STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

ఏ నావది ఏ తీరమో

ఏ నావది ఏ తీరమో

4 mins
6


లీల,ఉమేష్..ఇద్దరూ కూలీ పని చేసుకుని బతికేంత మాత్రమే ఆర్ధికస్థోమత ఉన్నవారు..కష్టాన్ని నమ్ముకుని బతుకుతూ,శ్రమ పడటంలో ఏ లోటూ లేనివారు..


నెమ్మది నెమ్మదిగా ఒక మధ్యతరగతి స్థాయి అంతగా ఎదగగలిగారు...


ఢిల్లీ లో నాలుగంతస్థుల ఇల్లు ఒకటి ఉంది..అక్కడ కింద ఒక గది అద్దెకి తీసుకుని ఉన్నంతలో సంతోషంగా ఉన్నారు..


మొదటి అంతస్థులో కొత్తగా పెళ్ళైన జంట ఉన్నారు దివాకర్ దంపతులు..


ఇద్దరూ ఉద్యోగస్థులు...కింద ఉన్న దంపతులతో పెద్దగా పరిచయం లేదు..


కాకపోతే దివాకర్ పెళ్ళికి ముందు నుంచీ అక్కడే అద్దెకు ఉంటున్నాడు కాబట్టి ఉమేష్ తో అప్పుడప్పుడూ మెట్లదగ్గర కూర్చుని మాట్లాడి ఉమేష్ మంచీచెడూ తెలుసుకునేవాడు...


ఉమేష్, లీల అమాయకులు, మంచివారు...అని దివాకర్ కొత్తగా పెళ్ళి అయి వచ్చిన భార్యకి చెప్పేవాడు...


లీల కడుపుతో ఉంది..ఉమేష్ లీల సంబరపడ్డారు...


కొన్ని నెలలకి ఉమేష్ ఆరోగ్యం సన్నగిల్లింది...కారణం ఏమిటో అని పరీక్షలు చేయిస్తే జాండీస్ (పచ్చకామెర్లు) అని తెలిసింది...వారికి అయినంతలో వైద్యం చేయించుకుంటున్నారు...


ఒకరోజు దివాకర్, ఉమేష్ ను చూసి..డల్ గా ఉన్నాడు అనిపించి కారణం అడిగితే జాండీస్ వచ్చింది, చికిత్స జరుగుతోంది అని తెలిసింది...జాగ్రత్తగా ఉండు అని ఉమేష్ కి ధైర్యం చెప్పాడు దివాకర్ .


దివాకర్ భార్య శృతి కూడా కడుపుతో ఉంది...


అదే ఊరిలో ఉన్న పుట్టింటికి వెళ్ళి సంబరాలు చేసుకున్నారు శృతి, దివాకర్...


ఉద్యోగాలు చేస్తూ బిజీగా ఉండే దివాకర్ దంపతులు ఇంట్లో ఉండేది పొద్దున్న ఓ రెండు గంటలు...


సాయంత్రం శృతి ఆరింటికి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి ఇల్లు శుభ్రం చేసుకుని, గిన్నెలు కడిగి వంట మొదలుపెట్టి ..ఇలా తొమ్మిదింటికి భర్త వచ్చేవరకూ ఏదో పని చేసుకునేది, తనకిష్టమైన పాటలు టూ ఇన్ వన్ లో వింటూ...శని ఆదివారాలు వస్తే షాపింగ్ అని, పుట్టింటికి వెళ్ళటం అంటూ బిజీ ఇద్దరూ...


అందుకే తాము అద్దెకుంటున్న బిల్డింగ్ లో విషయాలు అంతగా తెలిసేవి కాదు దివాకర్ వాళ్ళకి...


ఒక రాత్రి శృతికి నిద్ర పట్టటమే లేదు..ఏదో తెలీని అశాంతి...ఎంత ప్రయత్నించినా కునుకు పట్టనేలేదు..పొద్దున్నే కింద ఏదో అలజడి..


ఏమిటో అని బాల్కనీ లోంచి చూస్తే కింద మనుష్యులు చాలామంది ఉన్నారు..అసలే ఇరుకు సందులు...అలాంటి చోట అంతమంది ఒకేచోట...ఏమయ్యిందో అని దివాకర్ కిందకి వెళ్ళాడు...


తగ్గుతోంది అనుకుంటున్న జాండీస్ ఉమేష్ కి ఎప్పుడు తిరగబెట్టిందో ఉమేష్, లీల తెలుసుకోలేకపోయారు...


ఉమేష్ ఆ అర్ధరాత్రి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడు....


లీలకి ఏమీ అర్ధం కావటం లేదు ...


ఏడు నెలల గర్భవతి..మనిషి సన్నగా, పొట్ట ఎత్తుగా...చున్నీ తో మొహం కప్పుకుని కాసేపు, చున్నీ నోట్లో కుక్కుకుని కాసేపు ఏడుస్తోంది...నిజం చెప్పాలంటే అసలే అమాయకురాలు, ఇప్పుడు ఈ షాక్ కి అస్సలు బుర్ర పని చెయ్యనట్టు అయోమయంగా ఉంది...


