We welcome you to write a short hostel story and win prizes of up to Rs 41,000. Click here!
We welcome you to write a short hostel story and win prizes of up to Rs 41,000. Click here!

Varun Ravalakollu

Fantasy


4.9  

Varun Ravalakollu

Fantasy


డెడ్ మేన్ పేరడాక్స్ - 4

డెడ్ మేన్ పేరడాక్స్ - 4

5 mins 432 5 mins 432

సత్యా నవ్వేసి కాలచక్రాన్ని ఒక నెల తరువాతకి (కాలయంత్రంతో పనిలేకుండానే, భవిష్యత్తుని ఊహించడం వల్లనయ్యుండాలి!) సెట్చేసి, ఆ మెషీన్లో పది నిముషాలున్నాట్ట. తరువాత సామంత్ అందులో కెళ్లాట్ట. అతను బయటికొచ్చిన తరువాత గర్వంగా

“నువ్వు రెండ్రోజుల్లో ఫినిష్. కేలండర్ మీద రాసుకో!” అన్నాట్ట.

సత్యా నవ్వి, “ఆ తరువాత వారం రోజులకే నువ్వు!” అని తలపక్కకు వాల్చేసి ఏక్షన్ చేశాట్ట. సామంత్ తలనెగరేస్తూ వెళ్లాట్ట.

***

ఇదంతా దీర్ఘంగా ఈమెయిల్లో రాశాడు. హఠాత్తుగా హార్ట్ బైపాస్ సర్జరీ చేయించుకోవలసి వచ్చి హాస్పిటల్లో పది రోజులు గడిపి ఇవాళ ఇంటికి వచ్చేటప్పటికి ఈ ఉత్తరం. ఇంకా ఏదో రాశాడు గానీ, ఈ అంతిమ దినాల గూర్చిన సంభాషణ గూర్చి తెలుసుకోగానే స్టన్ అయి చదవడం ఆపాను. ఇంతకుముందు ఇలాంటిది ఒకదానిగూర్చి వినివున్నాను గదా! సత్యా రాసినదాని ప్రకారం సామంత్ కి నూకలు చెల్లాల్సినది ఈరోజే. నిన్ననే రంజనితో మాట్లాడాను హాస్పిటల్లో ఉన్నానని తెలిసి నన్ను చూడడానికి ఆమె వచ్చినప్పుడు.

“రేపే గదా, సామంత్ వస్తానన్నది?”

“రావాలి మరి!” ఉదాసీనంగా జవాబిచ్చింది.

“ఇస్తాంబుల్లో ఆగుతానన్నాడు” అని జోడించింది.

వెల్లకిలా పడుకుని చదువుతున్న ఐపాడ్ని పక్కనపెట్టి టీవీ ఆన్చేసి సీఎన్ఎన్ పెట్టాను.

“ఇస్తాంబుల్ కాల్పుల్లో మరణించినవారి సంఖ్య,” అంటూ చెబుతున్నాడు రిపోర్టర్. అయిదు నిముషాల్లో అప్డేట్ చేస్తూ మరణించిన వారిలో సామంత్ పేరుతో ఒక అమెరికన్ ఉన్నాడని జోడించాడు.

అదిరిపోయాను. అంటే సత్యా? టైం మెషీన్ సునామీలాంటిది. టోర్నడోలాంటిది. ఆ సునామీ, టోర్నడోల గూర్చి వినడం వేరు, వాటి తాకిడి అనుభవంలోకి రావడం వేరు!

రంజనికి ఫోన్ చేశాను. హార్ట్ బైపాస్ ఆపరేషన్ అయి ఇవాళే ఇంటికొచ్చానని గుర్తు చేస్తూ మాట దాటెయ్యబోయింది. సామంత్ గూర్చిన వార్తని విన్నానని చెప్పింది గానీ ఆమె గొంతులో కొద్దిగా కూడా అనుకోనిదేదో జరిగిందన్న షాకు తాలూకు చిహ్నాలేవీ నాకు వినిపించలేదు.

