శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Tragedy

4  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Tragedy

అసహాయత

అసహాయత

2 mins
321


              అసహాయత

              -శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి

     

  నాడు నాచేయి పట్టుకుని నడిపించిన నాన్న...ఇప్పుడు నడవలేని స్థితికి చేరుకున్నారు...! కర్రను ఓ చేతికిచ్చి...నేను మరోచేతిని పట్టుకుని నడిపించాల్సిన స్థితికొచ్చారు. ఎలాగో అతికష్టం మీద బాత్రూమ్ వరకూ అయినా చేరుకునేవారు. వారం రోజులబట్టి మంచం కూడా దిగడం లేదు...వయసు తెచ్చిన మార్పుతో.

     నాకే కాదు...ఒకరితో చేయించుకోవడంతో నాన్నకీ కష్టాలు మొదలయ్యాయి...!

    "ఇదిగో...ఇలాగైతే నా వల్ల కాదు. మీరేమో ఆపీసుకి ఉదయమనగా వెళ్లి సాయంత్రం ఎప్పుడో ఇంటికి చేరతారు . నాకేమో ఈయనకు సేవలు చేయాలంటే కష్టం. ముసలాడు అని నోరుకట్టుకుని పడుకుంటారా అంటే కాదు. కాళ్ళు ఆడకపోయినా...నోరు ఆడుతూ ఉండాలి మీ నాన్నకి. ఏమైనా తిన్న దగ్గర నుంచీ...విరోచనాలు పట్టుకుని ఒకపట్టాన వదిలిచావవు. అయినా ఒక మగవాడికి ఆడది ఏంచేయగలదు...? మీరేం చేస్తారో తెలీదు...ఇంట్లో ఆయన్ని చూసుకోవడానికి ఏ మనిషినైనా పెట్టండి. లేదంటే నేను మా పుట్టింటికి పోతాను." నా భార్య నసుగుళ్లు నాలుగురోజులు బట్టి వినలేకపోతున్నాను.

     నాకేం చేయాలో పాలుపోలేదు. అలాగని నాన్నకోసం ఉద్యోగం మానేసుకుని ఇంట్లో కూర్చోడానికి ఆస్తిపరుడ్ని కాదు. కుటుంబాన్ని నడపాలంటే...కష్టపడాల్సిందే. మా ఆవిడ పోరుపడలేక....నాన్నకోసం మనిషిని పెట్టాలని చూస్తే..పదిహేను వేలు తక్కువ కాకుండా అడుగుతున్నారు. అంత జీతం ఇచ్చి పెట్టుకునే స్థోమతైతే నాకులేదు గానీ పెట్టక తప్పలేదు. ఉదయం ఎనిమిదికి వచ్చి సాయంత్రం ఆరుగంటలకు వెళ్లిపోవడానికి వాళ్ళ ఒప్పందం. సరే రాత్రంతా నేను చూసుకుంటాను కదా అనుకున్నాను. కానీ ఆమనిషి కొన్ని రోజులు బానే వచ్చినా... అప్పుడప్పుడు సెలవలు పెట్టడంతో...నాభార్య చిరాకు మరీ ఎక్కువైపోయింది.నాన్నని ఎంత బాగా చూసుకుందామని అనుకున్నా...నా భార్య చీదరింపుల నుంచి తప్పించలేకపోతున్నాను. పెద్దవారని, మావగారని ఏమాత్రం గౌరవం లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. పోయేముందు ఆమాటల విసుర్లు నాన్న మనసుకి తగలడం నాకెంత మాత్రమూ ఇష్టం లేదు . వింటుంటే నాకే ఎంతో బాధగా ఉంది. కనిపెంచిన నాన్నను ఆ చీదరింపుల మధ్య ఎలా ఉంచాలో అర్థం కాలేదు.

      బాగా ఆలోచించాను....మనసుకి కష్టం అనిపించినా...నేను తీసుకున్న నిర్ణయం తప్పదనిపించింది. ఆ పదిహేను వేలూ వృద్దాశ్రమానికి కట్టి...అక్కడ జాయిన్ చేస్తే...నా భార్య మాటల తూటాలు నాన్న మనసుకి తగలవనిపించింది. మనసు రాయి చేసుకుని...నాన్నని తీసుకెళ్లి అక్కడ జాయిన్ చేసాను." నాన్నా మీమీద ప్రేమ లేక కాదు... నా భార్య నాకు సహకరించలేక నేనీ నిర్ణయం తీసుకోవాల్సివచ్చింది. ప్రతిరోజూ మిమ్మల్ని వచ్చి చూసుకుంటూ ఉంటాను. మిమ్మల్ని ఇక్కడ చేర్చానని నా గురించి లోకులేమనుకున్నా పర్లేదు... ఇంట్లో మీకోడలు జరిపే రాద్ధాంతం గురించి పూర్తిగా వాళ్లకు తెలీదు కాబట్టి.  మన ఇంటి విషయం మనకు మాత్రమే తెలుసు. మీరు నన్నర్థం చేసుకుంటే అంతే చాలు . నన్ను క్షమించండి నాన్నా"  అని ఆయన కాళ్ళకు దణ్ణం పెడుతుంటే...నాకళ్ల నుంచి కారిన ఆ కన్నీటి బొట్లు ఆయన పాదాల్ని అభిషేకించాయి.

     నా మనసుని అర్థం చేసుకోడానికి ఎంతో సమయం పట్టలేదు నాతండ్రికి. ప్రేమ నిండిన కళ్ళతో నన్నెంతో తృప్తిగా చూస్తుంటే...నాపై ఏమాత్రమూ కోపం లేదనిపించింది నాన్నకు. నా అసహాయత వల్ల నాన్నను అక్కడ జాయిన్ చేసినా....ఎవరి చీదరింపులూ లేకుండా నాన్న ఎంతో సంతోషంగానే వుంటారనిపించింది ఆవృద్దాశ్రమాన్న....!!

       అయినా సరే... నాన్నను అక్కడ విడిచి వెళ్తుంటే...నా మనసు మోయలేని వేదన్ని అనుభవిస్తూనే ఉంది...!!*


            ****.      *****     *****


   


   


Rate this content
Log in

Similar telugu story from Tragedy