బిల్డింగ్ లో అందరూ అక్కడికే వచ్చారు...కష్టం పంచుకున్నారు...తలో చెయ్యి వేసారు...


శృతి ఈ విషయం జరగగానే తన తల్లికి ఫోన్ చేసింది..శృతీ, నువ్వు కడుపుతో ఉన్న మనిషివి అక్కడికి వెళ్ళద్దమ్మా, నా దగ్గరికి వచ్చేయమ్మా అవన్నీ నువ్వు చూసి తట్టుకోలేవు, నాకు నీ సంగతి తెలుసు కదా..అంది..శృతి తల్లి..


శృతి ఒక నాలుగు రోజులు తల్లి దగ్గరే ఉంది...


తర్వాత ఒక రోజు ఆఫీస్ నుంచి తమ ఇంటికే వెళ్ళింది...కింద లీలా వాళ్ళ ఇల్లు..పక్కనే పైకి వెళ్ళే మెట్లు..మహానగరాల్లో చిన్న చిన్న స్థలంలోనే ఫ్లాట్లూ..మెట్లూ..పక్కనే నీళ్ళ మోటారూ..అంతా ఇరుకుమయం...శృతి నాలుగు రోజుల ముందు ఆ రోజు పొద్దున్న వెళ్ళటమే, మళ్ళీ ఈ రోజే బిల్డింగ్ కి రావటం...నిశ్శబ్దంగా ఉంది..ఎవ్వరూ లేరు...ఏంటో గుబులుగా బెరుకుగా అనిపించింది శృతి కి..ఏదో తెలీనీ భయం వేసింది తలుపు వేసి ఉన్న ఆ ఇంటి ముందు నుంచి వెళ్తూ మెట్లు ఎక్కి వెళ్ళాలంటే...ధైర్యం కూడగట్టుకుంటూ ఆంజనేయస్వామిని తలుచుకుంటూ మెట్లు ఎక్కేసి తమ ఫ్లాట్ లోకి వెళ్ళింది...


తన పనిలో తాను బిజీ అయిపోయింది...నాలుగో అంతస్థులో ఇంటి ఓనర్సుంటారు ..అక్కడి నుంచి కిందకు వస్తోంది లీల...


శృతి లీలను అప్పుడే చూడటం ఉమేష్ వెళ్ళిపోయాక...


" లీలా ఎలా ఉన్నావు, ఆరోగ్యం జాగ్రత్త.. " చెప్పింది శృతి...


" హా దీదీ..జాగ్రత్తగానే ఉంటాను "అంది...లీల..


కూర్చో అని లీలకు చెప్పి తాను రోజూ ఆ టైం కి ఒక పెద్ద గ్లాసు పాలు తాగుతుంది శృతి కడుపుతో ఉన్నప్పటినుంచి..ఈ రోజు పాలు వేడి చేసి లీలకి కూడా ఇంకో పెద్ద గ్లాసు నిండా పాలు తెచ్చి ఇచ్చింది శృతి..


ఇద్దరూ మాట్లాడుకుంటూ పాలు తాగారు...


" దీదీ బాగా ఆకలేసింది దీదీ...నువ్విచ్చిన పాలు ఆకలి తీర్చాయి " అంది లీల...శృతికి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి..లీల చూడకుండా వంటింట్లోకి వెళ్ళి రోటీ చేస్తాను..ఓ గంటలో వస్తావా...ఇస్తాను అంది శృతి...


" దీదీ..నా దగ్గర డబ్బులు లేవు..ఇంట్లో అన్నీ నిండుకున్నాయి...మా ఊరి నించి ఇంతదూరం రావాలంటే చాలా ఖర్చు..భరించలేమని ఎవ్వరూ రాలేదు...నేను రోజూ పని చెయ్యటానికి వెళ్ళేవాళ్ళ ఇల్లు కొంచెం దూరం...ఈ నాలుగు రోజులూ వెళ్ళలేదుగా..రేపు అక్కడికి వెళ్ళి డబ్బు తెచ్చుకోవాలి అనుకున్నా...పై ఇంటి దీదీ ని అడుగుదామని వెళ్తే ఆవిడ లేదు..పిల్లలు ఉన్నారు..వాళ్ళ అమ్మ బయటికి వెళ్ళింది అన్నారు.. " అంది లీల...


" సరే లీలా రోజూ ఈ టైం కి రా...ఒక గ్లాసు పాలు తాగుదువు గానీ నీకు, నీ బిడ్డకూ మంచిది... " అని శృతి లీలకు చెప్పింది...


సరే దీదీ...అని కొంచెం ప్రశాంతంగా వెళ్ళింది తన ఇంటికి లీల..