“రెణ్ణెల్లు - ముందు కెళ్లడంతో ఆగితే బావుండేది. అనవసరంగా ఆర్నెల్లు ముందుకెళ్లింది!” అని ఆమెగూర్చి సత్యా చెప్పడం గుర్తొచ్చింది.

“సత్యా ఇంట్లో టైం మెషీన్లో ఇది నువ్వు తెలుసుకున్నావుగదూ?” ప్రశ్నించాను.

“ఇవాళ పోతాడని తెలుసు ఎలా పోయాడో మాత్రం ఇప్పుడే తెలుసుకున్నాను,” అన్నది.

“సత్యా పోతాడన్న రోజేదో సామంత్ నాకు ఫోన్చేసి చెప్పాడు. ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని వార్తల్లో వచ్చింది. తెలుగు పత్రికల్లో వచ్చిన వార్తలకి లింకులని ఈమెయిల్లో పంపిస్తాను,” అన్నది.

ఆమె పంపేదాకా ఆగకుండా నేనే ఇంటర్నెట్లో సెర్చ్ చేసి పట్టుకున్నాను.

“సైంటిస్టునని చెప్పుకుంటూ కొంతకాలంగా భవిష్యత్తుని చూపెడతా నంటూ ప్రజలని మోసం చేస్తున్న ఒక వ్యక్తి ఉదంతం నేడు వెలుగులోకి వచ్చింది. ఇప్పటిదాకా బాబాలూ, సన్యాసులూ ఇలా అమాయకులని మభ్యపెట్టడం గూర్చి విన్నాం కానీ, సైంటిస్టునని చెప్పుకుంటూ మోసం చెయ్యడంగూర్చి మాత్రం ఈనాడు మొదటిసారిగా చూస్తున్నాం. అది గూడా, అమెరికానుండి వచ్చానని చెప్పుకుంటున్న ఒక వ్యక్తి! అసలు సైంటిస్టో కాదో, అమెరికా నుంచీ వచ్చాడో లేదో నిర్ధారించేందుకు పోలీసు బలగాలు అమెరికా వెళుతున్నాయి. కానీ ప్రతీ మనిషిలోనూ అంతరాత్మ అనేది ఉంటుందనీ, అది ఎప్పుడో నాగుపాములా బుసలు కొడుతుందనీ, దానికి ఆ మనిషి తట్టుకోలేడనీ ఈ సత్యా అనే వ్యక్తి నిరూపిస్తున్నారు. తన మరణానికి వేరెవరూ బాధ్యులు కారనీ, ఇంతకాలం తను కొంతమంది విద్యార్థులని కోచింగ్ సెంటర్లలో చేర్చనీక పోవడాని కారణభూతుడై వాళ్ల భవిష్యత్తుని నాశనం చేసినందుకూ, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తులకి అత్యవసరమైన ఆపరేషన్లని చేయనీకుండా అడ్డుపడి కొందరిని అల్పాయుష్కులని చేసి వారి కుటుంబాలని తీవ్రమైన మనస్తాపాలకు గురి చేసినందుకూ ఎంతో చింతిస్తున్నాననీ, వారినందరినీ క్షమించమని వేడుకుంటున్నాననీ ఆయన తన ఉత్తరంలో పేర్కొన్నారని ఎస్సై సయ్యద్ కమ్రుద్దీన్ చెప్పారు. సత్యా జనాలని మోసగించడానికి ఉపయోగించిన మెషీన్ని కోర్టులో ఎవిడెన్స్ కింద ప్రెజెంటు చేసేందుకు చాలా జాగ్రత్తగా ఆ ఇంటినుండీ తరలించారు,” ఇవీ వార్తలు!

ఇండియాలో కొన్ని ఆత్మహత్యలు ఎలా సృష్టింపబడతాయో నాకు తెలుసు గనుక సత్యా చివరి నిముషాలనీ, వాటిల్లో సామంత్ భాగాన్నీ పాత్రనీ ఊహించగలను. లేకపోతే! సత్యా ఆత్మహత్య చేసుకోవడమా! వాడి ఈమెయిల్ని మళ్లీ చదవడం మొదలుపెట్టాను.

