Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

దివ్వెల వెలుగుల దీపావళి

దివ్వెల వెలుగుల దీపావళి

3 mins
264



*దీపావళి*


 పండుగలన్నింటిలోనూ ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని తెచ్చే పండుగ దీపావళి. దివ్య దీపావళి ఆశ్వీయుజ మాసములో అమావాస్య రోజు వస్తుంది. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు.

రామాయణంలో శ్రీరామచంద్రుడు రావణవధ అనంతరం అయోధ్యకు పుష్పక విమానంలో రాగా పుర ప్రజలు అనందంతో దీపాలు వెలిగించి వైభవముగా పర్వదినము జరిపారని చెబుతారు పెద్దలు.

ఇక విష్ణు పురాణము ప్రకారము యజ్ఞవరాహ స్వామికి, భూదేవికి జన్మించిన నరకాసురుడు శ్రీహరి చేతిలో చావులేని విధముగా తల్లి చేతిలో మరణాన్ని వరంగా పొందుతాడు.

అప్పటి నుండి లోకకంటకుడిగా మారి అందరినీ పట్టి పీడింప సాగాడు.అతని రాజధాని ప్రాగ్జ్యోతిషపురము. నరకుడు పదహారు వేల రాజకన్యలను తన దగ్గర బందీలుగా చేసి హింసింపసాగాడు.

అతడు ఇంద్రుని తల్లి అయిన అదితి యొక్క కుండలములను అపహరించాడు. అతని బాధలు పడలేని దేవతలు ద్వారకకువచ్చి శ్రీకృష్ణుని శరణు వేడగా, స్వామి వారికి అభయమిచ్చాడు.

భూదేవి అంశ అయిన సత్యభామతో కూడి నరకాసురుని వధిస్తాడు. ఆశ్వీయుజ బహుళ చతుర్థి నాడు నరకుని సంహారం జరిగింది కావున దానిని నరకచతుర్థశి అని ప్రజలు వాడి పీడ విరగడయినందుకు సంతోషముతో

అమావాస్య నాడు పండుగను జరుపుకుంటారు.దానికే దీపావళి అనిపేరు.

'దీపావళి 'అంటే దీపముల వరుస అని అర్థము.


భారత దేశములో అన్ని ప్రాంతాల్లో వైభవముగా దీపావళిని జరుపుకుంటారు.

కొన్ని ప్రాంతాల్లో ఈ పండగను ఐదు రోజులు జరుపుకుంటారు. ముఖ్యంగా ఉత్తరాదిలోనూ, మార్వాడీలలో దీపావళి చాలా ముఖ్యమైన పర్వదినము.

ఆశ్వీయుజ బహుళ త్రయోదశి నుండి కార్తీక శుద్ధ విదియ భగినీ హస్త భోజనము వరకు పండుగ జరుపుకుంటారు.


ధనత్రయోదశి /ధన్ తెరాస్.



ఈ రోజు ఇంటిని శుభ్రము చేసి క్రొత్త వెండి, బంగారు ఆభరణాలు పూజలో పెట్టి ధనలక్ష్మిని పూజిస్తే ఆ తల్లి సిరులు కురిపిస్తుందని నమ్మకము. ధనలక్ష్మి తో పాటు కుబేరుని కూడా పూజిస్తారు. ఈ రోజు ఏది కొన్నాకూడా అది అమృతమే అవుతుంది అని భావిస్తారు.

లక్ష్మీదేవి క్షీరసాగరాన్ని మథనము చేసినప్పుడు ఉద్భవించిందని ఈరోజు విశేషంగా లక్ష్మిని ఆరాధిస్తారు.


ధన్వంతరీ జయంతి :


ఆరోగ్య ప్రదాయకుడు, ఔషధాధిపతి ధన్వంతరి ఈ త్రయోదశి నాడే క్షీరాబ్ది నుండి అవతరించాడు.

కామధేనువు, కల్పతరువు, ఐరావతం, చంద్రుడు మొదలైన దివ్య శక్తుల తో పాటే ధన్వంతరి కూడా ఆవిర్భవించాడు. ఒక చేతిలో అమృత భాండము, మరొక చేతిలో ఆయుర్వేదం ధరించి వచ్చాడు. ధన్వంతరి కూడా శ్రీమన్నారాయణుని అంశ కాబట్టి ఆయనను పూజిస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుందని, ఆయురారోగ్యాలతో ప్రజలు సుఖంగా ఉంటారని విశ్వసిస్తారు.


నరక చతుర్థశి :


దీపావళి ముందు రోజు నరక చతుర్థశి. తెల్లవారు జామున నరకాసురుని బొమ్మ చేసి కాలుస్తారు.ఈ రోజు నువ్వుల నూనె ఒంటికి పట్టించి స్నానము చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో అడబడుచులు వచ్చి అన్నదమ్ములకు తలంటి, హారతులిచ్చి ఆశీస్సులు పొందుతారు. దీపావళి పండుగను బంధు మిత్రులందరితో కలిసి చేసుకోవటం ఆనవాయితి.

