Nagmani Talluri

Comedy

4.4  

Nagmani Talluri

Comedy

కాలం మారింది

కాలం మారింది

4 mins
1.2K


చెట్టు నిండా విరబూసి ఉన్నాయి బొండు మల్లెలు. తను కాపురానికి వచ్చేటప్పటికి చిన్న మొక్క. ఇప్పుడు పందిరి నిండా అల్లేసింది. మొగ్గలు తెంపుతుంటే వచ్చింది మహాలక్ష్మమ్మ "ఏమ్మా బావున్నావా!" అంటూ ."

రండి పిన్ని గారూ ఎప్పుడొచ్చారు ఊరినుండి , మీ అమ్మాయి కోలుకుందా? పని చేసుకోగలుగుతోందా?" అంటూ పలకరిస్తూ ఇంట్లోకి ఆహ్వానించాను.

ఆవిడ మా ఎదురింట్లోనే ఉంటారు. కొడుకు , కోడలితో పాటుగా. ఈమధ్య పెద్ద కూతురికి ఆరోగ్యం బాలేదని వెళ్ళి నెల తరువాత వచ్చారు.

మీ మరిదికి పెళ్ళయిందట నిజమేనా? అందావిడ. ఆరా తీస్తున్నట్లుగా.

అవునండీ. ఓ వారం రోజుల క్రితం అయింది.అన్నాను.

"ఏంటీ బజారులో వాళ్ళు రకరకాలుగా చెప్పుకుంటున్నారు?" అన్నారు మళ్ళీ.

ఆవిడ ఆసక్తి కి నవ్వొచ్చినా, ఆవిడ ఆరాలకు కోపమొచ్చినా‌ పెద్దావిడ కదా అని చూసీ చూడనట్లు ఉంటాను.ఏ మాట కాస్త అటూఇటుగా మాట్లాడామా , ఊరందరి నోళ్ళలో మనమే నానతాం. మా వీధి రేడియో ఆవిడ.

"ఏం చెప్పుకుంటున్నారండీ". అన్నాను.

"ఆ పిల్లది వేరే కులమంటగా! మీ మరిది లేవదీసుకు వస్తే గుట్టుచప్పుడు కాకుండా దండల పెళ్ళి చేసారంట కదా!" అంది ఏదో గొప్ప నిజాన్ని అన్వేషించి సాధించినట్లు.

ఆ మాటలు నన్ను బాధించాయి. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా , కనీసం వినకుండా ఆమె అలా స్టేట్ మెంట్లు ఇవ్వడం నాకు నచ్చలేదు.

సమాధానం చెప్పాలని నోరు తెరిచేలోగా ," ఆవిడేనా నీ తోటికోడలు అంటూ చూస్తోంది వింతగా.

ఆవిడ చూసిన వైపే చూసాను. టెర్రస్ పై అటూఇటూ తిరుగుతూ ఫోన్ మాట్లాడుతోంది మిహిర. మావైపు చూసి నవ్వుతూ చేయి ఊపింది.

"మిహీ ,రా టీ తాగుదాం అని గట్టిగా పిలిచాను.

వస్తున్నాను అని సైగ చేసింది.

ఇంట్లోకి వచ్చిన మహాలక్ష్మమ్మ గారు మా అత్తగారూ కబుర్లలో పడ్డారు.

మిహిని పరిచయం చేసాను.మొహం కొద్దిగా మాడ్చుకుందామె ఎందుకో గానీ.

గుడికి వెళ్తే నన్నూ కలుపుకు పో అందని లక్ష్మమ్మ గారినీ కేకేసాను.

ఆవిడకు నాతో చాలా మాట్లాడే విషయాలు ఉన్నాయని , అందుకే నాతో వస్తోందనీ తెలుసు. అవి తెలుసుకో లేకపోతే ఆవిడకు నిద్ర పట్టదనీ కూడా తెలుసు.ఇవాళ ఆవిడ సందేహాలన్నీ తీర్చేద్దామనే నేనూ అనుకుంటున్నాను."అది కాదమ్మాయ్ , నాకో సంగతి అర్ధం కాలేదు? అసలు ఆ పిల్ల ఏం బావుందని ఏరికోరి మరీ చేసుకున్నాడు ,మీ మరిది. చుట్టాల్లో ఎంత నామర్దా , ఎంత తలవంపులు , ఎంత చిన్నతనం. మా చెల్లెలి ఆడబిడ్డ కూతుర్ని చేసుకోమంటే మీ అత్త ఆరోజు ఒప్పుకోలేదు.ఇవాళ కొడుకు చేసిన పనికి దిగులు పడి ఏం లాభం. అయినా ఎంత చదువుకుంటే మాత్రం ఆ పాంట్లు , చొక్కాలు ఏంటి మగరాయుడిలా , నాకేం నచ్చలేదమ్మా." అంది కొద్ది ఈసడింపును తన స్వరానికి జత చేస్తూ.

ఒక్క నిముషం మౌనం అవసరమైంది నాకు.

