జనాభా లెక్కల్లో..
జనాభా లెక్కల్లో..
జనగణన పని తొందరగా తేలట్లేదు అంటే నేనూ మా టీచర్ కు సహాయంగా వెళ్ళాను. మా శారదా టీచర్ పెద్ద పుస్తకం పట్టుకుని తనకు అప్పగించిన వార్డుల్లోని ఇళ్లన్నీ తిరుగుతూ ఉంది. నేనేమో ఒక కాగితం తీసుకుని అంతకు ముందు "డోర్ లాక్" అని విడిగా వ్రాసుకున్న ఇళ్ళల్లో ఇప్పుడు ఎవరైనా ఉన్నారేమో అని చూస్తున్నాను.
ఆ వీధిలో చివరి ఇంటికి చేరాం ఇద్దరమూ. ఓ పది నిమిషాలు ఇనుప రెయిలింగ్ ని చప్పుడు చేస్తే గానీ ఆవిడ బయటికి రాలేదు.
అవ్వా నీ పేరేమిటి అని అడిగింది శారదా టీచర్. ఆమె ఆ.. అని వినపడనట్లు ముందుకు వంగింది. ఆమెకు బ్రహ్మ చెముడు అని మాకు అర్థమయ్యింది. చాలా సేపటికి తన పేరు మల్లమ్మ అని చెప్పింది.
తన కొడుకు వస్తాడనీ, వివరాలు చెబుతాడు అని మమ్మల్ని కూర్చోబెట్టింది. కాసేపటి తరువాత కొడుకు ఇంకా రాలేదని ఏడ్చింది.
ఇంతలో పక్కింటావిడ వచ్చి అవ్వా! నువ్వు లోపలికి పో. నేను చెబుతాలే వివరాలు అని చెప్పింది.
మల్లమ్మ లోపలికి వెళ్ళింది. టీచర్ గారూ! ఆమె కొడుకు చనిపోయి చాలా రోజులైంది. కొడుకొస్తాడు అని అనుకుంటూ రాలేదని ఏడుస్తూ కాలం వెళ్లదీస్తున్న ఆమెకు గవర్మెంట్ ఇచ్చే పింఛన్ ఆధారం.
అదొక్కటీ పోకుండా చూడండి అంటూ వివరాలు చెప్పింది.
అవి వ్రాసుకొని తిరిగి వేరే వీధికి బయలుదేరాం.
టీచర్! మల్లమ్మ కొడుకు పేరు జనాభా లెక్కల్లో లేదు కదా. మల్లమ్మకు కొడుకు చనిపోయాడని ఎందుకు అర్థం కావడం లేదు అని అడిగాను నేను.
ఆమెకు అర్థం అయ్యే ఉంటుంది శీనూ. కాకపోతే ఆ విషయం ఆమె మరచిపోతోంది. ఆమె మానసికంగా చాలా డిస్ట్రబ్ అయ్యి ఉంటుంది. అందుకే లేని కొడుకు వస్తాడని కాసేపు, ఇంకా రాలేదని కాసేపు అనుకుంటూ ఉంది అని చెప్పింది.
నేను అర్థం కాలేదు టీచర్ అన్నాను.
సరే సరే మళ్లీ చెప్తాను అంటూ టీచర్ ముందుకు నడిచింది.
