శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Tragedy

4  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Tragedy

చివరాంకం

చివరాంకం

2 mins
285


               చివరాంకం

           -శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి

  

  "అమ్మా...నాకు నాన్న లేడామ్మా..."?

  తనకు ఏడేళ్ల వయసులో తండ్రి ఎలా ఉంటాడో తెలియక గుర్తుకొచ్చినప్పుడల్లా అడుగుతూనే ఉండేవాడు తల్లిని అనంతు. 

   

   మీ నాన్న మిలిటరీ ఉద్యోగానికి పోయి...సరిహద్దుల్లో కాపలాకాస్తున్నప్పుడు ... పాకిస్థానోళ్ళ తుపాకీ కాల్పులకు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని చెప్పేద్దామనుకునేది. కానీ... నోటి వరకూ వచ్చిన ఆ మాటల్ని గొంతులోనే మింగేసేది రంగమ్మ. చిన్న వయసులో అంత పెద్ద బాధను తట్టుకోలేడేమోనని. కానీ...ఏదో చెప్పాలి కాబట్టి..."మీ నాన్న దేవుడి కాడకు వెళ్లాడమ్మా...నీకు తోడు నేనున్నాను కదా" అంటూ...కొడుకుని అక్కున చేర్చుకుని కథలు చెప్తూ తండ్రి తలపు నుంచి మరిపించేది.

   

   రాను రాను పెద్దవాడవుతుంటే....తల్లి నోటినుంచి తెలియకపోయినా...ఇరుగు పొరుగు వాళ్ళ నోటినుంచి నిజం తెలియక పోలేదు. అలా తండ్రి విషయం తెలిసొచ్చి బాధ్యత కలిగిన కొడుగ్గా ఎదిగేసరికి.... తనకోసమే బ్రతికిన తల్లి అనారోగ్యంతో కళ్ళు మూయడంతో తోడు లేక ఒంటరి వాడయ్యాడు అనంతు. 


           **     **     **


   అనంతు భార్యా ఇద్దరు కొడుకులతో ఎంతో ఆనందంగా సంసారాన్ని గడుపుకొచ్చాడు. తాను తండ్రి లేకుండా పెరిగినందుకు కాబోలు....బాధ్యతాయుతమైన తండ్రిగా కొడుకులిద్దర్నీ ఎంతో అల్లారుముద్దుగా పెంచుకొచ్చి మంచి చదువులు చదివించాడు. అడ్డాలు నాడు బిడ్డలు గానీ గెడ్డాలు వచ్చాకా....వారి వ్యక్తిత్వమే మారిపోతుందని ఊహించలేదు. పెళ్ళాల చాటు మొగుళ్లయి వేరు కాపురాలు పెట్టారు. ఉద్యోగాల పేరుతో...విదేశాలకూ వలసెళ్లిపోయారు. కొడుకులు దూరమయ్యారని దిగాలుగా కూర్చుని...వారి కోసమే ఆలోచిస్తూ వుంటుంటే ఏదో ఒకటి పలకరిస్తూ ఈలోకంలోకి తీసుకొచ్చేది భార్య పార్వతి. 


   "మీరిలా దిగాలు పడిపోతే నేనేమైపోతాను చెప్పండి. పిల్లలు చిన్నవాళ్ళు కాదుకదా...! వారికేవో కొరికలుంటాయి. విదేశాల్లో గడిపి ఆర్థికంగా వెనకేసుకుందామనే వారి ఆలోచనని తప్పుపడితే ఎలా చెప్పండి...? వారి ముచ్చట తీరితే తిరిగి వారే వస్తారు లెండి" భర్తకు ధైర్యం అయితే చెప్పింది గానీ... అక్కడకెళ్లిన వాళ్ళు తిరిగిరారని అనుభవమున్న కుటుంబాల్లోని వారు చెప్పే వాస్తవాల్ని తానెన్ని వినలేదు గనుక...? అలాంటి విషయాలు ఎత్తితే....కొడుకులపై పెంచుకున్న ప్రేమనెక్కడ తెంపేసుకుంటాడో అనే భయంతో... సున్నిత మనస్కుడైన భర్త ఎక్కడ ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటాడోనని ఎప్పటికప్పుడు ఆ ఆలోచనల నుంచి బయటకు తీసుకొస్తూ ఉంటుంది అనంతుని.  

    

   అందుకే...చాలా ప్రేమగా భర్తను దగ్గరకు తీసుకునేది. ఈ మలివయసులో మీకు నేనూ...నాకు మీరూ ఒకరికొకరం తోడై ఉన్నాము మనకది చాలదూ అంటూ భర్తను చిన్నపిల్లాడిలా లాలించేది. భార్య మాటలు అతనికి కొండంత ధైర్యాన్నిచ్చినా...కొద్ది రోజులకే హఠాత్తుగా గుండెపోటు రావడంతో భార్య పార్వతి కన్నుమూసింది. 

    

    భార్య మరణంతో మళ్లీ ఎవరి తోడూ లేని ఒంటరివాడుగా మిగిలిపోయాడు ఆఇంట్లో అనంతు. 


           **       **      **


    అనంతుకి డెబ్బైయేళ్ళు దాటాయి.

    బాల్యంలో అమ్మ తోడుండేది. యవ్వనంలో భార్య తోడుండేది. ఈ వృద్దాప్యం లో తోడుండాల్సిన బిడ్డలు దూరంగా ఉండటంతో ...మనోవ్యాధి తోడయ్యింది. 


   భార్య పార్వతి పోయినప్పటి నుంచీ ఒంటరి బ్రతుకులోని కుమిలిపాటుకు బెంగతో మంచాన్న పడ్డాడు. ఊరు పొమ్మంటున్నా కాడు రమ్మనడం లేదు. స్వతహాగా... చిన్నప్పటినుంచీ కూడా చిన్న విషయానికే కుమిలిపోయే తత్వం కావడం వల్లనేమో...అన్ని జబ్బుల్నీ మించిన మనోవ్యాధి మనసును చెదపురుగులా దొలిచేస్తుందిప్పుడు. తాను పోయేలోపు ఆఇంట్లో కొడుకులొచ్చి వారి కుటుంబాలతో సందడి చేస్తూ ఉండాలన్నదే కోరిక. భార్యపోయినప్పుడు వచ్చిన కొడుకుల్ని అడిగాడు తన మనసులోని మాట. అదిగో వస్తాం ఇదిగో వస్తాం అంటూ ఇప్పటివరకూ రానేలేదు.  అందుకే...తను పోయినప్పుడు తల కొరివి పెట్టడానికైనా సమయానికి రారేమో అనే బెంగ....తానేమిటో ఎవరో తెలియని క్షీణ స్థితికి తెచ్చేసాయి.

జీవితంలో ఏం పొందినా పొందకపోయినా ఈ చివరాంకంలో కొడుకులు పెట్టే తలకొరివి కోసం ఎదురుచూస్తూ కళ్ళు మూసే అనంతులాంటి తండ్రులెంతమందో...!


   పాపం అనంతుకి తెలీదు...విదేశంలో కొడుకులిద్దరూ కరోనా బాహుబంధాల్లో చిక్కి చావుబ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారనీ ....వారి కళ్ళలో ఇప్పుడు ఏ తోడూ లేని తండ్రి రూపం కదలాడుతూనే ఉందని...!!*


     -------------------*********-----------------



Rate this content
Log in

Similar telugu story from Tragedy