kottapalli udayababu

Drama Romance Action

4  

kottapalli udayababu

Drama Romance Action

గురుదక్షిణ(కథ)-

గురుదక్షిణ(కథ)-

9 mins
14


గురుదక్షిణ(కథ)-


"గోపాలునికెంతమంది గోపికలున్నా... గుండెలోన నెలకొన్న రాధ ఒక్కతే..." అమరగాయకుడు ఘంటసాల గారి కంఠం అమృతధారలతోపాటు జీవిత సత్యాలు కూడా మేళవించి జీవం పోస్తున్న సజీవమైన భావగీతం శనివారం మధ్యాహ్నం ఒకటిన్నరకు వచ్చే ఈ కార్యక్రమంలో తన్మయత్వంతో కళ్ళు మూసుకుని గోపాలకృష్ణ ఈ లోకంలోకి తీస్తూ తలుపు మీద టక టక సబ్దం మోగింది అటు తిరిగి పడుకున్న భార్య భార్యను లేపడం ఇష్టం లేక గోపాలకృష్ణ తనే వెళ్ళి తలుపు తీశాడు

ఎదురుగా 'లతిక'.

భుజాన బ్యాగ్ తో చిరుస్వేదం నుదుట తామరాకుపై బిందువుల్లా మెరుస్తుంటే లేత తమలపాకులాంటి వర్చస్సుతో మిస మిస లాడి పోతున్న ఆమెను అలాగే చూస్తూ ఉండిపోయిన అతనిని ఒక్కసారి గా "బావా" అని అరిచింది లతిక.

"నువ్వు... నువ్వు..."

" అబ్బబ్బబ్బా... బయట ఎండ మండిపోతుంటే ముందు లోపలికి వచ్చి కాసిని మంచినీళ్లు తాగనీయ్ నాయినా. గొంతు ఎండిపోతోంది" అంటూ ఇంకా విభ్రమం తొలగని అతనిని రాసుకుంటూ లోపలికి వచ్చేసింది లతిక.

చెల్లెలు కంఠం వింటూనే లేని ఓపిక తెచ్చుకుని లేచి మంచినీళ్లతో లతిక దగ్గరగా వచ్చింది సువర్చల.

"ఏమిటే. వస్తూనే బావ మీద విరుచుకుపడుతున్నావ్?" అడిగింది నవ్వుతూ.

"లేకపోతే ఏమిటక్కా! సర్కస్ లో వింత మృగాన్ని చూసినట్టు, చూపులతోనే ఆడదాని శీలాన్ని జుర్రేసేటట్టు చూసే బావకు ఇంకా ఆ 'చూపు' పోలేదక్కా. పెళ్లయి ఇన్నేళ్లయినా ఎలా భరిస్తున్నావో గాని!" అందామె మంచి నీళ్ల గ్లాసందుకుని.

"అది సరేగాని... చెప్పాపెట్టకుండా ఉరుములేని పిడుగులా ఏమిటో అమ్మాయి గారి ఈ రాకకు అర్థం?" తలుపులు మూసి లోపలికి వచ్చిన గోపాలకృష్ణ మంచమ్మీద కూర్చుంటూ అడిగాడు.

" పరీక్షలు అయిపోయాయి. బాగా రాశాను.ఇక అంతా ఎంజాయ్మెంటే..." రాగయుక్తంగా అంటూ ఓణీ కొంగు పట్టుకొని పట్టుకొని గిర్రున తిరుగుతూ, కళ్ళు తిరిగిన కారణంగా తూలి తనమీద పడబోయిన ఆమెను సున్నితంగా పట్టుకున్నాడు గోపాలకృష్ణ . సరిగా కూర్చో పెట్టాడు మంచం మీద .

