Rama Seshu Nandagiri

Drama

5.0  

Rama Seshu Nandagiri

Drama

బాధ్యత

బాధ్యత

6 mins
223


"ఏంటి అమ్మా, ఎప్పుడూ ఏదో ఒక ఆలోచనే నా. ఇంకా దేనికి ఆలోచన. అన్ని బాధ్యతలు తీరిపోయాయి కదా. ఇంకా ఏమిటి" అన్నీ చిన్న కూతురు జ్యోతి మాటలకు చిరునవ్వే సమాధానంగా చూసింది వనజ.

అక్కడే ఉన్న పెద్ద కూతురు స్వాతి "అమ్మ అంతే, నోరు విప్పదు జ్యోతి. నేను, నాన్న అడిగి అడిగి విసిగి పోయాము. నాకేం ఆలోచన అంటుంది. మరి డాక్టర్ ఏమో, ఆమె మనసు లో బెంగ తప్ప ఏ అనారోగ్యం లేదంటారు."

" పోనీ, అక్క కు నాకు చెప్పక పోతే నాన్న కు చెప్ప వచ్చు కదా. ఏం నాన్న, మీతో ఏమైనా చెప్పిందా." జ్యోతి తండ్రి రఘురాం ని అడిగింది.

"లేదమ్మా, నేను అడిగినా ఏమీ చెప్పడం లేదు. నాకేం కాలేదు, అనవసరంగా గాభరా పడకండి అని అంటుంది." రఘురాం బాధగా అన్నాడు.

వాళ్ళ మాటలు వింటున్న వనజ చటుక్కున లేచి వంట గది లోకి వెళుతూ "ఎందుకు, ఇప్పుడు ఏమైందని. మనిషి కి అనారోగ్యం చేయదా. డాక్టర్ చెప్పిన మాటలు పట్టుకుని ఎందుకంత ఆదుర్దా పడతారు. నాకేం కాలేదు, ఏం కాదు." దృఢంగా అంటూ టీ పెట్టే ప్రయత్నం లో పడింది.

మిగిలిన ముగ్గురికీ ఏం చేయాలో తోచలేదు.

ఆ రాత్రి పిల్లలు ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు

భోజనం తరువాత ప్రక్కనే కూర్చుని రఘురాం వనజ చేతిని చేతి లోకి తీసుకొని అనునయంగా అడిగాడు "వనజా, చూసావు గా, పిల్లలు కూడా చాలా బాధ పడుతున్నారు. నాకు తెలుసు. పెళ్లి అయిన ఇన్నేళ్ల లో ఏనాడూ నువ్వు నాతో మనసు విప్పి మాట్లాడ లేదు. అది నీ తప్పు కాదు. నేను నిన్ను అంతగా తరచి అడిగింది లేదు. నువ్వు, నేను బాధ్యతలు అనే సుడిగుండంలో కొట్టుకుపోవడం తప్ప మన గురించి ఆలోచించింది లేదు. అందుకే ఏ రోజు మనసు విప్పి మాట్లాడు కోలేదేమో. ఈ రోజు అడుగుతున్నాను. చెప్పు. నా వల్ల నీకేమైనా కష్టం కలుగు తోందా. నేనేం చే‌సి నీ బాధని తీర్చ గలను. ప్లీజ్, చెప్పు" అతని గొంతు లో బాధ స్పష్టంగా తెలుస్తోంది.

వనజ అతని చేతి పై తన చేతిని ఉంచి "అయ్యో, అదేం లేదు. మీరు నాకు చేయగలిగిన సహాయం చేసారు. మీ అండ లేకుండా ఇంతగా నేనేమీ చేయలేక పోదును. మీరు, పిల్లలు ఇచ్చిన సపోర్ట్ తోనే ఆర్థిక బాధలు ఎన్ని ఉన్నా నెట్టుకు రాగలిగాను. పిల్లల పెంపకం, పెళ్లిళ్లు. నెరవేర్చ గలిగాను."

ఆమె మాటలు విన్న. రఘురాం"అయితే ‌ఎందుకు నీ ముఖం లో బాధ కన్పిస్తుంది. ఎప్పుడు ఆలోచన లో మునిగి తేలుతూ ఉంటావు" అని అడిగాడు.

"ఏమండీ, ఈ విషయం మరోసారి మాట్లాడదాం. చాలా రాత్రయింది. పడుకుందామా" అంది వనజ

వనజ ఆ విషయాన్ని మాట్లాడేందుకు ఎందుకో సుముఖంగా లేదని గ్రహించిన రఘురాం. "సరే వనజా, నీ ఇష్టం." అని నిద్ర కు ఉపక్రమించాడు

.....