అలా రోజూ సాయంత్రం ఒక గ్లాసు పాలు తాగుతూ...తన ఇబ్బందులు శృతికి చెప్పుకునేది లీల..డెలివరీ టైం కి డబ్బులు కూడా లేవు దీదీ అని ఒకరోజు శృతికి చెప్పింది లీల...


తిండి పెట్టటం, పాలు ఇవ్వటం వరకూ అయితే చెయ్యగలను కానీ...డెలివరీ ఖర్చులంటే..ఇవ్వలేను..అని శృతి ఆలోచిస్తోంది....


తాను తెచ్చుకున్న పళ్ళల్లో ఓ పండు లీలకి ఇచ్చేది శృతి ...మళ్ళీ ఇంకో రోజు చెప్పింది లీల... 


" దీదీ..నేను పనిచేసే చోట వాళ్ళు బాగా ఉన్నవాళ్ళే...డెలివరీ ఖర్చులు మేము పెట్టుకుంటాము అన్నారు .. " అని..


సంతోషమేలే...ఒక ఆధారం దొరికింది లీలకి అని శృతి అనుకుంటుంటే...


లీల మళ్ళీ చెప్పింది..." వాళ్ళ చుట్టాల్లో ఎవరికో పిల్లలు లేరంట...వాళ్ళు నా బిడ్డని దత్తతు ఇచ్చేయమంటున్నారు అని ... " 


శృతికి కాసేపు నేను విన్నది నిజమేనా అనిపించి లీలను పరీక్షగా చూసింది..


లీల చాలా మామూలుగా చెబుతోంది...


శృతికి ఏమి మాట్లాడాలో తెలీట్లేదు...


లీల ఇంకా చెబుతోంది... " ఈ ఇంటి అద్దె కూడా నేను భరించలేనుగా...అందుకే ఎలానూ ఇక్కడ పని చేస్తావుగా...మా ఇంట్లోనే ఉండిపో అన్నారు వాళ్ళు... " అని చెప్పింది లీల...


ఆధారం లేని తీగకు..ఏ ఒక్క తీగ దొరికినా చాలు అల్లుకుపోతాను అన్నట్టుగా లీల పరిస్థితి అర్ధం అవుతోంది శృతికి...


" అంటే బిడ్డను వాళ్ళకి ఇచ్చినా పెంపకం అంతా నువ్వే చూసుకునేటట్టుగానా.. " అడిగింది శృతి అలా అయితే బావుండు అనుకుంటూ..


ఒక తల్లి, బిడ్డకు..,...ఒక బిడ్డ, తల్లికీ .. దూరం కాకుండా ఉంటే బావుండును అన్న తాపత్రయం శృతిది మరి....


" లేదమ్మా బిడ్డను తీసుకునేవారు వేరే ఊళ్ళో ఉంటారు...నేను పనిచేసే వాళ్ళు వయసులో పెద్దవాళ్ళు వాళ్ళకి పనులన్నీ చేసిపెట్టేందుకు నేను ఆధారం...నాకూ నెల తిరిగేటప్పటికి ఇంటి అద్దె, ఖర్చులు అంటూ బుర్ర బద్దలవకుండా వాళ్ళు ఆధారం... " అని చెప్పింది లీల....


శృతి కళ్ళల్లో ఏమి చూసిందో..." దీదీ రేపే నేను వెళుతున్నా అక్కడికి...ఇంక మళ్ళీ నిన్ను చూస్తానో లేదో...నీ ఆరోగ్యం జాగ్రత్త..." అని కిందకి వెళ్ళటానికి లేచింది లీల...


" ఒక్క నిముషం అని...తన పర్సు లో ఉన్న ఒక వెయ్యి రూపాయలు, రెండు పెద్ద యాపిల్ పళ్ళు లీలకు ఇచ్చింది శృతి...


ఏ జన్మ రుణమో తీరిపోయింది...కానీ లీల ఎక్కడున్నా బావుండాలి...ఎన్నో ఆశలతో రెక్కల కష్టాన్ని నమ్ముకుని..ఊరు కాని ఊరు వచ్చిన బడుగు జీవులు....ఒక తోడు గాల్లో కలిసిపోగానే...ఏ తోడూ లేని ఒంటరి పక్షిలా రెక్కలుండీ తోడులేక ఎగరలేక...కడుపులో ఉన్న పాశం కూడా దూరమైతే అని లీల గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది శృతి....


ఏ నావదె తీరమో ఏ నేస్తమే జన్మవరమో

ఏ నావదె తీరమో ఏ నేస్తమే జన్మవరమో

కలగానో కథగానో మిగిలేది నీవే ఈ జన్మలో

ఏ నావదె తీరమో ఏ నేస్తమే జన్మవరమో

అనే పాటలాగా...ఎవరు ఎక్కడికి చేరాలో అక్కడికే పయనాలు..జీవనగమనాలు..


Rate this content
Log in

Similar telugu story from Classics