"ఎండలో వచ్చి ఎందుకే ఆ కోతి వేషాలు? అప్పుడే మొదలు పెట్టావాఅల్లరి! ఇంక నీకు తోడు ఆ ఇద్దరు వెధవలు తోడైతే సిలోను, వివిధ భారతి ప్రసారాలు కలిసి వింటున్నట్లే ఉంటుంది. పద.. పద .కాళ్ళు కడుక్కో. భోజనం ఎపుడూ చేసావో ఏమో!" వంటింట్లోకి దారితీసింది సువర్చల.

" ఓకే! అయితే నా కొడుకు, కూతురు ఇంకా కాన్వెంట్ నుంచి రాలేదన్నమాట. కడుపునిండా ఇంధనం పడేస్తే ఇంక రాత్రి వరకు నీతో మాట్లాడను" అంటూ అక్క గారిని అనుసరించబోయి లేవబోయినా లతిక ను చేయి పట్టి ఆపాడు గోపాలకృష్ణ.

" చెప్పు . వెళ్ళ గలవా నేను తోడు రానా!"

"వ్వే వ్వే వ్వే వ్వే...ఏం బాబు భోజనం చేయకుండా సగంలో లేచి పోయావా? నేను తిన్నాక మిగిలితే తేస్తాలే." ఆమె బావ చేతిలోంచి తన చేతిని విడిపించుకుంటూ అంది.

"నీ మొహం!సరే గాని అత్తయ్య మావయ్య ఎలా ఉన్నారు?"  ఆ మాట అన్న అతను అన్న వెంటనే అతని నోటికింద దోసిలి పట్టింది.

"అబ్బ... ఎంత ప్రేమ కారిపోతుందో ...సిగ్గు లేకపోతే సరి. సంవత్సరానికోసారి పండుగకు వచ్చి వెళ్లడమే గానీ, 'అయ్యో పెద్దవాళ్ళు అయిపోయారు.నెలకు ఒకసారి అయినా వెళ్లి అత్తమామల్ని చూసి వద్దామని ఉందా! అయినా నువ్వు అడిగావు కాబట్టి చెబుతున్నా. నాకు సంబంధాలు వెతుకుతూ వాళ్ళ మతి చెడగొట్టుకొని నా మతి చెడగొడుతుంటే భరించలేక పారిపోయి వచ్చా. ఇంట్లో చెప్పకే? నాయన్నాయనా. నీకు పుణ్యం ఉంటుంది. ఇక్కడైనా నన్ను ప్రశాంతంగా ఉండనీ." అంది లతిక అతని గడ్డం పెట్టి బతిమాలుతూ.

"మీ బావతో కబుర్లు తర్వాత.ముందు కాళ్ళు కడుక్కుని రమ్మన్నానా?" వంటింటి గుమ్మంలో అన్నం గరిటతో బాత్ రూమ్ వైపు పరుగు తీసింది లతిక.

ఆమె వెళ్ళిన వైపే చూస్తున్న గోపాలకృష్ణ కి కితకితలు మొదలై నాదస్వరం విన్న నాగుపాములా 'అదే' చూపు చూస్తూ ఉండి పోయాడు.

మరో అయిదు నిమిషాల్లో భోజనం చేసి వచ్చిన లతిక మంచం మీద వెల్లకిలా పడుకుని నిద్రలోకి జారుకున్న బావగార్ని ఓ సారి తదేకంగా చూసి అక్క గారి తో కబుర్లు చెప్పడానికి తిరిగి వంటింటి లోకి జారుకుంది లతిక.

*******

పరమేశ్వరం గారికి పెద్ద భార్య కూతురు సువర్చల . చిన్నతనంలోనే భార్య కాలం చేస్తే ఆమె చెల్లెలనే రెండో వివాహం చేసుకున్నారు ఆయన. చాలా కాలం తర్వాత అంటే ఇంచుమించు వివాహానికి కొద్ది రోజులు ముందు ఆయనకు అపురూపమైన వరంలా లతిక లభించింది.

