ఎప్పుడు వస్తాడో నా రాజు..
ఎప్పుడు వస్తాడో నా రాజు..
" ఏవిటేవ్ , మహ అందంగా తయారవుతున్నావ్, .. సాయంత్రం గెస్ట్ హౌస్ కి రా.., బంగారు గొలుసు తీసుకుపోదువు, నీ బంగారం లాంటి వంటికి, బంగారం మరీ అందాన్నిస్తుంది.. "
అని కారుకూతలు కూస్తున్నాడు చలపతి, బీడీలు చుడుతున్న మంగ ని, ఆశగా చూస్తూ...
" రేయ్, గుడిసెల పక్కకి, ఈ మధ్య అడవి దున్న ఒకటి, తెగ తిరిగి, గేదెలని, దూడలని సంపేత్తోందిట.. సాయంత్రం, మనమిద్దరం, కొడవలి, గునపం పట్టుకుని సిద్ధంగా ఉందాం.. దాన్ని అక్కడే నరికి నరికి సంపేద్దాం.." అన్నాడు వెంకడు, సత్యంతో.. పరోక్షంగా , చలపతికి వార్నింగ్ ఇస్తూ... వెంకడు,
ఆ బీడీల ఫాక్టరీకి, సరుకులు, ఎత్తిదించే, వ్యాన్ డ్రైవర్ ..
వెంకడు అంటే ఊర్లోవాళ్ళకి భయమే, చలపతితో సహా.. వెంకడు ఒక్క దెబ్బ కొడితే చాలు, వళ్ళు చచ్చుబడిపోతుంది అని...
చలపతి, వెంకడి మాటలకి భయపడి, తోక ముడవడం చూసి .. మంగ , వెంకడిని.. మెచ్చుకోలుగానూ, క్రృతజ్ఞతగానూ చూసింది...
మంగ తండ్రి ఎన్ని పెళ్ళి సంబంధాలు చూసినా, మంగ వద్దంటోంది..
మంగ తల్లి మంగని గట్టిగా నిలదీసి అడిగేటప్పటికి, మంగ చెప్పేసింది... తనకు వెంకడి మీద ప్రేమ ఉందనీ, పెళ్ళంటూ చేసుకుంటే వెంకడినే చేసుకుంటానని...
" ఎహె, వెంకడి జాతి, మన జాతి వేరు వేరు.. వాడితో నీ మనువుకి నేనొప్ప.." అని తెగేసి చెప్పేసాడు మంగ తండ్రి .. " లేదు అయ్యా, నా మనసుని నేను తిప్పుకోలేను, నాకు వెంకడే నా భర్త.." అని తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పేసింది మంగ కూడా...
" ఛీ ఫోవే నా ఇంట్లోంచీ,.. " అని మంగని, ఇంట్లోంచి గెంటేసాడు తండ్రి...
వెంకడి దగ్గరకు బయల్దేరి వెళ్ళింది మంగ.. ఆవేశం ఎక్కువగా ఉండే వెంకడు, దివాణం పెద్ద సూరయ్య తో, గొడవ పడుతున్నాడని తెలిసి, దివాణానికి పరుగు పరుగున వెళ్ళింది మంగ..
సూరయ్య, పూజారిని.. వడ్డీ కట్టలేదని, అతని కూతురి పెళ్ళికి ఆధారం అనుకున్న, ఎకరం పొలాన్ని, తన పేరు మీద రాసిచ్చేయమని, పూజారి మీద ఒత్తిడి తెస్తున్నాడు.. పూజారి అస్సలు ఒప్పుకోవట్లేదని, అతని ఇల్లంతా తన మనుష్యులతో, చిందరవందరగా చేయించి,.. పూజారి పూర్వీకులు, ఇల్లు దాటనీయద్దని, చెప్పి దాచి ఉంచిన, .. చిన్న భోషాణం పెట్టెని బలవంతంగా ఎత్తుకొచ్చేయించాడు సూరయ్య...
పూజారి అలా జరగటం, తమ వంశానికి, ఇంటికీ,.. అరిష్టమని, అపశకునమనీ, బాధపడి పరిగెత్తుకొచ్చాడు, సూరయ్య ఇంటికి, ..