“సామంత్ నా చివర రోజేదో చెప్పి వెళ్లిన తరువాత ఒకరోజంతా ఆలోచించాను. తరువాతే ఇది నీకు రాయడం మొదలుపెట్టాను. ఈ కాలయంత్రం ద్వారా ప్రజలు భవిష్యత్తులోకి చూడగల్లడం రెండువందల శాతం నిజమని నమ్ముతున్నాను. అలాంటప్పుడు సామంత్ చెప్పిన మాట నిజమవాలి. అయితే, నేను రేపు పోతానని చెప్పాడుగానీ, ఎలా పోతానో వాడు నాకు చెప్పలేదు. నా అనుమానం నిజమయితే వాడికి కూడా ఆ విషయం తెలిసుండదు. అలాగే వాడు పోయే రోజేదో నాకు తెలుసుగానీ ఎలా పోతాడో మాత్రం తెలియదు. సామంత్ పోతాడని రంజనికి కూడా తెలుసుగానీ ఎలా పోతాడో తెలియదు, ఈ విషయాన్ని టైం మెషీన్ దాస్తున్నట్లుగా నాకు అర్థమవుతోంది. ఎలా పోతారన్న వివరాల గనుక తెలిస్తే అలా జరగకుండా జాగ్రత్తపడి భవిష్యత్తునే మార్చేస్తే తన అస్తిత్వానికి ముప్పొస్తుందన్న భయం కాబోలు దానికి! (ఆనాడు పరీక్షిత్తు మహారాజుకి తానెలా పోతాడో తెలియలేదు. ఈనాడు మేమెలా పోతామో మాకూ తెలియదు!) దానికి మరీ అంత తెలివితేటలని ఆపాదించక్కర్లేదనుకుంటే, మేథమేటిక్స్ టర్మినాలజీని ఉపయోగించి దానికి ‘సింగులారిటీ’ అని నామకరణం చేద్దాం! నువ్వూ ఇంజనీర్వే గనుక, నీకున్న విలువల గూర్చి నమ్మకమున్నవాణ్ణి గనుక ఈ యంత్రం గూర్చిన వివరాలని నీకు అందజేసే ఏర్పాట్లు చేశాను. నువ్వే తయారుచేస్తావో, ఇంకొకళ్లచేత చేయిస్తావో, లేక ఇంకా రీసెర్చ్ చేసి సింగులారిటీని తొలగించడానికి కృషి చేస్తావో నీ ఇష్టం. (నిన్ను నిరాశపరిచేందుకని కాదు గానీ, ఒక్క విషయాన్ని గుర్తుచేసాను. మనకి కనిపిస్తున్న విశ్వాంతరాళమంతా బిగ్బేంగ్ వల్ల - అదే సింగులారిటీ వల్ల ఏర్పడిందన్న నిర్ణయాని కొచ్చారు గానీ, దాని ముందర సృష్టి ఎలా ఉండేది అన్న విషయాన్ని ఈనాడు కూడా ఎంతగొప్ప సైంటిస్టులు అయినా సరే చెప్పలేక పోతున్నారు!) ఇవాళ రాత్రి కాలయంత్రానికి పవళింపుసేవ చేసే సమయంలో దీనిలోని కీలకమైన రెండుమూడు పార్ట్లని తొలగించి ధ్వంసం చేస్తాను. రేపు నేనెలా పోతానో తెలియకపోవచ్చు గానీ, నేను పోగానే సామంత్ ఈ మెషీన్ ని చేజిక్కించుకుంటాడని నాకు ప్రత్యేకంగా ఏ భవిష్యవాణీ తెలియజెప్పాల్సిన అవసరంలేదు. ఇప్పటికి మాత్రం నీకు తెలిసిన భాషలో - గుడ్బై మై ఫైండ్!”

