ఇష్టం
ఇష్టం
సామ్రాజ్యం, ఓ సామ్రాజ్యం ఇందాకొచ్చి లేపాను, లేవవూ. ఇప్పుడు మళ్ళీ నిద్ర లేపుతుంటే లేవవేంటీ, ఉన్నావా పోయావా అన్నాడు సుదర్శనం విసుక్కుంటూ. ఏదో అనుమానం వచ్చి భార్య చెయ్యి పట్టుకుని చూసాడు. చెయ్యి వేడిగా ఉంది. మెడ, నుదురు తాకి చూసాడు. వేడిగా ఉన్నాయి. ఓసినీ జ్వరం ఇంతలా వచ్చిందేమిటే నీకు అని అనుకుని, తువ్వాలుని తడిపి తెచ్చి సామ్రాజ్యం మొహం మూడుసార్లు తుడిచాడు. ఊ అని మూలుగుతూ సామ్రాజ్యం నెమ్మదిగా కళ్ళు తెరిచింది. వెంటనే సుదర్శనం తన వణికే చేతులతో తమ ఫామిలీ డాక్టర్ కి ఫోన్ చేసాడు.
డాక్టర్ వచ్చి చూసి ఒక ఇంజెక్షన్ చేసి, రెండు టాబ్లెట్లు ఇచ్చి రాగిజావ వేడిగా కాచి ఆవిడకి తాగించి ఈ మందులు వేయండి అని చెప్పాడు. అలా జ్వరంతో బలహీనపడిన భార్యకు ఉండీలేని ఓపికతో సపర్యలు చేసి కోలుకునేలా చేసాడు సుదర్శనం.
" ఏవయ్యా, నీకు ఓపిక లేకపోయినా ఎందుకు నా కోసం అంత కష్టపడ్డావు " అని అడిగింది సామ్రాజ్యం. మరి నువ్వు లేచి తిరగ గలిగితేనే కదా నాకు కమ్మగా వండిపెట్టేది, నేను త్రృప్తిగా తినగలిగేది " అన్నాడు సుదర్శనం. మూతి మూడు వంకర్లు తిప్పింది సామ్రాజ్యం ఉక్రోషంగా.
ఇద్దరూ తీర్ధయాత్రలకు బయల్దేరి వెళ్ళారు. కాశీ, సోమనాధ్ , బదరీనాధ్, కేదార్ నాధ్ చూసుకుని మనసు నింపుకుని తిరిగి ఇల్లు చేరారు. సుదర్శనం విపరీతమైన మోకాళ్ళ నొప్పులతో బాధ పడుతున్నాడు. సామ్రాజ్యం నువ్వులనూనె వేడి చేసి కాళ్ళకు మర్దనా చేసేది. డాక్టర్ ని అడిగి ఇప్పించుకున్న మందులు శ్రద్ధగా సమయానికి భర్తకి వేసి, భర్త నోటికి రుచించేలా వండిపెట్టేది. అలా ఇరవై రోజులకి భర్తకి సామ్రాజ్యం చేసిన సేవలకి ఫలితంగా సుదర్శనం తేరుకున్నాడు.
తరువాత పదిరోజులకి సామ్రాజ్యం ప్రియపుత్రుడు సాయిరామ్ ఇంటికి వచ్చాడు. నా బంగారుతండ్రే నిన్ను ఎన్నిరోజులకి చూసానురా, నా కళ్ళకు పండుగలా ఉంది నిన్ను చూస్తుంటే అని సాయిరామ్ ని గుండెలకు హత్తుకుని కళ్ళనీళ్ళు కారుస్తూనే పొంగిపోయింది సామ్రాజ్యం . కొడుకుతో కబుర్లు చెబుతూ, కొడుక్కి నచ్చిన వంటలు చేసి పెడుతూ, అదనంగా పిండివంటలు కూడా చేసి కొడుకుకి త్రృప్తిగా తినిపిస్తూ రంగులరాట్నంలా తిరిగేస్తోంది సామ్రాజ్యం .
వారిద్దరినీ చూస్తుంటే సుదర్శనంకి కోపం వస్తోంది. కొడుకు వస్తే ఈవిడ గారికి నేను కనపడనే కనపడను అని అనుకుని ఉక్రోషపడుతున్నాడు. సాయిరామ్ మర్రోజు తన ఊరు వెళ్తాడు అనగా సామ్రాజ్యం ని అడిగాడు " అమ్మా, నా దగ్గరకొచ్చి నాలుగురోజులు విశ్రాంతిగా ఉండమ్మా " అని గారాబంగా అడిగాడు తల్లి దగ్గర చిన్నపిల్లాడు అయిపోతూ. " వద్దురా, నాన్నతోనే ఉంటాను " అంది సామ్రాజ్యం . " నాన్న దగ్గర నీకు ఒకటే చాకిరీ, నా దగ్గరకొస్తే నీ కోడలు దగ్గర నాలుగురోజులు విశ్రాంతిగా ఉండొచ్చుగా " అడిగాడు సాయిరామ్. " వద్దురా, ఆయనకి ఇబ్బంది అవుతుంది నేను తన దగ్గర లేకపోతే " అంది. " మరి ఆయనేమో నా దగ్గరికి రమ్మంటే రారు " అన్నాడు సాయిరామ్ నిందాస్తుతిగా. " ఆయన గురించి తెలియనిదేముందిలేరా, కానీయ్ ఇప్పటికీ " అంది సామ్రాజ్యం .
ఇదంతా వింటూనే ఉన్నాడు సుదర్శనం.
మర్రోజు కొడుకు వెళ్ళాక సుదర్శనం, సామ్రాజ్యం వాకిటి గుమ్మం దగ్గర కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. " ఏమే సామ్రాజ్యం నీ కొడుకు అంటే నీకు బోలెడంత ఇష్టం కదా, మరి వాడు పిలిస్తే వాడి దగ్గరకు పోలేదే " అడిగాడు సుదర్శనం కుతూహలంగా. " వాడంటే బోలెడంత ఇష్టం , నిజమే , కానీ మీరంటే బోలెడంత ప్రే..మ.... " అంది నోరారా నవ్వుతూ, చిరు సిగ్గుతో.... " అవునా " అని తానూ భార్య నవ్వులో నవ్వు కలిపాడు సుదర్శనం మురిపెంగానూ, అపురూపంగానూ... అలా ఇద్దరు పండు ముసలి ఆలుమగలు ఇద్దరూ మురుసుకుంటుంటున్న తరుణమిది...
