తన ప్రేమ
తన ప్రేమ
తనప్రేమను కణకణమున..దాచుకుంది ముచ్చటగా..!
రెప్పలింట కలలతోట..పెంచుకుంది ముచ్చటగా..!
పెదవివిప్పి చెప్పదు కద..కన్నులెత్తి చూడదు కద..
చెక్కిలింట సిందూరం..నింపుకుంది ముచ్చటగా..!
అమావాస్య సోయగమే..తన జడగా మారినదా..
తారకలే మల్లెలుగా..తురుముకుంది ముచ్చటగా..!
సెలయేరుల విలాసమే..తెలుసుకున్న మెఱుపేదో..
తనహృదయపు సవ్వడింట..అల్లుకుంది ముచ్చటగా..!
గగనమంత చెలిమివనం..తనమనసై విరిసెనేమొ..
నా ఊహల మధుశాలకు..చేరుకుంది ముచ్చటగా..!

