Nagmani Talluri

Inspirational

4  

Nagmani Talluri

Inspirational

దీపావళి

దీపావళి

3 mins
482


ఊరంతా దీపాల వెలుగులతో , తారాజువ్వలు , మతాబుల సందడితో కోలాహలంగా ,దీపావళి పండుగ సంబరాల్లో వెలిగిపోతోంది. కాని ఒక ఇల్లు మాత్రం దుఃఖపు చీకట్లలో మునిగిపోయి ఉంది. నిజానికి ఆ ఇంట్లో కూడా ఓ దీపం మిణుకు , మిణుకుమంటూ వెలుగుతోంది. అది దేవుని ముందు కాదూ , వాకిట్లో కాంతులీనుతూ లేదు. ఆ ఇంటి యజమాని శివరావు ఫొటో ముందు.

నెల రోజుల క్రితం హఠాత్తుగా గుండెపోటుతో ఈ లోకాన్ని వదిలి వెళ్ళారు. వెళుతూ వెళుతూ ఆ ఇంటి వెలుగుని , భార్య పార్వతమ్మ నవ్వునీ తీసుకెళ్ళిపోయారు.

దాదాపు ముప్పై ఏళ్ళుగా ఆయనే లోకంగా బతికేసిన ఆవిడ ఈ లోకంలో వంటరిగా , దిక్కు లేని దానిగా ఏకాకిగా మిగిలిపోయింది. 

నీకేమమ్మా రత్నాల్లాంటి కొడుకులు పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు అని చుట్టాలు అన్నప్పుడల్లా ఆనందంతో మురిసిపోయింది , గర్వంతో మెరిసిపోయింది.

కాని భార్య అనే భాధ్యత బతుకులోకి వచ్చిన ప్రతి మగవాడి జీవితం మారుతుందని , తల్లిదండ్రుల నుండీ దూరం జరుగుతుందనీ తెలుసుకోలేక పోయింది.

భర్త కష్టపడి కట్టిన ఇంటిని వదిలి పోలేక , తనది కాలేని కొడుకు ఇంట్లో పరాయి బతుకు బతకలేక ఇక్కడే ఉండిపోయింది.టపాసుల మోతలు చెవుల్లో మోగుతుండగా మనసు గతం లోకి జారుకుంది. 


"బావా , మా బంధువుల అబ్బాయి ఒకడు బస్తీలో ఉద్యోగం చేస్తున్నాడు , మన పార్వతికి ఈడు జోడూ సరిపోతాడు. నువ్ ఊ అంటే ఓసారి వాళ్ళను కదిలిస్తాను అని పక్కింటి చలమయ్య చెప్పిన మాటలకు సరే అనాలని ఉన్నా బయటి సంబంధం అనేసరికి భయమేసింది బసవయ్యకు.


ఆమాటే పెళ్ళాంతోనూ అన్నాడు. అయినోళ్ళు , దగ్గరోళ్ళు అక్క కొడుకులు అని పెద్ద అమ్మాయిలు ఇద్దర్నీ మేనళ్ళుళ్ళకే ఇచ్చి చేసావ్. ఏం సుఖపడుతున్నారు. ఇక్కడా పొలం చాకిరీనే అక్కడా చాకిరీనే , బిడ్డల్ని చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది. కనీసం చిన్నదాన్ని అయినా కాస్త మంచి చోట ఇద్దామయ్యా అన్న పెళ్ళాం మాటలకి తల వంచాడే కాని కడుపులో ఏదో భయం కదలాడుతూనే ఉంది.


కాని శివరావుని చూసాక వదలబుధ్ధి కాలేదు. చక్కగా ఉన్నాడు. చదువుకుని ఉద్యోగం చేస్తున్నాడు. ఆస్థిపాస్థులేవీ పెద్దగా లేవు గాని ఒద్దికైన కుటుంబం అవడంతో సంబంధం ఖాయపరుచుకున్నాడు.


పెళ్ళి అనగానే గుబులు మొదలైంది పార్వతికి. ఎన్నడూ తల్లిని విడిచి ఉండలేదామె. పెళ్ళి తరువాత పుట్టింటికి ఎక్కువగా రాలేదనీ , పైగా చాలా దూరం ఊరు కావడంతో భయపడుతోంది.


అక్క భర్తలు ఇద్దరూ తెలిసిన వాళ్ళే కావడంతో భయపడే పని లేదు. కాని కొత్త మనుషులు , కొత్త పద్దతులు. తనను వాళ్ళు కలుపుకుంటారా , లేదా అనే ఆలోచనలో రోజులు గడిపేస్తోంది. పైకి చెప్పలేని మరో కారణమూ కుదిపేస్తోంది. కుర్రాడు అందగాడు , తనేమో కాస్త నలుపు . నిజంగా నచ్చే పెళ్ళికి ఒప్పుకున్నాడా? పెద్దల బలవంతమా ? ఎవరితోనైనా ప్రేమాయణం సాగించాడా ! లాంటి ఆలోచనలతో సతమతమౌతోంది ఆమె.


గుండెలు అవిసేలా రోదించినా భర్త వెంట బయలుదేరక తప్పలేదు. అత్తారింట కుడి కాలు మోపక తప్పలేదు.