మరునాడు ఉదయం కాఫీ టిఫిన్లు అయ్యాక రఘురాం ఏదో పని మీద బయటకు వెళ్ళాడు. ఆరోజు పేపర్ తిరగేస్తుండగా ఫోన్ మోగింది. చూస్తే కజిన్ లక్ష్మి. ఫోన్ తీయగానే హడావుడి గా

" వనజా, ఇంట్లో నే ఉంటావు గా. ఒక గంట లో వస్తాను. రానా" అంది.

వనజ నవ్వుకుంటూ,"వస్తాను, అని మళ్ళీ రానా, అని అడగడం ఎందుకే". అంది.

లక్ష్మి కూడా నవ్వి, "సరే, ఒక గంట లో వస్తాను" అంది

ఇంతలో రఘురాం బయటి నుండి వచ్చి " వనజా

ఈశ్వర్ ఊరు వెళ్ళాలట. వీలైతే నన్ను రమ్మంటున్నాడు. ఏమంటావ్" అని అడిగాడు.

" వెళ్ళండి. దానికే ముంది". అంది.

"అంటే, నువ్వు ఒంటరిగా ఉండాలి కదా అని..‌"

అన్నాడు.

"అబ్బా, ఫర్వాలేదు. ఎప్పుడూ ఉండలేదా‌ నాకేమైనా కొత్తా. అదీగాక లక్ష్మి వస్తోంది. అదీ నేను ఉంటాం" అంది వనజ విసుగ్గా.

రఘురాం అది గమనించి మాట్లాడకుండా గది లోకి వెళ్ళి పోయాడు. అది చూసిన వనజ, తనూ లోపలికి వెళ్ళి అతనికి కావాల్సిన వస్తువులు సర్దింది.

అతని దగ్గరకు వెళ్ళి " సారీ, ఏమనుకోకండి. లక్ష్మి వస్తుంది గా. నేను ఒంటరిగా ఉండను. ఇందాక ఫోన్ చేసి వస్తున్నానని చెప్పింది. మీరంతా నన్ను

ఏమైపోతానో అన్నట్టు అతి జాగ్రత్తలు తీసుకుంటూ

ఉంటే ఒకొక్క సారి అసహనం గా ఉంటోంది. అందుకే అలా అన్నాను. ఈశ్వర్ కి ప్రోగ్రాం ఉందనే

అది ఇక్కడికి వస్తున్నట్లు ఉంది. నాకు ఏం చెప్ప లేదు. వస్తారుగా, తెలుస్తుంది." అంది సౌమ్యంగా.

రఘురాం కి కొంచెం రిలీఫ్ గా అనిపించింది.

ఇద్దరూ హాల్ లోకి వచ్చేసరికి లక్ష్మి, ఈశ్వర్ రానే

వచ్చారు.

వస్తూనే వనజని చుట్టేసింది లక్ష్మి.

"ఏమే, ఎలా ఉన్నావ్. నీకు బాగా లేదని తెలిసినా అమ్మ కి ఆరోగ్యం బాగా లేక అక్కడ చిక్కు కున్నాను. నిన్న నే వచ్చాను. ఇంక ఆగలేక వచ్చే‌సాను." కన్నీళ్ళ తో అంది లక్ష్మి.

"బాగానే ఉన్నాను. అత్తయ్య ఎలా ఉంది? ఇప్పుడు ఫర్వాలేదా!" అడిగింది వనజ

"బాగానే ఉంది. ఫర్వాలేదు. వదిన కి బాగులేక నేను వెళ్ళ వలసి వచ్చింది. అయినా అమ్మ కి బాగులేదంటే నేను ఆగలేక పోయాను." అంది లక్ష్మి

విచార వదనం తో.

" ఇప్పుడు బాగానే ఉంది కదా" అంది వనజ.

"ఆ(, బాగానే ఉంది. నన్ను వెళ్ళమని తనంటేనే వచ్చేశాను". అంది లక్ష్మి.

" సరే, మీ కబుర్లలో పడిమమ్మల్నెలాగూ పట్టించుకోరు. మేం బైలుదేరతాం." అన్నాడు ఈశ్వర్ నవ్వుతూ.

"అయ్యో అన్నయ్యా, ఆగండి. కాఫీ అయినా తాగి వెళ్ళండి." అంది వనజ.

"వెళ్ళనీవే బాబు. మళ్లీ ఆలస్యం అయితే రాత్రి తిరిగి రాలేరు" అంది లక్ష్మి.

సరే అంటూ వాళ్ళు వెళ్ళిపోయారు.

"రా వనజా! ఇప్పుడు మనం హాయి గా కబుర్లు చెప్పుకోవచ్చు. ఇదిగో, వంట, పెంట అనకు. ఆకలేస్తే ఏమైనా తెప్పించుకోవచ్చు." అంటూ వీథి తలుపులు వేసి ‌పడకగది లోకి దారి తీసింది లక్ష్మి.

