దింపుడు కళ్ళెం ఆశ
దింపుడు కళ్ళెం ఆశ


మాధవా! ఏందిరా ఆదెవ్వ ఇట్టా ఎల్లిపోయింది అంటూ ఆదెవ్వ దేహం చుట్టూ చేరిన వాళ్ళు ఆమె మనవడు మాధవని పలకరిస్తూ ఉన్నారు. ఏడేళ్ల మాధవ ఏడుస్తూ అందరినీ చూస్తూ కూర్చున్నాడు. ఆ ఊరి స్కూలు హెడ్మాస్టరుకు మాధవ అంటే అభిమానం.
అతను మాధవను ఓదారుస్తున్నాడు.
ఆదెవ్వ ఊర్లో అందరికీ తలలో నాలుకలా ఉండేది. మాధవ ఆమె ఒక్కగానొక్క కూతురి కొడుకు. కొడుకుల్లేరు.
కూతురు అల్లుడూ కూడా యాక్సిడెంట్లో చనిపోయారు. ఇప్పుడు ఆమె ఇలా కాలం చేసింది. ఆదెవ్వ దేహం చాప మీద వేసిన దుప్పటిలా ఉంది. దూరపు బంధువులు జరగాల్సిన ఏర్పాట్లు చేయడానికి వచ్చారు.
పంచాయితీ ప్రెసిడెంట్ తన దగ్గర పని చేసే అతనితో వచ్చి అన్ని పనులూ దగ్గర ఉండి చూసుకుంటున్నట్లు కనిపిస్తున్నాడు.
అంతిమ యాత్ర మొదలైంది. దింపుడు కళ్ళెం కోసం ఆదెవ్వ పాడెని దించారు.
మాధవ చేతిలో పట్టుకున్న కుండలోని అన్నాన్ని దర్భలతో మూడు సార్లు తిరుగుతూ వెనుక నుంచి తోస్తూ పడేయమని పిల్లాడితో చేయిస్తున్నారు.
ఏరా రాములూ! ఈ ముసల్దాని పింఛను డబ్బులో ప్రతీ నెలా కొంత నొక్కేసే వాళ్ళం కదా. ఇక ఏం ఉపయోగంరా మనకు? అని లోగొంతుకలో అన్నాడు ప్రెసిడెంటు.
అదేందయ్యా. ఈ ముసల్దానికి ప్రభుత్వ పథకం కింద ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి. ఆ బుడ్డోడి పేరు మీద ఇస్తారు. ఇక ఆ డబ్బులు ఎలా తీసుకోవాలో తమరికి నేను చెప్పాలా అని రాములు తన స్వామి భక్తి ప్రదర్శించాడు.
దింపుడు కళ్ళెం దగ్గర మూడు సార్లు చనిపోయిన వ్యక్తిని పిలవాలి అని పెద్దవాళ్ళెవరో అన్నారు.
మాధవ దీనంగా అవ్వా అవ్వా అవ్వా అని మూడు సార్లు పిలిచాడు.
ఆదెవ్వ మెల్లిగా లేచింది. ప్రెసిడెంటు మాట పెగలడం లేదు. ఆదెవ్వ కళ్ళు చింత నిప్పుల్లా ఎర్రగా మండుతున్నాయి.
ప్రెసిడెంటు గారూ! ప్రెసిడెంటు గారూ! ఎవరో నీళ్ళు ముఖం మీద చిలకరిస్తే స్పృహలోకి వచ్చాడు ప్రెసిడెంటు. చెట్టు క్రింద నీడలో ఉన్నాడు అతను. పక్కనే తువ్వాలుతో గాలి విసురుతూ రాములు.
ఆదెవ్వ. ఆదెవ్వ. అతని నోట్లోంచి మాటలు అప్రయత్నంగా వస్తున్నాయి.
ఆ. అయిపోయిందండీ. అందరూ మట్టి ఉప్పు వేశారు. పూడ్చేసి అందరూ ఊళ్లోకి తిరిగి వెళ్ళారు. మీరు చూసి వస్తారా అని అడిగాడు రాములు.
లేదు. లేదు. పద మనం ఇన్సూరెన్స్ డబ్బుల గురించి మాట్లాడదాం అని పంచాయితీ ఆఫీసుకు వెళ్ళారు.
ఆదెవ్వ పెద్ద కర్మ రోజుకు ప్రెసిడెంటు వచ్చి ఊరి జనం ముందు ఇన్సూరెన్స్ డబ్బులు ఆ పిల్లవాడి పేరుమీదే ఉంటాయని ఆ వివరాలు ఊరిలో ఉన్న స్కూలు హెడ్మాస్టరుకు అప్పగించాడు.
ఆ తరువాత ప్రెసిడెంటుకి ఆదెవ్వ ఎప్పుడూ కనిపించలేదు.