స్పందన
స్పందన
నిన్నటి తీపి
నేడేందుకో చేదుగా అనిపిస్తోంది
ఒకప్పటి యిష్టాలన్నీ
ఇప్పుడెందుకో అయిష్టాలుగా మారిపోతున్నాయి...
నాడు మధురక్షణాల
మధురానుభూతిలో నన్ను తడిపిన
వాస్తవాల నీటి మడుగులన్నీ
ఎండమావులుగా భ్రమ పెడుతున్నాయి ఈనాడేందుకో....
ఆవేదనా వర్షధారలతో నిండి
మనసు చెరువై పొంగి పొర్లుతున్నా
చుక్క నీరు లేని ఎడారిలా
ఎండుతున్నాయి కన్నుల కొలనులు... నేడేందుకో....
బహుశా
తరిగిపోతున్న కాలానికి
తనువు కాపలా కాస్తుంటే
తరలిపోతున్న వాస్తవాలన్నీ
తనివితీరక అనుభూతులై వెంటాడుతుంటే !!
నిన్న రేపుల చాటున
సహజత్వం ముసుగేసుకుని
అబద్ధాల ఆశల బాటలపై
ఆబగా పరిగెత్తే కాలంతో కలిసి
పదములు కలిపి స్పందించలేక
మది తనలో తాను
అనుభవిస్తున్న అంతర్మథన ఘోష
ఏమో పాపం ... !!!