మొదటి నుండీ పాపం పెద్దావిడలే ఎందుకు మాటలతో చిన్నబుచ్చడం అని పెద్ద మనసుతో సర్దుకుపోవడం తప్పైందా అనిపించింది.

ఆవిడకు అన్నీ నచ్చాలన్న రూలేముంది? ఒకరి జీవితం గురించి ఆమెకు అక్కర ఏమిటి?

ఇవాళ ఈమె నా మనసు తెలుసుకోవడానికి అంటోందా లేక అత్తా కోడళ్ళ మధ్య ఈమాటలతో అగ్గి రగిలితే చలి కాచుకుందామని చూస్తోందా?

రెండూ తప్పే కదా! ఒకరి సానుభూతి కోసమో , జాలి పలుకుల కోసమో నిజాన్ని గుప్పిట మూయగలమా ఎవరైనా! ఈవిడకు సమాధానం చెప్పాలి. నొచ్చుకున్నా , బాధపడినా సరే అనుకున్నాను.

దర్శనం చేసుకుని మండపంలో కూర్చున్నాం ప్రశాంతంగా.

ప్రారంభం ఎలా చేద్దామా అనుకుంటుండగా తనే అంది."నువ్ పెళ్ళి అయిన దగ్గర నుండీ ఎంత పని చేస్తున్నావ్ .ఆ పిల్ల కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే నువ్ టీ అందించావ్ నిన్న. ఆడపిల్ల అన్నాక అన్ని పనులూ నేర్చుకోవాలా వద్దా! నువ్వే చెప్పు అంది ."పిన్ని గారూ.. ఓ మాట చెప్పనా మీకు.ప్రతి మనిషికీ తమకు మాత్రమే సొంతం అనే జీవితం ఉంటుంది. అందులోకి ఎవరి జోక్యాన్ని భరించలేడు.తమ బ్రతుకు తమ ఇష్టానుసారం బతికే హక్కు ప్రతి వాళ్ళకూ ఉంది కదా! అలాంటప్పుడు గట్టున కూచుని ఈదేవాడి మీద రాళ్ళేయడం ఎంతవరకూ న్యాయమో మీరే చెప్పండి?.

నిన్నటి నుండీ మీరు మా కుటుంబ విషయాలే మాట్లాడుతున్నారు.అది మీకు మాపై గల అభిమానమే కావొచ్చు కానీ అది హద్దు దాటకూడదండీ." అన్నాను.

"నేను ఏం తప్పుగా మాట్లాడని నువ్వలా అంటున్నావో నాకర్ధం కావడం లేదు. కులం తక్కువ పిల్లని చేసుకున్నారని అన్నాను , ఆ మాట నిజం కాదా" అంది చిన్నబుచ్చుకుంటూ

మరింత మృదువైన భాష వాడాలని అనుకుంటూ , " అది కాదు పిన్ని గారు.మీ బంధువుల అమ్మాయిని చేసుకోలేదన్నది మీ కోపానికి కారణం కావొచ్చు , కాని చేసుకునే వాడి ఇష్టాయిష్టాలు తెలుసుకోవాలి కదా. తనకు నచ్చలేదని మా మరిది స్పష్టంగా చెబితే తల్లిగా మా అత్తగారు ఏం చేయగలదు? మీరే చెప్పండి. మెడలు వంచి బలవంతంగా పెళ్ళి చేయగలదా? చేస్తే వాళ్ళు నోరు మూసుకుని కాపురం చేస్తారనుకుంటున్నారా ఏంటి?

ఇక మీరు అన్నారే కులం అని. అంటే ఏంటో కొంచెం చెప్పండి పిన్నిగారు.

చేసే వృత్తుల బట్టే వర్ణాలు కులాలు పుట్టాయని నమ్ముతాను నేను. గుణం మంచిదవ్వాలే గాని కులం ఎందుకండీ. ఓ పూట కూడు పెడుతుందా చెప్పండి. వాళ్ళు ప్రేమించుకున్నారు. ఆ అమ్మాయి నాలుగేళ్ళు పోరాడి ఒప్పించుకుని సాధించుకుందే గాని తల్లిదండ్రులను గాలికొదిలేసి లేచిపోయి రాలేదు.వాళ్ళిద్దరూ అభ్యుధయ భావాలు గలవాళ్ళు.ఆడంబరాల పెళ్ళికి వ్యతిరేకులు. అందుకే సింపుల్ గా దండలు మార్చుకున్నారు. ఆ డబ్బుతో ఓ ఐదుగురు అనాధ పిల్లలను చదివిస్తున్నారు.