సువర్చల కాపురానికి వచ్చి పదిహేను ఏళ్ళయింది. లతిక ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. పరమేశ్వరం గారు పోస్టల్ లో పనిచేసి 6 నెలల క్రితం ఉద్యోగ విరమణ చేశారు.  రెండవ భార్యకి అనుకోకుండా మెడ మీద కంతి ఆపరేషన్ చేయవలసి వస్తే అది క్యాన్సర్ అని తేలింది. దాంతో ఉద్యోగవిరమణ అనంతరం వచ్చిన డబ్బులన్నీ భార్య అనారోగ్యానికి మందులకు, కుటుంబ పోషణకు చాలక పదవతరగతి తోటే లతిక చదువు  మాన్పించేద్దాం అనుకున్నారు కానీ అందుకు సువర్చల ఏ మాత్రం ఒప్పుకోలేదు.

" ఆడపిల్లకు చదువు ఈ రోజుల్లో చాలా అవసరం నాన్న . నువ్వు ఈనాడు దానికి చదువు అవసరమైన ఖర్చు అనుకోవచ్చు. ఆ చదివే రేపు నీకు వృద్ధాప్యంలో ఆధారం కావచ్చు. రేపు దానికి ఎలాంటి భర్త వచ్చినా అతనికి ఇష్టమైతే ఉద్యోగం చేసి సహాయపడుతుంది.లేదంటే తన పిల్లలకు చదువు తానే చెప్పుకుంటుంది. మీకు సరైన సమయం లేదు .అమ్మ విద్యావంతురాలు కాకపోవడం వల్ల మేం చదివినంత కాలం ట్యూషన్ లకు డబ్బు పోశారు. ఆ అవసరం రేపు దానికి రాకుండా చేసేదే మీరు చెప్పించే చదువు .అందుకే 'ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు 'అని అన్నారు. నువ్వు చదివించ లేను అంటే దాని చదువుకయ్యే ఖర్చు అంతా నేను భరిస్తాను. అందుకు అవసరమైతే ఆయనను ఒప్పిస్తాను కూడా." అది తండ్రికి ఉద్బోధ చేసింది సువర్చల .

ఆయన ముందు అంగీకరించిన తరువాత చేతులెత్తేశాడు. తన కాలేజీ లో చేరడానికి కారణం కొత్త ప్రపంచాన్ని తన అనుభవంలోకి తీసుకు వచ్చిన అక్క అన్నా,అక్క యొక్క విశాల భావాలు అన్నా లతిక కు అత్యంత ప్రేమాభిమానాలు. అందుకే అక్కను అప్పుడప్పుడు 'ఆడద్రోణాచారి' అని ఆటపట్టిస్తూ ఉంటుంది.

'అదేమిటే అంటే' ..."అవును అక్కయ్య. నా చెయ్యి పట్టుకుని ఓం నమశ్శివాయ బీజాక్షరాలను పలక మీద రాయించిన గురువు ఎవరో నాకు తెలియదు గానీ నా దృష్టిలో మాత్రం నా గురువు నువ్వే. ఎన్ని జన్మలెత్తి నీ రుణం తీర్చుకోగలను' అంటుంది ఆర్ద్రత నిండిన కళ్ళతో.

" తప్పమ్మా. తీర్చే అవసరం వస్తే తీరుద్దువు గాని లే .అయినా ఒక రక్తం పంచుకు పుట్టిన అక్కా చెల్లెళ్ళం.మన మధ్య రుణాలు ఏమిటి?" అంటూ తేలిగ్గా తీసి పడేస్తుంది సువర్చల.

అయితే అది అంత తేలికగా తీర్చుకొనలేని ఋణమని గాని, దాన్ని తీర్చుకునే అవకాశం మరే స్త్రీకి రాని విధంగా తనకి వస్తోంది అని తెలియని లతిక ,పిల్లలు స్కూల్ నుంచి రావడంతో దీపావళి రాత్రి టపాసుల్లా పేలుతూ, తుళ్ళుతూ అల్లరిచేస్తూ ఆటల్లో మునిగిపోయింది.

********

మరుసటి రోజు ఆదివారం .

