అలసందగింజల పప్పు
అలసందగింజల పప్పు
ఇవాళ మెస్ లో అలసంద గింజల పప్పు చేశారు. నాకైతే అస్సలు ఇష్టం ఉండేది కాదు. మా అమ్మేమో అన్ని రకాల కూరలూ తినాలి. అప్పుడే కదా ఆరోగ్యంగా ఉండేది అని చెప్పేది.
ఓరోజు ఏమైందంటే..
ఒంటి పూట బడి అయిపోయి నేను ఇంటికి వచ్చాను.
బ్యాగు హాల్లో పెట్టి లోపలికి వెళ్ళి చేతులూ కాళ్ళూ కడుక్కుని వచ్చి టీవీ ముందు కూర్చున్నాను.
అమ్మా ఈ రోజు ఏం కూర అని అడిగాను.
అలసందగింజల పప్పు అని చెప్పింది అమ్మ.
పోమ్మా. నాకొద్దు అలసందగింజల పప్పు. నేను తినను. అని కోపంగా అన్నాను. సర్లే నాన్నా. పప్పు తినొద్దులే. ఇదిగో ఈ గింజలు తిను అని పిలిచింది.
వంటింట్లో అమ్మ కింద కూర్చుని పప్పుగుత్తితో సెరవలో రుద్దుతూ ఉంది. పక్కనే గిన్నెలో ఉడికిన అలసందలు ఉన్నాయి.అమ్మ నా చేతిలో కొన్ని గింజలు పెట్టింది.
అవి తింటుంటే చాలా రుచిగా అనిపించాయి. ఇంకా కొన్ని పెట్టమని అడిగాను. అమ్మా. పప్పు చేయక ముందు ఉడకబెట్టి తీసిన వేడి వేడి అలసంద గింజలు పప్పులో కంటే బాగున్నాయి.
అమ్మా నేనూ ఇద్దరం మాట్లాడుకుంటూ ప్లేటులో ఉన్న గింజలన్నీ తినేశాము.
కాసేపటి తరువాత
నాన్న భోజనానికి వచ్చి కూర్చున్నారు. ఇందులో అలసంద గింజలే ఉన్నట్టు కనిపించడం లేదు. ఒట్టి పప్పులా ఉందే అని అడిగారు.
అలసంద గింజలన్నీ హాం ఫట్ స్వాహా అని అమ్మా నేనూ నవ్వుకున్నాం.
నాకు ఇదంతా గుర్తుకు వచ్చి నవ్వుకుంటూ భోజనం పూర్తి చేశాను.
