దీపావళి వచ్చిందోచ్..
దీపావళి వచ్చిందోచ్..
రేయ్. ఫస్టు మా ఇంటి కాడ పటాకులు కాల్చేసి వస్తా. మీ ఇంటి దగ్గర 1000 వాలా లాస్ట్ లో కాలుద్దాం. నేనే అంటిస్తా. నీకు భయం కదా అని చెప్పా మా పిన్ని కొడుకు చింటూకి.
వాడికి నిజంగానే అంత భయం లేదు. కానీ మనం అలా చెప్పాలి. ఎందుకంటే 1000 వాలా నేనే కాల్చాలి కాబట్టి.
నేనూ, మా తమ్ముడూ పటాకులు బాగా ఎండబెట్టి లోపల పెట్టుకున్నాం. ఎండలో పెడితే పటాకులు బాగా పేలుతాయి అంట.
దీపావళికి రెండు రోజుల ముందు నుంచే పటాకులు ఎండబెట్టుకోవడం, వాటికి తాతయ్య కాపలా కూర్చోవడం. అదో పెద్ద తంతు.
ఇక నరక చతుర్దశి రోజు పగలు కుక్క పటాకులు కొన్ని కాల్చి, గన్నులో రీళ్ళు నింపుకుని వీధిలో కాల్చుతూ తిరిగాం.
ఆ రోజు రాత్రి కాకర పువ్వొత్తులు కాల్చి నేను మళ్లీ పిన్ని వాళ్ళింటికి వెళ్ళాను. అప్పుడేమో బాబాయి కొన్ని కాకర పువ్వొత్తులు ఎవరో పిల్లలకి ఇస్తున్నాడు. వాళ్ళ ముఖాల్లో ఏదో వెలుగు. అవి తీసుకుని వాళ్ళు పరుగెత్తారు.
దీపావళి అంటే మన ఇంట్లో దీపాలు పెట్టుకుని, పటాకులు కాల్చేసుకోడం కాదర్రా. తోటి వారిని, పండుగ జరుపుకోలేని వారిని కూడా సంతోషంగా ఉంచాలి అన్నాడు బాబాయి.
ఏమిటో బాబాయి మాటలు నాకర్థం కాలేదు. 1000 వాలా నేనే అంటిస్తా అని చెప్పా.
సర్లేరా అన్నాడు బాబాయ్. నేనూ, చింటూ పటాకులు కాల్చడం మొదలుపెట్టాం.