ఏ నాడు ఉదయం గం.5:00 దాటి అరక్షణం కూడా పక్క మీద ఉండని సువర్చల ఏడు గంటలైనా లేకపోవడంతో అక్కను తట్టిలేపింది లతిక. ఆమె ఒళ్ళు జ్వరంతో పేలిపోతోంది. లతిక కంగారు పడిపోయింది. ఆమె కళ్ళలో గిర్రున నీళ్ళు తిరిగి జలజలా రాలి పోయాయి. గబగబా కాఫీ డికాషన్ తీసి కాఫీ కలిపి బావకి ఇవ్వడానికి వెళ్ళింది.

గోపాలకృష్ణ ఎర్రని కళ్లతో నిద్రలేమితో ఉన్నట్లుగా చిరాకుగా పేపర్ తిప్పుతున్నాడు.

"బావా. గుడ్ మార్నింగ్ .అక్క ఇంత వరకు లేవలేదు. జ్వరం వచ్చింది కాబోలు.ఇదిగో కాఫీ."

అతను తిరిగి విష్ చేయలేదు .మౌనంగా కాఫీ తీసుకుని చేసి రెండు గుటకల్లోనే అంత వేడిగా ఉన్న కాఫీ తాగేశాడు.

"బావా.  అక్క కి.." ఆమెకు కన్నీళ్లు ఆగడంలేదు.

గోపాలకృష్ణ మాట్లాడలేదు. తలవంచుకున్నాడు. ఆమె బావ తాగిన కప్పు తీసుకుంది.

" లతిక.నేను వెళ్లి టాబ్లెట్స్ తెస్తాను. ఈలోగా అక్కని లేపి బ్రష్ చేయించి కాఫీ తాగించు. ఇప్పుడే 5 నిమిషాల్లో వస్తాను" అని చెప్పి షర్టు వేసుకుని బయటకు వెళ్ళిపోయాడు గోపాలకృష్ణ.

అతను అంత చిరాకు గా ఉండడం లలిత ఏనాడు చూడలేదు. అతను టాబ్లెట్లతో తిరిగి వచ్చేసరికి అతను చెప్పినట్లు చేసింది లతిక.

సువర్చల టాబ్లెట్ వేసుకుని వేడివేడిగా చెల్లెలు ఇచ్చిన కాఫీ తాగింది.ఆ పూట లతికే వంట చేసింది .

సువర్చల స్నానం చేసి పడుకోబోతూ భర్త దగ్గరగా వచ్చింది.

" చూడండి. మీకు మళ్ళీ వీలు కుదరదు. దాన్ని ,పిల్లలని తీసుకుని ఎక్సల్ వరల్డ్ కో, ట్యాంక్ బండ్ కో వెళ్ళిరండి .పాపం దానికి ఇంట్లో ఏమీ తోచదు."

" ఉహు.నేను ఎక్కడికీ వెళ్ళను. పిల్లల్ని తీసుకు వెళ్ళు బావా. నేను, అక్క కబుర్లు చెప్పుకుంటాం. లేదా అక్కకి ఏదో పనిలో సాయం చేస్తాను. నేను మాత్రం ఇవ్వాళ ఎక్కడికి రాను. అసలే నిన్నటి ప్రయాణం బడలిక నాకు ఇంకా తీరలేదు. పాపం... పిల్లల్ని తీసుకెళ్ళు బావా. మళ్లీ వారం మనం అందరం కలిసి వెళ్దాం"లతిక ఖచ్చితంగా చెప్పి పిల్లల్ని జాగ్రత్తగా తయారుచేసేసరికీ గోపాలకృష్ణకి తప్పింది కాదు. అతను పిల్లలను తీసుకుని వెళ్ళిపోయాడు.

******

వంట పని అంతా పూర్తయ్యాక బట్టలు సర్ది, బట్టలు ఉతికి ఆరవేసి, అక్క గారికి భోజనం పెట్టి తను తిని మంచం మీద నడుం వాల్చిన దగ్గరికి వచ్చింది లతిక.

