బెజ్జమహాదేవి - బాల శివుడు - ఒక మహా శివరాత్రి
బెజ్జమహాదేవి - బాల శివుడు - ఒక మహా శివరాత్రి
అడుగుల చప్పుడు వినిపించింది.
బాల శివుడు : అమ్మా. నేను వచ్చేశా.
బెజ్జమహాదేవి : వచ్చావూ. అక్కడా ఇక్కడా తిరిగి.
పుట్టిన రోజున ఇంటి పట్టున ఉండి అమ్మ చెప్పినట్టు వింటేనా.
బాల శివుడు అప్పుడే నెయ్యి అభిషేకం మధ్యలోనుంచి వచ్చినట్టు ఉన్నాడు.
బెజ్జమహాదేవి : నెయ్యి మొత్తం అంటించుకుని వచ్చావా. ఉండు. వేడి నీళ్లు కాస్తాను. ఈ జిడ్డంతా వదలాలి అంటే గంట సేపయినా పడుతుంది.
బాల శివుడు : అమ్మా. భక్తులు అభిషేకం చేస్తుంటే వద్దని ఎలా అంటావ్.
బెజ్జమహాదేవి : అలా కాదు బాబూ. ఆ నెయ్యి, తేనె పులుముకుని నీ జుత్తు చూడు ఎలా అయిపోయిందో. అట్టలు కట్టిన జడలు, వాటి మీద జిడ్డు. ఎవరైనా చూస్తే ఏమంటారు? చూడుబ్బా. వాళ్ళమ్మ ఆ పిల్లోడికి స్నానం చేయించకుండా అట్లానే వదిలేసింది అనరూ.
బాల శివుడు : సరే అమ్మా. స్నానం చేయించు.
బాల శివుడు బాసింపట్టు వేసుకుని కూర్చున్నాడు.
ఏ జగదీశ్వరుని పాద ధూళి సోకిన చాలని సమస్త దేవతలూ ప్రదోష వేళయందు కైలాసంలో ఎదురు చూస్తారో, అట్టి విశ్వేశ్వరుడు అమ్మ ప్రేమలోని నిస్వార్థ భక్తికి కట్టుబడి చిన్న పిల్లాడిలా బెజ్జమహాదేవి ముందు అమాయకంగా కూర్చున్నాడు.
జగత్తునే కన్న పరమేశ్వరునికి తల్లి లేదని బాధపడి తనే తల్లిగా మారిన ఆమె జన్మ ఎంత ధన్యమో.
ఏ విధంగా భక్తులను ఉద్ధరించాలా అని తాపత్రయపడే ఆ శివయ్యకు భక్తులందరూ మ్రొక్కారు.
(బెజ్జమహాదేవి బాల శివుడితో ఇలా మాట్లాడి ఉండవచ్చు అనిపి ఊహించి వ్రాసినది..)