సామంత్ సత్యా ఒకళ్ల చావుదినాలని ఇంకొకళ్లు చెప్పడం సరే - రాఘవ కూడా ఈశ్వర్ విషయంలో ఈ సంగతి చెప్పాడు కదా! అయితే, ఈ రెండు కేసుల్లోనూ సత్యాకి ఆకలింపుకి రానిదీ, నాకు అర్థమవుతున్నది ఒక వింత ఉన్నది. ఆ వింతకి నేనివ్వాళ ‘డెడ్ మేన్ పేరడాక్స్’ అని నామకరణం చేస్తున్నాను. దీనికి వివరణ నిచ్చే ముందర ప్రపంచ వ్యాప్తంగా తెలిసిన గ్రాండ్ ఫాదర్ పేరడాక్స్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి.

“ఒకళ్లు గతంలోకి వెళ్లి తమ తాతని చంపితే, ఈనాటి వాళ్ల జీవితం ఉండకూడదు కదా, కానీ ఉన్నది, ఇదెలా సాధ్యం?” అన్నదే కదా గ్రాండ్ ఫాదర్ పేరడాక్స్!!

ఇక్కడ రాఘవ విషయంలోనూ, సత్యా విషయంలోనూ జరిగింది ఒకటే. భవిష్యత్తులోకి వెళ్లి, వాళ్లు ఇంకొకలళ్ల మరణం గూర్చి తెలుసుకోగలిగారు. కానీ, అప్పటికి తాము మరణించారన్న సంగతి వాళ్లకి తెలియలేదు. పైగా, మళ్లీ వర్తమానంలోకి వచ్చిన తరువాత కూడా గుర్తుంచుకున్నారు. ఇదెలా సాధ్యం? దీనికీ నేను ‘డెడ్ మేన్ పేరడాక్స్’ అని నామకరణం చేసింది.

నాగూర్చే నాకిప్పటికీ అర్థం కాని విషయమొకటుంది. అది నేను మొదటిసారి టైం మెషీన్లో కూర్చున్నప్పటి అనుభవం. నేను నిజంగా ఆ పంజాబీ స్త్రీలోకి పరకాయప్రవేశం చేశానా, లేక ఆ కాలంలో ఆమే నేనా? నేనా మెషీన్లో కూర్చునేముందర సత్యా నాకు చెప్పినది తన బాల్యపు అనుభవాలని. ఆ మెషీన్ ద్వారా గతంలో కెళ్లగలిగినా, అది గతంలో ఉన్నప్పటి దృశ్యాలనే, అనుభవాలనే తిరిగి పొందగలగడాన్ని మాత్రమే సాధ్యం చేసిందా లేక తన కాలయాత్రలని సత్యా అలాంటి అనుభవాలకే పరిమితం చేసుకున్నాడా? ఆ కాలంలో ఆమే నేను అయ్యుంటే, మళ్లీ గతంలోకి వెళ్లగలిగితే ఆ క్షణాన బావిలోకి దూకకుండా ఆగగలనా? పరకాయ ప్రవేశమే చేసుంటే, సత్యా మరణించిన క్షణంలోకెళ్లి దానికి కారకులైనవాళ్లని చూడగలను. కాకపోతే మాత్రం, వాడి చావుకి కారకులెవరో ఎప్పటికీ తెలియదు. రెండు శరీరాలూ కాలగమనంలో ఒకే క్షణంతో ముడిపడి ఉంటే పరకాయ ప్రవేశం చెయ్యగలగడం సాధ్యమా? రెండు శరీరాల్లో ఒకేసారి నేనుండగలగడం మాటటుంచి, ఆ రెండో శరీరంలో అప్పటికే తిష్టవేసి ఉన్న జీవం సంగతేమిటి? అంటే, సత్యా మరణించే క్షణం ముందు నేను అమెరికాలో ఉన్నాను. కాలయంత్రంలో గతంలోని ఆ క్షణానికి ప్రయాణించగలిగితే, ఇక్కడ హాస్పిటల్ బెడ్ పైన నా శరీరం, అక్కడ ఇండియాలో చావబోతున్న సత్యా శరీరంలోకి ప్రవేశించబోతూ నేనూ. ఇది సాధ్యమేనా?