" ఇప్పుడు చెప్పుకో!ఏంటి విశేషాలు?నిన్న సాయంకాలం బాగానే ఉన్నావు కదా. ఈ ఉదయానికి అంత జ్వరం ఎలా వచ్చేసింది?" వీపు మీద చేయి వేసి ఆప్యాయంగా చెల్లి అడిగిన ప్రశ్నకు జల ఊరినట్టుగా చివ్వున ఆమె కళ్ళల్లో తిరిగిన కన్నీళ్లు కంటి కొలుకుల నుంచి ధారగా వర్షించి దిండును తడప సాగాయి. సువర్చలా కన్నీరు దాచుకునే ప్రయత్నం చేయలేదు.తుడుచుకునే ప్రయత్నమూ చేయలేదు.

" అక్కా...ఏమిటిది?"సంభ్రమాశ్చర్యాలతో అడిగింది లతిక .

"ఏం లేదు గానీ ఎన్ని సంబంధాలు వచ్చాయి? అసలు నాన్న ఏం చేస్తున్నారు? నీ విశేషాలు చెప్పినదాన్ని బట్టి నా విశేషాలన్నీ చెబుతాను." చెల్లెలు వైపు తిరిగి అడిగింది సువర్చల.

" ఏముంది అక్కా... నీకు తెలియనిది ఏముంది మన పరిస్థితి? కాళ్ళు అరిగి పోయేటట్లుగా తిరుగుతున్నారు నాన్న. ఎవరిని సంప్రదించినా ఒకటే మాట.అమ్మాయి కనీసం డిగ్రీ చదివి ఉండాలి. కంప్యూటర్ టచ్ ఉండాలి. మంచి 'రంగు'ఉండాలి .అవసరమైతే ఉద్యోగం చేయాలి. కట్నం లాంఛనాలు ఏ మాత్రం తక్కువ కాకూడదు. ఇప్పటికి వచ్చిన సంబంధాలన్నీ ఇవే కోరికలతో వచ్చినవి. వీటిలో మంచి 'రంగు' అన్న క్వాలిఫికేషన్ తప్ప నా దగ్గర మరేమీ లేదు. అందుకే అసలు పెళ్లి వద్దు అనుకుంటున్నాను." వద్దనుకున్నా లతిక కళ్ళు చెమర్చాయి.

' తప్పు ఆ మాట అనకూడదు. తథాస్తు దేవతలు ఉంటారు. నీ విషయం నువ్వు చెప్పావు కాబట్టి నా విషయం చెబుతాను విను.మీ బావ గారి గురించి నీ అభిప్రాయం?"

"బావ బంగారం లాంటి వాడు. ఆయన వ్యక్తిత్వం ముఖ్యంగా భార్య గా నీ పట్ల ఆయన అనురాగం చూస్తే సార్థక నామధేయుడు అనిపిస్తుంది."

"కానీ ...కానీ.."

"ఊ...కానీ?"

" మీ బావ ఇపుడు ఒక ఉమనైజర్.''

"అక్కా. అంటే నాకు పూర్తిగా అర్థం కాలేదు. సంభ్రమంగా అడిగింది లతిక.

" నిన్నటి వరకు ఆరోగ్యంగా ఉన్న నేను రాత్రికి రాత్రి జ్వరానికి లోనై ఉదయం లేవలేక పోయానంటే?"

" అంటే ...?"

"మీ బావగారు రాత్రి నా మీద చూపించిన అతి పిచ్చి ప్రేమ"

"అంటే ...ఇంకా పూర్తిగా అర్థం కాలేదు"

" చూడు ఈ ప్రపంచంలో దేనికైనా హద్దు ఉంటేనే దాని అందం ఇనుమడిస్తుంది. హద్దు లేకుండా అతిగా ఉంటే వెగటు, అసహ్యం, జుగుప్స అన్ని భావాలు కలిసి జీవితమంటే ఏహ్య భావం ఏర్పడుతుంది. మీ బావగారికి ఇపుడు కనీసం ఒక రాత్రికి ఇద్దరు స్త్రీలు కావాలి ."

