణతో నీ జీవితాన్ని గడుపు అని కలహ కైకేయి కి ఉపదేశము చేసింది.


కలహ దివ్య రూపం ధరించి మాయమైంది.


కైకేయి మందిరము నుండి బయటకు నడిచింది.


Rate this content
Log in

Similar telugu story from Abstract