ఆ పూజారి బాధ తీర్చటానికి, వెంకడు, సూరయ్యతో గొడవ పడుతున్నాడు...గొడవ పెరిగి సూరయ్య, తన మనుష్యులతో, వెంకడిని ముట్టడించేలా చేసి, వెంకడిని తమ దివాణంలో, చీకటి గదిలో బంధించేసాడు...
అది చూసిన మంగ, బీడీల ఫాక్టరీలో, తనతో కలిసి పనిచేసే, తోటి కార్మికులతో కలిసి, సూరయ్య మీదకి దండెత్తి వచ్చింది.. దివాణంలోకి బలవంతంగా చొరబడి, వెంకడిని వెతికి, బయటకు తీసుకొచ్చింది సురక్షితంగా...
ఇంకో గంట ఆగుంటే, సూరయ్య దివాణం చీకటి గదిలోకి, నాగుపాముని వదిలి, వెంకడిని చంపించేసేవాడు సూరయ్య.. మంగ చకచకా జనాలను పోగేసి, సూరయ్య దివాణం మీద దాడి చేసింది కాబట్టి , ఆ కాస్త సమయంలో, సూరయ్య, వెంకడిని ఏమీ చేయలేకపోయాడు.. అసలు మంగ ఇంత త్వరత్వరగా, వెంకడిని బయటికి తీసుకెళుతుందని, సూరయ్యకి తెలియదు, సూరయ్య ఊహించలేదు...
మంగ చేత, వెంకడు, కొండ దగ్గర, గుడికొచ్చి వెళ్ళే, యాత్రికులు ఇష్టంగా కొనుక్కు వెళ్ళే, చిక్కుడు గింజలు, బొప్పాయి ముక్కలు, ఆనపకాయలు, సహజంగా పండించే కాయగూరలు, ఉసిరికాయలు లాంటివి అమ్మే ఏర్పాటు చేసాడు...
మంగ వాటితో పాటు మల్లెలు , కనకాంబరాలు, డిసెంబర్ పూలు.. ఇలా సీజన్ ను బట్టీ వచ్చే పూలను చిక్కగా మాలలు కట్టి , ఇష్టం గా అమ్మేది.. పూలమాలలు కొనుక్కుని వెళ్ళేవాళ్ళు, చాలా అందంగా మాల కట్టావు అమ్మాయ్ , అని అంటే మంగ సంతోషంతో పొంగిపోయేది...
మంగ, వెంకడికి తన ఇష్టం గురించి తెలియచెప్పింది, తండ్రి తన మీద కోపం చేసాడని కూడా చెప్పుకుంది... " పిల్లా, నీ ఇష్టం నాకు అద్రృష్టవశాత్తూ దొరికిన వరమే, కానీ మీ అయ్య ఒప్పుకోనీ, అప్పుడు మనం మనువాడుకుందాం.." అనేసాడు వెంకడు ..
అలా సంవత్సరం గడిచింది.. మంగ తండ్రి, మంగ ఊసే మరిచాడు, రెండో కూతురికి పెళ్ళి జరిపిస్తున్నాడు.. మంగ మనసు ఇహ పూర్తిగా విరిగిపోయింది, తండ్రి నిరాదరణకు కుమిలి కుమిలి ఏడ్చింది... మనసు పడ్డ మనిషిని, నన్ను అన్నివిధాలా కాపాడుకుంటూ, కళ్ళల్లో పెట్టుకుని చూసుకునేవాడిని, నేను పెళ్ళి చేసుకోవాలనుకోవటం తప్పా, నాకంటూ ఇష్టం ఉండకూడదా.. అని మంగ ఆలోచించుకుంది...
మర్రోజు చెరువులో తలారా స్నానం చేసింది, అమ్మవారిని మనసారా తలుచుకుంటూ చెరువులో అయిదు మునకలు మునిగింది... కొత్తచీర కట్టింది, నుదుటిన పెద్దబొట్టులాగా దిద్దుకుంటూ కళ్యాణతిలకంలాగా మలుచుకుంది, జడ నిండా మల్లెలు, మరువం, కనకాంబరాలు కలిపి నిండుగా అల్లుకున్న రెండు మూరల పూలు పెట్టుకుంది...అద్దంలో చూసుకుంటే, తనకు తానే సీతమ్మ తల్లిలా అందంగా కనిపిస్తున్నాను అనుకుని మురుసుకుంది... తీరిగ్గా అన్ని రకాల పూలు గుట్టగా పోసి పెట్టుకుని, తనకి ఇష్టమైన పాట పాడుకుంటూ పెద్ద మాల అల్లి చివరన ముడేసింది... అందమైన పూలదండ తయారయ్యింది....
