శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Tragedy

5.0  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Tragedy

ఆకుపచ్చని జ్ఞాపకం

ఆకుపచ్చని జ్ఞాపకం

3 mins
198


 


       నా ప్రియమైన బంగారం...!

       

       నువ్వు నా ఆకుపచ్చని జ్ఞాపకానివి. 

      అవును ...నిన్ను శ్వాసిన్నాను కాబట్టే... నా గుండె కొట్టుకుంటూ ...నిన్నే తలుస్తుంది. 

       

      నేనెవరో నీకు తెలీదు కదూ...

      నిజమే...నేను నీకు అపరిచితుడ్ని.

      నీవు మాత్రం నాకు పరిచితమే. 

       

      ముప్పై ఏళ్ల క్రితంనాటి నీ ప్రతి కదలికా...నీ ప్రతి జ్ఞాపకమూ నాకు గుర్తే. ఎందుకంటే...నీవు ప్రాణానివి. అప్పట్లో.... నీకోసం...నిను చూడాలని...నీ నీడను వెతుక్కుంటూ...నీవెక్కడుంటే అక్కడ పిచ్చివాడిలా తిరిగేవాడిని. దూరం నుంచైనా నువ్వు కనిపిస్తే చాలన్నట్టు కాలమంతా నీకోసమే వెచ్చించాను. కళ్ళు తెరిచినా... మూసినా నువ్వే. కలల్లోనూ నీరూపమే...

       

      అంతగా అల్లుకుపోయావు నా మనసుని.

       

      నువ్వొక తీయటి బంధంగా నిలిచిపోవాలని ఎంతగా ఆశ పడ్డానో...! అసలు నిన్ను ప్రేమించడానికి నాకేం అర్హత ఉందని నువ్వనుకోవచ్చు. కొన్ని ప్రేమలకు అర్థాలు ఉండవు. కులాలు, ఆస్తులు, అంతస్తులు తేడా కనిపించదెందుకో....?  మరి అది ఏనాటి బంధమో...? నీతో జీవితం పంచుకోవాలని ఎంతగా తపించిపోయానో...? నిను చూడాలని ....మీ ఇంటిచుట్టూ సైకిలుపై నేనెన్ని సార్లు ప్రదక్షిణ చేసేవాడినో...?నాలో కొలువైన దేవతవు కదా మరి. 


      నువ్వు...పరికిణీ జాకెట్టులోంచి కొత్తగా ఓణీల్లోకి మారిన రోజుల్లో అటుగా వెళ్తూ కొత్తగా చూసాను నిన్ను.  అప్పుడే కలిగింది....నా మనసులో ఏదో కొత్త స్పర్శ. బహుశా అదేనేమో...ప్రేమ పుట్టుకంటే. నా ఊహల్లో... కన్నుల్లో నీ ప్రతిరూపం నిలిచిపోయిందలా. ఇప్పటికీ అప్పటి నీరూపాన్నే తలచుకుంటూ వుంటాను. నా బంగారమెప్పుడూ మేలిమి కాబట్టే నీరూపు మెరుపై నాకళ్లలో ఇప్పటికీ మెరుస్తూనే ఉంది. 


     ఆనాడు నాప్రేమను నీ ముందుంచడానికి ఒకడుగు వెనక్కేసాను. కారణం నా నిరుద్యోగం. ఓ నిరుద్యోగిగా ఎదురవ్వడం నాకిష్టం లేకపోయింది. ఉద్యోగస్థుడినై..నీకు ఎదురుపడి మనసు విప్పాలనుకున్నాను. దూరంగా వెళ్ళడానికి మనసు రాకున్నా...నిన్నే తలచుకుంటూ...వేరొక ఊరెళ్లి టీచర్ ట్రైనింగ్ పూర్తిచేసి వచ్చాను. మనూరిలోనే నాకు టీచర్ పోస్టింగ్ అని తెలిసి ఎంత సంబరపడ్డానో... ! 


