శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Tragedy

4.8  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Tragedy

23.అభిసారిక

23.అభిసారిక

1 min
226             

   ఒంటరిగా మొదటిరాత్రి గడపడం...ఎంతగా నిరుత్సాహపరుస్తుందో కదా...! పెళ్లి చేసుకుని తోడు వచ్చాడనుకున్న భర్త ఆ సమయంలో చెంతన లేకపోవడంతో... ఎంతో అసహనంగా గదిలో అటూ ఇటూ తిరుగుతుంది భూమిక. 


  పూలతో అలంకరించిన మంచం వెక్కిరిస్తున్నట్టుగా ఉంది. అలంకరించిన పూలన్నీ కొద్దికొద్దిగా వాడిపోతున్నాయి. వెలిగించిన అగరబత్తి ధూపాలు కొండెక్కి చాలా సేపయ్యింది. వాటి తాలూకూ పరిమళం గదంతా... మత్తుగా ఎంతగానో గుప్పుమంటున్నాయి. అందుకేనేమో ఆమెలో భర్త రాకకోసం ఆ విరహావేదన. 


   గదిలోకి వచ్చినట్లే వచ్చాడు. ఇంకా ఎలాంటి కార్యక్రమం మొదలెట్టకుండానే...ఫోన్ రావడంతో..."అర్జంట్ పనిపడింది వెళ్లక తప్పదు " అంటూ భూమికను దగ్గరకు తీసుకుని నుదిటిపై ప్రేమగా ముద్దుపెట్టుకుని బయటకు వెళ్ళిపోయాడు. 


   పెళ్లయ్యాకా మొదటిరాత్రే ఇంత నీరుగారిపోతుందని అనుకోలేదు భూమిక. ఆ గదిలో ఒంటరిగా భర్త కోసం ఎదురుచూస్తుంటే...క్షణాలు యుగాల్లా గడుస్తున్నాయి. ఆ ఎదురుచూపులోనే...వెన్నెలంతా కరిగిపోయింది. 


  నిద్రలేమితో కనురెప్పలు అలసిపోయాయేమో...? తెలతెలవారుతుండగా... నిద్రలోకి జారుకోలేకపోయింది భూమిక. 


     **          **             **


   రాత్రనగా బయటకు వెళ్లిన ఆకాష్ ఉదయానికి తిరిగివచ్చాడు. ఒళ్ళంతా అలసటగా ఉంది. నిద్రలేమితో...కళ్ళు ఎర్రబారాయి. 

    

   మంచంపై ఆదమరిచి నిద్రపోతున్న భార్యను జాలిగా చూసాడు. పాపం రాత్రంతా ఒంటరిగా ఎలా పడుకుందో...? ఆ సమయంలో నేనలా బయటకు వెళ్లిపోవడంతో తన మనసెంతగా నొచ్చుకుందో...? పెళ్లి పేరుతో నాలుగు రోజులు డ్యూటీకి సెలవుపెట్టినా.... అర్జంట్ గా వచ్చి డ్యూటీలో జాయిన్ అవ్వమని ఫోన్ వచ్చింది. ముఖ్యమైన కేసు కావడంతో వెళ్లక తప్పలేదు. రేప్రొద్దుట వారు సుఖంగా సంసారం చేసుకోవాలంటే... ప్రమోషన్స్ కోసం ఇలాంటి రాత్రుళ్ళని ఎన్నైనా వదులుకోవాల్సిందే. మారు మాట్లాడకుండా బయలుదేరాడు. ప్రేమతో భార్య ముంగురులను సవరిస్తూ సారీ డియర్ అనుకుంటూ.... నిద్రపోతున్న భార్య పక్కనే తానూ నడుం వాల్చి...నిద్రలోకి ఒదిగిపోయాడు ఆకాష్. 


    నిద్రనుంచి మేల్కొన్న భూమిక కళ్ళు తెరిచేసరికి...భర్త గుర్రుపెట్టి నిద్రపోతూ ఉండడం....ఆపక్కనే కుర్చీలో విడిచిన ఖాకీ దుస్తులూ, టోపీ కనిపించడంతో... భారంగా నిట్టూర్చింది.


    తన పెళ్ళిచూపుల్లో...పోలీసు అధికారిని పెళ్లిచేసుకుంటున్నందుకు ఎంతో పొంగిపోయింది. అప్పుడప్పుడు నైట్ షిఫ్టులు వుంటాయనుకుంది గానీ...మొదటి రాత్రే...అడవి కాచిన వెన్నెలవుతుందని అసలు ఊహించలేదు. 


   ఒక పోలీసోడిని పెళ్ళిచేసుకోవడం వల్ల...తన భర్త సమయం సందర్భమని చూడకుండా డ్యూటీకి హాజరవ్వక తప్పదు. ఇలాంటి ఎన్నో మధురమైన రాత్రుళ్ళు విరహాన్ని అనుభవించకా తప్పదు. 

   

   నిద్రపోతున్న భర్త ఆకాష్ నే తదేకంగా చూస్తూ...రాత్రంతా మీకోసం ఎదురుచూపులతో  నన్నో అభిసారికను చేశారు కదా అనుకుంది భూమిక...!!*

    

   ***             ***           ***

             


   


Rate this content
Log in

Similar telugu story from Tragedy