వనజ తనని అనుసరించింది.

ఇద్దరూ కుదురుగా కూర్చున్నాక " ఇప్పుడు చెప్పవే వనం" అంది లక్ష్మి.

"ఏమిటి చెప్పాలి" ఆశ్చర్యంగా అడిగింది వనజ.

"అబ్బా, ఏమిటా! నేను లేనప్పుడు జరిగిన వింతలు విశేషాలు." అంది వెటకారంగా.

"చాల్లే ఆపు నీ వెటకారం. ఏమీ తెలీనట్లు అడుగుతావేం. నీకు అన్నీ తెలుసని నాకు తెలుసు." అంది వనజ కినుక గా.

" అవును. నీ అనారోగ్యం విషయం తెలుసు. నీ గురించి పిల్లలు, అన్నయ్య ఎంత ఆందోళన చెందుతున్నారో కూడా నాకు తెలుసు. కానీ నీకే అర్ధం కాదు. వాళ్ళని బాధ పెడుతున్నావు"

లక్ష్మి కొంచెం కోపం గా అంది

వనజ ఆశ్చర్యంగా"నేనా, నేనేం చేసాను?"

"నువ్వేం చేస్తున్నావు ఆలోచించు. ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్న దానిలాగా నీ ఆలోచనలలో నువ్వుంటే వాళ్ళ సంగతి ఏంటి? తీరికూర్చొని అనారోగ్యం తెచ్చుకుంటే వాళ్ళేం చేయగలరు?"

లక్ష్మి నిలదీసింది

" లక్ష్మీ, వాళ్ళ సంగతి సరే. నీకు నా విషయం తెలియదా". బాధగా అంది వనజ.

లక్ష్మి అనునయంగా వనజ చేతిని తన చేతిలోకి తీసుకుని " వనం, నాకు తెలుసు. చిన్న వయసులోనే తండ్రి చనిపోతే ఆయన బాధ్యతలు

నువ్వు చేపట్టి ఎంతో కష్టపడి ఇద్దరు చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు చేసావు. వాళ్ళు తిరిగి చూడక పోయినా

నువ్వు బాధ పడలేదు. తల్లి బాధ్యత నీ పైనే పెట్టుకున్నావు. అమ్మ బాధ పడకుండా తను చూసిన సంబంధం చేసుకున్నావు. అత్తింటి సమ‌స్యలు కూడా నీ భుజాల పైనే వేసుకుని అందరినీ ఒక దరికి చేర్చావు. ఇవన్నీ ఎందుకు చేసావు?" అడిగింది.

"అదేంటి లక్ష్మీ, నా పుట్టింటి బాధ్యతలు నాకు ఎలా ముఖ్యమో, ఆయనకీ అంతే కదా. ఆయన జీవిత

‌భాగస్వామినైనందుకు నాకు కూడా అవి వర్తిస్తాయి కదా!" వనజ జవాబిచ్చింది.

"చాలా బాగుంది. ఎన్నో కష్టనష్టాలను భరిస్తూ అన్ని బాధ్యతలు తీర్చుకుంటూ పిల్లలని పెంచి వారికి కూడా పెళ్ళిళ్ళు చేసి బాధ్యతలు తీర్చుకున్నారు కదా! మరి ఇప్పుడు హాయి గా జీవితాన్ని గడిపే సమయం లో ఏమిటి నీలో కలిగే ఆందోళన? ఏమైనా ఉంటే అన్నయ్య తో గాని లేదా పిల్లలతో గాని పంచుకోవాలి. అంతేకాని నీలో నువ్వు మధన పడటం దేనికి?" లక్ష్మి ప్రశ్నించింది.

వనజ తల ఇంకా కిందికి దించుకుంది. లక్ష్మి బలవంతంగా తల ఎత్తింది. ఆమె కళ్ళల్లో నీళ్ళు.

అది చూసిన లక్ష్మి కంగారుగా "ఏమైందే వనం? ఏమిటి నీ బాధ! కనీసం నాతో కూడా చెప్పవా!"

అడిగింది.

" నీవు తప్ప నాకెవరున్నారు లక్ష్మీ! నీతో తప్ప నా మనసు విప్పి ఎవరితో చెప్పగలను. నీకు తెలియదా? " అంది వనజ రుద్ధకంఠం తో.

"ఐతే చెప్పు మరి, దేని గురించి నీ ఆందోళన?" లక్ష్మి ఆత్రం గా అడిగింది.

"లక్ష్మి, అమ్మ, చెల్లెళ్ళు నాన్న ఇచ్చిన బాధ్యత.

అది సక్రమంగా నే పూర్తి చేసాను. అత్తింటి వారు. పెళ్లి తెచ్చిన బాధ్యత. అది కూడా ఆయన సహకారం తో నిర్వర్తించాను. పిల్లలు మా సమిష్టి బాధ్యత. అది కూడా ఇద్దరం కొలిక్కి తెచ్చాం."