    నీ ఎదుటకొచ్చి ధైర్యంగా నాప్రేమ మనసును పరచాలనుకున్నాను. కోటి ఆశలతో...మీ ఇంటి దరిదాపులకొచ్చి ఎన్నిసార్లు చుట్టినా...నీవొక్కనాడూ కనిపించనేలేదు. చివరికి ఎలాగైతే తెలుసుకున్నాను...నీకు పెళ్లైపోయి వెళ్లిపోయావని. నానుంచి నిన్నెవరో దౌర్జన్యంగా తీసుకెళ్లిపోయిన వేధన్ని ఎంత కాలం అనుభవించానో...!


   నేనూ ఓ ఇంటివాడినయ్యాను. మనసు నీతో. మనువు తనతో. అందుకేనేమో...తనతో నేనాడూ సుఖపడిన భావన నాకు అనిపించలేదు.  


   ఇన్నేళ్ల తర్వాత...మళ్లీ నువ్వు నాకు తారసపడ్డావు. నామనసు వికశించినట్టయ్యింది. ఆకుపచ్చని జ్ఞాపకానివి కదా...నిన్నెలా పోల్చకుండా వుంటాను చెప్పు...? అదే కోల ముఖం...అదే కోటేరు ముక్కు...అదే నవ్వు. చూడ్డానికి కొద్దిగా వయసు పైబడినా...నిన్ను పోల్చుకోలేనంతగా నువ్వేమీ మారిపోలేదు. పైగా నీలో ఏదో కొట్టొస్తున్న హుందాతనం ఇప్పుడు నన్ను మరీ పిచ్చివాడ్ని చేస్తుందంటే నమ్ముతావా...? ఇద్దరం యాభయ్యో పడిలో పడినా...మళ్లీ ముప్పై ఏళ్ల వెనక్కి జారిపోతే ...ఆనాడు నీతో కలిసి పంచుకోలేని ప్రేమ ఊసులెన్నో చెప్పుకోవాలని ఉంది. చెట్టాపట్టాలేసుకుని ఊరంతా తిరగాలని ఉంది. 


    అదంతా సాధ్యం కాదని నాకూ తెలుసు. కాలం కాటేసినట్టు నువ్వూ నేనూ కూడా వివాహితులమైపోయాం. నీకు పెళ్లైపోయినా...నీమీద ప్రేమ చచ్చిపోవడంలేదెందుకో.

 ఒకసారైనా కలవకుండానూ...మాట్లాడకుండానూ..ప్రేమా దోమా అంటూ మాట్లాడుతున్నానేమిటాని నన్నో రోడ్ సైడ్ బెవార్స్ గాడినని మాత్రం చులకనగా అనుకోకు. నువ్వెన్ని జన్మలెత్తినా...నిన్ను నాలా ప్రేమించగలిగే మనిషి మాత్రం నీకు దొరకడు. ఎందుకో...ఏమో...నువ్వంటే మాత్రం ఎప్పటికీ ప్రాణమే. 

     

   నీపై నాప్రేమను, ఇష్టాన్ని ఇన్నాళ్లకు నీతో చెప్పడం తప్పే. కానీ చెప్పాలనిపించింది. నిన్నే శ్వాసిస్తూ నా గుండె కొట్టుకుంటుందన్న నిజం నీకు తెలియాలి. నీకు తెలియని ఓ అపరిచితుని మనసెంతగా నీకోసం ఇన్నాళ్లూ తపించిందో నువ్వర్థం చేసుకోవాలి. నాకు తెలుసు...ఇంతగా నన్ను ప్రేమించిన అతనెవరా అని ఆలోచిస్తూవుంటావని...! నేనెవరో...నీకెప్పటికీ ఎదురుపడను గానీ...నీ ఆచూకీ నాకు తెలిసిందిగా. ముఖపుస్తకంలో తారసపడిన నీ ప్రొఫైల్ చూడగానే...నిన్నూ...నీ విలాసవంతమైన నీ స్థాయినీ అర్థంచేసుకున్నాను. నేనంత ధనికుడ్ని కాకపోయినా... మనిద్దరం ఒక్కటై ఉంటే గనుక...నీ కోసం చిన్న ప్రేమ మందిరమైనా కట్టించి చిలకా గోరింకలై కాపురం చేస్తూ వుండేవాళ్ళవేమో...? అయినా..నువ్వు నాకు చేరనంత దూరంలో వున్నా...నామనసులోనే ఉన్నావుగా పదిలంగా. ఈ జన్మకు ఇలాగే తృప్తిగా గడిపేస్తాను. 