ఒక్క నిద్ర అత్తారింట్లో చేసివస్తే పుట్టింట్లో కార్యం జరిపేస్తే పదహారు రోజుల పండుగ వరకూ ఇక్కడే ఉందువు గానీ అని తల్లి చెప్పిన మాటల ధైర్యంతో ఉంది. కాని మర్నాడు ఉదయమే దూరపు బంధువు చనిపోవడంతో మైల వచ్చింది పుట్టింటి వారికి. దాంతో పదిహేను రోజుల పాటూ అత్తారింట్లో ఆగిపోవాల్సిందే అని పెద్దలు చెప్పడంతో గుండె ఆగినంత పని అయింది.


కళ్ళ.నీళ్ళు బయటకు కనపడనీయకుండా వంటింట్లో అత్త గారికి పని సాయం చేస్తూ , పెళ్ళి కాని ఇద్దరు ఆడపడుచుల కబుర్లు వింటూ కాలం గడిపేస్తోంది.


శివరావు చాలా నెమ్మదస్తుడు. ఎవరితోనూ ఎక్కువ మాట్లాడడు. పొద్దున్నే డ్యూటీకి వెళ్ళి రాత్రికి వచ్చే వాడు. భార్యను పలకరించడమో , పిలవడమో చేసేవాడు కాదు.


ఆడవాళ్ళకు ఉండే సహజ సిగ్గు కారణాన పార్వతి కూడా తప్పుకు తిరుగుతూ ఉండేది.

కాని భర్త వైపు నుండీ ఆమె ఆశించిన ప్రేమ కనపడక పోయేసరికి అతను ఇష్టం లేని వివాహం చేసుకున్నాడేమో అనే అనుమానం కలిగింది ఆవిడకు.


ఓ నాలుగు రోజులకు దీపావళి పండుగ వచ్చింది. కోడలి చేత లక్ష్మీ పూజ జరిపించి ముత్తైదువులకు తాంబూలాలు ఇప్పించిది ఆమె అత్తగారు. 

ఆసాయం కాలం ఆడ పిల్లలతో కలిసి దీపాలు పెడుతుంటే వంటింట్లో బూరెల డబ్బా తీసుకు రమ్మని అత్తగారి పిలుపు విని హడావిడిగా వెళ్ళింది.


డబ్బా తీసుకుని వెనక్కు తిరిగే సరికి ఎదురుగా శివరావు. దాదాపు ఆనుకున్నంత దగ్గరగా.

ఒక్క క్షణం భయం వేసింది. మరు క్షణం పరిస్థితి అర్ధమై సిగ్గు మొదలైంది. గట్టిగా ఆమె చేయి పట్టుకుని బలంగా తన గుండెల మీదకు లాక్కుని బాహువుల్లో ఊపిరి ఆడనంత గట్టిగా బిగించాడు.


వదలండీ అంటూ ఆమె పెనుగులాడే కొద్దీ పట్టు బిగించి ఉక్కిరిబిక్కిరి చేసాడు. ఎవరో వస్తున్న అలికిడికి ఆమెను వదిలేస్తూ పెదవులపై గట్టిగా తీయని ముద్దును ముద్రించాడు.మనసులని అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి ఆమెకు.


ఆడపిల్లలు తిరిగే ఇంట్లో పధ్ధతిగా ఉండి తీరాలన్న నియమం తెలిసొచ్చింది. మనసులో తీయని కోరికలు మొదలవగా భర్త స్పర్శ కోసం ఆ చక్కిలిగింతల పులకరింతల కోసం ఎదురు చూస్తూ పుట్టింటిని మరచిపోయింది.


తొలి దీపావళి ఆడతనాన్ని నిదురలేపి , కొంటె కోరికల తెర తీసి భర్తతో తన బంధాన్ని అనుబంధంగా మార్చి కాంతులు వెదజల్లుతుందని ఊహించలేదామె.అది మొదలు భర్తతో కలిసి జీవన ప్రయాణం .కలిసి కష్టాన్నీ సుఖాన్నీ పంచుకున్నారు. బతుకు పండించుకున్నారు. పెద్దల పట్ల భాధ్యత , పిల్లల పట్ల కర్తవ్యాలను సక్రమంగా నిర్వర్తించారు. తుది రోజులు ఆనందంగా గడపాలి అనే ఆశలు తుంచేస్తూ ఒంటరిని చేసి వెళ్ళిపోయాడు.


ఆయన ఆశలు , ఆలోచనలు , జ్ఞాపకాలు తన చుట్టూనే అల్లుకుని ఉన్నాయని తెలుసు. జ్ఞాపకాల వెలుతురులో తన జీవనం సాగించాలనీ తెలుసు.కష్టమైనా కాలంతో పాటే నడవాలనీ తెలుసు. తోడు కోసం ఎదురు చూడటం కాదు మనమే ఒకరికి నీడను ఇవ్వగలిగితే బావుంటుంది కదా అన్న ఆలోచన వచ్చింది.


వెనక వీధిలో తల్లిదండ్రులను ప్రమాదంలో కోల్పోయి బంధువులకు భారంగా మారిన పసి వాళ్ళ మోము గుర్తొచ్చింది. వాళ్ళకు ఆసరా కలిగిస్తే , చదువు చెప్పిస్తే అన్న ఆలోచన కలిగింది. మనసులోని చీకట్లు తొలగిపోవాలంటే జ్ఞాన జ్యోతి వెలగాల్సిందే.


అది మరో రెండు పసివాళ్ళ జీవితాల్లో వెలుగు నింపితే అంతకన్నా కావల్సింది ఏముంది? అంతకంటే ప్రకాశవంతమైన దీపావళి మరొకటి ఉంటుందా అనుకుంది. ఆలోచనల్ని ఆచరణ పెట్టే దిశగా పాదాలు కదిపింది.


Rate this content
Log in

Similar telugu story from Inspirational