వనజ చెప్పింది విన్న లక్ష్మి " మరింకేంటి'! అంది కుతూహలంగా.

"ఇక్కడే అసలు కథ మొదలవుతుంది" అంది వనజ విచారంగా

ఆశ్చర్యంగా చూసింది లక్ష్మి.

వనజ కొనసాగించింది. " లక్ష్మీ, నీకు తెలుసు, మావి చిన్న ప్రైవేటు ఉద్యోగాలు. ఇద్దరం ప్రస్తుతం ఉద్యోగం చేయలేం. దాచుకున్న ఆస్తి లేదు. పిల్లల మీద ఆధారం. నేను ఏనాడూ నా భర్త మీద కూడా ఆధారపడలేదు. కాని ఈ రోజు ఆడపిల్లల మీద, అల్లుళ్ళ మీద ఆధారపడ వలసి వస్తోంది. అదే నా బాధ కు కారణం. ఆడదాని నైన నేనే ఇలా భావిస్తున్నానని తెలిస్తే ఆయన ఎంత బాధ పడతారు! ఆయన్ని ఆ బాధకి గురి చేయడం ఇష్టం లేక ఆయనకి చెప్పలేకపోతున్నాను. పిల్లలు నా మాటలకి బాధ పడతారని, వాళ్ళ ని వేరు చేస్తున్నా నంటారని వారితో పంచుకో లేక పోతున్నాను. ఇప్పుడు చెప్పు, నా ఆందోళన అర్థం లేనిదా!"

వనజ మాటలను అత్యంత ఆశ్చర్యం తో విన్న లక్ష్మి కొంచెం సేపు మౌనం వహించింది. తరువాత

" సరే ఆలోచిద్దాం." అంటూ టైం చూసి "అమ్మో

2 గంటలైంది. నా వల్ల కాదు. ఆకలేస్తోంది. పద. బైటికి పోయి తిందాం." అంటూ వనజని లేవదీసింది. ఇద్దరూ బైటికి వెళ్లి హోటల్ లో తిని వచ్చారు. అప్పటికే అలసి నట్లున్న వనజ తన మనసు లో భారం తగ్గినట్లై ప్రశాంతంగా నిద్ర పోయింది. కానీ లక్ష్మి కి నిద్ర. కరువైంది.

అలా ఆలోచిస్తూ చాలా సేపటి కి ఆలోచన ఒక కొలిక్కి రాగా నిద్ర పోయింది.

"లక్ష్మీ, లే. అయిదు అయింది. టీ చేసాను. రా తాగుదాం." అని లేపడం తో లేచి ముఖం కడుక్కుని వచ్చింది. చాలా తేలిక గా అనిపించింది. వేడి వేడి టీ ఉత్సాహం నింపింది.

"అయితే నీ బాధ కూతుళ్ళు, అల్లుళ్ళ మీద ఆధారపడ వలసి వచ్చింది అని కదా" అడిగింది లక్ష్మి. వనజ జవాబివ్వలేదు.

"సరే, నీ బాధ సహజం అనుకుందాం. మరి మీ నాన్న కి నువ్వు కూతురివి కాదా. నువ్వు బాధ్యత

అని అన్నీ నిర్వహించానంటావు. మరి నీ కూతుళ్ళు అలా అనుకో కూడదా. నిజంగా వాళ్ళ కి కష్టం కలిగించ కూడదు అనుకుంటే వాళ్ళ కి నీకు వీలైనంత సహాయం చెయ్యి. ఈ విధంగా ఆరోగ్యం పాడుచేసుకుంటే నిజం గా వాళ్ళ ని బాధ పెట్టిన దానివి అవుతావు. ఆలోచించుకో.

ఇదే నేను నీకు చెప్పగలిగింది." అని మౌనం వహించింది లక్ష్మి.

చాలా సేపు మౌనం గా ఉండిపోయిన వనజ

తలెత్తి కన్నీళ్ళ తో "నా కళ్ళు తెరిపించావు లక్ష్మీ.

నా తప్పు నాకు తెలిసి వచ్చింది. ఇంక నా పిచ్చి ఆలోచనలతో ఎవరినీ బాధ పెట్టను. థాంక్స్ లక్ష్మీ"

అంది మనస్ఫూర్తిగా.

లక్ష్మి మనసు లో, 'అమ్మయ్య, దీన్ని దారికి తేగలిగాను. అన్నయ్య కి, పిల్లల కి ఈ శుభవార్త చెప్పాలి. వాళ్ళు చాలా సంతోషిస్తారు' అనుకుని

తనూ బదులుగా నవ్వుతూ వనజ భుజం తట్టింది.Rate this content
Log in

Similar telugu story from Drama