"అక్కా"సర్పద్రష్టలా ఉండిపోయింది లతిక.

"అవునమ్మా . పెళ్లి అయిన నాటినుంచి మా ఆర్థిక ఇబ్బంది ఆయనను ఒక డబ్బు సంపాదించే యంత్రంలా మార్చింది. ఉదయం ఆరు గంటల నుంచి స్కూలుకు వెళ్ళే దాకా ట్యూషన్లే ట్యూషన్ లు. ఉద్యోగం నుంచి వచ్చాక లోకల్ కాన్వెంట్ లలో ఒక్కో గంట వాగి వాగి పని చేసి రాత్రి తొమ్మిదింటికి అలసివచ్చిన ఆయన భోజనం చేసిన వెంటనే నిద్రలోకి జారుకునే వారు .

ఇల్లంతా సర్దుకుని అందమైన చీర కట్టుకుని సన్నజాజులు, మల్లెలు ఏవో ఒకటి తల్లో తురుముకొని రంభలా ఆయన ముందు నిలబడితే ఫలితం శూన్యం.

అసలు సంసారానికి కూడా పనికి రాడేమో అన్న భయంతో ఎన్నో రాత్రులు నిద్ర లేదు నాకు. అయితే నా అదృష్టం పండి ఆయన నన్ను ఇద్దరు బిడ్డల తల్లిని చేశారు. పిల్లలు పుట్టాక నేను నా అంతట నేను ఆయన దగ్గరికి వెళ్లడం మానుకున్నాను. అలాగే నా దగ్గరకు వచ్చేవారు ఎప్పుడైనా అంటే ఏ సంవత్సరాలకో ఓసారి.

పెళ్లయిన నూతన దంపతులు రోజుకు రెండు మూడు సార్లు కూడా సంసారం చేస్తారని నేను పుస్తకాలు చదివాను . ఇరుగుపొరుగు అమ్మలక్కల ద్వారా విన్నాను కూడా. ఎంత ప్రయత్నించినా ఫలితం శూన్యం. ఆయన నా పోరు పడలేక ఎంతో మంది డాక్టర్లు కూడా కలిశారు సలహా కోసం. మందులకు కనీసం పది వేలకు పైగా పోసారు. అయితే ఏమాత్రం వాడినా ఫలితం కనిపించలేదు. మందులన్నీ అయిపోయే గాని కానీ ఆయనలో మార్పు లేదు.

మనిషికి మనసుని మించిన ఆయుధం లేదు. మనిషి తన మనసును నియంత్రణలో ఉంచుకుంటే ఆ ఆత్మవిశ్వాసం తో ఎంతటి విజయాన్నైనా సాధించగలడు.

మన మనస్సు నియంత్రణ చేసుకునే ఆత్మ శక్తి మనలో ఉంటే సంసార జీవితం అత్యద్భుతంగా అనుభవించవచ్చని కూడా పుస్తకాల్లో చదివాను.

70 సంవత్సరాలు ఉన్న భర్త కూడా 'వారానికి రెండు సార్లు అయినా తన భార్యతో సంవత్సరం చేస్తున్నాను అయితే నా భార్య నన్ను విసుక్కుని అసహ్యించుకుంటోంది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి' అని ఒక వారపత్రికలో ఉత్తరం రాశాడు.

"ఇవన్నీ నాకు ఎందుకు చెపుతున్నావో నాకు అర్థం కావడం లేదక్కా"

" పూర్తిగా వినమ్మా .ఈ 15 ఏళ్లలో యంత్రంలా పని చేసిన మీ బావ రెండు స్థలాలు కొన్నారు. ఇరవై లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్లు చేశారు. నిత్యం జరుగుబాటుకు ఆయన జీతం,వడ్డీలతో హాయిగా సాగిపోతోంది.

