Dinakar Reddy

Abstract Children Stories Drama

4  

Dinakar Reddy

Abstract Children Stories Drama

అమ్మ vs అత్తిబోకి

అమ్మ vs అత్తిబోకి

1 min
245


అత్తిబోకి! ఏం జేసొచ్చినావుమే అని అనింది అమ్మ. నేను అప్ప దుప్పటి కప్పి పండుకుంటే సాలు. ఏదో ఒకటి అనడం. నేను అన్నీ అత్తి పనులు చేస్తానని అమ్మ అలా అంటుంది. ఎప్పుడూ చప్పుడు చేసే బోకిలా ఉంటాయట నా చేష్టలు.


ఒక్కటే కూతురని నన్ను నెత్తికెక్కించుకుంటున్నారు అని అందరూ అనకూడదనే గదా నేనేం చేసినా. అమ్మకేమీ అర్థం కాదు.


అందుకే పక్కింటి కోమటోళ్ళామె పప్పల పిండి నూరతా ఉంటే నేర్చుకుని వచ్చా మొన్న. 


మా బంగారమే. ఇప్పటి నుంచీ వంటలంటే నీకు ఎంత ఇష్టమే అని ఆవిడ దిష్టి కూడా తీసింది.


ఇంగ జూస్కో. నాకు సెప్పకుండా బొయ్యి పప్పల పొళ్లు సింతకాయ పొళ్లు నూరతండావా అని. అట్లా పిలవందే పోకూడదంట. పైగా సదువుకుంటానని చిన్నారి దగ్గరికి పుయినా కదా. ఇంటికి రాకండా పక్కింట్లోకి పుయినా కదా. అందుకు ఈవిడ గారికి కోపం.


అదే అమ్మైతే వెళ్లకుండా ఉన్నట్టు. మళ్లీ పెద్ద వాళ్ళూ పిల్లలూ ఒకటా అంటుంది. 


పోన్లే చిన్న పిల్లను కదా. అన్నం కలిపి ముద్దలు పెట్టమంటే రెండో క్లాసుకు వచ్చావు. అన్నం తినడం నేర్చుకోవూ అని అంటుంది.


అదే అప్పయితే ఎంచక్కా పకోడీలు తెచ్చి తినిపిస్తాడు. 


అయితే ఓ రోజు బావిలోంచి నీళ్లు తోడడం నేర్చుకుందామని చూసినా. పెద్ద తాబేలు కనపడింది. దాన్ని తీద్దామని చేద వేసినా. అది కాస్తా డామ్మని బాయిలో పడింది. నేను బాయి ఎనకాల గొంతుగుచ్చున్యా.


నేనే పడిపుయినా అనుకోని అమ్మ శోకాలు పెట్టింది. అప్ప గబగబా వచ్చి బాయిలోకి దుంకబోయినాడు. అప్పా అని నేను అరుస్తా పక్కకు వచ్చినా.


అమ్మ నన్ను కావిలిచ్చుకుని పొగిలి పొగిలి ఏడ్సింది. నాయమ్మే. నీకేం కాలా కదా నాయమ్మి అని ముద్దులు పెట్టింది. ఎన్ని మొక్కులు మొక్కితే పుట్టినావురా నువ్వు అని అప్ప అన్నాడు. 


అమ్మ గోరు ముద్దలు చేసి తినిపించింది. నా చెయ్యి వదలకుండా పక్కనే పడుకుంది. అమ్మ ఎంత బాధపడిందో ఏమో. ఇంగ నుంచి అత్తిబోకి అత్తి చెయ్యదులేమ్మా అని బుగ్గ మింద ముద్దు పెట్టినా.


అబ్బా. అబ్బా. ఏం బ్రమ. అమ్మా కూతురు నిద్దరబోండి అని అప్ప నవ్వుకున్నాడు.


Rate this content
Log in

Similar telugu story from Abstract