    ఈ ముఖపుస్తకం ద్వారా ఇన్నాళ్లకు మళ్లీ నిన్ను చాసాకా నాఈ ప్రేమ సందేశం నీకు పంపాలనిపించింది. ఈనాడైనా.. నీకు చెప్పుకుంటున్నందుకు నా మనసెంతో సంతోషంగా ఉంది. నిన్నెంతగానో ఇష్టపడ్డ ప్రేమికుడు నేనున్నానని మాత్రం అప్పుడప్పుడైనా తల్చుకుంటావా బంగారం...? 


   నిన్ను ప్రేమించే నీ మనుషుల మధ్య...నాప్రేమ నీకు పనికిరాకపోవచ్చు. కానీ వాళ్ళిచ్చిన ప్రేమ మీద నాది వంద రెట్లు ఎక్కువే ఉంటుందేమో. ఒకవేళ నీకు ఎవరి ప్రేమా దక్కలేకపోయుంటే...నీకోసం మాత్రమే పడిచచ్చే ఈ పిచ్చి ప్రేమికుడు ఒకడున్నాడని నీకు తెలియాలనే..నా మనసు నిప్పాను. 


   ఇప్పుడు కాకపోతే...నాకోసం మరోజన్మలో అయినా మళ్లీ పుడతావని...నీకోసం ఎన్ని జన్మలైనా పుడుతూనే వుంటాను. నీవెప్పటికీ నాకు ఆకుపచ్చని జ్ఞాపపకానివే. ఇవి అక్షరాలు కాదు. నా మనసు నుంచి నీపై కురిసిన ప్రేమకుసుమాలు. 


   నిన్ను మరిచిపోలేక నీతలపులతో...నా మది మబ్బులు కమ్ముకున్నప్పుడు ...కురిసిన జ్ఞాపకాల జల్లులో నేనెప్పుడూ తడుస్తూనే వుంటాను.


    వందమందిలో వున్నా ఒంటరితనమే...

    ఏ మూలకి వెళ్తున్నా ...పరధ్యానమే...

    నాలా నేనుంటే కదా...గతం మాయని మచ్చలా..

    పదే పదే వెంటాడుతుంటే...ఏం పాలుపోక...

    ఏం తెలపాలో అర్ధం కాక...కుమిలి ..కానరాక..

    మాయమైపోవాలని మనసు ఆత్రం పడుతున్నా...

    ఏదో వెంటాడే ఆశ..పాశం ...పరిగెడుతూనే ఉంది          అలుపాగక...అవమానాల పాలైపోతున్నా...

    ఒకప్పుడు వినసొంపుగా ఉన్న నాస్వరమే...నేడు కళావిహీనమై ముగబోతుందంటున్నా...

    ఒకనాడు ఆనందం పంచిన నా మనసే...నేడు విలయం లా తోస్తుందంటున్నా...

    కరకుగుండెతో...ఆరని కంటతడితో...మిగిలే వున్నా ఇంకా శాపగ్రస్థునిలా......

    నిజాయితీగా మిగిలిన నా ప్రేమకి...సమాధి కట్టుకుని..

నిన్నలలో మిగిలిన జ్ఞాపకాల్లో ..మిగిలిన నిన్ను..

మరీ మరీ తలచుకుంటూ...

    మనసు కదా...మార్చుకోలేను...గతానివే కదాని మారలేను...!!


                       నీ 

                  నిరంతర ప్రేమికుడు.





       



       




       


       


       

      


Rate this content
Log in

Similar telugu story from Tragedy