ఈనాడు ట్యూషన్లు అన్నీ మానేసి హాయిగా ఉంటున్నారు. ఎప్పుడైతే ఆర్థిక సమస్యలు వదిలి మానసికమైన సంతృప్తి లభించిందో అప్పటినుంచి ఆయనలో "పురుషుడు" విజృంభిస్తున్నాడు. ఎంతగానంటే ఆయనని... ఆయన నేను సంతృప్తి పరచలేకపోతున్నాను.

ఎన్నో రాత్రులు అసహనంగా గోడలను చేతులతో బలవంతంగా పిడికిలితో గుద్దులు గుద్ది తన ఆవేశాన్ని నియంత్రించుకున్నారో నాకు తెలుసు . కానీ నాకు ఇప్పుడు 40 ఏళ్లు వచ్చాయి. ఆయనని ఆయన బలాన్ని నేను తట్టుకోలేక పోతున్నాను. అలా అని ఆయనని వదిలేస్తే మరో ఆడదాని వలలోనో లేదా లేనిపోని అలవాట్లు చేసుకుంటారని నాకు విపరీతంగా భయం పట్టుకుంది. అందుకే... అందుకే... "

"అందుకే ఆయనని నీకు ఇచ్చి వివాహం చేద్దామనుకుంటున్నాను."

అక్క నోటి నుంచి వచ్చిన ప్రతి మాట తన నెత్తిన వడగళ్ల వాన కురిపించినట్లు ఫీల్ అయింది లతిక.

"అక్కా!" రెండు నిమిషాలు కొయ్యబారిపోయింది ఆమె...వానలో తడుస్తున్న ఆనందమో, వడగళ్ల దెబ్బలు తిన్న బాధో అర్ధం కాని దానిలా.

" అవునమ్మా ! నాన్న గారి కూతురువైనందుకు ఆయన సాంప్రదాయమే నీకు వచ్చింది అనుకో. ఈ పరిస్థితులలో అమ్మ నాన్న నీకు ఎలాగూ పెళ్లి చెయ్యలేరు. ఒక వేళ ఏ సంబంధం కుదిరినా నా చేయి పడాల్సిందే.పైగా ఆ వచ్చేవాడు ఎలాంటివాడో? అవునా?"

అవునన్నట్లుగా తలూపింది లతిక.

" బావ అంటే నీ అభిప్రాయం?"

" బావ అంటే నాకు...నాకు చాలా ఇష్టం. కానీ, కానీ ..."

"ఆ దృష్టితో ఎప్పుడూ చూడలేదు అంటావు. అవునా ! పోనీ నీ మనసులో ఎవరైనా ఉన్నారా?"

"అక్కా.మన పరిస్థితి తెలిసి నాన్నగారికి మరో సమస్య అవుతానని ఎలా అనుకున్నావ్? నీ మీద ఒట్టు."లతిక అక్క గారి తల మీద చేయి పెట్టింది.

ఆ చేతిని అపురూపంగా పట్టుకుంది సువర్చల.

' అందుకేనమ్మా. నేను నీకు చేసిన రెండేళ్ల సాయానికే నన్ను 'ఆడ ద్రోణాచార్య' అని పిలిచే దానివి .అలాగే ఆ గురువు హోదాలోనే అడుగుతున్నాను .నా మాట విని బావ ని పెళ్లి చేసుకో . ఇంత కన్నా గొప్ప సంబంధం నీకు ఎవరూ తేలేరు . నా భర్త అని చెప్పడం కాదు గాని మీ బావ నా పాలిట నిజంగా వేణుగోపాలుడే. అందుకే ఆలోచించి ఉదయమే నీ నిర్ణయం చెప్పు"

" మరి బావ ఏమంటాడో..?"నసిగింది లతిక.

" మన బావకి నాకు చెప్పగలననే నమ్మకం విశ్వాసం నాకు ఉన్నాయి. నాకు కావాల్సింది నీకు అభ్యంతరం లేకపోవడం."

" నన్ను బాగా ఆలోచించుకోనీ అక్కా" బలవంతంగా గొంతు పెగలదీసుకొని అంది లతిక.