క్రొత్త దుస్తులు ధరించి నరకాసురుని వధ జరిగినందుకు ఆనందంగా టపాసులు కాల్చి, మిఠాయిలు పంచుకుంటారు.


దీపావళి :



ఆశ్వీయుజ అమావాస్య రోజున దీపావళి పండుగ. రాత్రి వేళలో ఈ పండుగను జరుపుకుంటారు. ఇంటిని శుభ్రం చేసి రకరకాల పిండివంటలతో నైవేద్యాలు పెట్టి దేవుని పూజ చేసి, లక్ష్మీ ఆరాధన అనంతరము సంధ్యాకాలంలో గోగు కర్రలకు గుడ్డ పీలికలతో కాగడాలు వెలిగించి గుమ్మల్లో నేల మీద కొడుతూ 'దిబ్బి దిబ్బి దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి 'అంటూ గోగు కర్రల్ని దూరంగా వేసి వచ్చి, అందరూ శుభ్రంగా కాళ్ళు కడుక్కొని, కుటుంబసభ్యులతో కలిసి మిఠాయి తింటారు.

తరువాత ఇంటిని దీపాలతో అలంకరణ చేస్తారు. మట్టి ప్రమిదలలో నువ్వుల నూనె వేసి దీపాలు వెలిగించి లక్ష్మీ దేవికి, తులసి మాతకు పూజ చేస్తారు.

ఆ తరువాత అందరూ బంధుమిత్రులతో కలిసి టపాసులు కాల్చి ఆనందిస్తారు.


బలి పాడ్యమి :


దీపావళి మర్నాడు కార్తీక శుద్ధ పాడ్యమిని బలి పాడ్యమి అంటారు. చతుర్దశి నాడు విష్ణుమూర్తి వామనుడి రూపంలో బలి చక్రవర్తిని పాతాళానికి అణచి వేయగా ఈ రోజు మళ్ళీ బలి భూమి మీదకు వచ్చాడు. అందుకని ప్రజలు 

బలికి పూజలు చేస్తారు.

శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని పైకెత్తి రేపల్లె ప్రజలను కాపాడిన రోజు ఇదే నని ప్రజలు కృష్ణునికి పూజలు చేస్తారు.


భగినీ హస్త భోజనము :



ఈ రోజును 'యమ ద్వితీయ,' అని 'భాయి దూజ్ 'అని జరుపుకుంటారు.

సూర్యుని కుమారుడు యముడు, కుమార్తె యమున. యముని ఎవ్వరూ ఇంటికి పిలవరు. కానీ తన సోదరుని తన ఇంటికి రమ్మని యమున ఎన్నో సార్లు పిలుస్తుంది.యముడు తీరిక లేక వెళ్ళలేక పోతాడు.

కార్తీక శుద్ధ విదియ నాడు తప్పకుండా తన ఇంటికి రావాలని అన్నను బ్రతిమిలాడగా యముడు ఈ రోజు తన సోదరి ఇంటికి వస్తాడు.

యమున సంతోషించి, అన్నకు అభ్యంగన స్నానము చేయించి, క్రొత్త బట్టలు పెట్టి, స్వయంగా వండిన రకరకాల పదార్థాలతో ప్రేమగా భోజనం పెడుతుంది. దీనినే "భగినీ హస్త భోజనము "అంటారు.ఈ రోజు సోదరికి సోదరులు కానుకలు తెస్తే, సోదరులకు

ఆడబడుచులు కానుకలు ఇస్తారు.

ఈ రోజు సోదరి చేతి భోజనము తింటే అపమృత్యు భయాలు తొలగిపోతాయి. సోదర సోదరీల మధ్య ప్రేమకు ఈ పండగ ఆదర్శంగా నిలుస్తుంది.


ఇలా ఐదు రోజుల పండుగ దీపావళిని దేశ విదేశాల్లో హిందువులు ఘనంగా జరుపుకుంటారు.

వానకాలము పోయి చలి కాలము వచ్చే ముందు పండగ. క్రిమి కీటకాదులు తొలగి పోవాలని, మతాబుల పొగతో క్రిముల బాధ పోతుంది. వాతావరణం స్వచ్ఛతతో నిండిపోతుంది.

నువ్వుల నూనె శరీరమునకు వేడిని కలుగ చేసి, ఆరోగ్యాన్నిస్తుంది. ఆ నూనె దీపాల వలన మనకు తేజస్సు, ఆరోగ్యము కలుగుతాయి.

సర్వ శుభములను కలుగ చేసే పర్వదినము దీపావళి.


-------------------


Rate this content
Log in

Similar telugu story from Classics