ఇంతలో క్రింద కాలింగ్ బెల్ శబ్దమవడం మా ఆవిడ తలుపు తియ్యడం, లీలగా వినిపించింది. ఆవిడ అడ్డుపడుతున్నా వినకుండా,

“రెండు నిముషాలే మేడం” అంటూ హైదరాబాద్ తెలుగు ఏక్సెంటులో వినిపించిన మాటల తరువాత ఆ వచ్చినవాళ్లు పైకి వస్తున్నట్లుగా మెట్లమీద అడుగుల చప్పుడు వినిపిస్తుంటే, ఎందుకో గుండె వేగం కొద్దిగా పెరగసాగింది. వాళ్లు బెడ్రూంలోకి రావడానికి ఎంతోసేపు పట్టలేదు. వాళ్లు ఇద్దరు. వాళ్లని చూడగానే నాకు కోపమొచ్చింది.

“ఆవిడ వద్దంటున్నా వినకుండా ఇక్కడికి రావడానికి మీకు ఎటికేట్ లేదా?” కోపంగా ప్రశ్నించాను.

“కోపం తెచ్చుకోకండి సార్. మేమడిగిన ప్రశ్నలకి సమాధానమిస్తే అందరం ఎవరి దారిన వాళ్లం త్వరగా వెళ్లిపోవచ్చు. మేమిక్కడికొచ్చిన పనికూడా త్వరలో అయిపోతుంది,” వాళ్లలో ఒకడన్నాడు.

“నా ఇంట్లోకొచ్చే కోన్ కిస్కాగాళ్లకి నేనెందుకు జవాబు చెబుతాను?” నాకు కోపం పెరిగిపోతోంది. వాళ్ల మొహాలని అప్పటిదాకా చూడలేదు మరి!

“మీ ఇండియా పోలీసులకి ఇక్కడికొచ్చి ప్రశ్నించడానికి అధికారమెవరిచ్చారు?” మా ఆవిడ కోపంగా ప్రశ్నించింది.

యూనిఫాం వేసుకోకపోయినా, ఆమెకి తామెవరో క్రిందనే చెప్పినట్లున్నారు. వాళ్లు పోలీసులన్న మాటని విని నేను స్టన్ అయ్యానుగానీ వెంటనే తేరుకున్నాను.

“జానకీ, నువ్వు 911 కి ఫోన్ చెయ్యి!” ఆమె నాదేశించాను. అమెరికా పోలీసులొచ్చిన తరువాత ఆ వెధవల సంగతి తేలిపోతుంది.

ఈ సంభాషణ ఇంతకుముందే జరిగినట్లు - కాదు, ఇంతకుముందే జరగబోతుందని. తెలియడం - హఠాత్తుగా గుర్తొచ్చింది. రెండవసారి రాఘవ టైం మెషీన్లో యాత్ర చేసినప్పటి మాటగదూ ఇది? అలాగయితే, ఇలా గుర్తొచ్చిందని అప్పుడు తెలిసిందా? ఇప్పుడు జరుగుతుందని అప్పుడు తెలియడం గూర్చి ఇప్పుడు తెలుస్తుందని… ad infinitem - అంటే, అనంతంగా - అనిగదూ అంటారు ఇలాంటి లంకెలని? అమెరికాలో కటకటాలని లెక్కబెట్టడంగూర్చి వాళ్లేదో అంటున్నారు. నా హార్ట్ రేట్ పెరగడం తెలుస్తోంది.

“అయ్యో. ఇవాళే హాస్పిటల్ నుంచీ వచ్చింది. ఆయనకి స్పృహతప్పు...”అని జానకి అనడం లీలగా వినిపించింది. కాలయంత్రంలోంచి అప్పుడు చెమటలు కక్కుతూ బయటకొచ్చాను. ఇప్పుడే మవబోతోందో తెలియదు.

*** అయిపొయింది ***


Rate this content
Log in

More telugu story from Varun Ravalakollu

Similar telugu story from Fantasy