హే పూలు..
హే పూలు..
హే పూలుమ్మో.. పూలమ్మి అరుస్తూ వెళుతోంది. తన నెత్తి మీదున్న గంపలో చెండు మల్లెలు విడిపూలుగా ఉన్నాయి.
ఇంకొన్ని కవర్లలో కనకాంబరాలు, మల్లెల మాలలు ఉన్నాయి. చామంతులు కూడా ఉన్నాయి.
ఉదయాన్నే ఆమె గొంతు నేను రోజూ వినేదే. పూలు కొందామన్నా డబ్బులు చేతిలో లేని స్థితి నాది. రెండంతస్తుల మేడలో ఉన్నా, మెడలో బంగారు గొలుసు ఉన్నా ఆర్థిక స్వాతంత్య్రం లేని బతుకు నాది.
ఓ రోజు ధైర్యం చేసి అడిగాను. నెలలో ప్రతి మంగళవారం, శుక్రవారం నాకు పూలు ఇవ్వు. నెలంతా అయిపోయాక మా ఆయన ఉన్నప్పుడు గొడవ పెట్టుకో. ఆయన డబ్బులిచేస్తారు అని.
అన్నిటికీ డబ్బులు ఖర్చు పెట్టే ఆయన, నా చేతికి మాత్రం చిల్లిగవ్వ ఇవ్వడు.
పూలమ్మి ఏమనుకుందో ఏమో. సరేనని ఒప్పుకుంది. అనుకున్నట్టే నెలంతా పూలిచ్చి మా ఆయన ఉన్నప్పుడు గొడవ చేసి ఇప్పించుకునేది.
తరువాత మా ఆయన లక్ష్మీ! ఇదిగో ఈ డబ్బులు ఇంటి ఖర్చులకు పెట్టుకో అని నాకే డబ్బులు అప్పజెప్పడం మొదలుపెట్టాడు. రోజూ పూలమ్మి మా ఇంటికి వచ్చి మధ్యాహ్నం ఎండకు కాసిన్ని మంచి నీళ్ళు తాగి, నీడలో నడుం వాల్చేది.
నేనూ తనొచ్చినప్పుడల్లా ఏదో జ్యూసో లేదంటే మజ్జిగ ఇవ్వడంతో నాకు తృప్తిగా అనిపించేది.
ప్రేమ, అభిమానం అనేవి కేవలం మనవాళ్ళ మీదే కాదు. మన అనుకుని మన పరిస్థితిని అర్థం చేసుకుని సహాయం చేసే వాళ్ళ మీద ప్రేమ కలిగి ఉండడం గొప్ప లక్షణమే. అయినా ప్రేమంటే అవతలి వారి బాగును కోరుకోవడమే కదూ.