ఆ అమ్మాయి అందంగా లేదేమో గాని చాలా మంచి పిల్ల. సమాజం పట్ల అవగాహన కలిగిన పిల్ల. తను కొన్ని స్వచ్చంద సంస్ధలతో కలిసి పని చేస్తోంది. వృధ్ధాశ్రమాలకు విరాళాలు పోగు చేయడం , ఫంక్షన్స్ లో మిగిలిన భోజనాలను తెచ్చి అనాధ‌లకు పంచడం , ప్లాస్టిక్ వాడకం పై అందరికి జ్ఞానం కలిగించడం లాంటివి చేస్తుంది. అవి చూసే మా మరిది ఇష్టపడ్డాడు. ఓ మాట చెప్పండి పిన్ని గారు. నేను చెత్త తెచ్చి మీ వాకిట్లో పోస్తే మీరు గొడవ పెట్టుకుంటారా లేదా ? ఆ అమ్మాయి చిన్నతనం అనుకోకుండా వీధులు ఊడుస్తుంది , చెత్త ఏరేస్తుంది .అలాంటి పిల్ల మంచిది కాదా చెప్పండి.

ఇక బట్టలంటారా! ఒళ్ళంతా కప్పేసే జీన్స్ పాంటు వేసుకోవడంలో తప్పేంటండీ , జారిపోయే , వీపంతా బయటకు చూపించే చీర కట్టుకుని బైక్ ల మీద ఎలా వెళ్ళగలరు? పని మీద బయటకు వెళ్ళే ఆడపిల్లలు. కాలం మారిందండీ. దానితో పాటూ మనం మారలేక పోయినా ఆ కాల ప్రవాహాన్ని ఈదే తీరాల్సిన జనాన్ని మనం తప్పు పట్టకూడదండీ. వాళ్ళ దారికీ , గమనానికి అడ్డు రాకూడదు. మీ అత్త గారు మట్టి పాత్రల్లో వండారనీ , మీరు కాపురానికి వచ్చాకే రాగి ఇత్తడి గిన్నెల వాడకం మొదలైందనీ చెప్పారు గుర్తుందా! అంటే మార్పును మీరే ఆరంభించారు.మీ దృష్టిలో ఆనాడు అదో తప్పు కాదు కానీ మీ అత్త గారు బాధపడే ఉండి ఉంటారు కదా. అంటే ఆనాడు మీరు కాలంతో పాటు మారారు కదా. ఇదీ అంతేనండీ.

మంచిని తీసుకుంటూ , చెడును వదిలేస్తూ కాలంతో పాటూ సాగిపోవడమే మనిషిగా మన కర్తవ్యం.పిన్ని గారూ , నా దృష్టిలో పెద్దరికం అంటే ఏంటో తెలుసా!  పిల్లల మనసు తెలుసుకుని వారి దారికి అడ్డుపడకుండా హుందాగా తప్పుకోవడం. అప్పుడే మన విలువ మిగులుతుంది. ఇవన్నీ మీకు తెలియనివి కావు. కాకపోతే పాటించరంతే.

మీరు పక్కన వాళ్ళ సంగతి పట్టించుకోవడం , వాళ్ళ గురించి వీళ్ళకు వీళ్ళ గురించి వాళ్ళకు చెప్పడం మానేసెయ్యండి.

మీరు కబుర్లు చెప్పినంత సేపూ నవ్వుకుని మీ వెనకాలే మూతులు తిప్పుతున్నారంతా! మీకవసరమా చెప్పండి.

మీలాంటి ఖాళీగా ఉండి ఒపికగా ఉండే పెద్దవారితో వారి చిన్ననాటి సంగతులు , ఊసులు సంఘటనలను కధలుగా చెప్పించి ఆనాటి కాలమాన స్థితి గతులను ఈనాటి పరిస్థితులతో పోల్చి పిల్లలకు పాఠాలు చెప్పాలనే ఆలోచనలో ఉన్నాడు మా మరిది.

మీరు చక్కగా అవన్నీ గుర్తు చేసుకుని చెబితే రికార్డ్ చేసుకుంటారు వాళ్ళు."పిన్నీ, కాలంతో పాటూ పరుగులు పెట్టాల్సిన కాలమిది. లేకుంటే కలలు కన్న జీవితాలు పొందలేరు. అందుకే వాళ్ళనలా సాగనిద్దాం. కుదిరితే ఓ మంచి మాట సాయం , లేకుంటే మౌనమే ,మంచిది.

నీకు రామాయణ భారతాలు తెలుసు. వాటిల్లోని సారాన్ని ఈ తరానికి అర్ధమయ్యేలా విడమర్చి చెప్పు , తీరిక వేళల్లో.

మనం ఉన్నప్పుడే కాదు పిన్నీ , లేనప్పుడు కూడా మన గురించి మంచే చెప్పుకోవాలి.

తప్పుగా మాట్లాడితే నీ బిడ్డను అనుకుని క్షమించు ."అన్నాను.

ఇలాగైనా ఆవిడ ఇంటింటి రామాయణం ఆపుతుందేమో అన్న ఆశతో.

తలకెక్కాయో లేదో గాని తల ఊపింది.

చూద్దాం మారకపోతే మరో డోసు తగిలిద్దాం అనుకున్నాను.

దేవుడికి మరోమారు దండం పెట్టుకుని అక్కడ నుండి కదిలాము.


Rate this content
Log in

Similar telugu story from Comedy