వెంకడు చెరువులో స్నానం చేసి వచ్చి, చెట్టు క్రింద ఉన్న జంట పాముల విగ్రహం దగ్గర , నుదుట కుంకుమ పెట్టుకుని, భక్తిగా రెండు చేతులు జోడించి, దేవునికి దణ్ణం పెట్టుకుంటున్నాడు... అతని మెడలో మెత్తగా పూలదండ పడింది.. కళ్ళు తెరిచి చూసాడు, ఎదురుగా పూర్తి అలంకరణలో అందంగా, ముగ్ధ మనోహరంగా నవ్వుతూ సిగ్గులమొగ్గవుతున్న మంగ, ఇహ నుంచీ నువ్వే నా భర్తవి, నా అర్ధభాగానివి, అంటోంది మంగ స్పష్టాస్పష్టంగా ...
" ఏవిటిది మంగా, ఎందుకీ తొందరపాటు.. మీ నాన్నని ఒప్పించుకునేవాళ్ళం కదా.." అన్నాడు వెంకడు, మంగను మందలిస్తూ... " మా నాన్న ఎప్పటికి ఒప్పుకునేను, మనం ముసలివాళ్ళం అయినా మా నాన్న మనని పట్టించుకుంటాడన్న నమ్మకం నాకు లేదు మావా " అంది మంగ సర్దిచెబుతున్నట్టుగా...
వెంకడు అడ్డంగా తలూపుతూ, మెడలోని పూలదండ తీసి , చెట్టు కొమ్మకి వేలాడదీసి, కోపంగా వెళ్ళిపోయాడు... మంగ మాత్రం కొత్త పెళ్ళి కూతురిలాగా , " నా భర్తని, నన్ను చల్లగా చూడు దేవుడా " అని శ్రద్ధగా, భక్తిగా దేవుడికి దణ్ణం పెట్టుకుని వేడుకుంది మనసారా ...
ఆ రోజు సాయంత్రం, ఎర్రంచు తెల్లచీర కట్టుకుని , తలనిండా మల్లెల మాల ధరించి తల్లి దగ్గరకు వెళ్ళింది మంగ... తల్లి పాదాలకు దణ్ణం పెట్టుకుని , తల్లిని తనివితీరా గుండెలకు హత్తుకుని , తన వివాహజీవితం మొదలుపెట్టేందుకు తల్లి ఆశీస్సులు తీసుకోవాలి అనుకుంది మంగ...
తమ ఇల్లు కాస్తంత దూరంలో ఉండగా, తమ ఇంటి ముందు ఏదో గలాటా జరుగుతోందని చూసింది మంగ..పరుగు పరుగున వెళ్ళి చూసింది.. తండ్రి , చెల్లెలి భర్తను బతిమాలాడుతున్నాడు ,
" బాబూ , ఒక్క నెల సమయం ఇవ్వు , నా రెక్కలు ముక్కలయ్యేలా శ్రమ పడైనా సరే, మీ అమ్మకి బంగారు చెవి దుద్దులు చేయిస్తా, నా కూతురి పెళ్ళిజీవితం మొదలవకుండానే, పాడుచేయద్దు బాబూ , ఎన్ని ఆశలతోనో నా కూతురు నీ చేత మూడుముళ్ళూ వేయించుకుంది " అని తండ్రి , కొత్త పెళ్ళికొడుకు రమణ ని బతిమాలాడుతున్నాడు...
రమణ తల్లి , రమణ చెయ్యి పట్టుకుని లాక్కుపోవాలని చూస్తోంది..
చెల్లి మణి ఏడుస్తోంది.. తల్లి తల కొట్టుకుంటూ, చీరకొంగు నోటికి అడ్డం పెట్టుకుని ఏడుస్తోంది...
మంగకి ప్రాణం కొట్టుకుపోయింది.. " అయ్యో నా మనుషులు కష్టం లో ఉన్నారు " అనుకుని గబగబా చెల్లి దగ్గరకు వెళ్ళి ఓదార్పుగా చెల్లి చెయ్యి పట్టుకుంది..