" నీ ఇష్టం ఎంత సమయమైనా తీసుకో. కానీ నీ అభిప్రాయం నిర్దిష్టంగా, నిక్కచ్చిగా చెప్పు. నీకు ఇష్టం లేకున్నా పర్వాలేదు .నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేసే పూచీ నాది. సరేనా?''

లతిక మౌనంగా తల ఊపింది .ఆమె ఆ రోజంతా మళ్లీ సువర్చల తో మాట్లాడనేలేదు.

******

మరుసటి రోజు ఉదయం-

" సువ్వి.. సువ్వి...లే...కోపాలు మునిగిపోతుంటే ఏమిటా మొద్దునిద్ర?" భర్త ఉలిక్కిపడి లేచింది సువర్చల.

"లతిక కనబడడం లేదు" నెత్తి మీద పిడుగు పడ్డట్టయింది.ఇల్లంతా వెదికారు.

దొరికింది.

సువర్చల దిండు కింద లతిక రాసిపెట్టిన ఉత్తరం.అందులో ఇలా ఉంది.

" గురుదేవురాలైన అక్కయ్యకు లతిక ప్రణామాలు .

అక్కయ్యా. ఈ వయసులో ఆడదానికి తన భర్త కంటే తన పిల్లల మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. కానీ ...కానీ నీకు బావ పట్ల ఉంబ అచంచల విశ్వాసానికి, అనంతమైన అనురాగానికి నీ తోబుట్టువుగా పుట్టినందుకు నేను గర్విస్తున్నాను .

ఈ వయసులో కూడా నీ భర్త సుఖం కోసం అనుక్షణం ఆలోచిస్తున్నావు అంటే నీ లాంటి భార్య దొరికిన బావ ఎంతో... ఎంతో అదృష్టవంతుడు.

బావ అంటేనే 'ఎక్స్ కిరణాల' లాంటి చూపు.ఆ చూపులు ముందు అయస్కాంతంలా గాలం వేస్తాయి. తర్వాత భావాల లోతులు తెలుసుకున్నట్లు తేనెలు కురిపిస్తాయి. ఆ తేనెలు ఆస్వాదించడానికి ఏ సీతాకోక చిలక అయినా ఆయన వలలో పడి తీరవలసిందే. అలాంటి బావను నువ్వు నాకు ఇచ్చి వివాహం చేస్తానని అంటే ఎలా కాదనగలను ?నీకు బావకు నా జీవితాంతం సేవచేసుకునే భాగ్యం కల్పించిన నీకు కృతజ్ఞురాలిని.

కోహినూర్ వజ్రాన్ని అందుకోబోతున్న సంతోషంగా ఉంది నాకు.అన్ని విధాలా నాకు గురువైన నీకు నీ చెల్లెలుగా సమర్పించే గురుదక్షిణ నీ కోరికను మన్నించడమే. ఈ విషయం అమ్మా నాన్నకు చెవిని వేసి వాళ్లని స్వయంగా తీసుకురావడానికి వెళుతున్నాను. నీతో చెప్పకుండా పెడుతున్నందుకు నన్ను మన్నించు.

సదా నీ అడుగు జాడల్లో నడిచే నీ చెల్లెలు-

లతిక.

భార్యతో పాటు అదే ఉత్తరాన్ని వెనక నుంచి చదివిన గోపాలకృష్ణ అయోమయంగా భార్య కళ్లలోకి చూసాడు-'నిజమా'అన్నట్లు.

ఆమె భావగర్భితంగా భూదేవి అంతటి అంతటి సమస్యని సంతృప్తి అనే ఆకాశంతో కప్పుతున్నట్టుగా కళ్ళతో 'అవును' ఇచ్చిన సమాధానానికి అమాంతం తన ఎముకలు విరిగేలా కౌగిలించుకున్న భర్త గుండెల మీద తోటకూర కాడల తల వాల్చి కళ్ళు మూసుకుంది సువర్చల.

సమాప్తం



Rate this content
Log in

Similar telugu story from Drama