ఆరుద్ర పురుగులు
ఆరుద్ర పురుగులు
అవిగో ఆరుద్ర పురుగులు. నాన్న చిన్న పిల్లాడిలా కేరింతలు కొట్టారు.
ఏంటి నాన్నా ఇది అని ఆయన్ను ఆపబోయాను.
చాలా ఏళ్ళయిపోయింది వీటిని చూసి అని ఆయన వాటిని మెల్లిగా అరచేతిలోకి తీసుకున్నారు. చిన్నప్పుడు ఇలానే పట్టుకునేవాణ్ణి తెలుసా. అని నా వైపు చూశారు. అప్పుడే కురిసి వెళ్లిందా అన్నట్లు వర్షం వాసన గాలిలో తడి నేల మీద అలాగే ఉంది.
ఆయన మనసులోని సంతోషం కళ్ళల్లో కనిపించింది. ఇంక నేనేం మాట్లాడలేదు.
చాలా కాలం తరువాత సొంత ఊరికి వచ్చిన ఆయన తన బాల్యాన్ని నెమరు వేసుకుంటూ అక్కడి వారిని పలకరిస్తూ అతి జాగ్రత్తగా గెనాల మీద నడుస్తూ తను ఈ ఊరి వాణ్ణి అని నిరూపించుకోవడానికే అన్నట్టు మళ్లీ మళ్లీ నాకు అక్కడి ప్రదేశాల కథలు చెబుతూ ఉన్నారు.
ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా చాలా కాలం నుండి నాన్న సిటీలోనే ఉండాల్సి వచ్చింది. ఊళ్లో పని పడేసరికి ఈసారి మాకిద్దరికీ రాక తప్పలేదు.
నాన్న ఆరుద్ర పురుగుల్ని జాగ్రత్తగా నేల మీద వదిలిపెట్టారు.
అమ్మ అరుగు(సమాధి) పక్కన కాస్సేపు కూర్చుని ఇంక బయలు దేరుదాం అని అన్నారు.
మా కారు ఊరు దాటుతూ ఉంది. నాన్న గారి జేబు రుమాలులో దాచుకున్న తోటలోని మట్టి(నేను చూడలేదనుకుని) ఎన్నో జ్ఞాపకాల్ని తనలో కలుపుకుని మాతో పాటు వస్తోంది.
రైతులు శుభ సూచకంగా భావించే ఆరుద్ర పురుగులు అస్తమిస్తున్న సూర్యకాంతిలో ఎక్కడో దూరంగా ఎర్రగా బొద్దుగా మెరుస్తూ కనిపించాయి.