రమణ తల్లి పార్వతి , మంగని చూసి " ఇదుగో నీ పెద్దకూతుర్ని ఎలాగో కట్నం ఖర్చు తప్పించుకోవడానికి బయటకు తరిమేసావుగా , ఈ చిన్నకూతురికి పెట్టేందుకు కూడా లోభిస్తావెందుకూ " అని పార్వతి, మంగ తండ్రిని నిందిస్తోంది...
అప్పుడు మంగ వైపు, మంగ తండ్రి " నువ్వెందుకు తగలడ్డావు ఇప్పుడు ఇక్కడికీ " అన్నట్టు అసహ్యంగా చూసాడు.. మంగకి మనసుకి చాలా బాధనిపించింది , తండ్రి చూపులకి...
అప్పుడే వెంకడు అక్కడికి వచ్చాడు..
" రమణా , అమ్మకి సోమవారంకల్లా మంగ, నేనూ వచ్చి బంగారం అందిస్తాము, మణిని కాపురానికి తీసుకెళ్ళండి " అని రమణకి మాటిస్తున్నాడు...
" ఛీ ఎవడిక్కావాలిరా నీ నీచమైన సొమ్ము ,
ధూ నీ డబ్బుతో నా చిన్నకూతురి కాపురం బాగుపడేట్లయితే, నాకు నా కూతురు బరువేమీ కాదు, నాతోనే ఉంటుంది " అన్నాడు మంగ తండ్రి ఛీత్కారంగా, వెంకడిని చూస్తూ..
" అయ్యా, అవునవునూ, నీ జాతే రమణది, కానీ నీ కూతురిని పెళ్ళి చేసుకుని కూడా, వాళ్ల అమ్మకి బంగారం పెళ్ళిసమయానికి నువ్వు ఇవ్వలేకపోయావని, కట్టుకున్న భార్యని బాధపెడుతున్నాడు.. , కానీ నా వెంకడు, మానవత్వం నిండుగా ఉన్న మానవుడు, ఆయనకు జాతి, హోదాతో పనిలేదు , సాటిమనిషికి సాయం చేస్తే చాలు అనుకుంటాడు "అలాంటివాడిని నువ్వు, ఛీ కొడతావు, ధూ అంటావు , మీ వైపుకి వెంకడు రాకూడదని నువ్వనటం కాదు , అసలు వెంకడు వ్యక్తిత్వానికి, మీరు సరితూగలేరు " అంటోంది ఆవేశంగా మంగ...
" మంగా నువ్వుండు,.. మణీ నువ్వెళ్ళమ్మా రమణతో , రమణా తల్లి ఎంత ముఖ్యమో, తాళి కట్టాక భార్య కూడా అంతే ముఖ్యం, మన యువకులం అటు తల్లికీ, ఇటు భార్యకీ ఇద్దరికీ న్యాయం చేయాలి, నీ వంట్లో సత్తువ లేదా , నీ గుండెల్లో నీ మీద నీకు నమ్మకం లేదా, ఆ మాత్రం వాళ్ళిద్దరికీ, నువ్వు వాళ్ళ అవసరాలకు సమకూర్చలేవా , మణిని ప్రేమగా, బాధ్యతగా మీ ఇంటికి తీసుకెళ్ళు, వచ్చే సోమవారం మంగ తన చెల్లెలి ఇంటికి బంగారం, చలిమిడితో సారె తీసుకొస్తుంది " అని వెంకడు, రమణకి నమ్మకం కలిగించాడు, తక్షణ కర్తవ్యం బోధించాడు...
రమణ తన తల్లి వైపు ఊరుకోమ్మా, ఒప్పుకోమ్మా అన్నట్లు చూసి " మణీ నీ సామాన్లు సర్దుకున్నట్లేనా, మనింటికి బయలుదేరుదాం " అన్నాడు...
మంగ తల్లి వెంకడికి , రమణకి చేతులు జోడించింది.. అలా వద్దు అన్నట్లు వెంకడు తల అడ్డంగా తిప్పుతూ తనూ చేతులు జోడించాడు , రమణ మణితో కలిసి అత్తకి, మావకి కాళ్ళకు దణ్ణం పెట్టుకున్నాడు...
మంగ, వెంకడి వైపు ప్రేమగా చూస్తూ , వెంకడు దగ్గరకు వచ్చి నుంచుంది...
మంగ తండ్రి తెలిసీతెలియని, అర్థం అయ్యీ అవ్వనీ అసహనంతోనూ, ఊరటతోనూ.. ఊగిసలాడుతూ, ఓ పక్కన నుంచుని ఉన్నాడు...
చెల్లి కాపురం పదిహేనురోజుల్లో సరిదిద్దింది మంగ, వెంకడి సాయంతో..
తండ్రి అభిప్రాయంలో, వెంకడి పట్ల ఎలాంటి సానుకూలమార్పూ లేదు...
మంగ తండ్రి కూడా పూర్తిగా ఇష్టపడితేనే, మంగ మెడలో తాళి కడతాను, లేదంటే నిన్ను నా భార్యగా దగ్గరకు తీయను అంటాడు వెంకడు స్పష్టంగా ...
మంగకి వెంకడి ఆలోచనల్లో మంచితనమూ, మూర్ఖత్వమూ రెండూ కనిపిస్తాయి.. ఎవ్వరూ లేని వెంకడు, మంగ కూడా తన కారణంగా తన తల్లి తండ్రి చెల్లికి దూరం కాకూడదు అనుకుంటాడే కానీ ఇప్పటికే మంగను తండ్రి ఇంట్లోకి రానివ్వట్లేదు అనేది సరిగ్గా అర్థం చేసుకోడు...
పట్టణంలో మల్టీప్లెక్స్ పనికి పోయాడు వెంకడు, తరువాత బొంబాయికి కూడా చేరిపోయాడు ఇంకా పెద్ద పెద్ద పనుల కాంట్రాక్టులకు ఒప్పుకుని.. మంగకు దూరం దూరంగా ఉంటే అయినా , మంగ తండ్రి మంగని దగ్గరకు తీస్తాడని, మంగ మరొకరిని పెళ్ళి చేసుకుని తన అమ్మానాన్నలకు దగ్గరవుతుందేమో అని వెంకడి ఆలోచన... మంగకి ఏ లోటూ ఉండకూడదని వెంకడి ప్రయత్నం ...
కానీ వెంకడు తన పక్కన ఉంటే తనకి, తన ఆనందానికి ఏ లోటూ ఉండదని మంగకి తెలుసు , తనకి తెలిసింది ఎన్నిసార్లు వెంకడికి నచ్చ చెప్పాలని చూసినా , వెంకడు ఏదో ఒక సందేహంతోనో , సంశయంతోనో మంగకి దూరంగానే ఉన్నాడు తప్ప మంగని దగ్గరకు తీయలేదు...
మంగ తల్లి ఎంతలా తన భర్తని బతిమలాడినా, మంగ తండ్రి మూర్ఖంగా ఉండి, వెంకడిని తమలో కలుపుకోవటానికి అస్సలు ఒప్పుకోలేదు...
సంవత్సరాలు గడిచినా మంగ ఒంటరితనానికి పరిష్కారం దొరకట్లేదు... ఇంక ఆ దసరాకి ఊరు వచ్చిన వెంకడిని మంగ నిలదీసింది , మంగ తల్లి కూడా వెంకడిని అడిగింది.. మంగ మెడలో వెంకడిని తాళి కట్టమనీ , మంగని కూడా తనతో పాటుగా బొంబాయికి తీసుకెళ్ళమని...
వెంకడూ ఒక రకమైన మొండివాడు , మంగ తండ్రీ ఒక రకంగా మూర్ఖుడూ...
ఫలితంగా మంగ, జంటలేని పక్షిలా మిగిలిపోయింది...
వెంకడిది మంచితనం కాదూ , మొండితనం అని మంగకి అర్థం అయ్యేసరికి, మంగకి పెళ్ళి వయసు దాటిపోయింది... అయినా మంగ కూడా, తాను ఒకనాడు వెంకడి మెడలో దండ వేసేసాను కాబట్టి వెంకడే తన భర్త అని మరొకరితో పెళ్ళి అన్న ఆలోచనే చెయ్యలేదు...
" వస్తాడు నా రాజు " ఈ రోజు , ఏదో ఒక రోజు మంగా అంటూ తన ప్రేమని నాకు అందిస్తాడు నా వెంకడు " అని అనుకుంటూ.. .. " చుట్టూ పచ్చని ప్రకృతి , మేఘాలు ముసిరి వానపడేలాంటి వాతావరణంలో, కొండ రాయి మీద కూర్చుని తన ప్రాణసఖుని కోసం ఎదురుచూస్తూ కూర్చుంటూ ఉంటుంది మంగమ్మ ..

